గురజాడ – శ్రీశ్రీ :
శ్రీశ్రీని యుగకర్తగా పేర్కొన్నవారు చాలామంది
వున్నారు. గురజాడపై సాధికారికంగా రాసిన మొదటి
వ్యక్తి శ్రీశ్రీ యే. గురజాడను తెలుగువారికి సమగ్రంగా
పరిచయం చేసిన వ్యక్రి శ్రీశ్రీయే. గురజాడపై చక్కని
అంచనా వేసింది కూడా శ్రీశ్రీయే. గురజాడ ఆధిక్యానికి
కారణాలు శ్రీశ్రీ వివరించారు కూడా. అంతేకాదు
‘నవ్యసాహిత్య జనకుడు’ అని గురజాడని
అభివర్ణించాడు. అక్కడితో ఆగక ‘ఆయన రోడ్డువేస్తే ఆ
మార్గాన్ని తాను వెడల్పు చేశాను’ అని శ్రీశ్రీ
చెప్పుకున్నారు. ‘అడుగుజాడ గురజాడది. అది భావికి
బాట’ అని శ్రీశ్రీ బల్ల గుద్ది మరీ చెప్పాడు. ‘గురజాడ
మార్గమే తన మార్గం’ అని చెప్పిన శ్రీశ్రీ కూడా
గురజాడలా ప్రజల భాషలో కవిత్వం
రాయలేకపోయినందుకు బాధపడ్దాడు. అంతేకాదు
‘నాకు గురువు గురజాడ’ అని శ్రీశ్రీ అన్నారు.
అలాంటప్పుడు ఎవరు ఆధునిక తెలుగు సాహిత్యానికి
యుగకర్త అవుతారో మనం నిర్ధారించవచ్చు. ఇక్కడ
చర్చకు తావు లేదు.
అసలు విషయం ఏమంటే గురజాడ తర్వాత రెండు దశాబ్దాలకు ‘మహా ప్రస్థానం’
వచ్చింది. శ్రీశ్రీ ముందు భావకవి, తర్వాత అభ్యుదయ కవి, తదనంతరం విప్లవ కవి. శ్రీశ్రీ
వర్గకవి. ఉద్యమకవి. ఉద్యమ కవిత్వం ఎప్పుడూ పరిమిత కాలనికి సంబంధించినదిగా
ఉంటుంది. ఈ విషయాన్ని మనం మరిచిపోకూడదు.
భావాలపరంగా తన కాలానికి గురజాడ సాంఘిక దార్శనికుడు. తన కాలానికి శ్రీశ్రీ
కవిత్వం పూర్తిగా నూటికి నూరుపాళ్ళు విప్లవ సందేశాత్మకం. సామాజిక అంశాల్లో
గురజాడను, శ్రీశ్రీ ని పోల్చలేం. ఎందుకంటే ప్రధానంగా వర్గ చైతన్యమే శ్రీశ్రీ కవిత్వానికి
దిక్సూచి. గురజాడది సామాజిక చైతన్యం. వర్గచైతన్యం పరిమితం. సామాజిక చైతన్యం
విస్తృతం.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు