‘ముత్యాలసరాలు’ జగమెరిగినవే. అభ్యుదయకామనతో పునఃసృష్టి చేసిన ‘లవణరాజు
కల’, ‘పూర్ణమ్మ’, ‘కన్యక’ వంటివన్నీ ఆయన వదలివెళ్ళిన ‘అడుగుజాడ’లే! కవిత్వశాఖల్లో
ఆత్మాశ్రయకవిత్వం, ప్రబోధకవిత్వం, సంస్కరణ కవిత్వం, ప్రణయకవిత్వం – మాత్రమే
కాక, బాలగేయం కూడా – వెలయించి తన మార్గదర్శకత్వాన్ని మనముందు నిలిపాడు
గురజాడ.
నాటక రచన పరంగా ‘కన్యాశుల్కం’ గురించి ఏకంగా ఒక వాఙ్మయ భాండాగారమే
ఉంది తెలుగువారికి! భాషా సాహిత్య, ప్రక్రియా, ప్రయోగ విషయంలో ప్రపంచ
సాహిత్యంలోనే అది ఉత్తమోత్తమైనదని కీర్తిగన్నది కదా!
గురజాడ బహుముఖీనమైన ప్రజ్ఞా, ప్రయోగదక్షతల్లో ఒక పాయ ఆధునిక కథానికా
ప్రక్రియ. ఆయన నెరిపిన అనన్య సామాన్య మార్గనిర్దేశకత్వం ద్యోతకమవుతోంది దీనిలో.
గురజాడ రాసిన కథానికలు ఐదు. దిద్దుబాటు, మీ పేరేమిటి? మెటిల్డా, పెద్దమసీదు,
సంస్కర్త హృదయం. వీటిలో ‘దిద్దుబాటు’ ఆంధ్ర భారతి 1910 ఫిబ్రవరి సంచికలో
ప్రచురితమైంది. ఇది తొలి తెలుగు కథానికగా ‘ఒక గుర్తింపుకూ, గణనీయతకూ’
పాత్రమైనది. కథావస్తువులోని క్లుప్త , స్పష్టత, నాటకీయతా – ప్రారంభమైన తర్వాత
ఒకటి రెండు గంటల వ్యవధిలోనే కథానిక ఆఖరైపోయిన తీరు… ఈ లక్షణల వల్ల
‘దిద్దుబాటు’ ఒక నమూనా కథానికగా నిలిచిపోతుంది. ‘కథానిక పైన లక్షణ గ్రంథాన్ని
రాయకపోయినా, మంచి కథకు ఉండవలసిన లక్షణాలేవో ఊహించుకోడానికి వీలుగా
అప్పారావు పంతులు భావి కథకుల ముందుంచిపోయిన లక్ష్యం – దిద్దుబాటు!’ అంటూ
భాష విషయమూ ఆ తర్వాత స్పృశించారు మధురాంతకం రాజారాం. ‘ఆధునిక తొలి
తెలుగు కథానికగా ఈ కథ ఎన్నదగింది. అంతకు ముందు వివిధ రచయితలు రాసిన
కథలలో ఎటువంటి శిల్పం లేదు’ అన్నారు డా.భాస్కర స్వర్ణాంబ. ‘చిన్నకథ అప్పారావు
మానస పుత్రిక’ అన్నారు కె.వి. రమణారెడ్డి.
‘ఆధునిక స్త్రీలు మానవ చరిత్రను తిరిగి రచిస్తార’నే అభ్యుదయ కాంక్షని’ వందేళ్ళ
ముందే పేర్కొన్న గురజాడ దార్శనికత మహత్తరమైనది – నిజానికి ‘దిద్దుబాటు’ ఆయన
ఆశాభావానికి అచ్చమైన వ్యాఖ్యానం. ‘మెటిల్డా’ కథలోనూ దయనీయమైన వివాహిత
జీవితమే కథావస్తువు. మతమౌఢ్యం వెర్రితలలు వేయడాన్ని నిరసిస్తూ రాసిన కథలు ‘మీ
పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’. ఈ కథల్ని దృష్టిలో ఉంచుకొని ‘మత మౌఢ్యాన్ని తీవ్రంగా
నిరాకరించే రచనలు గురజాడ కథల తర్వాత రాలేదనే చెప్పాలి’ అన్నారు కె.కె.