‘మహాకవి గురజాడ అప్పారావు మొట్టమొదటిసారి ముత్యాలసరాలు గుచ్చిన యేడు
1910లోనే తెలుగు కవిత్వంలో విప్లవశకం ఆరంభమైనది’ అని శ్రీశ్రీ గారు కుండబద్దలు
కొట్టినట్లు నిజాన్ని నిక్కచ్చిగా వెలువరించారు. అంతేకాక శ్రీశ్రీ గారు, కందుకూరి
వీరేశలింగం, తిరుపతి వెంకటకవులు, రాయప్రోలు సుబ్బారావుగార్లను ప్రస్తావించి
వారెవ్వరూ యుగకర్తకారని, సామాజిక పరిణామానికి విప్లవ పంథాలలో వేగం సాధించిన
‘మహాకవిగా’ గురజాడ వారినే ఆధునిక యుగానికి యుగకర్తగా తాను భావిస్తున్నట్లు తెగేసి
మరీ చెప్పారు.
‘ఆధునిక సాహిత్య యుగకర్తే కాదు తెలుగులో
వ్యావహారిక భాషా రచనకు ఉపక్రమించిన వారిలో
ప్రథములు కూడా గురజాడే’ అని గొర్రెపాటి వేంకట
సుబ్బయ్యగారు ప్రశంసించారు. ‘తెలుగులో ఆదికవి
నన్నయ్య అయితే తెలుగుకు ఆధునికతని కల్పించింది
గురజాడ. ఈ ఇద్దరి చేతుల్లో తెలుగు కొత్త పుంతల్ని
తొక్కింది’ అని గురజాడ సాహిత్య పరిష్కర్త సెట్టి
ఈశ్వరరావు గారు కొనియాడారు.
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గురజాడను
‘మహాకవి’గా గుర్తించి గౌరవించారు. ‘గురజాడ
గురుపీఠం’ అనే గ్రంథంలో ఆరుద్రగారు ‘ఆధునికాంధ్ర
సాహిత్యానికి గురజాడ ఆచార్యుడు’ అని సమర్థించారు.
గురజాడను ‘ఆధునికాంధ్ర కవిత్వానికి
మూలపురుషుడుగా’ గురజాడను కొనియాడారు
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు. ‘వైతాళికులనే
మేలుకొలిపినాడు, మార్గదర్శి, మేధావి’ అని
ముద్దుకృష్ణగారు అన్నారు. ‘కన్యాశుల్కాన్ని దేవుడు
తప్పిస్తే మరొకరు రాయలేరు అనేవారు. నాటక రచనా
కళా విషయంలో గురజాడ వారు నిజంగా దేవుడే.
ఆయన సృష్టించి, పోషించిన పాత్రలే ఆయన్ని దేవుణ్ణి
చేశాయి’ అని రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు కొనియాడారు.
గురజాడ – రాయప్రోలు :
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు ‘ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు – ప్రయోగాలు’ అనే పరిశోధనా గ్రంథంలో గురజాడ, రాయప్రోలు ఇద్దరినీ యుగకర్తలుగా
పేర్కొన్నారు. నారాయణరెడ్డి గారి పరిశోధనా వాదనలో పసలేదు. తర్వాత కాలంలో ఆయన సిద్ధాంతం నిలవలేదు. ఆ పరిశోధన సరైనది కాదని విమర్శకులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. కారణం రాయప్రోలు రచనలు ఎక్కువశాతం సనాతన సంప్రదాయ