గురజాడ, రాయప్రోలు ఇద్దరూ గొప్పవారే ఇద్దరూ ప్రముఖ సాహిత్యవేత్తలే. అయితే
ఒక యుగానికి ఇద్దరు యుగకర్తలు వుండరు కదా! వుండకూడదు కదా. కాబట్టి అన్ని
విషయాల్లోనూ కొత్తదనాన్ని, మార్పును కోరుకున్న గురజాడ అప్పారావుగారే యుగకర్త.
కాలంతో పాటు కొత్తదనాన్ని సంతరించుకొని, భావితరాలవారు అనుసరించడానికి
మార్గదర్శకులైన మహాకవులే యుగకర్తలవుతారు.
గురజాడ – కందుకూరి :
కందుకూరి వారు 1878లో రాజమండ్రిలో ‘సంఘ సంస్కర్త సమాజం’ను స్థాపించారు.
అంతేకాదు తన సంఘ సంస్కరణ ఉద్యమానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా
ఎంచుకున్నారు. అందుకే నవల, ప్రహసనం, నాటకం, మొదలైన సాహిత్య
ప్రక్రియలన్నింటిని ఈ లక్ష్యంతోనే రాశారు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనానికీ మధ్య
గల సంబంధాన్ని గ్రహించడంలో కందుకూరి వారి కృషి, చైతన్య స్ఫూర్తి చాలా గొప్పది.
మీదు మిక్కిలి విస్మరించరానిది.
వీరేశలింగం ఉద్దేశం వేరు. గురజాడ ఆలోచన వేరు. సంస్కరణల్లో జీవన విధానంలో
నిక్కచ్చిగా వున్న వారు కందుకూరి. రాజీపడని మనస్త ్వం కందుకూరిలో కన్పిస్తుంది.
ఆయన రచనలో శిల్పం, భాషాసొగసులు, సాహిత్యపు విలువలు, కళాదృష్టి ఇవి పెద్దగా
కనబడవు. కందుకూరి ఆ దృష్టితో రచనలు చేయలేదు. సంఘసంస్కరణకు, సాహిత్యాన్ని
ఒక ప్రచార సాధనంగా ఉపయోగించుకున్నారు. గురజాడ దీనికి పూర్తిగా భిన్నంగా
నడిచాడు. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిపూర్ణమైన మానవజీవితాన్ని చాలా చక్కగా
చిత్రీకరించి ఆవిష్కరించారు.
కందుకూరిది ఉద్యమదృష్టి గురజాడది మేధోదృష్టి. కందుకూరి సత్యవాది. గురజాడ
వాస్తవికవాది. అందుకే తాను సృష్టించిన అన్ని పాత్రల స్వభావాలూ, సమాజంలోని
మనుషులుగా సజీవంగా కన్పిస్తారు. సంఘంలోని మనుషుల్లో ఎలా మంచి చెడులు
వుంటాయో, గురజాడ సృష్టించిన పాత్రల్లో కూడా అలా కనబడతారు. గురజాడ వారిలా
కందుకూరి వారు వాడుక భాషలో రచనలు రాయలేకపోయారు.
గురజాడ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, కళా, సాహిత్యాది రంగాల్ని వివేచన చేశారు.
వీరు వ్యక్తిగత ద్వేషంతో కాకుండా, వస్తు నిర్దేశిత దృష్టితో మాత్రమే విషయాన్ని నిశితంగా
విశ్లేషణ చేశారు. ఆ విమర్శలో చిన్నయసూరిని, కందుకూరిని కూడ వదలలేదు.
‘కందుకూరివారు చిన్నయసూరి గారిని మించి పోవాలని’ అనుకుంటున్నారు అని భాషా
విషయంలో వ్యంగ్యంగా మాటలాడారు. ఆ తర్వాత కందుకూరివారు పూర్తిగా మారిపోయి
‘నీతిచంద్రిక’ ‘మిత్రలాభం’లోని గ్రాంథిక భాషను విడిచిపెట్టి వాడుక భాషలోకి వచ్చారు.
కందుకూరి సాంఘిక పోరాటం కోసం సాహిత్యాన్ని మాధ్యమంగా
ఉపయోగించుకున్నారు. ఆయన ప్రధాన దృష్టి సాంఘిక చైతన్యమే. గురజాడ రచనలో
వున్న సాహిత్యపు విలువలు, కందుకూరిలో కనబడవు. గురజాడది సంస్కరణ దృష్టితో
పాటు, భాషా దృష్టి, కళాత్మక సాహిత్య దృష్టి కూడా. గురజాడ ప్రజల్ని ప్రేమించడమే కాదు,
ప్రజలభాషను కూడా ప్రేమించారు. అందుకే గురజాడ ఎవరికీ అందనంత ఎత్తుకు
ఎదిగారు.