గురజాడ రచనలు మనకు ఆదర్శప్రాయం. అనుసరణీయం అయ్యాయి. అందుకే
గురజాడను ‘గద్యవాఙ్మయ ప్రవర్తకుడు’ అని శ్రీశ్రీ అన్నారు.
డైరీలు, లేఖలు, డిసెంట్ పత్రం, మాటామంతీ లాంటివి కూడా గురజాడను
అగ్రపీఠంలో నిలబెట్టాయి. చనిపోయి నూటామూడు సంవత్సరాలు గడిచినా తెలుగు వారి
హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తున్న మహనీయుడు గురజాడ అప్పారావుగారు (21
సెప్టెంబర్ 30 – 1862 నవంబర్ 1915). మహాకవులకు జననమేగాని మరణంవుండదు.
ఇప్పటికీ గురజాడ రచనలపైన ఆయన జీవితంపైన ప్రత్యేకించి కన్యాశుల్కంపైన
ఎన్నెన్నో పరిశోధనలు విమర్శలు, విశ్లేషణలూ, వ్యాఖ్యానాలూ, సమీక్షలు, సంకలనాలు,
సంపుటాలు వచ్చాయి. ఇంకా వస్తూ వున్నాయి. అదే గురజాడకూ, ఆయన రచనలకూ
వున్న గొప్పతనం, విశిష్టత కూడా. తెలుగు సాహిత్యంలో మరి ఏ ఇతర రచయితకు లేనంత
ఖ్యాతి గురజాడ వారికి దక్కింది. వారి రచనలతో తెలుగు సాహిత్యం సుసంపన్నం
అయిందనడంలో సందేహం లేదు. గురజాడ గూర్చి ఎంత రాసినా, ఎంత మాట్లాడినా
తనివితీరదు. గురజాడపై వచ్చిన కొన్ని విమర్శలు సరైనవి కావు. కావాలని కొంతమంది
రంధ్రాన్వేషణ చేశారు. కొందరు చేసిన విమర్శలు వివేచనతో కూడినవి కావు. అవి
కువిమర్శలు. గురజాడ ప్రతిభా ప్రజ్ఞా పాటవాల్ని కొంతమంది సంప్రదాయవాదులు
గుర్తించలేకపోయారు. ఇదే విషయాన్ని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పదే పదే నొక్కి
చెప్పారు కూడా.
సెట్టి ఈశ్వరరావు, బం.గో.రె, అవసరాల సూర్యారావు, కె.వి.ఆర్, శ్రీశ్రీ, ఆరుద్ర,
సర్దేశాయి తిరుమల రావు కొడవటిగంటి కుటుంబరావు, తాపీ ధర్మారావు, నార్ల
వేంకటేశ్వరరావు నిడుదవోలు వేంకటరావు, పి.యస్. ఆర్. అప్పారావు, అబ్బూరి
రామకృష్ణారావు, మొదలి నాగభూషణ శర్మ, ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం మొదలైనవారు
ఎందరో గురజాడ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి నిగ్గు తేల్చారు. చింతాదీక్షితులు,
ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు
మున్నగువారు గురజాడ మార్గదర్శకత్వాన్ని వేనోళ్ళ కొనియాడారు.
గురజాడపై, ఆయన రచనలపై ప్రముఖుల అభిప్రాయాల్నిముందుగా పరిశీలిద్దాం.
‘నవ్యాంధ్ర కవిత్వ శుభోదయమునకు గురజాడ అప్పారావు వేగుచుక్క’ అని ఆండ్ర
శేషగిరి రావుగారు అన్నారు.
‘అప్పారాయోపజ్ఞకమైన రాసే గీతాలను రాయప్రోలు సుబ్బారావుగారందుకున్నారు’
అని విశ్వనాథ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ‘ఈ శతాబ్దపుటారంభమునకే గురజాడ
అప్పారాయ కవి యువలోకము కనుచున్న కలలు రూపొందజేయుచు ఆధునిక కవిత్వపు
ధ్వజమును ప్రతిష్ఠించెను. ముత్యాల సరములను గేయ సంపుటితో నవ్యకవితకు నాంది
పఠించెను’ అని ఖండవల్లి లక్ష్మీకాంతంగారు భావించారు.
‘అప్పారావు గారి నీలగిరి పాటలు, ముత్యాలసరాలు కొత్త పాతల మేలు కలయిక
కూర్చిన నవ్య సాహిత్యపు తొలికృతులు’ అని నోరి నరసింహశాస్త్రిగారు పేర్కొన్నారు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు