7.7 C
New York
Monday, November 25, 2024

యుగకర్త గురజాడ


వస్తువులో, పాత్ర చిత్రణా నైపుణ్యంలో, భాషలో, హాస్య చతురతలో, వ్యంగ్యస్ఫూర్తిలో
సహృదయ పాఠకుల, ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న నాటకం కన్యాశుల్కం. అందుకే
ఈ నాటకం గొప్పది అయింది. ఇందులోని పాత్రలు సమాజంలో వున్నారు. అంచేత
గురజాడ సృష్టించిన పాత్రల్ని సమాజంలోని పాత్రల్ని సరిపోల్చి చెబుతూ మురిసిపోయే
చాలా ఎక్కువమంది ఇప్పటికీ వున్నారు. గురజాడ వారి కన్యాశుల్కాన్ని అంతకు ముందు
వచ్చిన కందుకూరి వారి ‘బ్రహ్మవివాహం’ ప్రహసనంతో పోలుస్తూ ఇతివృత్తపరంగా వున్న
పోలికలను వెదికేవారు గ్రహించవలసిన సత్యం ఇది.
‘వీరేశలింగం గారు ‘బ్రహ్మ వివాహం’ లో ఆనాటి బ్రాహ్మణుల పెళ్ళిళ్ళకు
సంబంధించిన అంశాల్ని రాశారు. కేవలం అలవాట్లను, ఆచారాలను ఎద్దేవా చేసే
ప్రహసనం అది. కన్యాశుల్కం – బ్రహ్మవివాహం ఈ రెండింటి మధ్య సామ్యము లేదు.
విషయ ఆలోచన పూర్తిగా భిన్నమైంది. కన్యాశుల్కంలో హాస్యం, పాత్రల చిత్రీకరణ,
జటిలమైన ఒక కొత్త కథా సంవిధానం కోసం ప్రయత్నించాను’ అని అప్పారావు గారు
అన్నారు.
‘కందుకూరి వారు ప్రహసనాల్ని ముఖ్యంగా సాహిత్య విలువల కోసం కాక, ప్రచారం
కోసం, సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించి రాశారు. అందుచేత వీరేశలింగం
రచనలు సాహిత్యం సంబంధించి కాకుండా పోయాయి’ అని ప్రముఖ కథా రచయిత
చాగంటి సోమయాజులు (చా.సో) గారు అభిప్రాయపడ్డారు.
‘సంఘంలోని కుళ్ళును తూర్పారబట్టాలనే ఉద్దేశం ప్రధానంగా పెట్టుకొని అప్పట్లో
అప్పారావు గారే కాక వీరేశలింగం పంతులు గారు కూడా చాలా వ్యంగ్య రచనలు చేశారు.
కాని ప్రచార వేగం చేతనో, ఏమో, వారి రచనలో గురజాడ వారి రచనల నుండి తొంగిచూసే
మనోహరశిల్పం కానరాదు. అప్పారావు గారి రచనల్లో పదింతలు ఫలించిందనడానికి
లోకమే సాక్షి’ అని సుప్రసిద్ధ రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు తెలియజేశారు.
‘వీరేశలింగం పంతులుగారి సాహిత్యం, సంస్కరణ స్పృహకు అగ్రతాంబూలమిచ్చి,
సాహిత్య కళా స్పృహకు రెండో స్థానం ఇచ్చింది. గురజాడ వారి సాహిత్యం కళా దృష్టికి
మొదటి స్థానం ఇచ్చి, సంస్కరణ స్పృహకు రెండోస్థానం ఇచ్చింది. అందువల్ల నాటకం,
కవిత, కథ మొదలైన ప్రక్రియలు గురజాడ రచనల్లో కళాకేతనాన్ని సమున్నతంగా
స్థాపించుకున్నాయి’ అని విఖ్యాత విమర్శకులు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు అన్నారు.
మర్మం లేకుండా వున్నది వున్నట్లు చెప్పాలంటే కందుకూరివారు సంఘ సంస్కర్తగా
వేసినంతటి బలమైన ముద్ర సాహిత్యంపై వేయలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే
కందుకూరి చైతన్యం సాంఘిక చైతన్యమే కానీ, సాహిత్య చైతన్యం కాదు. అంచేత ఆధునిక
తెలుగు సాహిత్యానికి యుగకర్త వీరేశలింగం గారు కాజాలరు. గురజాడ రాసిన

కాలంలోనూ అంతకుముందు కూడా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిలాంటి ఉద్దండ పండితులు
ఎందరో వున్నారు. వారి రచనలు గొప్పవే వ్యక్తులు కూడా చెప్పుకోదగ్గవారే. అయితే
మనిషికి ప్రాముఖ్యం ఇచ్చి అతని హృదయ స్పందనకు ప్రాధాన్యం ఇచ్చే వాడే రేపటి
ప్రపంచానికి మార్గదర్శి కాగలుగుతాడు. గురజాడ మనకు ఇచ్చిన సందేశం కూడా ఇదే.
గురజాడ ముందు సాహిత్యానికీ, తర్వాత సాహిత్యానికీ మధ్య వున్న తేడా కూడా ఇదే.

3.7/5 - (4 votes)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles