శ్రీశ్రీ రచనల్ని, గురజాడ రచనల్ని తులనాత్మకంగా అధ్యయనం చేస్తే గురజాడ
చనిపోయి ఇప్పటికి నూట మూడు* సంవత్సరాలు అయింది. అయినా గురజాడ రచనలు
నిత్యనూతనంగా వున్నాయి. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ రచనలకు ప్రజాదరణ వుంది.
శ్రీశ్రీ రచనలకు అంత ప్రజాదరణ లేదు. అదే గురజాడ రచనల్లోని గొప్పతనం విశిష్టత
కూడా. సామాజిక సహృదయ ప్రేక్షకుల హృదయాల్ని శ్రీశ్రీ కన్నా గురజాడే ఎక్కువ
దోచుకున్నారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే శ్రీశ్రీ కన్నా గురజాడ అంటే ఎక్కువమందికి
తెలుసు.
గురజాడని – శ్రీశ్రీని వాళ్ళ వాళ్ళ రచనలతో కానీ,
వ్యక్తిత్వంతో కానీ, ఇంకా అనేక ముఖ్యమైన అంశాలతో
పోల్చి చూస్తే ఆధునిక తెలుగు సాహిత్య యుగకర్త
గురజాడే అవుతారు. ఇందులో ఎవరికీ ఏమీ
అనుమానాలు, వగైరాలు అక్కరలేదు. అందుకే
కొడవటిగంటి కుటుంబరావుగారు ‘ఆనాడు అప్పారావు
లేకపోతే ఈనాడు శ్రీశ్రీ వుండరు’ అనే సత్యాన్ని ఎప్పుడో
తేల్చి చెప్పారు.
శ్రీశ్రీని యుగకర్తగా అనేవాళ్ళు ఒక విషయాన్ని
జాగ్రత్తగా గమనించాలి. శ్రీశ్రీ కూడా గురజాడ చైతన్యం
నుంచి వచ్చిన వారే. శ్రీశ్రీ కూడా గురజాడ ప్రభావానికి
లోనయినవారే. ఈ విషయం శ్రీశ్రీ గారే చెప్పారు.
ప్రభావితుడు, ప్రభావం చేసిన వాడికి నాయకుడూ,
అధినాయకుడూ, సమ ఉజ్జీ కాడు, కాలేడు. యుగకర్త
అసలే కాలేడు. ఇది చరిత్ర చెపుతున్న పచ్చి నిజం.
విమర్శ – పరామర్శ :
కన్యాశుల్కం నాటకంలోని ఇతివృత్తం, పాత్రలు, రసం, నాటక లక్షణాలు, నాటక
ప్రయోజనం, భాష మున్నగు విషయాలపై విమర్శలు చాలా వచ్చాయి. నాటకంలోని
ఇతివృత్తానికి శాశ్వతం లేదన్నది ఒక విమర్శ. ఈ నాటకంలోని పాత్రలు సమాజంలో
కన్పిస్తున్నాయి. ఈనాటికి కూడా గురజాడ పాత్రలు సజీవంగా వున్నాయి. అందుకు
గిరీశం, రామప్పపంతులు, భీమారావు, నాయుడు, బైరాగి పాత్రలు మంచి ఉదహరణంగా
మనం తీసుకోవచ్చు. కన్యాశుల్కంలోని వున్నది హాస్యం కాదని మునిమాణిక్యం గారు
విమర్శించారు. దానికి ఘాటైన సమాధానం పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఇచ్చారు.
‘ఒక కాంతం పాత్రను సృష్టించినందుకే మునిమాణిక్యం వారు తెలుగు వారి కృతజ్ఞతకు
పాత్రులైనారు కదా! కన్యాశుల్కంలో కోటి సూర్యకాంతులున్నవి. కన్యాశుల్కంలో ఏమీ
లేకపోయినట్లయితే వీరేశలింగం గారి ప్రహసనాలు, గ్రాంథిక వర విక్రయం, పానుగంటి
వారి కంఠాభరణం లాగా ఏనాడో ప్రజల మధ్య లేక, రెండు అట్టల మధ్యనే జీవించి
వుండలేదని’ తీవ్రంగా ప్రతి విమర్శ చేశారు.