పాల్కురికి సోమనాథుడు అనగానే ద్విపద, వేమన అనగానే ఆటవెలది, అన్నమయ్య
అనగానే కీర్తనలు, క్షేత్రయ్య అనగానే పదాలు, గురజాడ అనగానే ముత్యాలసరాలు మనకు
గుర్తుకు వస్తాయి. ఆధునిక కవిత్వానికి ఆద్యులు, ఆరాధ్యులు, పూజనీయులు
గురజాడవారు. 1910లో ఈ ముత్యాల-సరాలు వచ్చాయి. గురజాడ కవిత్వంలో నవ్య
ప్రయోగాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇతివృత్తంలో, నవ్యతలో, భావంలో, శైలిలో,
భాషలో, ఛందస్సులో, పదప్రయోగంలో ఒకటి ఏమిటి అన్ని అంశాల్లో కొత్త విషయాలు
కన్పిస్తాయి. గురజాడవారు ఆనాడు పద్యాన్ని విడిచిపెట్టి గేయం రాయడమే పెద్ద చైతన్యం.
పెనుమార్పు కూడా. అంతేకాదు వాడుకభాషలో కవిత్వం రాయడం కూడా గురజాడ
భావంలో సహజత్వం వుంది. వాస్తవికతా సౌందర్యం వుట్టిపడుతుంది. శ్రీశ్రీ అన్నట్లు
‘గురజాడది వట్టి ఫోటోగ్రఫీ కాదు X-ray ఫోటోగ్రఫీ’. అంతవరకు తెలుగు కవిత్వంలో
లేని కొత్తదనం గురజాడ కవిత్వంలో కన్పిస్తుంది.
‘ప్రపంచ కవి సమ్మేళనంలో తెలుగువారి తరఫున పాల్గొనదగిన మహాకవి గురజాడ
అని, ఆయన కవిత్వాన్ని కొత్త మలుపు తిప్పారు’ అని శ్రీశ్రీ కొనియాడారు. కన్యక అగ్నికి
ఆహుతి అయింది. పూర్ణమ్మ నీట మునిగి ఆత్మహత్య చేసుకుంది. కన్యక చైతన్యాన్నిస్తుంది.
పూర్ణమ్మ సంస్కారాన్నిస్తుంది. ‘పూర్ణమ్మ ముగింపు ఒక గొప్ప కావ్యాన్ని చదివిన అనుభూతి
కలుగుతుందని’ శ్రీశ్రీ కొనియాడారు. పూర్ణమ్మను గురజాడ చతురశ్ర గతిలో నడిపారు
‘పూర్ణమ్మ కథ, కాల గర్భంలో కాదు, కావ్య గర్భంలో కలిసింది. అందుకే శాశ్వతంగా
నిలిచింది’ అని ఆరుద్రగారు ప్రశంసించారు. ‘పూర్ణమ్మ చనిపోలేదు, ఆమెది ఆత్మహత్య
కాదు. భర్త యింటికి పోవడానికి మారుగా, లోకేశ్వరి ఇంటికి పోయిందని అనడం
యదార్థం’ అని రమణారెడ్డిగారు అభిప్రాయపడ్డారు.
వీరు దేశభక్తి గేయాన్ని ‘సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా’ ప్రశంసించారు
శ్రీశ్రీ గారు. ‘ఠాగూరు రాసిన ‘జనగణమణ’ కంటే గురజాడ వారి దేశభక్తి గీతం’ ఎన్నోరెట్లు
మిన్న’ అని రోణంకి అప్పలస్వామిగారు అన్నారు. ‘అప్పారావు రాసిన కాలానికీ, దేశానికీ,
ఇంతకంటే నిండుగా సమాజ పథాన్ని గురించి, ఆదేశించిన జాతీయ గీతం మరొకటి
లేకపోవచ్చు’ అని కె.వి.ఆర్. గారు తెలియజేశారు.
గురజాడ వారి ఐదు కథలు చదివితే ఆనాటి సాంఘిక జీవితం ఎలా వుండేదో
తెలుస్తుంది. దిద్దుబాటు, మీ పేరేమిటి, మెటిల్దా, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం అనే
ఐదు కథల్లో పతనమవుతున్న నైతిక విలువలు, మతవ్యవస, ్థసాంఘిక వ్యసనాలు మొదలైన
అంశాలు కన్పిస్తాయి. గురజాడ రచనా రీతిని గూర్చి చెపుతూ చింతాదీక్షితులుగారు ‘చిన్న
చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేటట్లు చెప్పగల దిట్ట’ అని ప్రశంసించారు.
గురజాడవారు రాసిన కథలు ఇప్పటికీ నిత్య నూతనంగా వున్నాయి. కథ సామాజిక
జీవితానికి ప్రతిబింబం అనే వాస్తవాన్ని గురజాడ రుజువు చేశారు. అదే విషయాన్ని నేటి
కథారచయితలు కూడా వాస్తవం చేస్తున్నారు. వాస్తవ జగత్తును దర్శింప చేస్తున్నారు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు