రంగనాథాచార్యులు. కథానికాంశాల్లో సామాజిక వాస్తవికత ఆవశ్యకతని స్పష్టీకరిస్తూ
గురజాడ రాసిన కథానికలూ, ఉగ్గడించిన అభిప్రాయాలూ – కథకులకు మార్గనిర్దేశం
చేశాయి.
గురజాడ సాహిత్యంలో కాంతిమంతంగా కొట్టొచ్చినట్టు కనిపించే మౌలిక తత్త్వం –
అభ్యుదయకామన, సంఘ సంస్కరణాభిలాష, వాడుక భాష ప్రయోగం, దాని వినియోగం.
ప్రక్రియల పరంగా వస్తుశిల్పి నిర్మాణ విధానాల్లో వినూత్నత. తానే ఆద్యుడుగా వాటికొక
స్థిరమైన రూపకల్పన చేసిపోయాడు. సమకాలీన సామాజిక స్పృహకి ఎత్తిన వైజయంతికగా
వాటిని మలచాడు. ‘కొత్త మిన్కుల తెలివిపటిమను మంచి చెడ్డల మార్చితిన్’ అన్నాడు.
‘జీవితాన్ని నూత్న దృక్పథంతో దర్శించి కథాకవితారూపాల్లో దాని తత్త్వాన్ని
అన్వయించటానికి ప్రయత్నించాను’ అని తన హృద్దర్శనాన్ని తానే ప్రకటించాడు.
వాడుకభాషలో విద్యాబోధనకు పోరాటంలో ఆయనది ఎక్కటి పోరు. మడమతిప్పని
ధైర్యస్థైర్యాలతో తన ఆశయాన్ని ప్రకటించాడు. ‘సంకెళ్ళను ప్రేమించే వాళ్ళు గ్రాంథిక
భాషను ఆరాధిస్తారు గాక! నాకు మాత్రం నా మాతృభాష జీవద్భాష. అది ‘ఇటాలియన్
ఆఫ్ ద ఈస్ట్’. ఈ జీవద్భాషలో మన సుఖాన్నీ, దుఃఖాన్నీ వెల్లడించుకోవడానికి మనం
సిగ్గుపడటం లేదు. కానీ, దీన్ని వ్రాయడానికి మాత్రం మనలో కొంతమంది
బిడియపడుతున్నారు. వ్యావహారిక భాషలో వున్న సాహిత్యం రైతును మేల్కొలుపుతుంది.
భారతదేశంలో వున్న ఆంగ్లేయుడి గుండె కుదుపుతుంది. దాని శక్తి అపారం. అవకాశాలు
అనంతం’ అని అనంతమైన విశ్వాసాన్నీ, చిత్తశుద్ధినీ ప్రకటించారు. తన ఆశయ కారణాన్ని
పారదర్శకం చేశారు. వాడుక భాషాపరంగా ఆయన పోరాటపటిమకు ‘మినిట్ ఆఫ్
డిసెంట్’ ఒక్కటే చాలు. వెయ్యి నిదర్శనాలు పెట్టు అది!
‘వాస్తవిక రచన మానవజీవితం’ అనే అంశం మీద రాస్తూ ‘కవితాకళకు నేను లొంగి
వుండవలసిన వాడనే. అయినా నాకు మానవసమాజం పట్ల మహత్తర బాధ్యత వున్నది’
అంటాడు. ‘ఏమిటి బాధ్యత?’ ఒక దోషాన్నీ, ఒక దుర్నడతనీ, అవినీతినీ ఆకర్షవంతం
చేయకపోవడం. ‘చేయలేదనే భావిస్తున్నాను’ అన్నాడు. కళాసాహిత్య రూపాలు గాడితప్పితే,
సాంస్కృతికంగా సమాజానికి మంచి జరగదని భావం. ‘మానవ జీవితంతో నేను చెలగాటం
ఆడ్డం లేనేలేదని యీ నాటకం (కన్యాశుల్కం) చదివితే నీకు తెలుస్తుంది’ అని ఎంతో
చిత్తశుద్ధితో అన్నాడు.
‘మానవ స్వభావంలోనే పరస్పర వైరుధ్యం వుంది’ అనే సార్వకాలీనమైన సత్యాన్ని
చెబుతూ కనుకనే మధురవాణి పాత్రను చివరి అధ్యాయంలో సంస్కరించాను’ అని
చెప్పుకున్నాడు.
సంస్కృతి నిర్మాణం, ఆవిష్కరణ – మనుషుల వైయుక్తికమైన వైరుధ్యాల్లో ప్రతిఫలిస్తూ
సామాజికవర్తనలో కొన్ని కొన్ని నమూనాలుగా రూపమెత్తుతుంది. ఆ వైరుధ్యాల్ని పట్టుకొని
వాటి వాస్తవ స్థితిని యథాతథంగా చిత్రించటం రచయితకి ఒక బాధ్యత. దానితోపాటుగా
ఆ వైరుద్యాల మూలకారణాల్ని విశ్లేషిస్తూ, సామాజికంగా వున్న అవాంఛనీయతని
వ్యక్తిత్వం – తత్త్వం
SourceAuthor - విహారి