అంకాలు పెంచారు. పాత్రలు పెరిగాయి అనేది ఒక విమర్శ. కన్యాశుల్కంలో
బాలవితంతు సమస్య ఎలా ముడిపడి వుందో, నిరూపించే ఉద్దేశంతోనే, వితంతువులు
వేశ్యా సమస్యల వైపు ఎలా బలవంతంగా లాగబడుతున్నారో, వేశ్యా సమస్య అన్ని
వర్గాలపైన, అన్ని వర్ణాలపైన, అన్ని వృత్తులపైన ఎలా ప్రభావం చూపుతుందో, సంఘ
సంస్కరణోద్యమంలో ఈ సమస్య పరిష్కారం ఎందుకు కాలేదో ఇలా అన్ని విషయాల్ని
విపులంగా వివరంగా లోతుగా చెప్పాలని అనుకున్నారు గురజాడవారు. అందుకే అంకాలు
పెంచారు. పాత్రలు కూడా పెరిగాయి.
నాటకంలో మధురవాణి ప్రసంగాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి అనేది ఒక
విమర్శ. కావాలనే మధురవాణి పాత్రను గురజాడ పోషించారు. తొలికూర్పులో కన్నా,
రెండో కూర్పులో మధురవాణి పాత్రను పెంచి రాశారు. ‘సదుద్దేశంతోనే మధురవాణి
పాత్రను పోషించాను’ అని గురజాడగారే చెప్పారు.
ఈ నాటకంలో ప్రాచీన నాటక లక్షణాలు లేవు అనేది ఒక విమర్శ. అసలు విషయం
ఏమంటే గురజాడ వారు ఈ నాటకాన్ని ప్రాచీన నాటక లక్షణాల్ని దృష్టిలో పెట్టుకుని
రాయలేదన్న విషయాన్ని మనం మరవరాదు. ఆధునిక కాలంలో పుంఖానుపుంఖాలుగా
వెలువడే నాటకాలకు ప్రత్యేకంగా నూత్న లక్షణాల్ని ఏర్పరచుకోవలసి వున్నది. కన్యాశుల్కం
నాటక విషయం కూడా ఇలాంటిదే. ఆధునిక నాటకాలకు ప్రాచీన నాటక లక్షణాలు
అన్వయించవు.
ఆంగ్ల భాషాపదాలు నాటకంలో ఎక్కువగా వున్నాయి అనేది ఒక విమర్శ. గురజాడ
ఆంగ్ల పదాలు వాడారు. ఇందులో వాడిన ఆంగ్ల పదాలు తెలుగువారి నిత్య జీవితంలో
సమ్మిళితమై పోయిన పదాలే అన్న విషయాన్ని విమర్శలు గమనించాలి.
కన్యాశుల్కం నాటకం ద్వారా నాటకకర్త ఏమీ సాధించలేకపోయారు అనే వాళ్ళు కూడా
వున్నారు. ఇది విచారించదగ్గ విషయం. ఏమీ సాధించకపోతే వందలసార్లు నాటకం
ప్రదర్శనకు ఎలా నోచుకుంటుంది. అసలు ప్రజలు ఎందుకు చూస్తున్నారు. ఆ గ్రంథం
అన్నిసార్లు ఎందుకు ముద్రణకు నోచుకుంది. విమర్శకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి.
కావాలని రంధ్రాన్వేషణ చేస్తే అది విమర్శ అన్పించుకోదు. కువిమర్శ అవుతుంది.
విమర్శకులు ఒక గ్రంథాన్ని విమర్శించదలచకుంటే వాళ్ళ కోణంలో నుంచి కాక రచయిత
ఏ దృష్టితో ఆ రచన చేశాడో ముందు తెలుసుకోవాలి. ఆ కోణం నుంచే ఆ గ్రంథాన్ని
విమర్శించాలి. గురజాడ ఈ నాటకంద్వారా సాహిత్య ప్రయోజనాన్ని, భాషా ప్రయోజనాన్ని
సాధించారు. ఈ నాటకం ద్వారా ఏ ప్రయోజనం కనబడలేదంటే మీరు అవివేకులు.
ఇప్పటికైనా గురజాడ రచనల్ని ఆ కాలం నాటి సామాజిక దృక్పథంతో తులనాత్మకంగా
అధ్యయనం చేయాలి.
కన్యాశుల్కం ఒక వర్గానికి సంబంధించి ముఖ్యంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు
చెందిన నాటకమని ఒక విమర్శ సాహిత్య లోకంలో బలంగా వుంది. కాబట్టి ఇతర వర్గాల
వారు, ఇతర కులాల వారు ఈ నాటకం చదవవలసిన అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఈ
సమాజంలో వున్నారు. ఇది నూటికి నూరుపాళ్ళు అవగాహన లేనివాళ్లు కావాలని,
పనికట్టుకుని, బురద జల్లాలని చేసే కువిమర్శ ఇది. ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని
మన కళ్ళముందు వుంచడానికి నాటకకర్త వివిధ పాత్రలతో మన ముందుకు వచ్చారు.
అంతేకానీ ఈ నాటకం ఒక వర్గానికో, మతానికో, కులానికో, కొంతమంది అనుకున్నట్లు
వ్యక్తులకో, సంబంధించినది కాదు. గురజాడవారు వీటన్నింటికీ అతీతుడు. ఈ విషయం