దార్శనికుడుగా గురజాడ ‘తెలుగు సారస్వతానికి సరిహద్దు!’ ‘చలనశీల సాహిత్య స్రష్ట’.
‘….. ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్రా, ఆ
చరిత్రకొక పరిణామం వుంటాయి. సామాజిక, చారిత్రక పరిణామ గమనంలో కవియొక్క
సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలీ, ప్రతిభాశాలీ అయితే ఆ గమనాన్ని
అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవపంథాలలో వేగం
సాధించిన మహాకవిగా గురజాడ అప్పారావుకి నేను నమస్కరిస్తున్నాను’ అంటాడు శ్రీశ్రీ –
గురజాడ ఆధిపత్యానికి కారణాలు’ అన్న వ్యాసంలో.
గురజాడ మౌలిక తాత్త్వికతని విహంగవీక్షణం చేస్తే – తాను ప్రభావితంచేసిన
మూడురంగాల్లోనూ ‘ఆధునికత’ని ప్రవేశింపజేసినవాడు ఆయన.
సంఘసంస్కరణ అనేది గురజాడ తత్త్వంలో ప్రాథమిక లక్షణం. ఆ సంస్కరణలో
మానవ జీవనంలోని అన్ని పార్శ్వాలూ ఇమిడి ఉన్నాయి.
ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించిన కొన్ని ఆచరణాత్మక వాంఛితాలు ఆనాటి ప్రజల్ని
అమితంగా అబ్బురపరచాయి. ఒక్క ‘దేశభక్తి’ గేయాన్ని విశ్లేషించుకుంటేనే, ఆయనది
ఎంత ఆధునికభావనో, ఆయన ఎంతటి విశ్వమానవ ప్రేమికుడో అర్థమవుతుంది.
‘మంచిచెడ్డలు మనుజులందున యెంచి చూడగ రెండె కులములు / మంచియన్నది
మాలయైతే మాలనే అగుదున్’ అన్నాడు. ‘మాలవాడు కనపడగానే భ్రాతృత్వం చాలాదూరం
పలాయనం చేస్తుంది. మాలవాణ్ణి చూడగానే అమాంతం కౌగలించుకోని వాడికి దేశమాత
పేరు ఎత్తడానికి అర్హత లేదని నా గట్టి నమ్మకం’ అనగలిగిన ధీరుడు గురజాడ.
‘ఎల్లలోకము వొక్క యిల్, లైవర్ణభేదములెల్ల కల్లైవేలనెరుగని ప్రేమ బంధము వేడుకలు
కురియ’ అనే విశాల దృష్టితో, అభ్యుదయకామనతో సాహిత్యకృషి చేసిన గురజాడ
దేశాభిమాని మాత్రమే కాదు, విశ్వమానవ ప్రేమికుడు. ‘అన్నదమ్ముల వలెను జాతులు
మెలగవలెనోయ్’ అని సార్వజనీనమైన శుభాకాంక్షలు గుండెనిండుగా కలిగిన సంఘ
సంస్కరణాభిలాషి.
‘పుట్టుక వల్ల గొప్ప రానేరాదు. గుణయోగ్యతల వలననే గొప్పవచ్చును’ అని
స్పష్టంచేశాడు. ‘మలిన దేహుల మాలలనుచును / మలిన చిత్తుల కధిక కులముల /
నెలవొసంగిన వర్ణధర్మము / అధర్మ ధర్మంబే’ అనేది వర్ణవ్యవస్థ నిరసన.
మతాన్ని గురించి కూడా గురజాడది నిశ్చితమైన అభిప్రాయమే. ‘అద్వైతం ఎండమావి
మాత్రమే… ప్రపంచం యొక్క అచ్చమైన తత్వం స్వార్థత్యాగంలో, పరోపకారంలో వుంది.
స్వార్థ త్యాగానికి దారితీయగల ప్రేరణకు ప్రేమను మించింది వుందా? మానవాళి పూసిన
అత్యంత ఉజ్వలమైన పుష్పం ప్రేమ, వెర్రిప్రేమకాదు, వ్యామోహం కాదు, అందమైన ఆత్మల
సౌందర్యాన్నీ, స్ఫటిక స్వచ్ఛతను మెచ్చుకోవడం, పరోపకారం, దయా, శాంతీ,
నిశ్చలత్వమూ, – మనోహరమైన రూపురేఖల ద్వారా తొణికిసలాడే సౌందర్యం,
మంచితనమే దైవం. మంచితనాన్ని ప్రేమించడం దైవ ప్రేమను వ్యక్తం చేసే సూటిదారి’ అని
సందేశించాడు గురజాడ.
వ్యక్తిత్వం – తత్త్వం
SourceAuthor - విహారి