11.5 C
New York
Sunday, November 24, 2024

ఆచార్య ఇనాక్‌ కథల్లో విశేష మణిపూస “కొత్త యిల్లు”

– ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

“కొత్త యిల్లు” ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రాసిన కథ. 1969 క్రితం రాసిన ఈ కథ అనేక విషయాలలో ఈనాటికీ ఆలోచింపజేసే రచన. ఈ కథ రాసి 53 సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ మారని సామాజిక పరిస్టితులు మానవ స్వభావాలు ఆ నడుమ దాగిన మానవ బొన్నత్యం ఆలోచింపజేసే విషయాలు. మనిషి స్వార్థజీవి. అదే సమయంలో మనిషి క్షమాగుణ భరతుడు. ఈ కథలోని సౌందర్యం ఈ వైరుద్ధ్యం. ఈ కథ ప్రధానంగా పేరమ్మది చలమయ్యుది. వీరి సంతానం బసవయ్య. అతని భార్య సీతమ్మ. పేరమ్మ సీతమ్మ పాత్రలు స్త్రీ విశేష విశాల హృదయ దృష్టికి నిదర్శనం. దేనినైనా ఎదుర్కొనే అందుకొనే తట్టుకొనే శక్తికి బలమైన ప్రతీక పేరమ్మ. ఆమె గుణగణాలు కొంత కనిపించే పాత్ర సీతమ్మ. పేరమ్మ జీవితం ఈ కథలో ప్రధానాంశం. ఆమె జీవిత చిత్రణకు దోహదమైన చలమయ్య పాత్ర ప్రధానంగా కథలో రచయిత అనేక జీవిత వాస్తవాలను చెప్పారు.

ఈ కథలో 30 ఏళ్ళ వయస్సుకు జీవితాన్ని లోతుగా పరామర్శించగల తాత్త్విక దృష్టిని రచయిత కనపరచడం అబ్బురపరుస్తుంది. రచయిత కథ నిర్మాణంలో వాడిన పోలికలు ఉపమానాలు స్వభావ చిత్రణ గుర్తంచదగ్గవి. ప్రకృతి ధర్మాన్ని మానవ నైజాన్ని ముడిపెట్టి చూపటం విశేషం. రచయిత శిల్ప నిర్మాణం, కంఠస్వరం, కథాసూచనకు ఇచ్చే సూక్ష్మాలు కథ పటిష్టతకు నిదర్శనం. స్త్రీవాదం తొంబైలలో వేగం పుంజుకోవడం సాహిత్యంలో చూడగలం. కానీ ఆచార్య ఇనాక్‌గారు ఆనాడే, ఇంకా స్తీవాదపు ఆలోచనలు ప్రసరించని కాలంలోనే, నూతన ఆలోచనలకు పాదుగొల్పారు. సాహిత్యంలో ఈనాడు ప్రస్ఫుటంగా వ్యక్తం చేసే స్త్రీవాద భావనలను ‘లింగవివక్ష వయోభేదం’ ఈ కథలో భాగం చేశారు, చర్చించారు. ఇటువంటి సందర్భంలోనే రచయితని క్రాంత దర్శకుడు అంటారు. సమాజం భవిష్యత్తులో ఏమి చూస్తుందో ఏ రూపంలో ఏ మార్గంలో ప్రయాణం చేస్తుందో రాబోయే పరిణామాలని ముందుగా చూడగలిగినటువంటి ద్రష్ట రచయిత.

I.పాత్రలు: ఇందులో ప్రధాన పాత్ర పేరమ్మ. చలమయ్య, బసవయ్య, సీతమ్మ పేరమ్మ బంధువులు. కథలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉండి కథమలుపులకు కారణమైన పాత్ర సభారంజని.

సీతమ్మ: ఒకానొక గ్రామం. ఆ గ్రామంలో ఊరబావిలో నీళ్ళు తోడుకొంటున్న సీతమ్మతో కథ ఆరంభమయ్యింది. ఆక్కడ తాటి చెట్టు కింద కూర్చొన్న చలమయ్యను ఆమె చూసింది.

సీతమ్మ పాత్ర చురుకైనది. ఆమె చలమయ్య కోడలు. అతను పేరమ్మ గురించి అడగగానే ఆమెకు కలిగిన కొంత అనుమానం, _ భర్త పేరుతో బసవయ్య బాగున్నాడా అని అడగడంతో అని అడగడంతో ఆమెకు అనుమానం బలపడిరది. అతడి పేరు అడిగి చలమయ్య అని. తెలిసితన మామే అనే నిజం తెలుసుకొంది. ఆమెలోని చురుకుదనం వళ్లే అతను చెప్పకనే అతడు ఎవరో కనుక్కోగలిగింది. ఇంటికొచ్చి అత్తకు చెప్పింది. చలమయ్య పలకరిస్తే పేరమ్మ బదులు జవాబివ్వటంతో సీతమ్మకు మనసు కుదుటపడిరది అంటారు రచయిత. సీతమ్మలో కనపడని వ్యక్తం కానీ భయం అది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన మామ పట్ల అత్త ప్రవర్తన ఎలా ఉంటుందో అనే అనుమానం నుంచి ఆ భయం వచ్చింది. చలమయ్యతో బసవయ్య పెడసరంగా మాట్లాడితే సర్ది చెప్పింది. భర్త తండ్రి పట్ల నిరసనగా ఉన్నా, సీతమ్మ అతడి దూరంగా కానీ నిరసనగా కానీ చూడకపోవడం ఆమెలోని అంగీకార స్వభావానికి నిదర్శనం.

సభారంజని: సభారంజని పరోక్షంగానే తప్ప ప్రత్యక్షంగా కనపడని అతి ముఖ్యమైన పాత్ర. చలమయ్య ఆమెను ఇష్టపడటం వల్ల చెల్లాచెదురైన కుటుంబం, ఆమె మరణానంతరం చలమయ్య తిరిగి రావడంతో ఒక కుదుపుకు గురయింది.చలమయ్య తెచ్చిన ధనం అయిపోయి తిరిగి నాటకాలలో పాత్రలు వేయాల్సి వచ్చినప్పుడు అతడి పట్ల కొంత నిరసన చూపినా అతడిపై జాలి పడిరది. తనతోనే ఉండనిచ్చింది. ఆమె నాటక ప్రదర్శనలకు సహాయకారిగా ఉంటూ మాయల ఫకీరు పాత్రను నేర్చుకొన్న చలమయ్యను నాటకాలలో పాత్రధారిని చేసింది. కలిసి ప్రదర్శనలిచ్చారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. ఆస్తులు సంపాదించుకొన్నారు. పరిస్థితి తలకిందులై అనారోగ్యాల పాలయారు. టైఫాయిడ్‌తో ఆమె మరణించింది. చలమయ్య ఎంత ప్రయత్నించినా ఆమెను రక్షించుకోలేక పోయాడు.

బసవయ్య: బసవయ్య చలమయ్య కొడుకు. కానీ పుట్టిన దగ్గర నుంచి తండ్రిని చూడనేలేదు. తండ్రి పెంపకంలో పెరగలేదు. తండ్రి పట్ల ఏ రకమైన ప్రేమ కానీ బాధ్యత కానీ లేవు. తండ్రి ప్రేమను పొందలేదు. తండ్రితో ఎలా ఉండాలో మెలగాలో. మాట్లాడాలో తెలియదు. 20 ఏళ్ల బసవయ్య తల్లి పెంపకంలో పెరగి సమర్దుడిగా నిలిచాడు. 40 ఏళ్ల చలమయ్య _ ఇంటికి రావటం ఎలా స్వీకరించాలో కూడా అర్థంకాని అయోమయ స్థితి బసవయ్యది. అతనిలో ఉండే ఈ గందరగోళం అతనికి అర్థం కానీ అయోమయ స్టితి. తల్లి మాటను ఒప్పుకుని చలమయ్య తండ్రిగా అంగీకరించడానికి సంసిద్ధంగా లేడు. భార్య చెబుతున్నా స్వీకరించే మానసిక స్థితిలేదు. రచయిత అక్కడ ఉంటారు, ‘ఒక మధురమైన ఊహ, తీయని కల, ఎడారిలో సరోవరం వంటి ఆలోచనతో అక్కడ కూర్చున్న మనిషి తన తండ్రి అనుకోవటానికి ప్రయత్నిస్తే, పెన్సిలిన్‌ ఇంజక్షను పడని వాళ్లకు ఇంజక్షను ఇస్తే వచ్చే రియాక్షను వంటిది వచ్చి వళ్లంతా మంటప్పుట్టింది’ (61) అని. ఈ వాక్యం బసవయ్య ఆంతర సంఘర్షణకు నిదర్శనం. పదహారేళ్ల వయసులో పేరమ్మకు పుట్టిన సంతానం బసవయ్య. 20 ఏళ్లు ఆమెని వదిలి వెళ్లిన చలమయ్య మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆమె ముప్పై ఆరేళ్ల వయసులోనూ కుమారుడు 20 ఏళ్ల వయసులోనూ ఉన్నారు.

ఈ సందర్భంలో ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అన్న ఊరి వాళ్ల మాటలు బసవయ్యను కుంగదీశాయి. అందుకే అతడిని వెళ్లిపొమ్మని తల్లితో వాదించాడు. కుమారుడికి _ సర్దిచెప్పుకోలేక తల్లడిల్లి పోయింది పేరమ్మ, తల్లితో ఘర్షణ అనంతరం ప్రశాంతంగా నిద్రపోయాడు బసవయ్య. ఈ వాదన విన్న ఫలితంగా చలమయ్య ఇల్లు వదిలి వెళ్లిపోతే తల్లి నిద్రలేపి వెతుక్కొని రమ్మని బసవయ్యకు పురమాయించింది. ఈ అంతటిలోనూ తల్లి పరాయి పురుషుడికి దగ్గరవుతోంది అనే ఊరి వారి వ్యంగ్యపు మాటలు అతడిని తల్లికి ఎదురు చెప్పే ఘర్షించే వాదించే పరిస్థితికి కారణమైతే, ఈ పాత్రను చిత్రించడంలో రచయిత ఆ వయస్సు యువకుడి మానసిక సంఘర్షణ తర్కబద్ధంగా కథలో నిలిపారు. స్త్రీ సున్నిత హృదయ ప్రభావిత. అది సీతమ్మ దగ్గర చిత్రించారు రచయిత. పురుషుడు, భావోద్వేగం కంటే ప్రాపంచికత తార్కికత కలిగి ఉంటాడు. పురుషుడి ఈ స్వభావమే బసవయ్య పాత్ర చిత్రణలో కనిపిస్తుంది.

చలమయ్య: చలమయ్య తన భార్య పేరమ్మ ప్రసవమై తిరిగి వస్తున్న సమయానికి ఇంటి నుంచి దొరికిన డబ్బు తీసుకొని సభారంజని అనే భోగపు స్త్రీ, నాటకాలలో పాత్రలను పోషించే స్తీ పట్ల మక్కువతో ఆమె అంగీకారంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పసిగుడ్డుతో పదహారేళ్ల పేరమ్మ ఇంటికి వచ్చేసరికి ఇతను లేడు. సభారంజనితో చేతిలో డబ్బు ఉన్నంత వరకు సుఖంగా జీవించిన చలమయ్య ఆపై ఆమె నిరసనలకు సంపాదన లేని ఇబ్బందికి పరాశ్రితంగా బ్రతకవలసిన దైన్యానికి గురయ్యాడు. ఆమె ప్రదర్శించే నాటకాలకు తెరదించుతూ తీస్తూ అవీ ఇవీ అందిస్తూ త్‌ కొంతకాలం జీవించాడు. డబ్బు ఉన్నప్పుడు అతనితో సుఖంగా ఉన్న సభారంజని తిరిగి తాను నాటకాలలో పాత్రలు వేయవలసి వచ్చిన స్థితిలో అతడిని నిరాకరించలేక, ప్రేమించనూ లేక పోయింది. కానీ జాలితో తనతో ఉండనిచ్చింది. చలమయ్య, _ ఆమెతో పాటు ఆమె ప్రదర్శించే నాటకాలకు సహాయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలనాగమ్మ నాటకంలోని మాయలఫకీరు పాత్ర అద్భుతంగా వేయగలిగిన సామర్థ్యం రావడంతో జంటగా వారిరువురూ కొన్ని సంవత్సరాలు కాంటాక్ట్‌ తీసుకొని ప్రదర్శనలు ఇచ్చారు. డబ్బులు బాగా సంపాదించుకొన్నారు. ప్రజాదరణ బాగా పొందారు. ఆరేళ్లలో సంపాదించిన ఘనత తగ్గసాగింది. క్రమంగా నాటకాలు వేయడానికి అవకాశాలు తగ్గిపోయాయి. రాబడి తగ్గిపోవడం మొదలైంది. ఆరోగ్యాలు పాడయ్యి ఇబ్బంది పడే పరిస్థితి అయింది. టిబితో అతడి ఆరోగ్యం సన్నగిల్లినప్పుడు విశ్రాంతి అవసరమైంది. సభారంజని టైఫాయిడ్‌ తీవ్రమై మరణించింది ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు చలమయ్య. అప్పులు తీర్చటానికి ఉన్న ఇల్లు అమ్మి, అప్పులు తీర్చి,మిగిలిన డబ్బుని జేబులో పెట్టుకొని తాను ఎప్పుడో వదిలేసి విస్మరించిన భార్యని గుర్తు చేసుకున్నాడు మెల్లిగా ఊరు చేరాడు. ‘ఏ వూరు నుంచో ఏ వూరుకో పోతున్న ఏ బాటసారో పడుకోవడానికి చోటు ఇవ్వమంటే ఇవ్వగలిగే యింటిలో అడుక్కునే బిచ్చగాడికీ ఇంత అన్నం పెట్టగలిగే యింట్లో తనకు చోటు దొరకకపోతుందా అని గంపెడాశతో వచ్చాడు చలమయ్యు’ (పు.74) అంటారు రచయిత. అయితే తల్లి కొడుకు కోడలు అనుబంధంగా అల్లుకున్న కుటుంబంలో తనను దరిచేర్చుకోగలరా అనే అనుమానం ఇక్కడికొచ్చాక అతడికి కలిగింది.

తల్లీకొడుకుల వాదన తన గురించి ఘర్షణాత్మకంగా జరుగుతుండటం విని, తనకు అక్కడ ఆశ్రయం దొరకదని వారి మధ్య తను ఉండడం సబబు కాదని చలమయ్య భావించాడు. ఆ రాత్రే తన దగ్గర మిగిలిన డబ్బును పేరమ్మ కొంగుకు కట్టి ఇంటి నుంచి వెల్లిపొయాడు. ఈ పాత్రను చిత్రించేటప్పుడు రచయిత ఆ పాత్రలో ఉన్న బలహీనతల్ని _ చెప్పకనే చెప్పారు. అతని కోపం తాటాకు మంట అంటారు రచయిత. ఆ తాటాకు మంటలాగా అది లేచి అణగారిపోతుంది. ఇతని ఆలోచన కూడా తాటాకులమంటే. “చుర చుర త్వరత్వరగా మండి చప్పున ఆరిపోయి నిప్పు జాడ కూడా లేకుండా అయిపోయే మంట. ఆ మంటల్లోనే ఏమైనా చేస్తే దానికి తిరుగుండదు. మంట తగ్గితే మళ్లీ మంట పుట్టడం సామాన్యంగా జరగదు అంటారు రచయిత. చుర చురమని మంట పుట్టినప్పుడే చలమయ్య నిర్ణయించుకొన్నాడు ఇంటి నుంచి వెళ్లిపోవాలని. అలా పుట్టినప్పుడు చేసిన దానికి మళ్ళీ తిరుగుండదు అన్న రచయిత మాట ఆయన తీసుకొన్న నిర్ణయంలో కనిపిస్తూ ఉంది. చలమయ్య బలహీనత సభారంజని. ఆమెను వదల్లేని స్థితి అతనిది. ‘పోయి.. సెగన వెన్నముద్ద ఉంచితే కరిగిపోయినట్లు వయస్సులో పెద్దదైన స్త్రీ దగ్గర మగవాడు అలా అయిపోతాడని అనిపించింది చలమయ్యకు'(పు.64) అంటారు రచయిత. ధనమైపోయి తండ్రి సంపాదించిన రెండెకరాల పొలం తండ్రి తదనంతరం కానీ సంక్రమించని పరిస్థితిలో చలమయ్య తల్లడిల్లుతున్నప్పుడు అనుకొన్న మాట ఇది.

ఇంకా అంటారు రచయిత ‘ప్రమిదలో పడ్డ కీటకం, నీటిలో పడ్డ పురుగు పైకి రావాలని రాలేకపోయినట్లే అవుతుంది. హద్దుల్లిని ఆనందపు అలజడి పురుషుడికి కలిగించిన స్త్రీ నుంచి ఏ మగాడు దూరం కాలేడు’ (పు.65) అని. రచయిత మాటలో చలమయ్య ఎంతగా సభారంజని మోహంలో కూరుకుపోయాడో అర్ధం అవుతుంది.

పేరమ్మ: ఈ కథ అంతా పేరుమ్మ చుట్టూ అల్లుకున్నటువంటిదే. పదహారేళ్ల పేరమ్మను చలమయ్య వదిలేసి వెళ్లాడు. పెళ్లైన ఏడాదికి బిడ్డను కని, మెట్టినింటికీ తిరిగి వచ్చేసరికి చలమయ్య లేడు. పేరమ్మకు ఏమీ అర్ధం కాలేదు. భర్తను ప్రేమను పొందలేకపోయినా, అత్తమామల ఆదరణ పొందింది. కొడుకు ఉన్నప్పుడు దూరమైన వాళ్ళు కోడలు ఒంటరి కాగానే దరి చేరారు. మామ మరణంతో అత్త, కూతురు దగ్గరికి వెళ్లి దూరం కావడంతో ఒంటరిగానే పేరమ్మ కొడుకును పెంచింది. ప్రయోజకుడ్ని చేసింది. ఇంత కాలం తర్వాత తిరిగి వచ్చిన భర్తను చూసి ఎలా స్పందించాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. భర్త మమకారం పొందకుండానే 20 ఏళ్లు గడిపిన పేరమ్మకు భర్తతో ఎలా మాట్లాడాలో తెలియలేదు. భోజన సమయంలో అతడికి అన్నం పెట్టి బయటకి రాకుండా చుట్టింటిలోనే ఉండిపోయింది. భర్తగా కలిసి ఉన్న కాలం అతి తక్కువ. ఇప్పుడు ఇంటికి వచ్చిన భర్త ఎదుట నిలవలేక సిగ్గు మొహమాటం బెరుకు అయోమయం భావాలతో పేరమ్మ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

భర్త వస్తాడని ఎదురుచూడటంలో ఉండే ఆనందం అది నిరాశ అయితే కలిగే బాధ పేరమ్మ అనుభవించింది. బిడ్డను వదిలి వస్తే మరో పెళ్లి చేయాలని ఆమె తల్లి తండ్రులు భావించినా పేరమ్మ అది ఇష్టపడలేదు. బిడ్డను పెంచింది. ఎన్ని కష్టాలు, రంపపు కోతలు భరించినా ఆమె నిలదొక్కుకొంది. రచయిత అంటారు ‘ఆమెకు భర్త దూరమయ్యాడు కానీ అదృష్టం కాదు'(పు.68) అనీ. ఇది ఆమె కష్టానికి తోడైన అదృష్టం. పేరమ్మకు తల్లిదండ్రులు వివాహం చేయ తలపెట్టడం చూసిన అత్తమామలు ఉన్న రెండెకరాల పొలాన్ని మనవడి పేర రాశారు. ఆమె కష్టాన్ని రచయిత ‘భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని వర్తమానంలో జీవితం గుండెల మీద కుంపటి వేసుకుని పేరమ్మ గతం గడిపేసింది'(పు.72) అని. ఈ వాక్యం ఆమె కష్టాన్ని అంతటినీ చూపిస్తుంది. ఆమె తన కష్టంతో కొడుకు పెళ్లి చేసింది, రెండెకరాల పొలం కొంది, పాత ఇల్లు మార్చి రాతిగోడల ఇల్లు కట్టించింది. అది ఆమె సామర్థ్యం. పేరమ్మ సమర్థతని రచయిత “ఇంత జీవితం వెనుక భగవంతుడు నుదిటి మీద కుంకుమ బొట్టు క్రింద వ్రాసిన రాతలో తిరిగిన వంకర్లు మాటున సాఫీగా వున్న అదృష్టం కాక ఆమె శరీరం నుంచి కణం కణంగా స్రవించిన చెమట బొట్ల విలువ ఉంది (పు.72) అని. ఆమె శ్రమ పట్ల రచయితకున్న గౌరవం అది.

చలమయ్య అనారోగ్యంతో వచ్చాడు. అతడి ఉమ్మిలో రక్తపు జీర ఉండటం ఆమెకు వణుకు కలిగించింది. ఏమైందని అడిగినా అతడు సమాధానం చెప్పలేదు. ఎప్పుడైనా భర్త కనిపిస్తే 20 ఏళ్లుగా ఆమె. గుండె గూడు కట్టుకొని ఉన్న బాధనంతా చెప్పుకోవాలని ఆశపడేది. కానీ అతను వచ్చేసరికి, ఆమెకు ఏం చేయాలో తోచలేదు. భర్త అనారోగ్యాన్ని గుర్తించింది. కొడుకు పెడసరంగా ఉండటం గమనించింది. వారిద్దరి మధ్య పొరపొచ్చాలు వస్తే బతక కలిగిన కొడుకు కంటే బతకలేని భర్త తనకు ముఖ్యం కాదా?అని పేరమ్మ ఆలోచించింది. ఈ సందర్భం ఒక స్త్రీ బొన్నత్యాన్ని చాటే సందర్భం. భర్త ప్రేమ తెలియదు. తెలిసినా అది కొంతకాలమే. ఆమెను వంటరిని చేసి వదిలేపోయాడు. దాంపత్య మాధుర్యమే తెలియని 20 ఏళ్ల కాలాన్ని మోసిన పేరమ్మ, తిరిగి వచ్చిన భర్త పట్ల నిరసనను కానీ వ్యతిరేకతను కానీ అసహ్యాన్ని కానీ ఆమె భావించలేదు ప్రదర్శించలేదు. స్త్రీలలో ఉండే క్షమా గుణానికి పేరమ్మ పరాకాష్ట. స్త్రీలో తల్లి హృదయం ఉంటుంది. అది ఎన్ని తప్పులనైనా సహించగలిగిన తత్త్వాన్నిది . పిల్లలు తప్పు చేస్తే భరించే తల్లి గుణమే ఇక్కడ పేరమ్మలో కనిపిస్తుంది. ఒంటరిని చేసిపోయిన భర్త పట్ల ఏమైనా కొంతైనా చికాకు ఉండి ఉండేదేమో కానీ, అనారోగ్యంతో ఉన్న భర్తను చూడగానే ఆమెలోని స్త్రీ భార్యగా కాక తలిగా తలెత్తింది. ఒకప్పుడు తనపై ఆధారపడిన కొడుకుని పెంచినట్టే, తనపై ఆధారపడడానికి వచ్చిన భర్తను చూసుకోవాలసిన బాధ్యతకు సిద్ధమైంది.

20 ఏళ్లుగా జీవితంతో పోరాడుతూ. వచ్చిన పేరమ్మ జీవితాన్ని స్తిమితపరుచుకొంటూ ఉన్న సమయం అది. అయినా, మరోసారి. జీవిత పరిస్థితులతో పోరాటానికి సిద్ధమైన ధీర. ఆమెది లై మానవత్వం. అంతకు మించి బౌదార్యం అంతకు మించి క్షమాగుణం. అంతకు మించిన దైవత్వం. కొడుకు చలమయ్యతో చికాకుగా మాట్లాడుతుంటే, అత్తా కోడలు కలిసి మాట్ట్లాడుకొంటున్న సందర్భంలో రచయిత _ అంటారు, “వాళ్ళిద్దరూ పెద్ద విశాలమయిన చెరువు ల్లాగా కొత్తనీటిని కలుపుకోగల చెరువుల్లాగా కనిపించారు (పు.61 ) అని. ఇది రచయిత చేసిన కథాసూచన. ఆమె చలమయ్యను అంగీకరించడానికి అతడి అనారోగం వలన కలిగిన జాలి మాత్రమే అనుకోవటానికి లేదు. ఇది ఈ స్త్రీల హృదయ బౌన్నత్యం, ముఖ్యంగా పేరమ్మది.

కుమారుడితో వాదులాడిన సందర్భంలో, ఊరంతా ఎంతో పేరు గడిరచిన పేరమ్మను నిప్పులాంటి మనిషి అన్న పేరమ్మను గురించి చెడ్డగా అనుకొంటున్నారని అన్నపుడు ‘ఎవళ్ళుతోనో ఏంది? నేనెప్తుంటినిగా మీనాయనని’ అని నిలదీస్తున్న కొడుకుతో “ఏంట్రా నిజం చెప్పేది! సెబుతుంటే తెలియటంలా?’ అని గద్దించటంలోనూ తను ఏమిటో తెలుస్తుంది. ‘సత్తె పెమాణంగా మీ నాయనరా’ అని కుమారుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. . వీళ్ళిద్దరి ఘర్షణ విని ఈ వాదులాట తన వళ్లే అని చలమయ్య గ్రహించాడు. ఎంతో కాలం నుంచి కలసి ఉన్న కొడుకుని ఆమెకి దూరం చేయడం తగదని వారి మధ్య ఉన్న ఆప్యాయతను దూరం చేసే అధికారం తనకు లేదని భావించాడు చలమయ్య. తెచ్చినడబ్బును నిద్రపోతున్న పేరమ్మ కొంగు కట్టి వెళ్లిపోయాడు. వాదనలతో ఏడుపుతో ఆలస్యంగా పడుకొన్న పేరమ్మకు ఎవరో తట్టినట్టు మెలుకువ వచ్చింది. దానికి అతడి ప్రవర్తన పట్ల ఆమె గమనింపు కారణం. ఇలాంటిదేదో జరుగుతుందని ఆమెకు ఊహ. అందుకే లేచిన పెంటనే, జరిగింది గ్రహించి గుర్రు పెడుతున్న కొడుకున లేపి నీ మూలానే వెళ్లాడు ఎక్కడున్నా వెతికి తీసుకురా అని పంపింది. ఇది తిరిగి వచ్చే భర్త సంరక్షణ బాధ్యత తీసుకోదలచిన ఉన్నత మనసుకు నిదర్శనం. పేరమ్మలాంటి స్తీమూర్తులలో బౌనత్యం తెలుసుకోలేని సమాజానికి అర్థం చేసుకోడానికి సగౌరవంగా ఆదర్శంగా నిలిచే ప్రతీక పేరమ్మ.

II స్వాభావికత: రచయిత కథలకి ప్రాచుర్యాన్ని ఇచ్చిన అంశాలలో ఆయన రచనల్లో ఉన్న స్వాభావికత ఒకటి. పల్లెలో ఊరబావి దగ్గర నీళ్లు తాగుతున్న మనిషి వర్ణన ఇది. ‘నీళ్ళు తోడుకొన్న చలమయ్య కడవ అరుగు మీద పెట్టి పైజామా పైకెత్తి మోకాళ్లతో అదిమిపట్టి కొంచం వంగి చేయి నోటి దగ్గర పెట్టుకొని చేత్తో కడవ పట్టుకొని ప్రక్కగా వంచుకుని నీళ్ళు తాగాడు'(పు.56). ఇది సర్వ సాధారణ దృశ్యం పల్లెల్లో. బావుల దగ్గర నీళ్లు తాగడం దీనిని అక్షరీకరించి కంటి ముందు చిత్రాన్ని నిలిపిన తీరు ఇది.

మనిషి చిత్ర విచిత్ర పరిస్థితుల్లో మానసిక సంఘర్షణకు గురవుతుండటం సహజం. మనస్తత్వ సిద్దాంతాలు ఫ్రాయిడ్‌తో ఆరంభమై ‘ప్రకటితం అవుతూ ఉంటే సాహిత్యంలో వాటి ప్రతిఫలనాలు చూసే సామర్థ్యం పాఠకులకి చూపించే శక్తి రచయితలకి ఏర్పడింది. చలమయ్య భార్య కొడుకు కోడలు మాట్లాడుకొంటూ ఉంటే. మూడు. కోణాలు… కలిగిన త్రికోణంలో తనకు చోటు లేదనే అభద్రతలో పరాయి వాడిగా మిగిలి పోయిన దిగులు తో ఉన్నప్పుడు రచయిత అంటారు, “చలమయ్య హృదయం భయం పొరలలో చిక్కుబడిపోతూ ఉంది అని. ఈ సందర్భం లో ఏ మనిషి ఉన్నా, ఇది సహజం.

III. పోలికలు/ఉపమానాలు: ఇనాక్‌గారి రచనల్లో సందర్భానికి వాడే పోలికలు విశేషంగా ఉంటాయి. పేరమ్మ భర్తను 20 ఏళ్ల తర్వాత మళ్లీ చూసినప్పుడు కలిగిన హృదయ సంచలనానికి నిదర్శనం ఈ వాక్యం ‘సాఫీగా వెళ్లే రైలు వంతెన మీదుగా వెళ్లితే కొన్ని సెకండ్లు కొత్తగా దడదడలాడిన ధ్వని వినిపిస్తుంది. ఇప్పుడు ఆమెకు అలాగే అనిపించింది’.(పు.59)

పేరమ్మ చలమయ్యకు చుట్టింటిలో అన్నం పెడుతుంటే, సీతమ్మ బయట ఇంటి. పంచలో భర్తకూ ఇంటికి తాటాకు కప్పుతున్న పనివాళ్లకూ అన్నం పెడుతూ. ఉంది.చుట్టింటికి పంచలోకి ఆహారపదార్థాలు. తెస్తూ. వెళ్తూ. ఉన్న సీతమ్మ ‘ఇంటి పంచలోకి. చుట్టింటిలోకి నేత నేసే మగ్గంలో కండెలాగా తరుగుతూ ఉంది'(పు.62) అంటారు. రచయిత బట్టలు నేసేటప్పుడు కండె కదలిక తెలిసిన వాళ్ళకి ఆమె ఎంత వేగంగా కదులుతూ ఉందో అర్థమవుతుంది.

చలమయ్య సభారంజని పట్ల ట్ల ఇష్టంతో వెళ్లిపోయాడు. ఆమె సమక్షాన్ని వదిలి ఉండలేని స్థితి చలమయ్యది. స్త్రీ పురుషులు ఎవరైనా ఎంత మంచి కుటుంబంలో పుట్టినా ఎంత మంచిగా ఉందామనుకున్న దొంగతనం వ్యభిచారం తాగుడు మానలేరు. (ప్రమిదలో పడ్డ కీటకం నీటిలో పడ్డ పురుగు పైకి రావాలని రాలేకపోయినట్లే అవుతుంది’ అని అంటారు రచయిత. స్తీ మోహం అతడిని బలహీనపరచటం తేరుకోలేని పరిస్థితి కలగటం ఈ సందర్భంలో గుర్తించవచ్చు.

IV. తాత్త్వికత: అతి చిన్నవయసులోనే జీవితానికి సంబంధించిన వేదాంత దృష్టి తాత్త్విక దృష్టి కలిగి ఉండటం అరుదు. అది ఇనాక్‌ గారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చలమయ్య ప్రేమించి జీవించే జీవితాన్ని ఆనందంగా అనుభవించాడు. కలిసి గడిపిన సభారంజని మరణాంతరం అతడికి జీవితం శూన్యంగా అనిపించింది. ఉన్నవన్నీ అమ్మేసి అప్పులు తీర్చాక ఈ విశాల ప్రపంచంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిరది. ఆ సందర్భంలో రచయిత మాటలు ఆలోచింపదగ్గవి. “మనిషికి విశాల పరిధి భయం పుట్టిస్తుంది. విస్తృతి చూచి పిచ్చివాడయిపోతాడు. అందుకే చిన్న పరిధి ఏర్పరచుకొంటాడు. అందులో నూతిలో కప్పలాగా జీవిస్తాడు. మనిషి పెరిగితే పరిధి పెరిగినా చింత లేదు, కానీ మనిషి యథాపపూర్వకంగా ఉన్నప్పుడు పరిధి విస్త్స్రతం అయితే భరించలేడు'(పు.74). ఇది చలమయ్యను ఉద్దేశించిన మాట. చలమయ్యను గురించి చెప్పిన మాట అయినా, ప్రతి మనిషికి వర్తిస్తుంది. మనుషులు కులాలుగా మతాలుగా స్త్రీలుగా పురుషులుగా ధనికులుగా పేదవాళ్లుగా విభజితమై ఆయా పరిధుల్లో ఇరుక్కుపోయి జీవించటంలో సుఖాన్ని పొందుతూ, దానిని ఘనత అనుకుంటూ విశాలత్వం అనే భావననే విస్మరించిన తీరు రచయిత రాసిన కాలం నుంచి నేటికీ ఉండటం శోచనీయం.

అభ్యుదయ దృష్టి: రచయితలో అభ్యుదయ దృష్టి రచనల తొలి రోజుల నుంచే ఉండటం విశేషం. సాధారణంగా స్త్రీ పురుషులలో పురుషుడికి ప్రాధాన్యం ఇచ్చే సామాజిక వాతావరణంలో, స్త్రీ పురుషులిద్దరి పట్ల సమానదృష్టిని ప్రదర్శించిన సాహిత్యం ఇనాక్‌గారిది. ఇంతకు ముందే పేర్కొన్నట్టు దురలవాట్లకు అలవాటైన స్త్రీ పురుషులు ప్రమిదలో పడ్డ కీటకంలాగా అని పోల్చడంలో ఉద్దేశిస్తున్నది చలమయ్యనే అయినా, ఈ పోలిక స్త్రీ పురుషుల్లో ఎవరికీ మినహాయింపు కాదు. అది స్పష్టంగా అక్కడ తెలుస్తూ ఉంది. స్త్రీవాదం 80లకి గాని రాలేదు. తొంబైలకు గానీ ఊపందుకోలేదు. కానీ 1969లోని రచయిత చాలా విప్ణవాత్మక భావాలను ప్రకటించడం కనిపిస్తుంది. చలమయ్య సభారంజని ఇష్టపడే క్రమంలో దిగజారిపోయి ఆమెని ఆశ్రయించుకొని బతికే పరిస్థితి వచ్చినప్పుడు అతడి పరిస్థితి దారుణం. ఇతర మగవాళ్ళు ఆమెని తేలికగా చూడడాన్ని కూడా పట్టించుకోనే స్థితి దాటిపోయాడు. రచయిత, “ఆమె ఊరెళ్లిపోతే ఇంటి దగ్గర ఉండి పొందే ఆటుపోటుల కంటే తన ఉంపుడుగత్తెను (ఈ మాట పైకి అన్నాడు. ఎందుకంటే ఆమె అతనికి ఉంపుడుగత్తె కాదు అతనే ఆమెకు ఉంపుడుగత్తె. లింగవివక్ష దూరంగా వుంచుకోవచ్చు) అని రచయిత అనటంలో ఈ తీరు కనిపిస్తుంది. ఉంపుడుగత్తె పదప్రయోగం స్తీకి కాకుండా ఆమెని ఆశ్రయించుకుని బతుకుతున్న పురుషుడికి అన్వయింపచేయడం పురుష స్వామ్యానికి చెంప పెట్టే. లింగవివక్షని దూరంగా ఉంచవచ్చు అనుకోవచ్చు అన్నమాటలో లింగ వివక్ష అనే భావమే పొడసూపని రోజులలో రచయిత స్పృహని గుర్తించవచ్చు. స్త్రీకి వివక్ష లేదు పురుషుడు దిగజారిన స్థితిని రచయిత ఇక్కడ చూపించారు.

ఇరవై ఏళ్ళ చలమయ్య ముఫ్పె ఏళ్ళ సభారంజనిని ఇష్ట పడ్డాడు.కన్నరికం పెట్టాలని అంటే, ఆమెను పోషించాలని ‘ఘ్రహించాడు. _ అతడికం వయస్సులో పెద్దది అయిన సభారంజనిని చేపట్టటానికి పెద్దదయితే ఏమి?అని ఆలోచించాడు.ఈ సందర్భంలో “జీవితం విచిత్రమయింది.ఏ సూత్రం ఎందుకు చెప్పబడిరదీ, ఏ ఆచారం ఎందుకు పుట్టింది జాగ్రత్తగా ఆలోచిస్తే కారణం శూన్యంగా కనిపించదు. కొన్ని అవశ్యం ఆచరించదగ్గవి. కొన్ని అవశ్యం మార్చుకోదగ్గవీ వుంటాయి. కాలం మార్పు వల్ల'(పు.63). ఆ మార్పు తప్పదని భావించాడు చలమయ్య. తనకంటే పెద్దదయినా ఆమెతో జీవితం తప్పులేదని నిర్ణయించుకొన్నాడు. అతడి ఆలోచనలలో అనుభవ రాహిత్యమున్నదేమో అనే అనుమానం అతది వయస్సు రీత్యా అనిపించవచ్చు కానీ, ఆచరణలో ఆమెతో ఆమె మరణం వరకు జీవితాన్ని కొనసాగించిన చిత్తశుద్ధిని చూపాడు. స్త్రీ పురుష సహజీవనానికి వయస్సు ఆటంకం కాదనే దృష్టిని నాడే చాటారు రచయిత. ఇది నేడు సమాజంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ముగింపు: ఆచార్య ఇనాక్‌గారి ఈ కథ ఒక మణిపూస. కథా నిర్మాణంలో ఉపయోగించిన ఉపమానాలు, స్వభావ చిత్రణ, జీవిత తాత్త్వికత, అభ్యుదయ దృష్టి ఇవన్నీ కథ పాటిష్ట్యానికి దోహదమయ్యాయి. కథకు ప్రాణ బిందువు మాత్రం పేరమ్మ. మనిషి సంకుచిత పరిధిని అధిగమించాలనే సందేశం ఉంది. హృదయ వైశాల్య సామర్థ్య ప్రదర్శన ఉంది. మనిషి సంస్కారవంతుడయితే ఈ కథ హృదయ క్షాళనాన్ని, హృదయ పరివర్తనను అందించగల ఉన్నత స్థాయిని కలిగి ఉంది. ఉన్నతాంశాలు కలగలిసిన కథలో మహోన్నత వ్యక్తిత్వంతో పేరమ్మను మలిచిన తీరు ఈ కథకు కథా సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని, పాఠకుల హృదయాలలో చెరగని ముద్రను వేసిన వేయగలిగిన అద్భుత కథ.



5/5 - (2 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles