సిద్ధాంతాలకు అనుగుణంగా వర్గీకరించారు. కందుకూరి వీరేశలింగం నుండి వెలమల
సిమ్మన్న వరకు ప్రముఖమైన ఇరవై తెలుగు సాహిత్య చరిత్రలు తెలుగులో చోటు
చేసుకున్నాయి. ‘తెలుగు సాహిత్య చరిత్రకారులు’ అనే గ్రంథాన్ని డాక్టర్ గుమ్మా
సాంబశివరావుగారు వెలువరించారు.
యుగం అంటే కొన్ని విశిష్ట సమాన ధర్మాలు గల కాలపరిమితి. ‘వాఙ్మయ చరిత్రలో
కొన్ని విశిష్ట లక్షణాలు గల వాఙ్మయం మొదలైన దగ్గర నుంచి, దాని ప్రాధాన్యం నశించి
కొత్తదైన, భిన్న వర్గాలకు, చెందిన లక్షణాలు గల వాఙ్మయం ప్రారంభమైనంతవరకు గల,
కాలాన్ని యుగం’ అని అంటారు. నిరంతరం సమాజం మారుతుంది. అదేవిధంగా
సాహిత్యంలో మార్పులు వస్తాయి. సాహిత్యం ఎప్పుడూ సమాజానికి అనుకూలంగానే
వుంటుంది. అంచేత సాహిత్యం సామాజిక ప్రతిబింబం. సాధారణంగా ఆయా కాలపు
సమాజంలోని మార్పుల మూలంగానే సాహిత్యంలోని యుగ విభజన జరుగుతుంది.
సాహిత్య చరిత్రలో చేసే యుగ విభాగం విషయ గ్రహణానికి చక్కని సాధనం.
తెలుగు సాహిత్య చరిత్రకారులు, రచనా సౌలభ్యం కోసం తమ తమ అభిరుచిని బట్టి
రకరకాలుగా యుగ విభజన చేశారు. 1)కవుల్ని బట్టి యుగ విభజన 2) కవితా పోషకుల్ని
బట్టి యుగ విభజన 3) కావ్య ప్రక్రియల్ని బట్టి యుగ విభజన 4) మార్గదర్శకులైన
మహాకవుల్ని బట్టి యుగ విభజన. ఆచార్య పింగళి లక్ష్మీ కాంతంగారు మార్గదర్శకులైన
మహాకవుల్ని బట్టి తెలుగు సాహిత్య చరిత్రను యుగవిభజన చేశారు. ఆధునిక యుగంలో
మార్గదర్శకుడైన మహాకవిగా, ఎందరో ప్రముఖులచేత, మన్ననల్ని ప్రశంసల్ని అందుకున్న
ఏకైక వ్యక్తి గురజాడ అప్పారావుగారు. పింగళివారి విభజన ప్రకారం ఆధునిక యుగాన్ని
‘గురజాడ యుగం’గా మనం పరిగణించవచ్చు.
గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, తిరుపతి వేంకట కవులు, కందుకూరి
వీరేశలింగం, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, చలం మున్నగు వాళ్ళ పేర్లు
సాహిత్యలోకంలో యుగకర్తలుగా విన్పిస్తున్నాయి. అంతేకాదు, వీళ్ళపై అనేక వ్యాసాలు
కూడా వచ్చాయి. కొంతమందిపై గ్రంథాలు కూడా వెలువడ్డాయి. వీరి అందరి రచనలపైన,
వాళ్ళ వ్యక్తిత్వంపైన సునిశితంగా, లోతుగా, విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా,
నిక్కచ్చిగా అధ్యయనం చేస్తే శ్రీశ్రీ అన్నట్లు ‘యుగకర్త కావడానికి అన్ని రకాలుగా
తగినవారు మహాకవి గురజాడ అప్పారావు’ గారే. భవిష్యత్ సమాజాన్ని దర్శించిన
క్రాంతదర్శి వీరు. సమాజంలో తాను ఆశించిన మార్పులన్నింటినీ సాధించడానికి
సాహిత్యాన్నే సాధనంగా చేసుకున్న సామాజిక శాస్త్రవేత్త గురజాడ వారు.
గురజాడకు పూర్వం తెలుగు సాహిత్యంలో భాషాపరంగా, సాహిత్యపరంగా,
భావాలపరంగా, దిగజారుడు ధోరణులు, నీచమైన ధోరణులు, తిరోగమన ధోరణులు
అనేక అంశాలు చోటుచేసుకున్నాయి. చుట్టూ ఉన్న సమాజంలోని చెడును సరిదిద్దవలసిన
సామాజిక బాధ్యతను సాహిత్యం స్వీకరించలేకపోయింది. కొందరికే పరిమితమైన,
గ్రాంథికభాషకు మాత్రమే, సాహిత్యగౌరవం కల్పించారు. ఆ కారణంగా సాహిత్యానిక
ప్రజలకు మధ్య గల దూరం చాలా పెరిగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గురజాడ
అన్నివిధాలా ముఖ్యంగా సమాజంలోనూ, సాహిత్యంలోనూ భాషలోనూ మార్పును
మనసారా కోరుకున్నారు. అదే గురజాడ తెలుగుజాతికి చేసిన మహోపకారం.