7.7 C
New York
Monday, November 25, 2024

యుగకర్త గురజాడ


ఆయన రచనల్ని విశాల దృక్పథంతో అధ్యయనం చేస్తే
మనకు తేటతెల్లమవుతుంది. ‘మతములన్నియు
మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న
దార్శనికుడు గురజాడ.
సమాజంలోని అన్ని అంశాల్ని ఒక రచయిత తన
రచనలో చెప్పలేడు. అలా చెప్పిన వాడు సృష్టి పుట్టిన
నుంచి ప్రపంచంలో లేడు. అది కుదరదు కూడా.
ఇప్పటికైనా మీ వితండవాదాన్ని విడిచిపెట్టి, మంచి
దృష్టితో విమర్శించడం అలవాటు చేసుకోండి. తీసుకున్న
ఇతివృత్తం బట్టి, ఏ పాత్రలు సమాజంనుంచి తీసుకోవాలి
అనే విషయాన్ని రచయిత ఆలోచిస్తాడు. మాకులం
గూర్చి చెప్పలేదు. మా మతం గూర్చి ఈ నాటకంలో
లేదు. మా వర్గాన్ని గూర్చి రచయిత కనీసమైనా
పట్టించుకోలేదు అనేవి అర్థం లేని మాటలు. ఈ విమర్శ
చర్చలో నిలవదు. ఆ దృష్టితో విమర్శ చేయడం తప్పు
కూడా. మీదు మిక్కిలి కువిమర్శ అవుతుంది.
అందరూ అన్ని విషయాలు రాయలేరు. కొన్ని
విషయాలు కొన్ని అంశాలు కొందరే రాయగలరు. ప్రతీ
రచయిత సమాజంలోని అన్ని అంశాల్ని తన గ్రంథంలో రాయలేదని విమర్శ చేయడం
అజ్ఞానానికి పరాకాష్ఠ. ఉదహరణకు గురజాడ, జాషువా గార్ల రచనలు తీసుకుందాం.
ఇద్దరూ సమాజంలో, పాతుకుపోయిన తీవ్రమైన సమస్యల్ని ముఖ్యంగా తమ సమాజంలో
ఒక కులంలో జరిగిన అన్యాయాల్ని, అక్రమాల్ని, మోసాల్ని, బాధల్ని ఎత్తిచూపారు. ఆ
సమాజం బాగుపడాలని కోరుకున్నారు. అంతేకాక సమాజంలోని అన్ని వర్గాలవారూ,
అన్ని కులాలవారు బాగుపడాలని మనసారా కోరుకున్నారు. ఆ ఇద్దరూ రచయితలు వాళ్ల
గ్రంథాల్ని వాళ్ళ కులాల దృష్టితో రాయలేదు. సామాజిక దృక్పథంతో రాశారు. విమర్శకులు
కూడా ఆ కోణంనుంచే అధ్యయనం చేయాలి. లేకపోతే కువిమర్శకులుగా సాహిత్యలోకంలో
మిగిలిపోతారు. సాహిత్య విమర్శను తప్పుదోవ పట్టించినవారు అవుతారు.
సామాజిక దృక్పథంతో కాకుండా, ప్రజలకు ప్రయోజనం లేకుండా ఊహా ప్రపంచంలో

తిరిగి, రచనలు చేసిన రాయప్రోలు సుబ్బారావు గారు కానీ, సాంఘిక ఉద్యమదృష్టితో
రచనలు చేసిన కందుకూరి వీరేశలింగంగారు కానీ, తమ సాహిత్య దీప్తితో జనాల్ని
ఉర్రూతలూగించిన తిరుపతి వేంకట కవులు కానీ, స్త్రీ సమస్యల్ని ఇతివృత్తంగా తీసికొని
రచనలు చేసిన చలంగారు కానీ, “ఈ శతాబ్దం నాది’’ అని సామ్యవాద సిద్ధాంతాల్ని తన
కవిత్వం ద్వారా వెల్లడించిన శ్రీశ్రీ గారు కానీ, ప్రాచీన సనాతన సంప్రదాయ భావాలతో
ఎన్నో సాహిత్య ప్రక్రియల్ని సృష్టించిన బహుగ్రంథ కర్త విశ్వనాథ సత్యనారాయణగారు
కానీ, ఇంకా మరి కొంతమంది కానీ – అందరూ గొప్ప కవులే, అందరూ గొప్ప రచయితలే.
అందరి రచనలు విశిష్టమైనవే. ఇందులో వాదోపవాదాలు లేవు. ఈ విషయంలో చర్చేలేదు.
అందరిదీ ఒక్కటే మాట. అయితే తెలుగు సాహిత్యానికి సామాజిక చైతన్య దీప్తినీ, నవ్య
తేజస్సునూ వాడుక భాషా సొగసుల్ని కలుగజేసిన మహానుభావుడు, మహాకవి, మేధావి,
మార్గదర్శి అప్పారావుగారు. అంతేకాక ప్రముఖ సాహిత్య చరిత్రకారులు, సుప్రసిద్ధ
విమర్శకులు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినట్లు మార్గదర్శకుడైన మహాకవి
మాత్రమే యుగకర్త అవుతాడు. అంచేత ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త
గురజాడవారే అనే విషయం విస్పష్టం.
ఆధార గ్రంథాలు :
ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు – ప్రయోగాలు – సి.నారాయణరెడ్డి
మహాకవి, మహాపురుషుడు – గురజాడ అప్పారావు – సెట్టి ఈశ్వరరావు
మహోదయం – కె.వి. రమణారెడ్డి
కన్యాశుల్కం – నూరేళ్ళ సమాలోచనం – విశాలాంధ్ర
మన గురజాడ – శ్రీశ్రీ
గురజాడ గురుపీఠం – ఆరుద్ర
కన్యాశుల్కం – నాటక కళ – సర్దేశాయి తిరుమలరావు
తెలుగు సాహిత్య చరిత్ర – వెలమల సిమ్మన్న
తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు – వెలమల సిమ్మన్న
యుగకర్త గురజాడ (అముద్రితం) – వెలమల సిమ్మన్న
గురజాడ జయంతి సంచికలు
గురజాడ వర్ధంతి వేడుకలు
గురజాడ ప్రత్యేక సంచికలు
దిన, వార, పక్ష, మాస పత్రికలు
*ఈ వ్యాసం 2018 లో రాసినది.

3.7/5 - (4 votes)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles