11.5 C
New York
Sunday, November 24, 2024

మునిపల్లె రాజు ‘సరోజ’ కథ – కళాత్మకత

– ఆచార్య రాచుగాల్ల రాజేశ్వరమ్మ

ఆధునిక యుగంలో వెలసిన అనేక సాహితీ ప్రక్రియలలో కథా సాహిత్యం ఒకటి. బండారు అచ్చమాంబ, రాయసం వెంకట శివుడు, గురజాడ మొదలు నేటి వరకు తెలుగు సాహితీ క్షేత్రంలో కథ సుమాలు కోకొల్లలుగా వెల్లివిరిసాయి. అలాంటి కథాసాహిత్యానికి తుష్టిని పుష్టిని కలిగించి సమున్నత స్థాయికి పెంచిన ప్రముఖ రచయితల్లో నాలుగవ తరానికి చెందిన మునిపల్లె రాజుగారు ఒకరు. రావిశాస్త్రి, మధురాంతకం, కారా, కొకు, కేతు లాంటి కథా రచయితల కోవకు చెందిన వారేవీరు. ఆంగ్లేయుల బానిస సంకెళ్లనుంచీ, మన దేశం విముక్తి కాకముందు నుంచీ నేటి స్త్రీ బహుజన, దళిత, గిరిజన మైనారిటీ వాదాల వరకు నాటక రంగం మొదలు మూకీ టాకీల నుంచి ఐమాక్స్‌ల వరకు ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్డబండ్లు మొదలుకొని కారు విమానాలు ఉపగ్రహాల వరకు గ్రామ్‌ ఫోన్‌ రికార్డులు టేప్‌ రికార్డులు సీడీలు మొదలు నేటి అంతర్జాలాల వరకు కాల ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ కాలం వదలని అరుదైన కధకులు మునిపల్లి రాజుగారు అని అభివర్షించారు రాసానిగారు. (కథాస్రవంతి మునిపల్లి రాజు కథలు, 2015 సంవత్సరం, డాక్టర్‌ వి.ఆర్‌. రాసాని, పుట.9)

మునిపల్లి రాజుగారు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని గరికపాడు గ్రామంలో శారదాంబ హనుమంతరావులకు 1925 మార్చి 16న జన్మించారు. వీరి పూర్తి పేరు మునిపల్లె బక్కరాజు. వీరు పుట్టింది గ్రామమే అయినా బాల్యం దాదాపు వివిధ సాహితీ సంస్కృతుల సంఘమ క్షేత్రమైన తెనాలిలో గడిచింది. సంస్కారం, దేశభక్తి, సాంప్రదాయ విలువల త్రివేణి సంగమం వీరి కుటుంబం. కుటుంబ పరిస్థితుల వల్ల ఆశలు ఆశయాలు ఆదర్శాలను పక్కకు నెట్టి 18 వ ఏటనే ఉద్యోగ పర్వంలో అడుగు పెట్టారు. మొదట విశాఖపట్నం మిలటరీ క్యాంటీన్లో 1942′ 43 మధ్య అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత 801వ బ్రిటిష్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇంజనీర్ల యూనిట్‌లో సర్వేపని నేర్చుకున్నారు. తర్వాత మిలిటరీ గ్యారేజ్‌స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సర్వీసులో చేరారు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసినా మిలిటరీ సర్వీసులోనే కొనసాగుతూ వచ్చారు. ఉద్యోగరీత్యా ఆయన పూనా, మద్రాస్‌, సికింద్రాబాద్‌ అస్సాం విశాఖపట్నాలలో పనిచేశారు.

వీరు ప్రారంభంలో శ్రీశ్రీ బాణిలో టుమ్రీలను, సర్రియలిజం కవితలను రాసినా, భావవ్యక్తీకరణకు, అభిప్రాయప్రకటనకు కథే మిక్కిలి అనుకూలంగా ఉంటుందని తాను కథా రచయితగా మారినట్లు తానే చెప్పుకున్నారు. వీరి కథలు వినోదిని, చిత్రగుప్త, ఢంకా, రూపవాణి భారతి, కృష్ణ, శారద వంటి సాహిత్య పత్రికలలో ముద్రతమయ్యాయి. వీరు ఎన్నో సినిమాలకు సమీక్షలు, విశ్లేషణగా వ్యాసాలు రాశారు.

వీరు మునిపల్లె రాజు కథలు, పుష్పాలు, ప్రేమికులు, పశువులు దివో స్వషప్నాలతో ముఖాముఖి, అను కథా సంపుటాలను, మరికొన్ని కథలను వీరు వివిధ పత్రికలలో ప్రచురించారు. వీరు మానవతా, మానసిక విశ్లేషణ, _ అధ్యాత్మికత, _ తాత్వికత, సాంప్రదాయ. విలువల _ వ్యక్తీకరణ, జాతీయత మొదలైన వాటికి పట్టం గట్టి కథలను రాసి యువ రచయితలకు, రచయిత్రులకు మార్గదర్శకంగా నిలిచారు. అందుకే. కాబోలు ప్రఖ్యాత సీనియర్‌ రచయిత అయిన మధురాంతకం రాజారాంలాంటి. వారు సైతం వీరిని కథా సాహిత్యంలో తమ. గురువుగా చెప్పుకునేవారు. “కథల్లో గానీ జీవితంలో గానీ మానవుడే మహనీయుడు” అనేది ఆయన మోటో, అందుకే అతని కథలు నిండా మానవత్వం సౌందర్య పరిమళాలే పరివ్యాప్తమై ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగానే అణువణువులోను మానవత్వాన్ని నింపుకున్న నిలువెత్తు మనిషి. తన ఉద్యోగ జీవనంలో తటస్థపడిన మనుషులను, సంఘటనలను తన కథల్లో ప్రస్తావించారు. స్వీయానుభవాలతో రాసిన కథలు కనుక ఇవి సజీవత్వాన్ని సంతరించుకుని ఉన్నాయి.

మునిపల్లె రాజు గారి కథల్లోని సాహితీ మూర్తిని అనేక సంస్థలు గుర్తించి వివిధ సత్కారాలను అందించాయి. వాటిలో నూతలపాటి స్మారక సమితి సాహితీ పురస్కారం 1993, జేష్ట లిటరరీ సాహితీ సత్కారం 1993, రావిశాస్త్రి మెమోరియల్‌ లిటరరీట్రస్ట్‌ వారి ప్రథమ పురస్కారం 1994, పలుపుల శివయ్య సాహితీపురస్కారం 1995, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం 1996, కళాసాగర్‌ మద్రాస్‌ వారి సత్కారం, మొదలైనవి ఆయన కృషికి గుర్తింపుగా లభించిన గౌరవాలు. వీరు రాసిన కథల్లో వారాలపిల్లాడు, సవతి తమ్ముడు, ఆవలి పక్షం, బిచ్చగాళ్ళ జెండా లాంటి మరుపురాని కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథల్లో “సరోజా అనే కథ ఒక విశిష్టమైనది. వారి గొప్ప కథల్లో ప్రత్యేకంగా నిలబడిన కథ ఇది. ఒక చిత్రలేఖకుని జీవితాన్ని, అతని బొమ్మలకు మోడల్‌గా మారిన సరోజ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన శైలితో ఫిడేలు రాగాల ప్రవాహంలో సాగిన అద్భుతమైన కథ సరోజ. ఈ కథలోని ప్రతి అక్షరంలోనూ ఒక ఆర్థత తాత్విక భావన నిక్షిప్తమై ఉండి పాఠకున్ని అట్టే ఆకర్షిస్తుంది.

ఈ కథలో ప్రధాన పాత్రలు హయగ్రీవం, సరోజలు. హయగ్రీవం చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఉన్న ఒక అక్కకూ పెళ్ళె ఎక్కడో భర్తతో కాపురం చేసుకుంటూ ఉంటుంది.

హయగ్రీవం మిలిటరీలో పనిచేస్తుంటాడు. అక్కడ అతని మిత్రుడు పార్థసారథి _ మిత్రులిద్దరూ సర్వీసులో అంచలంచెలుగా కెప్టెన్‌స్థాయికి ఎదుగుతారు. రెండవ ప్రపంచ యుద్దంలో బ్రిటిష్‌ సైన్యం తరపున జపానో ‘తలపడతారు. ఈ యుద్ధంలో హయగ్రీవాని కాలిపోతుంది. కుంటివాడైనందుకు అతనిని మిలిటరీ సర్వీసు నుంచి డిమాబ్‌ చేస్తారు. పార్థసారథి మాత్రం సర్విసులోనే కొనసాగుతూ ఒక ఇటాలియన్‌ కన్యను పెళ్ళాడతాడు. ఇటలీలోనే స్థిరపడి ఇటాలియన్‌ కన్సల్టింగ్‌ ఇంజనీరుగా “పనిచేస్తుంటాడు. హయగ్రీవం మిలిటరీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మద్రాసులో పార్థసారథి సొంత ఇంట్లో అద్దెకుంటూ నివసిస్తూ ఉంటాడు. హయగ్రీవం కుంటివాడైనందున అతని భార్య విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. మిలిటరీ సర్వీసు నుంచి వచ్చినందున హయగ్రీవం ఒక ఉద్యోగంలో చేర్తాడు. కానీ అక్కడ ఇమిడలేక దానికి రాజీనామా చేస్తాడు. అతనికి ఏ ఆధారము ఉండదు.

అయితే. చిన్నతనం నుంచి తన అక్కకు తనకు చిత్రలేఖనం, ఫిడేలు వాయించడం బాగా అబ్బింది. వీటి మీద ఆధారపడి జీవిద్ధాం అనుకుంటే. అవి కూడు పెట్టవు. సరిగ్గా అదే సమయంలో అతని మిత్రులైన భాస్కరం, శ్రీను నడుపుతున్న స్టూడియోకు పని ఏమైనా దొరుకుతుందని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మోడల్‌ సరోజా అతనికి పరిచయం అవుతుంది. ఆమె ఒక అబ్కారి జవాన్‌ కూతురు. తాగుబోతు అయిన ఆమె భర్త ఉద్యోగం పోగొట్టుకొని మోడల్‌ వృత్తి చేసే భార్య సంపాదన పై ఆధారపడి ఉంటాడు. అప్పటినుండి సరోజ హయగ్రీవం వద్ద మోడల్‌గా పనిచేస్తూ ఉంటుంది. తాను గీసిన బొమ్మల్ని ఇటలీకి పంపుతాడు. అక్కడ అలాంటి సహజత్వం లేని చిత్రాలకు పెద్దగా గిరాకీ ఉండదని పార్థసారథి ఉత్తరం రాస్తాడు. జీవకళ ఉట్టిపడే భారతదేశ తాత్వికత కనబడే చిత్రాలు గీయమని ఉత్తరం ద్వారా తెలుపుతాడు. ఇటలీ నుండి తిరిగి వచ్చిన చిత్రాలను మిత్రులైన భాస్కరం, శ్రీనులు తీసుకొని ఢల్లీలో జరిగే ప్రదర్శనకు వెళ్తారు. ఆ చిత్రాలు అమ్ముడుపోయాయో లేదో తెలియదు కానీ వాళ్లు కొంత పైకాన్ని మాత్రం హయగ్రీవానికి ఇస్తారు. తర్వాత హయగ్రీవం పార్థసారథి కోరిన విధంగా సహజత్వం ఉట్టిపడేట్టుగా దేవాలయ కళ్యాణ మండపంలో కనిపించే దేవదాసీల నృత్యం, తడిచిన బట్టలతో గ్రామీణ స్తీ చెరువు నుండి నీళ్లు తెచ్చే వంటి చిత్రాలను గీస్తాడు. చిత్రాల కోసం సరోజని మోడల్‌గా పెట్టుకుని చిత్రాలు గీయటానికి ప్రయత్నిస్తాడు. ఆమెకు దినసరి వేతనం 15 రూపాయలు.

ఈలోగా హయగ్రీవానికి విపరీతంగా జ్వరం వస్తుంది. అప్పుడు తన బాధల్ని కూడా మరచి హైయగ్రీవానికి చిన్నపిల్లలకి చేసినట్టు సేవ చేస్తుంది సరోజ. తన దినసరి కూలీ కూడా తీసుకోదు. జ్వరం నుంచి కొలుకున్న హయగ్రీవం ప్రార్ధసారథి కోరినట్లు సహజత్వం ఉట్టిపడేటట్లు వివేకానందుడి ఉద్దాటన, పాళ్చెత్యుడి టెక్నాలజీ, భారతీయుడి ఆత్మ విమర్శ మిళితంచేసి వేసిన కొత్త బొమ్మలు. రమణాశ్రయంలో వృక్షరాశి, ఛాయా సాష్టాంగ నమస్కృతి, నాగపూజ, సరోజతో మొన్నమొన్నటి బొమ్మలు అన్నీ కలిపి చిత్రాలను గీసి ఇటలీకి పంపుతాడు. ఆరు నెలల తర్వాత ఒకరోజు సరోజని కూర్చోబెట్టి బొమ్మ గీయడానికి ప్రయత్నిస్తుండగా హయగ్రీవానికి పార్థసారథి నుండి బిల్‌గ్రామ్‌ వస్తుంది. హయగ్రీవం చిత్రాలన్నీ అమ్ముడు పోయాయని, మూడు వేల పౌండ్లు బ్యాంకు ద్వారా పంపుతున్నానని ప్రశంసిస్తూ పార్థసారథి నుంచి వచ్చిన టెలిగ్రామ్‌ అది. హయగ్రీవం, సరోజా! అని అరుస్తూ ఆమె వైపు చూస్తాడు. ఆమె నుండి సమాధానం లేదు. సరోజ చేతిలో ఫిడేలు జారి నేల మీద పడ్డది. కమానింకా చేతిలోనే ఉన్నది. గడ్డంతో ఫిడేలు పట్టుకుని ఫోజిస్తూ కూర్చున్న సరోజ డబ్బుమని సోఫాపైన వాలిపోతుంది. విషయం అర్థం కాని హయగ్రీవం సరోజా! అంటూ నీళ్లు తెచ్చి ముఖంపైన చిలకరిస్తాడు.

ఆమె కళ్ళు తెరుస్తుంది. ఆమె వీపు మీద తేలిన వాతలు పమిట తొలగి కనిపిస్తున్నాయి. “నీ బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి సరోజా! నువ్వు అబద్ధం చెప్పలేదు సరోజా! నీళ్లు నీళ్లు తాగు” అంటాడు. సరోజ కళ్ళు తెరిచి చూస్తూ. చిరునవ్వు అధరాల చివర్లన అలుముకుంటుంటే మెల్లగా అన్నది “అన్నం తిని మూడు రోజులైంది” హయగ్రీవ హతాసుడైపోయాడు. బతుకంటే అర్థం చెప్పిన మానవి సరోజిని ఎలాగైనా బతికించుకోవాలని మెట్టు దూకుతూ క్రిందకి పోతాడు. కాఫీకో, కొబ్బరి నీళ్ళకో. “ఇదా చిత్రం లేఖనం” అంటే అని అనుకుంటాడు.

ఈ కథలో తాను కొవ్యొత్తిలా కాలిపోతున్నా కూడా నిరాశ, నిస్ప్రహలతో నిండిన హయగ్రీవానికి సహాయం చేయడం సరోజా త్యాగశీలతకు చక్కని నిదర్శనం.

మునిపల్లె. రాజుగారిది. స్త్రీ పాత్ర చిత్రణలో అందెవేసిన చేయి. ఆయన ప్రతి స్తీలోనూ మాతృమూర్తిని దర్శించగలిగిన సహృదయుడు. తన జీవన గమనంలో తారసిల్లిన ఎందరో స్త్రీలను తన కథల్లో పాత్రలుగా చిత్రించి జీవం పోశారు. అందుకే ఆయన కథల్లోని స్త్రీ పాత్రలు సజీవాలై జీవకళతో _ తొణికిసలాడుతాయి. ఈ సరోజ కథలోని పాత్ర కరుణ రసభరితంగా ఉండటం వల్ల ఈమె పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పవచ్చు.

ఈమె కేవలం ఒక దినసరి ‘మోడల్‌ కూలిగా చిత్రకారుని కుంచకు ప్రాణం పోసినట్టిది. తన జీవితంలో ఎంత చీకటున్నా, తన భర్త తనను ఎంత హింసించినా, ఎవరితోనూ తన బాధలు చెప్పుకోని మనస్తత్వం కలదు. భర్తను పోషించుకోవడం కోసమే కూలీగా మారిన ఉత్తమ గృహిణి సరోజ. అనుకోకుండా కలిసిన చిత్రకారుడు హయగ్రీవానికి ఒక ప్రేరణగా కనిపిస్తుంది. మోడల్‌గా ఫోజువ్వటానికి అతని పిలుపుపై ఇంటికెళ్లిన సరోజ హయగ్రీవం జ్వరంతో ఉన్నప్పుడు తల్లిలా సేవ చేసి తన దినసరి కూలీ డబ్బుతోనే పాలు, బ్రెడ్డు కొని తెచ్చి ఇచ్చిన కరుణామూర్తి.

తన బొమ్మలకు విలువ లేకుండా పోయిందని విచారించే హయగ్రీవంతో “భాస్కరం, శ్రీనుల చిత్రాల కన్నా, మీ చిత్రాల్లోనే సహజత్వం కనబడుతుందని అతనికి స్టైర్యాన్ని కల్పించిన సహృదయరాలు.

హయగ్రీవానికి మొదటిసారి సరోజ పరిచయమైనప్పుడు ఆమె రూపం “విరాటుని కొలువులో సైరంద్రి, అశోక వృక్షపు నీడలోని సీతాదేవిలా కనిపిస్తుంది. అలాంటి దయనీయ స్థితిలో ఉండి కూడా గొప్ప చిత్రకారునిగా హయగ్రీవం విదేశాల్లో భారతీయ చీత్రకళకు అంత గొప్పదనం కలగటానికి తనకు అంతటి డబ్బు, ‘సౌరవం లభించటానికి కారణం సరోజే అని ఆమెను మెచ్చుకుంటాడు. తాను చిన్నపాటి మోడల్‌గా నిలిచి, తాను కాలిపోతూ కూడా వెలుగునిచ్చే కొవ్యొత్తిగా త్యాగమయిగా సరోజ పాత్ర కనిపిస్తుంది. నిరాశతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో అతనికి ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి.

ఈ సరోజ కథ పరోక్ష కథనంలో సాగిన కథ. అంతేగాక మునిపల్లి రాజుగారు ఫ్లాష్‌బ్యాక్‌ కధన పద్ధతిని కూడా ఎంతో చక్కగా అద్భుత శైలి విన్యాసంతో నిర్వహించిన తీరు అమోఘం. “మళ్లీ ఇంకో లోకం, జ్వరభాషలో జపానీ మాటలు మాటలుకావు, మృత్యుఘోషలు, జపాన్‌ సిఫాయి బాయినెట్‌ అని, మన దేశ సైన్యం గుర్ధాలు, సిక్కులు, డోగ్రాలు, మరాఠాలు ఎలా ఎవరెవరు బ్రిటీష్‌ ష్‌ ప్రభుత్వం పక్షాన యుద్ధంలో పాల్గొన్నది. ఆ యుద్ధంలో హయగ్రీవం అవిటివాడైన సంఘటనని ఫ్లాష్‌బ్యాక్‌ నేపథ్యంలో నడిపించిన తీరు కథకు ఒక నిండుదనాన్నిచ్చింది.

అలాగే కథానికా రచనలో కథనాన్ని కమనీయంగా నడిపేది వర్ణన. ఇది కథానికకు కళా సౌందర్యాన్ని తాత్వికత్వాన్ని చేకూరుస్తుంది. ‘సరోజ’ కథ “జ్వరం” వర్ణనతో మొదలై కళ్ళు మూతలు పడుతున్నా తూలిపోయి మంచంమీద పడిపోయిన అనారోగ్య స్థితిని హయగ్రీవం పాత్ర ద్వారా వ్యక్తీకరిస్తే చివర సరోజ అన్నం తిని మూడురోజులైందని ఆకలితో, నిస్పత్తువతో ఆమె కళ్ళు బైర్లుకమ్మి అచేతన స్థితిలోకి మారిన తీరు అనారోగ్యంపాలై ఆవిష్కృతమైంది. ఈ కథలోని విశిష్టత ఏమిటంటే ఏ వర్లనతో అయితే కథ ప్రారంభమైందో, అదే వర్ణనతో కథ ముగుస్తుంది. ఇది రచయిత శైలి దక్షతను శిల్ప నైపుణ్యాన్ని వ్యక్తపరిచే అంశం.

ఈ కథలో ప్రధాన పాత్ర అయిన సరోజ అను పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి ఆ పాత్ర పేరుని శీర్షికగా నిర్ణయించడం కూడా ఓ ప్రత్యేకత. ముగింపులో రచయిత తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా పాఠకుల ఆలోచనకే మనోభావాలకే వదిలివేయడం ఈ కథలోని మరో విశిష్టత. కథను రచయిత “హయగ్రీవం మెట్లు దూకుతూ కిందికి పోయాడు కాఫీకో, కొబ్బరినీళ్ళకో. బతుకంటే అర్థం చెప్పిన మానవికి ఇదా చిత్రలేఖనం అంటే అనే ప్రశ్నతో ముగించారు. అంతేకాకుండా చిత్రలేఖనంలోని సాధక బాధకాలను, చిత్రాలు అమ్ముడుపోవడానికి వేలంలో గిరాకీ పలకడానికి, చిత్రాల్లో జీవం ఉండాలనే సత్యాన్ని చెప్పడంతో పాటు చిత్రాలలో కనిపించే స్త్రీల, మనుషుల అంతరంగాలలోని అగాధాలను ముఖంలో కనిపించనివ్వక ఎంత జాగ్రత్త వహిస్తారో సరోజ పాత్ర ద్వారా చాలా కళాత్మకంగా ఉదాత్తంగా ఆవిష్కరించారు మునిపల్లె రాజుగారు. ఈ కథలోని సంఘటనల ద్వారా వర్ణనల వలన ఈ కథ కాలము రెండవ ప్రపంచయుద్ధ కాలం నాటిదని అంచనా వేయవచ్చు. మన భారతీయులు బ్రిటీష్‌ ప్రభుత్వం తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో పోరాడిన విషయాన్ని ప్రస్తావించటం వల్ల అప్పటి యూరప్‌లో నాజీలు సాగించిన దురహంకారచర్యల్ని 1940 వ దశకంలోని ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని పట్టించే చారిత్రక నేపథ్యం కూడా ఉందని అర్థం చేసుకోవచ్చు.

మనిషి జీవితంలో ఎదురయ్యే ఆధ్యాత్మిక, భౌతిక, తాత్విక కల్లోలాలను మానసిక సంఘర్షణను కరుణ రసాత్మకంగా చిత్రించిన కథ “సరోజ. ఇదొక వచన రూపంలో ఉన్న కావ్యంగా అనిపించి పాఠకుడికి రచయితకి మధ్య ఒక ఆత్మిక అనుబంధాన్ని కూడా నిలుపుతుందనడంలోనూ సందేహం లేదు. రాజుగారి శైలి ఒక లయాత్మకమైన బిగువు కలిగి ఉంటుంది. అదే ఆయన రచనకు ఒక అమరత్వాన్ని కలిగిస్తుంది. అందుకే అరసం వారు ప్రసిద్ధ కథా నవల రచయితగా డాక్టర్‌ వి. ఆర్‌. రాసాని సంపాదకత్వంలో ముద్రించిన మునిపల్లె రాజు కథలు పుస్తకంలో “మధురమైన ఫిడేలు రాణువు తొక్కిన కధనంలో రాసిన అద్భుత కథ సరోజ అంటారు” రాసాని. ఇన్ని కారణాల వల్లనే రాజుగారి కథలలో సరోజ కథ ఒక ఉత్తమ కథగా నిలిచిపోయింది.


5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles