11.5 C
New York
Sunday, November 24, 2024

అమెరికా తెలుగు కథానిక – వస్తు వైవిధ్యం

– ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి

పరిచయం

కథానిక దేశ కాలమాన పరిస్థితులకు దర్పణంగా నిలిచే సాహిత్య ప్రక్రియ. ఆధునిక సాహిత్యం నవలగా, కవిత్వంగా, గేయంగా, నాటకంగా విభిన్న రూపాలతో విస్తరిస్తున్నా, కథ లేదా కథానిక రూపం మానవ సమాజ చిత్రణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సంఘటనలు, సందర్భాలు, సమస్యలు, మానవ మనస్తత్వాలు మొదలైన అంశాలను ప్రపంచానికి చెప్పడంలో కథానిక ప్రక్రియ ఒక అడుగు ముందు నిలబడుతోంది.

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి జీవితాల్లో తొంగిచూసిన సమస్యలకు లేదా జరిగిన సంఘటనలకు ప్రతిరూపంగా వచ్చాయి అమెరికా తెలుగు కథానికలు. వాస్తవాలను, జరిగిన సంఘటనల నేపథ్యంలో అమెరికాలోని తెలుగు కథకులు కథలను రాసినట్టే కనిపిస్తోంది. ‘తెలుగువారు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా, తెలుగుతనంలోని సంప్రదాయాలను, ఆలోచనలను వదులుకోరు’ అని అమెరికా తెలుగు కథానికలు నిదర్శిస్తున్నాయి.

2006 అక్టోబరులో వంగూరి ఫౌండేషన్స్‌ ఆఫ్‌ అమెరికా వారు ప్రచురించిన “అమెరికా తెలుగు కథానిక (తొమ్మిదో సంపుటి) లోని కథలు అక్కడి జీవితాన్ని విభిన్న రీతిలో చిత్రించాయి.

‘దూరపు కొండలు నునుపు” అన్న సామెత అచ్చంగా అమెరికా అందాన్ని కలలుగనే భారతీయులకు వర్తిస్తుంది. ఒక ప్రాంత ప్రభావం మనిషిపై ఎంత ఉంటుందో, వేరొక సమాజ బలహీనతలు కూడా అంతే ఉంటాయని తెలిపే వరకట్న వేధింపుల సంగతుల నుండి మంచు తుఫానుల్లో కూరుకుపోయి పడే ఇబ్బందుల వరకు అమెరికాలో భారతీయులు జీవిస్తున్న విధానాన్ని అమెరికా తెలుగు కథానిక ప్రస్పుటంగా తెలియజేస్తోంది.

గృహ హింస

అందమైన అమెరికా కలలుగనే అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపిన కథ ‘మరణ ముహూర్తం. సత్యం మందపాటి ఈ కథా రచయిత. ఈ కథలో ‘కోటి కలలతో అమెరికాలో అడుగు పెట్టిన సునేత్ర ఒక ఒరిస్సా అమ్మాయి. అమెరికన్‌ సిటిజన్‌, మెక్కాలెస్‌ అనే ఊర్జో ఉంటుంది. అదనపు కట్నం కోసం వేధించే మొగుడు పెట్టే చిత్రహింసలు భరించలేక మొగ్గుణ్ణి చంపేస్తుంది. అనాథలైపోయే పిల్లలను కూడా కడతేర్చి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. భర్త పిల్లలు చనిపోతారు. ఆమె ప్రాణాలతో మిగిలిపోయి జైలు పాలౌతుంది. మరణ శిక్ష విధిస్తారు. ఆమె మానసిక పరిస్థితి చక్కబడ్డాక శిక్ష విధించాలని ఎదురుచూస్తూ, మానసిక వైద్యురాలితో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తారు. “జైల్లో డెట్‌ రోలో మరణశిక్ష కోసం ఎదురు చూస్తూ నరకం అనుభవిస్తోంది. తలను గోడకు కొట్టుకొని చావాలని ప్రయత్నిస్తుంది. ఒక రోజు పోలీసు నుండి తుపాకీ లాక్కొని చావాలని ప్రయత్నం చేస్తుంది. మరో పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయింది” ఇదీ సునేత్ర కథ.

నరక కూపంలో ఏడేళ్ళు కాపురం చేసి, ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అదనపు కట్నం కోసం మాటలతో చేతలతో రోజూ వేధించే భర్త నుండి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది సునేత్ర. అతను వెళ్ళనివ్వలేదు. ఇండియాకు వెళ్ళనివ్వక, ఫోన్‌ చేసుకునే అవకాశాన్ని కూడా లేకుండా చేసి, గొంతు పట్టుకొని నులుముతూ చంప చూస్తున్న భర్త నుండి విముక్తి పొందడం కోసం, చివరికి భర్తను హతమార్చే అంత తీవ్ర నిర్ణయానికి ‘సునేత్ర రావడం సగటు మనిషిని ఆలోచనలో పడేస్తుంది. అమెరికా, సాఫ్ట్‌వేర్‌ మోజులో పడి ఆడపిల్లల్ని కట్టబడితే, వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించేలా చేస్తుంది. నేటికీ అమెరికా వైపు ఎగబడుతున్న అమ్మాయిలకి ఈ కథ ఒక హెచ్చరిక ఇస్తోంది.

ఊహాత్మక మిత్రులు (ఇమేజనరీ ఫ్రెండ్స్‌)

అమెరికా సంస్కృతిలో ఊహాత్మక మిత్రులకు స్థానం ఉంది. అందమైన భవంతుల్లో, విశాల గదుల్లో మనుషుల్లేక, బొమ్మల్నే ప్రాణస్నేహితుల్లా భావించే ఒక కొత్త విషయాన్ని కథగా అందించారు. రెంటాల కల్పన, “టింకూ ఇన్‌ టెక్సాస్‌ అనే శర్షికతో రాసిన ఈ కథలో ‘టింకు’ ఒక పిల్లవాడు. సుస్మిత, ఆనంద్‌లు టింకూ’ తల్లిదండ్రులు. హౌరీ (బొమ్మ టింకూ స్నేహితుడు) తో నిత్యం సంభాషిస్తూ, ప్రాణమున్న మనిషిలా భావించే టింకూను ఇండియాకు తీసుకొని రావాల్సి వస్తుంది.

సుస్మిత ఇండియాకు టింకూతో కలిసి రావాలని నిర్ణయించుకుంటుంది. టింకూ రాలేనంటాడు. ఇండియా అంటే బోర్‌ అండ్‌ డర్టీ అంటాడు. సమ్మర్‌ యాక్టివిటీస్‌ అన్నీ మిస్‌ అవుతానని, అందువల్ల రాలేనంటాడు. కంప్యూటర్‌, గేమ్స్‌ అన్నీ ఇండియాలో ఉన్నాయని, తప్పక వెళ్ళాలని తండ్రి గట్టిగా చెప్తాడు.”డాడి మై రియల్‌ ప్రాబ్లం ఈస్‌ హౌరీ. హౌరీకి ఫ్లైట్‌ జర్నీ అంటే భయం. ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు … కదా. భయపడుతున్నాడు…” అంటాడు టింకూ.’హౌరీ కేవలం నీ ఆటబొమ్మ. అచ్చం పిల్దాడిలా ఉన్న ఓ బొమ్మ. దానికి నీ కిష్టమైన పేరు పెట్టుకున్నావ్‌. అంతేగానీ అది నీతో మాట్లాడదు. ఆడుకోదు. నువ్వేదానితో ఆడుకుంటావు. దాన్ని ఫ్రెండ్‌లా నువ్వు ఊహించుకుంటున్నావు” అని తండ్రి దబాయించి ఇండియాకు ప్రయాణం అవ్వమంటాడు.

మరుసటి రోజుకు టింకూకు జ్వరం వస్తుంది. ఆసుపత్రికి వెళ్తారు. డాక్టరును సంప్రదిస్తారు. టింకూ, సుస్మితను బయటకు పంపి డాక్టర్‌ ఆనంద్‌తో “ఒకే మిస్టర్‌ ఆనంద్‌. పిల్లల్లో ఇదంతా మామూలే. మనకు ఇదంతా ట్రాష్‌లా కనిపిస్తుంది. కానీ అమెరికాలో సగానికి పైగా ఈ ఇమేజనరీ ఫ్రెండ్స్‌ ఉంటారు. వాళ్ళ మానసిక ప్రపంచంలో అదంతా ఒక భాగం. …ఇమేజనరీ ఫ్రెండ్‌షిప్‌ లోపమో, అసహజమో కాదు. ఇలాంటి వారు స్నేహశీలురు. సృజనశక్తి ఎక్కువ. ఎదుటి వాళ్ళ ఇష్టాఇష్టాల్ని గౌరవించడంలో, స్నేహభావంతో మెలగడంలో నార్మల్‌ షి పిల్లల కంటే ముందుంటారని” హౌరీకి ప్లైట్‌ జర్నీ అంటే ఉన్న అనవసర భయాన్ని, ఆందోళనను తొలగించేలా నచ్చచెప్పమనే చెప్తాడు డాక్టరు. టింకూనూ ప్రేమగా దగ్గరికి తీస్తాడు తండ్రి. కొందరు పిల్లలు లోన్లీగా ఫేలవుతున్నారని, ఫ్యామిలీలో సరైన ప్రేమ ఆప్యాయతలు పొందలేక ఇలాంటి ఇమాజినరీ ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటారనుకోవడం అవగాహనా రాహిత్యమే’ అంటారు డాక్టర్‌. అయితే, దీన్ని మానసిక రుగ్మతగా గుర్తించే వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మంచుతుఫాన్లు

అమెరికా దేశంలో వాతావరణం విపరీత హెచ్చుతగ్గులతో ఉంటుంది. మంచుతుఫాన్లు కురిసే సమయాల్లో జీవనం అస్తవ్యస్తంగా మారిపోయి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విపత్కర పరిస్థితుల్లో మానవ ఆలోచనలు, మానసిక సంఘర్షణలు, సంబంధాలు ఎలా ఉంటాయో స్నోస్టార్మ్‌, మంచుకురిసిన రాత్రి కథల ద్వారా తెలుసుకోవచ్చు.

డా॥ వేద రాసిన స్నో స్టార్మ్‌లో విసు, శ్రీలు భర్త భార్యలు, సరోజ స్నేహితురాలు. ప్రీతి, చేతన్‌లు, శ్రీవిసు దంపతుల సంతానం. విసు కుటుంబంతో కలిసి డిన్నర్‌కు వెళ్ళి వస్తూ, జరిగిన విషయాలను మాట్లాడుకుంటారు. అందరూ తలా ఓ వంటకం చేసుకొని వచ్చి, కలిసి భోజనం చేసే పద్ధతి ఉన్న అమెరికాలో ఉంది. ఆ రోజు డిన్నర్‌లో శ్రీ స్నేహితురాలు వంకాయ వంటకానికి సరిపోయే దినుసుల్లేక, పచ్చడి చేసి తెచ్చి సరిపెట్టిందని, ‘అదొక ప్రత్యేక రుచి’ అని చెప్పి ఊదరగొట్టిందని బాధపడుతుంటే విసు శ్రీని ఓదారుస్తాడు.రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్న కారులోని వృద్ధ జంటను చూసి, మనం కట్టే టాక్స్‌లతో ఎంజాయ్‌ చేస్తున్నారని అసూయ ప్రకటించి, వేగంగా వెళ్ళి మంచు తుఫానులో ఇరుక్కుపోతారు. కారు టైర్లు స్కిడ్‌ అయ్యి, లోయ ముందున్న రైలింగ్‌ ఆసరాతో బతికి పోతారు. ఆ దారిలో వెళ్ళిన వగ్రో (ట్రక్కు డ్రైవర్‌) క్షేమం అడిగి ఆగకుండా వెళ్ళిపోతాడు. ఆ డ్రైవర్‌ సాయం చేయలేదని కూడా తిట్టుకుంటారు. చివరికి ఆ ట్రక్కు డ్రైవర్‌ పోలీసుల్ని సాయం కోసం పంపుతాడు.

వీళ్ళు ప్రయాణంలో చిక్కుకున్న మరుక్షణంలో వీరికి గుర్తొచ్చిన స్నేహితురాలు సరోజ. ఆమెకు సమాచారం ఇవ్వగానే తన వాహనంతో వచ్చి, వీరిని క్షేమంగా ఇల్లు చేర్చి వెళ్ళిపోతుంది. నా తర్వాత చిన్న చిన్న విషయాలకే మనుషులను _ అపార్థం చేసుకోకూడదనే సందేశాన్ని పంచుకుంటారు భార్యాభర్తలు. అమెరికా వాతావరణం, అమెరికాలోని తెలుగువారి సంబంధాలు, వారి ఆలోచనా ధోరణులను తెలియజేస్తూనే, మనసును ఇంకాస్త విశాలం చేసుకోవాల్సిన అవసరాన్ని తెలుపుతుంది ఈ కథ.

సుందరశ్రీ దువ్వూరి రాసిన ‘మంచు కురిసిన రాత్రి’ కథ కూడా మంచువల్ల ఏర్పడే సమస్యలను చిత్రించింది. హరి, సాధన దంపతులు బతుకు తెరువు కోసం అమెరికా వచ్చి ఉంటారు. సాధన గర్భవతి. హరి ఉద్యోగంలో బెటర్‌మెంట్‌ కోసం టాక్సింగ్‌, జావా కోర్సులు నేర్చుకుంటూ ఉంటాడు.

ఒక రోజు కాలేజీలో ఇవ్వాల్సిన అసెన్‌మెంట్‌ గుర్తొచ్చి, సాధనను అడుగుతాడు. తనకు ఆ పని చెప్పలేదని అంటుంది. వాగ్వాదం తీవ్రమౌతుంది. చేసేది లేక, ఆఖరు తేది అయిపోతుండడంతో ‘తనే వెళ్ళి అసైన్‌మెంట్‌ను కాలేజీ ప్రొఫెసర్‌ డ్రాప్‌ బాక్స్‌లో వేసి రావాలని బయలుదేరతాడు. మంచుతుఫాను ప్రారంభమై ఉంటుంది. కష్టం మీద కాలేజీకి చేరుకొని, అసైన్‌మెంట్‌ డ్రాప్‌ బాక్స్‌లో వేసి తిరుగు ప్రయాణం అవుతాడు. దారి మధ్యలో యాక్సిడెంట్‌ అయ్యి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు కదలవని భావించి, వేరే మార్గం గుండా బయలుదేరి తెలియని ప్రాంతంలో ఇరుక్కుపోతాడు. టైర్లు మంచులో కూరుకు పోయి కారు ఆగిపోతుంది. కిందికి దిగిన హరి మంచుపై జారి కిందపడతాడు. తన చేతిలోని రిమోట్‌ ‘కి జారి కారు కిందికి పోతుంది. తన కాలు మంచు బొరియలో ఇరుక్కుపోతుంది. కార్‌ కీ పై వేలుపడి లాక్‌ అయిపోవడంవల్ల (సైడ్‌వాల్‌ కు, కారు టైర్‌కు మధ్యలోని సందులో) కారు తలుపు తెరుచుకోదు.

మంచు కురుస్తూ ఉటుంది. 15 నిమిషాలు గడిచిపోతాయి. భయం మొదలౌతుంది. టోపీ, గౌసులు, ఫోన్‌ కార్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ నంబర్‌ 911కు ఫోన్‌ చేసే అవకాశం కూడా లేదు. వీస్తున శీతల పవనాలు ‘చిగురుటాకు’ను చేసి వణికిస్తున్నాయి. నిర్మానుష్యమైన ఆ వీధిలో ఇంకో రెండు గంటల్లో దిక్కులేని చావు ఖాయం అనుకుంటాడు. హెల్ప్‌, హెల్ప్‌ అని ఎంత గొంతు చించుకున్నా, వినేనాధుడు కనిపించడు. ఒక కారు వచ్చి వెళ్ళిపోతుంది. ఇతని ఆర్తనాదాలు వినడు. మరో కారు వచ్చి వెళ్ళి పోయింది. హరి అరుపులు విని కొంత సేపటికి తిరిగొచ్చిన కారులోని వ్యక్తి గర్భవతి అయిన తన భార్య ప్రోత్సాహంతో వెనక్కి వచ్చానని చెప్పి, కాపాడి వెళ్ళిపోతాడు. గతంలో ఇలా సహాయపడబోయి డబ్బు, ఉంగరాలు పోగొట్టుకున్న జ్ఞాపకం హరిని వెంటాడగా, ఒక మంచుతుఫానులో ఇలా ఇబ్బందిపడే వ్యక్తిని వదిలి వెళ్ళిపోతే అతను చనిపోయిన జ్ఞాపకం అతన్ని గాయపరుస్తుంది. మంచుకురిసే ప్రాంతాల్లో జీవితం ఎంత దుర్చరంగా ఉంటుందో ఈ కథ వివరిస్తుంది.

అత్యాశ, ఆన్‌లైన్‌ మోసాలు

మనుషుల్లోని అత్యాశలు కష్టపడకుండా సులభంగా వచ్చే డబ్బు కోసం విజ్ఞతను నశింపచేస్తాయనే కథాంశంతో కె.వి. గిరిధరరావు రాసిన కథ “పేపాల్‌. సురేష్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. భార్య సుజాత కూడా అతనితోనే ఉంటుంది. ఏదో ఒకటి చేసి, త్వరగా డబ్బు సంపాదించి బాగా స్థిరపడాలనే కోరిక సురేష్‌ది. ఇండియా వెళ్ళి పోవాలన్న కోరిక సుజాతది.’ఇంటి నుంచి పనిచేయండి… వారానికి రెండు వందల నుంచి, 9వేల డాలర్ల వరకూ సంపాదించండి’ అనే ఇ’మెయిల్‌ ప్రకటన సురేష్‌ జీవితాన్ని మలుపులు తిప్పింది.

“విలియం ఫాన్స్‌ అనేవాడు జెకోస్తోవేకియాలోని లెస్‌ క్రైమ్‌ సాఫ్ట్‌ ఇంక్‌ అనే కంపెనీకి ప్రతినిధి అని, ఆ కంపెనీ కంప్యూటర్‌ నేరాలు నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తుందని, అన్ని దేశాల్లో కష్టమర్లు ఉన్నారని, ఉత్తర అమెరికా కష్టమర్లు కొన్నప్పుడు డబ్బును క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తారని, చట్టపరమైన కారణాలవల్ల తమ దేశంలో ‘పేపాల్‌’ వినియోగించడానికి అనుమతి లేదని చెప్తాడు. జెకోస్తోవేకేయా బయట నివసిస్తూ, పేపాల్‌ ద్వారా స్వీకరించి, 10 శాతం కమీషన్‌ మినహాయించుకొని మిగిలిన నిధులను మాకు పంపిస్తే చాలు అనే సందేశంతో సురేష్‌ తన ఖాతా వివరాలను అందజేస్తాడు. నెలరోజుల్లోనే 50వేల డాలర్లు వస్తాయి. అంటే 5 వేల డాలర్లు సురేష్‌కు మిగులుతాయన్న మాట. తన 10 శాతం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని ఆ కంపెనీకి పంపేస్తారు.కొట్టేసిన క్రెడిట్‌ కార్డుల నుండి ఆ డబ్బు వచ్చిందని, దాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని ‘ఫివాల్‌’ కంపెనీ నుంచి హరికి వత్తిళ్ళు ప్రారంభం అవుతాయి. “తను వెస్ట్రన్‌ యూనియన్‌ ద్వారా క్యాష్‌ ట్రాన్నాక్షన్‌ చేయడం వల్ల, తను పంపిన డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కష్టమర్‌లకు ఇచ్చిన సాస్ట్‌ వేర్‌ సీడీలు గానీ, తను పంపిన డబ్బుకు రసీదులు గానీ లేకపోవడం వల్ల, తను నన లాయర్‌, “మీరు పెద్దగా చేయగలిగిందేమీ లేదు’ అన్న మాటలకు ఉసూరు మంటాడు. అంతేగాక ‘ఆ ఫ్యాక్స్‌ గానీ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో అయితే, నువ్వే ఫ్రాడ్‌ చేసి వారికి నిధులు చేకూర్చావని ప్రభుత్వం నీపై పై కేసు పెడుతుంది అంటాడు.” కష్ట నిష్టూరాలతో ఇంటికి పోతారు సుజాత, సురేష్‌. అత్యాశలతో, రాత్రికి రాత్రే సంపన్నులు అయిపోవలనే వారు ఇలాంటి ఉచ్చులో పడతారని ఈ కథ హెచ్చరిస్తుంది.

మూఢనమ్మకాలు

సాంకేతిక పరంగా అమెరికా ఇతర దేశాలకు దిశానిర్దేశం చేయగల స్థాయిలో ఉన్నా, అక్కడ పాతుకుపోయిన మూఢనమ్మకాలు కూడా అంతే లోతుగా ఉన్నాయని తెలిపే కథ ఇది. గవరసాన సత్యనారాయణ రాసిన “అమెరికాలో అద్దెకొంప’ కథ దెయ్యాలు నిజంగానే ఉన్నాయనే భ్రమను కల్పిస్తుంది.

బోస్టన్‌ ప్రాంతంలోని బెడ్‌ఫర్డ్‌ పట్టణంలో స్మశానం దగ్గర ఇల్లు తక్కువ అద్దెకు దొరుకుతుంది ఒక భారతీయ వైద్యుడికి. అర్థరాత్రి 12 గంటలకు కాలింగ్‌ బెల్‌ కొట్టి ఒక వృద్ధుడు కేక్‌ ఇస్తాడు. తను పక్కనే ఉంటానని, ‘వెల్‌కం టు నైబర్‌హుడ్‌ డే అని “చెప్తాడు. ఆ వృద్ధుడి నాన్న ఐర్లాండు నుండి వచ్చాడని, అమ్మ జర్మనీ నుండి వచ్చిందని, జర్మనీ వాళ్ళు ఇంజనీరంగ్‌లో ముందుంటారని, ఐర్జాండు వాళ్ళు మద్యం ప్రియులని చెప్పి వెళ్ళిపోతాడు.

అమెరికాలో వృద్ధులు ఒంటరి జీవితం గడుపుతారని, పిల్లలు పెద్దె ఉద్యోగరీత్యా దూరప్రాంతాలకు పోయి. స్థిరపడతారని, న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌గా ఏర్పడి ఎవరి దారిలో వారు ఉంటారని, క్రిస్‌మస్‌ రోజునో, థాంక్స్‌ గివింగ్‌ రోజునో కలిసి మళ్ళీ విడిపోతారని రచయిత _ అక్కడి సంస్కృతిని తెలియజేస్తాడు. వృద్ధులకు పొద్దుపోక గ్రంథాలయాల్లో పుస్తక పఠనం, ఆసుపత్రుల్లో స్వచ్చంద సేవ, సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్బులో కాలక్షేపం వంటివి చేస్తుంటారంటాడు. రెండు నెలల తర్వాత మళ్ళీ అర్థరాత్రి కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. ఈసారి చాక్లెట్‌ బాక్స్‌తో వచ్చిన ఆ వృద్ధుడు భారతదేశ చరిత్రను, యూరోపియన్‌ల రాకను గురించి వివరిస్తాడు. లైబ్రరీకి వెళ్ళే టైం లేదని డాక్టర్‌ చెప్పిన సమాధానం విని తానే పుస్తకాలు తెచ్చి ఇస్తానంటాడు. మూడో నెల ఒక అర్ధరాత్రి మళ్ళీ కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. గిఫ్ట్‌ ప్యాక్‌తో ఉన్న పుస్తకాన్ని ఇచ్చి, జేబులో ఉన్న షాంపేన్‌ ఓపెన్‌ చేస్తాడు. ‘హేపీ బర్త్‌డే టు బోత్‌ ఆఫ్‌ అస్‌’ అని చెప్పి సంతోషాన్ని పంచుకుంటారు. డాక్టరు చేతిలో పెట్టిన ఆ పుస్తకం 1920లో వచ్చిన ‘ఎ మిస్టమరీ ఆఫ్‌ ఫస్ట్‌ వరల్డ్‌ వార్‌. మరుసటిరోజు ఆసుపత్రిలో ‘బెడ్‌ఫర్డ్‌ న్యూస్‌ పత్రికలో వచ్చిన ‘మిస్టరీ ఆఫ్‌ ఎ మిస్సింగ్‌ బుక్‌ అనే శీర్షికతో ఉన్న వార్తను చదివి చర్చించుకుంటూ ఉంటారు.

‘గత పది సంవత్సరాలుగా థామస్‌ (టామ్‌) పుట్టిన రోజున ‘ఎ మిస్టరీ ఆఫ్‌ ఫస్ట్‌ వరల్డ్‌ వార్‌ పుస్తకం గ్రంథాలయం నుండి మాయమై పోతుందని, ఆ పుస్తకం రాసిన థామస్‌ చనిపోయి 60 సంవత్సరాలు అయ్యిందని, అప్పటికే ఆయన వయసు 70 ఏళ్ళు అని, ఆ పుస్తకాన్ని ఎవరు దొంగిలిస్తున్నారో గ్రంథాలయ సిబ్బందికి గాని, పోలీసు వాళ్ళకు గాని అంతు చిక్కడం లేదని, థామస్‌ చరిత్రను క్లుప్తంగా పేపర్‌లో రాశారని చర్చించుకుంటూ ఉంటారు. ఆయన మనిషిలా ఉంటూనే దెయ్యంలా గాలిలో తేలిపోతూ ఉంటాడని, తన పుట్టిన రోజున బెడ్‌ఫర్డ్‌ నగరానికి కొత్తగా వచ్చిన వారికి ఆ పుస్తకాన్ని బహుమానంగా ఇస్తుంటాడని పేపర్‌లో రాసివున్న విషయం డాక్టర్‌కు తెలుస్తుంది. తనకు కనిపించి పుస్తకం తదితరాలు ఇచ్చిన ఆయనే దెయ్యం రూపంలో ఉన్న థామస్‌ అని గ్రహిస్తాడు. స్మశానం దగ్గర ఉండే ఇళ్ళకు అద్దె అందుకే తక్కువ అని నిర్ధారించుకుంటాడు.

ఈ కథ చదివితే అమెరికాలో దెయ్యాలు నిజంగానే ఉన్నాయనే నమ్మకం కలుగుతుంది. రచయిత ఏ కోశానా ఇందులోని శాస్త్రీయతను అంచనా వేయలేదు. ఇదొక సస్పెన్స్‌ సినిమా కథలా తోస్తుంది.

స్త్రీలపై చూపుతున్న వివక్షను ఎత్తి చూపడం

నిత్యం చలాకీగా ఉండే నీలవేణి (40 సంవత్సరాలలోపు వయసున్న యువతి) కెనడాలో ఒక హైస్కూల్‌లో ఇంగ్లీషు టీచర్‌. పంక్పువాలిటీ, సిన్సియారిటీ, పెద్దల పట్ల గౌరవం కలిగిన ఒక ఆధునిక సంప్రదాయ యువతి. ఉద్యోగంతోపాటు “గితాభవనం “లోని అనేకమంది వృద్ధులకు స్వచ్భంద సేవ చేయడం ఆమెకు ఇష్టం. గీతాభవనం యజమానురాలు “గోమతి’కి ప్రతిరోజూ పురాణ అంశాలు చదివి వినిపిస్తూ ఆధ్యాత్మిక విషయాలను అలవోకగా తెలియజేస్తూ ఉండేది (జ్ఞాననవాసిష్టం, భగవద్గీత లాంటివి వినిపించేది). ఆమెకు ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో స్త్రీలకు మాత్రమే ఉన్న కొన్ని కట్టుబాట్ల పట్ల, వివక్షపట్ల తిరస్కార భావం ఉంటుంది. తాళి తెంపడం, బొట్టు చెరపడం, తెల్లచీర కట్టడం వంటి ఆచారాలు ఆమెకు నచ్చవు.

కొమరోలు సరోజ ‘గీతాభవనం’ పేరుతో రాసిన కథ స్త్రీల పట్ల సమాజం చూపిస్తున్న ఉదాసీన వైఖరిని ఎత్తిచూపిస్తుంది. కెనడాలో ఉన్న గీతాభవనం (వృద్ధాశ్రమం) కేంద్రంగా సాగే ఈ కథలో నాలుగు పీజీలు చేసిన నీలవేణి, గీతాభవన యజమానురాలు గోమతి, తమిళ వృద్ధురాలు మామీలు ప్రధాన పాత్రలు. ఆధునిక లౌకిక స్త్రీగా, సంప్రదాయాల ముసుగులో స్త్రీలపట్ల చూపుతున్న వివక్షను ప్రన్నించడం కథలో కీలక అంశం.

ఆమె పెంపుడు తల్లి చిలకలూరిపేట నుండి రాసిన ఉత్తరం, ప్రయాణానికి సిద్ధమౌతున్నప్పుడు వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆమె గతాన్ని బయట పెడుతుంది.ఆమెను కంటికి రెప్పలా పెంచిన తల్లి మరణం, జన్మనిచ్చిన తండ్రి ఆచూకి. తెలియడం ఆమెను ఇండియాకు పరుగులు తీయిస్తున్న అంశాలు.

“నాకు తండ్రెవరో తెలియదు. మా అమ్మ నన్ను, మా చెల్లిని పెంచలేక ఎడాప్షన్‌ ఏజన్సీకి ఇచ్చింది. పిల్లలు లేని వృద్ధ దంపతులు మమ్మల్ని పెంచుకున్నారు. చెల్లి సినిమా పిచ్చితో పారిపోయింది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఆ దిగుల్లో పెంపుడు తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి కూడా చనిపోయింది. నా పదిహేనేళ్ళప్పుడు నా కన్నతల్లినీ, నా హాఫ్‌ బ్రదర్స్‌ను (కన్నతల్లి రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత పుట్టిన వారు) చూపించింది.

జన్మనిచ్చిన తండ్రిని, హాఫ్‌ బ్రదర్స్‌, సిస్టర్స్‌ను కలుసుకోబోతున్నానని, నాన్న అలా అమ్మను ఎందుకు వదిలేశాడో తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఒక్క నైట్‌ ఎంజాయ్‌మెంట్‌ కోసం ఇలా చేశాడా అని సందేహిస్తుంది. మన దేశంలో ఒకే తల్లి, వేరు వేరు తండ్రులు, అమెరికాలోనూ ఒకే తల్లి వేరు వేరు తండ్రులు అక్కడ స్త్రీలే, ఇక్కడా స్త్రీలే అంటూ ‘ స్త్రీలను బలిపెడుతున్న సంస్కృతిని ఎత్తి చూపిస్తుంది. ఎప్పుడు జవాబులు దొరకని ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని రావడానికి ఇండియాకు బయలుదేరుతుంది నీలవేణి.

మాతృభాష సంస్కృతుల కోసం తపన

అమెరికాలో ఉన్న తెలుగువారు కొంతమంది మాతృభాష పట్ట, తెలుగు సంస్కృతి పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండడమే గాక, వాటిని కాపాడుకోవడం కోసం వారు పడే తపన ఆంధ్రదేశంలో ఉంటూ పరాయీకరణ కాబడుతున్న అనేకమందిని సిగ్గుపడేటట్లు చేస్తుంది. ఈ నేపథ్యంతో నిడదవోలు మాలతి రాసిన “ఉభయ భాషా ప్రవీణ’ కథ తెలుగు వారిని ఆలోచింపచేస్తుంది.

“దేశ భాష ఏదో కూడా తెలియని ఒక కుటుంబం రచయిత పక్క వాటాలో దిగుతారు. వారికి ఇంగ్లీషు రాదు. వారు మాట్లాడే భాష రచయిత్రికి తెలీదు. చేతి సైగలతో ఏదో సాగిపోతుంది.

వాళ్ళబ్బాయి ఫిల్‌ (హిబ్రు యెమేన్‌) ను స్కూల్లో వేయడానికి రచయిత సహాయం తీసుకుంటారు. ఫిల్‌ స్కూల్లో ఆకతాయి పనులు చేస్తూ, ఇంగ్లీషు కూడా సరిగా నేర్చుకోడు. యెనీనా అనే టీచర్‌ పట్టుదలతో వాడికి ఆంగ్లం నేర్పాలని ప్రయత్నించి విఫలం అవుతుంది. స్కూల్లో ఆ అబ్బాయిని తీసేస్తామని ప్రిన్స్‌పాల్‌ వార్నింగ్‌ ఇస్తే “యెనీనా ఇంకో అవకాశం ఇవ్వమని బతిమాలి ఒప్పిస్తుంది. టీచర్‌ పిల్లవాడి ఇంటికి రచయిత్రితో కలిసి వెళ్తుంది. ‘ఫిల్‌’ వీళ్ళకు అర్థం కాని భాషలో అరుస్తాడు. ఉచ్చరించలేని బూతు మాట్లాడతాడు. అమెరికా చేరాక ఎలాగైనా ఇంగ్లీషు వచ్చేస్తుందని, అది సమాజ పరిసరాలను బట్టి ఉంటోందని సరిపెట్టుకోకుండా, ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్టాడాలని టీచర్‌ పెట్టిన షరతు రచయితకి కోపం తెప్పిస్తుంది.

“నా బాధ ‘పరాయి గడ్డన బతుకు సాగించుకున్నప్పుడు, భాషే సంస్కృతి. ఇల్లొక్కటే అది నిలబడగల ప్రదేశం. తమ మట్టికాని చోట, తమ అస్తిత్వాన్ని నిలుపకోడానికి ఆఖరి మజిలీ” అనుకుంటుంది రచయిత్రి. తమ్ముడు గోపి, ఫిల్‌లు ఆడుకుంటూ ఉంటే ఆమెకు తోచిన వాక్యాలు, దేశం, భాష, రంగు, ఆచారాలు, నమ్మకాలు ఏమీ స్పృహ లేని ఇద్దరు పిల్లల్లా కనిపిస్తారు.

అమెరికా టీచర్లు’ “అమెరికానే గొప్పదని, వాళ్ళు చెప్పినవే ప్రపంచం నేర్చుకుంటోందని, పుస్తకాలు, కంప్యూటర్లు, వీడియో గేమ్స్‌ ఇచ్చి పుట్‌బాల్‌, చదరంగం, బేస్‌బాల్‌ వంటి. ఆటలు నేర్చి వాళ్ళని విజ్ఞానవంతులు చెయ్యాలి” అనే . మాటలు విని రచయిత్రికి కోపం వస్తుంది. చదవడం కూడా వాళ్ళే ‘నిపెట్టినట్లు మాట్లాడిన ఆమె అజ్ఞానం రచయిత్రికి కోపం తెప్పిస్తుంది. హా. ‘బెన్నత్యాన్ని పెంచిన అనేక అంశాలు ప్రపంచానికి అనేక జ్ఞానాలు ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నట్టు ఉంది. భారతీయ సంస్కృతి, మాతృభాషలపట్ల ఉండాల్సిన ఆదరణను వివరిస్తుంది రచయిత్రి.

స్త్రీల కష్టం గుర్తింపుకు నోచుకోవడం లేదనే వ్యథ

భారతదేశంలో స్త్రీల బాధ్యత చాలా ఎక్కువ. ఇంటిపని, వంటపని, వృద్ధులను, పిల్లలను చూసుకోవడం, అవసరమైతే బయట పనిచేయాల్సి ఉండడం వంటి బోధ్యతలు ఇల్దాళ్ళకు సంప్రదాయబద్ధంగా చుట్టుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మహిళల మనోవేదన ఎలా ఉంటుందో తెలిపే కథ “ఊర్మిళ రేఖ’ గొర్తి సాయి బ్రహ్మానందం ఈ కథా రచయిత.

“రాముడి వనవాసం – ఊర్మిళ లక్ష్మణుడి కోరిక మేరకు అంతఃపురంలో ఉండిపోవడం, ఆ తర్వాత భరతుడు, కైకేయితో వెళ్ళి అడవిలో రామలక్ష్మణ సీతలను కలవడం, వారి యోగక్షేమాలు వివరించడం ‘ఊర్మిళ త్యాగాన్ని ప్రశంసించడం రామాయణ కథ అయితే, ఒకవైపు భర్త మాట కాదనకుండా అత్తమామలకు సేవలు చెయ్యడానికి. భర్తను ఒంటరిగా దుబాయ్‌కి పంపి పిల్లలను చదివించుకుంటున్న నిర్మల పడ్డ కష్టం గుర్తింపుకు నోచుకోకపోవడం ఈనాటి నిర్మల కథ.

నెలరోజులుగా అత్తను (ఆసుపత్రిలో చేర్చి) చూసుకుంటూ అన్నీ మంచం మీదే అవుతున్నా, వాటిని భరించి బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటుంది నిర్మల. ఒక రోజు మరిది, తోడికోడలు డా॥ విజయ ఇంటికి వస్తారు. ఇరుకైన ఇంటి గదిలో ఉండలేక రాత్రి అత్తగారున్న ఆస్పత్రిలో ఉంటారు. ఆ రాత్రి అత్తకు గుండెపోటు వస్తుంది. డా॥ విజయ నిద్రపోకుండా మేలుకొని ఉండడం వల్ల ఆమెకు సరైన ట్రీట్‌మెంట్‌ ఇచ్చి బతికించుకుంటుంది.

ఆమెకు ఒక రాత్రి సేవ చేసిన విజయను అందరూ పొగుడుతూ ఉంటారు. ఐదేళ్ళు ఆమెకు సేవ చేస్తున్న నిర్మల ఊసు కూడా ఎత్తకపోయిన తన భర్త తత్వాన్ని కూడా ఆమె గుర్తిస్తుంది. భర్త కోసం త్యాగం చేసిన ఊర్మిళ రామాయణంలో, భర్త కోసం సేవలు చేసిన నిర్మల ఈ కాలంలో గుర్తింపుకు నోచుకోవడం లేదని చెప్తాడు రచయిత.

సగం కథ రామాయణం, సగం కథ నిర్మల జీవితం ఇలా విభిన్నాంశాలను సంవిధాన పరిచి రాసిన కథ “ఊర్మిళ రేఖ”. ‘కథలో అరణ్యంలో సీత వేసిన ముగ్గులో ఒక గీత సీత రేఖ, రెండో గీత ఊర్మిళ రేఖగా చెప్పి కథా శీర్షికకు ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేశారు సాయిబ్రహ్మానందం.’

మితిమీరిన భక్తి

‘అతి సర్వత్రా వర్దయేత్‌’ అనే మాట గాలికి పుట్టలేదనిపిస్తుంది. అమెరికాలో మితిమీరి పోతున్న ‘భక్తి’ వ్యాపారాన్ని లేదా ‘భక్తి’ కార్యక్రమాన్ని అధిక్షే పిస్తూ వ్యంగ్య ధోరణిలో వచ్చిన కథ “సంకట్‌ కాల్‌ మె బాహర్‌ జానేకా మార్గ్‌”. వంగూరి చిట్టెన్‌ రాజు ఈ కథను రాశారు. ఈ కథ స్వీయానుభవం నుండి పుట్టినట్టుగా ఉంటూ, బారిస్టరు పార్వతీశం నవలా శైలిలా గిలిగింతలు పెడుతూ సాగిపోతుంది.

రచయిత బాంబేలో చదువుకునే రోజుల్లో మిత్రులు మూర్తి, రావులతో కలిసి బొంబాయిలోని ‘పవాయ్‌’ క్యాంపస్‌లో చదువుకుంటూ అందమైన పార్సీ అమ్మాయిలను చూడడానికి “కొలాబా’ దాకా వెళ్ళేవాళ్ళు. సౌందర్యారాధన కోసం ‘విక్రోలి’ అనే స్టేషన్‌ దాకా తీసుకెళ్ళి, అక్కడి నుండి విక్షోరియా టెర్మినస్‌ దాకా రైల్లో వెళ్ళేవారు.

ఆ రైలు ప్రయాణం ఎలా ఉంటుందో, ఎక్కే జనం, దిగే జనం పడే పాట్లు, తోసివేతలు, గొడవలు ఎలా ఉంటాయో హాస్యపూరితంగా చెప్తాడు.

ఒకసారి తెలుగు జంట రైల్లో ఎక్కుతుంది. “… జన సందోహంలో నేను ఈ తోపుడు కార్యక్రమంలో ఒకానొక పెద్దావిడను అనుకోకుండా నా రామబాణం, అనగా నా మధ్య వేలు కొంచెం దాటిగా ఆవిడ వీపు మీద ఆనించి ముందుకు జరుగుతుండగా ఆయన పక్కనున్న ఆయనతో ‘ఈ వెధవ ఎవడో వేలుతో పొడుస్తున్నాడండీ’ అని శుద్ధ తెలుగులో విన్నవించుకొంది. శ్రీవారు నాకేసి ఒక చూపు చూసి తన అర్గాంగితో ఈ పొట్టి వెదవ అంతకన్నా ఏం చేస్తాడులే. కంగారు పడకు’ అంటాడు. వేలుతీయడం, తెలుగుకు మొహం వాచి వారితో మాట్లాడాలనుకోవడం, ఈ పరిస్థితిలో బాగుండదని జనంలో కలిసి దూరంగా వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగిపోతాయి. అక్కడ ఓ కిటికీ దగ్గర రాసి ఉన్న ‘సంకట్‌ కాల్‌మే బాహర్‌ జానేకా మార్గ్‌’ (ఎమర్జెన్సీ ఎక్టిట్‌) దగ్గరికెళ్ళి తమను తాము కాపాడుకునే మార్గం చూసుకుంటాడు.

అమెరికాలో సంకట్‌ కాలం స్వయంకృతాపరాధం. పక్కింటి వాళ్ళకు 15 వంకాయలు కాస్తే, ఇంకో ఇంట్లో 20 వంకాయలు కాయడం ముందోడికి సంకటం ‘ కొలస్ట్రాల్‌ పక్కోడికన్నా తక్కువ ఉన్నా సంకటమే అంటాడు రచయిత. “హిందూ మతంలో ఉన్న గొప్పతనమే అది. ఎటువంటి తరహా సంకట్‌ కాలానికి ఏదో ఒక బాహర్‌ జానేకా మార్గ్‌… అనగా ‘ఎమర్జెన్సీ పూట’ ఉంటోందని అధిక్షేపిస్తాడు.

“ఇన్సూరెన్స్‌, బంగారం రేటు పెరిగినా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోయినా, ఇలా చివరికి తన కూతురికి మ్యారేజ్‌ బ్యూరోలో పేరు నమోదు చేయించడానికి సైతం వ్రతం చేయించాలని భార్య చెబితే విని అవాక్కయిపోతాడు భర్త. అమెరికాలో పెరిగిపోతున్న అతిభక్తి, ప్రతి దానికి చేస్తున్న వ్రతాలను అధిక్షేపిస్తూ రాసిన కథ ఇది.

అవి -ఇవీ

జె.యు.బి.వి. ప్రసాద్‌ రాసిన ‘జన్మదిన రాహిత్యం. జన్మదినాలకు, పెళ్ళిరోజులకు వేడుకల పేరుతో చేస్తున్న దుబారాను చిత్రించింది.వేలూరి వెంకటేశ్వరరావు రాసిన ‘అంటు అత్తగారు” కథ అంటు, మైల, మడి, ఎంగిలి, వంటి సంప్రదాయాల్లో పనికొచ్చే అంశాలు ఉన్నాయని, వాటిని మరిచిపోయి ఆధునికులు అతిచేస్తారని రచయిత చేస్తున్న ‘ఫిర్యాదు. సమాజ కట్టుబాట్లకు వత్తాసు పలుకుతుంది.శ్రీనాథ్‌ జొన్నవిత్తుల రాసిన ‘కలయిదనీ నిజమిదనీ తెలియదులే’ కథ ఈ (మెయిల్‌) లేఖల విధానాన్ని అనుసరిస్తూ భారతదేశానికి అమెరికాకు మధ్య ఉన్న భేదాలను, సంబంధాలను వివరిస్తుంది.

విప్లవ్‌ రాసిన ‘ఫిష్‌ దట్‌ గాట్‌ అవే కథ వారాంతాలలో సరదాలు తీర్చుకోవడానికి చేపలు పట్టే అభిరుచిని గురించి తెలియజేస్తుంది. మహేష్‌ శనగల రాసిన ‘గుగ్గుళ్ళమ్మ గుడి’, తాడికొండ శివకుమార్‌ శర్మ రాసిన ‘స్టిల్‌ ఎన్‌ ఇండియన్‌, నొరి రాధిక రాసిన ‘పండగ’, పూడిపెద్ది శేషశర్మ రాసిన ‘ముసురు చీకట్లో మెరుపు కిరణం’, దశిక శ్యామలాదేవి రాసిన జానకి’, డా॥ దారా సురేంద్ర రాసిన ‘దొరబాబు దూరదర్శిని, నిర్మలాదిత్య గారి సర్‌ ఫైజ్‌ పార్టీ, దేశిబొట్ల ఉమ రాసిన “చేతులు కాలాక ఆకులు”, డొక్కా శ్రీనివాస ఫణి కుమార్‌ రాసిన ‘లిటిల్‌ సైంటిస్ట్‌ కథలు విభిన్న కథావస్తువుతో అమెరికా జీవితాన్ని, ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయాలను, సమకాలీనంలో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తాయి. అమెరికాలో కథలు రాస్తున్నవారు అమెరికా జీవితాన్నే గాక, వారిలో జీర్లించుకు పోయిన భారతీయ జీవన విధానాన్ని కూడా గొప్పగా చిత్రిస్తున్నారు. ప్రవాస కథలపై పరిశోధనలు జరిగితే, మరిన్ని లోతైన అంశాలు బయటికొస్తాయి.

ఆధార గ్రంథాలు

  1. అమెరికా తెలుగు కథానిక – సంపాదకులు డా॥ పెమ్మరాజు (తొమ్మిదవ సంకలనం) (2006) వేణుగోపాల రావు, డా॥ వంగూరి చిట్టెన్‌ రాజువంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, ఐఎన్‌సి. హాస్టన్‌, టెక్సాస్‌.
  2. కథాశిల్పం (1995)-వల్లంపాటి వెంకటసుబ్బయ్య, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ.



4.7/5 - (15 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles