వ్యాఖ్యానించటం మరొక కర్తవ్యం. ఈ రెండు కర్తవ్యాల నిర్వహణలో రచయిత సాంస్కృతిక
ప్రాపంచిక దృక్పథం ద్యోతకమవుతుంది. ఆ రచయిత సూచించే సంఘ శ్రేయోభిలాషా
బయటపడుతుంది.
మధురవాణి పాత్ర సంస్కరణలో తెలిసే అంశాలు ఇవే: ‘సానిపిల్లలో వుండే
మానవత్వాన్ని నువ్వు మరచిపోకు. ఆమె విచారం, కన్నీళ్ళు, సంతోషం, ఆనంద బాష్పాలూ,
నీ నా సుఖదుఃఖాలవంటివే. మన అనుభూతులవలెనే అవీ గంభీరమైనవే! ఉదాత్తమైనవే!’
అంటాడు…. ‘ఇప్పుడున్న భావాలు పోయి, వీటి స్థానే కొత్తవి రావలసిన అవసరానికి,
అగత్యానికి మానవపరిణామం దారితీస్తున్నది. కంటి ఎదుట శూన్యం. స్త్రీ పురుష లైంగిక
సంబంధాలకు అనవసర ప్రాముఖ్యము నీయడంలో ఔచిత్యమేముంది? అర్థమేముంది?’
అనీ ప్రశ్నిస్తాడు. ఈ సందర్భంలోనే గురజాడ వివాహ వ్యవస్థ మీద కొంత చర్చ చేశాడు.
‘మానవజీవితంలో కానీ, లేదా సారస్వత కల్పనలలో కానీ, ఎందులోనైనా స్త్రీ పురుష
శారీరకానుభవాలూ, ఆనందాలూ మితిమీరకుండా తదుచిత స్థానాల్లోవుండాలి’ అని తన
దృక్పథాన్ని చూపుతాడు. సంస్కృతి రాహిత్యానికి కారణమయ్యే స్థితిని నివారించటమే
కవికృత్యం అని నమ్మినవాడు గురజాడ.
సాహితీకారునిగా తన కావ్యేతివృత్తాలు భారతీయమైనవి అని విశ్వసించాడు గురజాడ.
అవన్నీ సమాజంలోని మనిషి గురించీ, సంఘజీవిగా మనిషి ఉనికి గురించీ, మనుగడ
గురించీ రాసినవే. సంఘానికీ, వ్యక్తికీ మధ్యన వ్యుత్పన్నమవుతున్న (సం)ఘర్షణ గురించీ
రాసినవే. అలా రాసేటప్పుడు – ‘మంచి’ని సాధారణీకరించుకొని, ఆ ‘మంచి’ని
ప్రేరేపించటానికీ, ప్రోత్సహించటానికీ, నిలబెట్టటానికీ, స్థిరపరచటానికీ – తన కలాన్ని
కరవాలంగానే ఝుళిపించాడు గురజాడ. వాడుక భాషావినియోగం నుంచీ, అనేక
సాంఘిక సంస్కరణల ఆవశ్యకత వరకూ గురజాడ ‘ప్రజల మనిషి’గా నిలిచాడు.
ఒక నిజమైన సాహితీకారుడు ఇలా వుండాలనే నిబద్ధతని చాటి, పాటించటమే
గురజాడ సాంస్కృతిక దృక్పథం! అందుకే ఏకంగా ‘సాహిత్యం జాతిపరంగా కావాలి.
సంస్కృతి సమిష్టి సంపత్తి’ అనే అన్నాడు. ఇది ఆధునికత మాత్రమే కాదు, ఒక జీవన తత్త్వం,
ఒక దార్శనికత కూడా! అందుకే, ఆయన జాతి వైతాళికుడు, యుగకర్త!
వ్యక్తిత్వం – తత్త్వం
SourceAuthor - విహారి