అప్పారావుగారి మొత్తం సాహిత్యంలో ప్రధానంగా మనకు కన్పిస్తున్న సామాజిక
అంశాలున్నాయి. పాశ్చాత్య నాగరికతా వ్యామోహాన్ని నిరసించడం, బాల్య వివాహాల్ని
ఖండించడం, వితంతు వివాహాల్ని ప్రోత్సహించడం, వేశ్యావృత్తిని నిర్మూలించడం, స్త్రీకి
సంపూర్ణస్వేచ్ఛ ఇవ్వడం, అందరికీ విద్య, అపారమైన దేశభక్తి, జాతీయతా దృక్పథం,
మతాన్ని నిరసించడం, కుల నిర్మూలన, మూఢాచారాల్ని, నమ్మకాల్ని, ఛాందస భావాల్ని
ఎదిరించడం, అవినీతిపై తిరుగుబాటు చేయడం మొదలైనవి.
ఆధునిక తెలుగు సాహిత్యంలోనేకాక నాటక ప్రక్రియలోనూ గురజాడ రాసిన
కన్యాశుల్కం పెనుమార్పులకు కారణమయింది. ఈ నాటకం తెలుగు సాహిత్యంలో
చెప్పలేనంత సంచలనాత్మకమైన విప్లవం తెచ్చింది. ఈ నాటకం మీద వచ్చినంత విమర్శ,
ప్రతి విమర్శలు మరి ఏ నాటకం మీదా, ఇతర గ్రంథం మీదా రాలేదు. అంతేకాదు ఒక
రచయిత రాసిన గ్రంథం మీద ఇన్ని వేల పేజీల విమర్శ కూడా రాలేదు. ఇది గొప్పే కాదు,
ఒక రికార్డు కూడా. ఈ నాటక గొప్పతనాన్ని గూర్చి గురజాడ చెపుతూ హరికథా
పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారికి ఒక ఉత్తరం కూడా రాశారు. ‘ఇతివృత్త
స్వీకరణలో, నిర్వహణలో, హాస్యరస పోషణలో, పాత్రోన్మీలనంలో తెలుగు సాహిత్యంలో
ఇది అత్యుత్తమ నాటకం అనే విషయాన్ని మరవకండి’ అని తన అభిప్రాయాన్ని
తెలియజేశారు.
వీరు సృష్టించిన పాత్రలు మానవత్వంతో నిండి వున్నాయి. ప్రాణమున్న ప్రతీ
ఒక్కరిలోనూ అవి జీవించి, జీవితాన్ని ఉత్సాహవంతం చేస్తాయి. మానవత్వంతోనూ,
జీవితంతోనూ పెనవేసుకున్న పరిపూర్ణమైన రచన కన్యాశుల్కం. ప్రారంభంలో
గ్రాంథికభాషలో రచనలు చేసిన గురజాడ తర్వాత వాడుక భాషలో రచనలు చేయవలసిన
ఆవశ్యకత గుర్తించారు. దాన్ని ప్రజా ఉద్యమంగా తలచారు. గిడుగు వ్యావహారిక
భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఇద్దరూ కలిసి భాషా, సాహిత్యాల్ని ప్రజల దగ్గరకు
తీసుకెళ్ళారు. జనాలకు దగ్గరయ్యారు.
సమాజంలోని అన్నిరకాల మనుషులు ఈ నాటకంలో మనకు కనబడతారు. గురజాడ
సృష్టించిన అన్ని పాత్రల్ని మనం ఇష్టపడతాం. కారణం, ఆయన సృష్టించిన పాత్రలు
సమాజంలో ఇప్పటికీ మనకు కనబడతాయి. అవి సజీవ పాత్రలు. సలక్షణ పాత్రలు –
విలక్షణ పాత్రలు.
మధురవాణి లాంటి మానవ విలువలు, నైతిక విలువలు కలిగిన స్త్రీమూర్తి, గిరీశం
లాంటి మాయగాడు, మాటకారి, అబద్ధాల కోరు, అగ్నిహోత్రావధానులు లాంటి పరమ
ఛాందసుడు, మూఢుడూ, దావాలకోరుగాడు, కోపిష్టి, వెంకమ్మలాంటి సనాతన భావాలు
గల భర్తను వ్యతిరేకించిన స్త్రీ, లుబ్ధావధానులు లాంటి పరమ లోభి, పేరుకుతగ్గ వ్యక్తి,
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు