తెలుగు సాహిత్యంలోనే కాక, భారతీయ సాహిత్యంలోనే కాక, ప్రపంచ నాటక
సాహిత్యంలో కన్యాశుల్కం అగ్రశ్రేణిలో నిలిచే గొప్ప నాటకమని మేధావులు, కవులు,
రచయితలు, నాటక కర్తలు,పండితులు, సాహిత్యవేత్తలు, విమర్శకులు వేనోళ్ళ
కొనియాడారు.
ఇతివృత్తంలోనూ, సాహిత్య కళా సౌందర్యంలోనూ, భాషలోనూ, భావంలోనూ, పాత్ర
పోషణా నైపుణ్యంలోనూ, పాత్రోచిత భాషను వాడడంలోనూ, సంభాషణా చాతుర్యంలోనూ,
అద్భుతమైన సన్నివేశ కల్పనలోనూ, రసపోషణలోనూ, కథా సంవిధానంలోనూ,
శైలిలోనూ, శిల్పంలోనూ, నాటక నిర్మాణ దక్షతలోనూ, సాహిత్య ప్రయోజనంలోనూ,
తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు పలుకుబడులు
వాడడంలోనూ, జాతీయాలు, సామెతలు వాడడంలోనూఒకటి ఏమిటి ఇలా అన్ని విషయాల్లోనూ
కన్యాశుల్కంలో ఉత్తమ నాటక కళా విశిష్టత
కొట్టవచ్చేటట్లు కన్పిస్తుంది. ఈ నాటకంలో గొప్పతనం
ఏమంటే చదివినా, చూసినా, నాటకంలోని పాత్రలన్నీ
మనకు ఎల్లకాలం జ్ఞాపకం వుంటాయి. ఇదే ఈ నాటకం
గొప్పతనం.
గురజాడ రాకతో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక
నూతన శకం ప్రారంభమైంది. ఈ విషయాన్ని
అన్నివర్గాలవారు, అందరూ ముక్తకంఠంతో
అంగీకరించారు. మీదు మిక్కిలి అభినందించారు
కూడా. సామాజిక సంస్కరణ కోసం, భాషా సంస్కరణ
కోసం, వాడుక భాషలో నాటకం రాశారు. గురజాడ
నూటికి నూరుపాళ్ళు తాను అనుకున్న సాహిత్య
ప్రయోజనాన్ని పూర్తిగా సాధించారు. ఇందులో ఎవరికీ
ఏ అనుమానం అవసరం లేదు. తెలుగు భాషా
సాహిత్యాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి, రాబోవుకాలానికి అనుగుణంగా తెలుగు
సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులయ్యారు.
‘జీవితం అంత గొప్పది కన్యాశుల్కం’ అని శ్రీశ్రీ, “తరగని గని కన్యాశుల్కం’’ అని
ఆరుద్ర, “మానవజీవి చిత్రణే కన్యాశుల్కం’ అని ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం, “సంస్కరణ
పతాక కన్యాశుల్కం’ అని టి.ల్. కాంతారావు, “జీవిత రంగమే కన్యాశుల్కం’’ అని నార్ల
మొదలైనవారు కన్యాశుల్కం నాటకం గూర్చి కొనియాడారు. ‘కన్యాశుల్కం లాంటి
నాటకాలు తెలుగులో లేవు. వచన నాటకాలకు అప్పారావుగారు ఆదిభిక్ష పెట్టారు’ అని
చింతా దీక్షితులు ప్రశంసించారు. ‘కన్యాశుల్కం తిరగేస్తే మొదటి పేజీలోనే మనిషి వాసన
వస్తుందని’ సర్దేశాయి తిరుమల రావుగారు అభిప్రాయపడ్డారు.