వ్యక్తిత్వం – తత్త్వం
– తొలి సంచిక
గురజాడని మార్గదర్శిగా అభివర్ణిస్తూ శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రిగారు ‘దేశం ఎంతగా పతనమైపోవాలో అంతగా
పతనమైనప్పుడు, మానవతా విలువలు ఎంతగా దిగజారి
పోవాలో అంతగా దిగజారి పోయినప్పుడు, తెలుగు భాష
ఎంతగా భ్రష్టుపట్టిపోవాలో అంతగా భ్రష్టుపట్టిపోయినప్పుడు
పుట్టుకొచ్చాడీ మహాను భావుడు’ అని ప్రశంసించారు.
గురజాడ వ్యక్తిత్వంలోని తేజోరేఖల్ని ముందుగా
చెప్పుకుందాం.
గురజాడ పొద్దుచాలని కృషీవలుడు. ఒకేసారి వందపనులు
చేసేవాడు. ఆటలు, చదువు, పరిశోధన, వాదనలు, పుస్తకపఠనం, వీణావాదన సాధన,
ఈత, గుర్రపుస్వారీ, టెన్నిస్, బిలియర్డ్స్ – కొన్ని తన ‘జీవుని వేదన’ని తృప్తిపరచటానికైతే,
కొన్ని రాజసేవకు ఆవశ్యకాలు.
గురజాడ మేధ – సర్వమూ ఆకళించుకున్న శక్తి కలిగినది. దానిది పూర్ణప్రజ్ఞ.
బహుముఖీనత్వం. కన్యాశుల్కంలో ఆయన వాడుకున్న ప్రాచీన జానపద వైభవాన్ని
చూడండి. శతకవాఙ్మయమూ, తత్వాలూ, జనం నోట నానిన పాటలూ – అన్నీ ఆయనకు
ఉపకరించాయి. (సారా కొట్టుసీనులో దుకాణదారు పాడే వేమనపద్యం. దాన్ని అతను
పాడినతీరు – గుర్తుకొస్తుంది!)
గురజాడ జ్ఞానతృష్ణ ఎల్లలు లేనిదనిపిస్తుంది. కోర్టుకేసుల కోసం, న్యాయవాదులకి
అవసరమైనప్పుడు సలహాలివ్వడం కోసం – తానుగా ‘లా’ చదవటం ఒక విశేషమైతే, ఆ
చదువుతో ఆనాటి మద్రాస్ ప్రభుత్వ ఎకౌంటెంట్ జనరల్ ఏ.జి. శ్రీనివాసయ్యంగారినే
ఆశ్చర్యచకితుణ్ణి చేయటం మరో విశేషం. అలాంటివే, యూనివర్శిటీ కాంపోజిషన్ కమిటీ
పోరాటాలు. ‘మినిట్ ఆఫ్ డిసెంట్’ రచన, గురజాడ వ్యాసాలు చూస్తే, ఏ విషయాన్ని
గురించి అయినా కూలంకషంగా పరిశోధించి నిర్ణయాలకి రావటం అనేది ఆయన
పరిశోధనల జీవలక్షణం అనిపిస్తుంది. ఆయన వ్యాసాల్లో ‘ఆంధ్రకవితాపిత – 1’ ‘ఆంధ్ర
కవితాపిత 2-’ ఉన్నై. విషయం – ‘బెజవాడలో యుద్ధమల్లుని శాసనం రాజరాజనరేంద్రుని
కన్న ప్రాచీనమైనది అవునా, కాదా?’ అనేది గురజాడ అవుననే అభిప్రాయాన్ని ప్రకటించారు.
ఈ వ్యాసాల్లో ఆయన చూపిన ఆధారాలూ, చేసిన చర్చలోని విస్తృతమైన, నిశితమైన
పూర్వాపరాల ఉటంకింపులూ గమనిస్తే – గురజాడ దీక్షకీ, చిత్తశుద్ధికీ, సూటితనానికీ