గురజాడ తాత్విక చింతనలోని మూలసూత్రం కూడా ఆయన సాంస్కృతిక అన్వీక్షణని
తెలుపుతుంది. ‘మంచిని ప్రేమించడమే దైవమును ప్రేమించడము. దుర్గుణములను రోసి,
ఆత్మసుగుణ సంపత్తిని పెంపొందించుకుంటున్న కొద్దీ, ఆ దివ్యత్వమును పొందుతుంది’
అంటాడు.
‘మన సామాజిక నీతిసూత్రాలు’ అనే అంశాన్ని తన లేఖల్లో ప్రస్తావించాడు గురజాడ.
‘అనుస్యుతంగా మనస్సు నంటిపెట్టుకున్న భావాల్ని పరిగ్రహించవలసిన అవసరాన్నీ,
‘సెంటిమెంటులో వున్న సత్యమును’ అన్వేషించవలసిన ఆవశ్యకతనీ – గుర్తుచేస్తాడు. నీతి,
నైర్మల్య, పవిత్రతలనే భావాలకు గల నిజస్వరూపాన్నీ, నిజతత్వాన్ని – వింగడించి
చూడమంటాడు. ‘సమాజం నిర్ణయించిన కొన్ని శాసనాలు ఉన్నాయి. వాటిని గౌరవించడం
మన విధి’ అయితే, ‘ఈ సాంఘిక శాసనాలు, ధర్మాలు లోపభూయిష్టంగా వున్నప్పుడు
వాటిని మనం బాహాటంగా ఎదుర్కొని సంస్కరింపవలసి వుంటుంది….’ ఇదీ సాంస్కృతిక
దృక్పథం!
భాషా సాహిత్యాల విషయానికి వస్తే గురజాడ తత్త్వం ‘పాత కొత్తల మేలుకలయిక’ గా
రూఢి అవుతుంది.
ఆధునిక సాహిత్య ప్రక్రియల రూపకల్పనలో, నిర్మాణంలో గురజాడ రచనా వైశాల్యం
కన్నా కూడా, రచనలో లోతుని ఎక్కువ చూపాడు. ముందుతరాల్ని అందుకోమన్నాడు. తన
ఆధునిక భావధారనీ, వాడుకభాష ఆశయాన్నీ, నూత్న శిల్పనైశిత్యాన్నీ, విస్తృతం
చేసుకోమన్నాడు. స్రష్టగా అదీ గురజాడ! ‘తన నాటి వరకూ ఉన్న పాత రచనల్లో
యంత్రత్వం, కృతకత్వం, అశ్లీలతా, ఆడంబరత్వం మాత్రం విసర్జించి, మహాత్య్మం
స్వీకరించి, పాతకొత్తల మేలుకలయికలో ఆకర్షణ సహజరీతిని సాధించి, ముట్టినదంతా
రసవంతం చేసిన సువర్ణయోగి గురజాడ అప్పారావు’ అన్నారు ఆనాటి భమిడిపాటి
కామేశ్వరరావుగారు.
సాహిత్య ప్రక్రియల్లో ముఖ్యమైన – కవిత్వం, కథానిక, నాటకం – ఈ మూడిటిలోనూ
మొట్టమొదటిసారిగా, వస్తుగతంగా, శిల్పరూపగతంగా భాషాపరంగా ఆధునికతను
అందించినవాడు గురజాడ. కవిత్వపరంగా – ముత్యాలసరాలు సృజన, కథానిక పరంగా
ఐదు ఆణిముత్యాలు, నాటకంగా ‘కన్యాశుల్కం’ ఈ మూడు వైవిధ్యభరితమైన రచనల
మీదా – పుట్టెడు వివరణ విశ్లేషణ, చర్చ, వాఙ్మయం మనముందు కొచ్చే వున్నై.
ప్రయోగశీలిగా ఈ ప్రక్రియల ఆధునికతకు ఆయన ఆద్యుడు.
కవిత్వపరంగా – ప్రయోగశీలిగా -తెలుగు సాహితికి ఆయన అందించిన
వ్యక్తిత్వం – తత్త్వం
SourceAuthor - విహారి