భోగిమంటలు
(భారతి 1945సంచిక 1,Vol 22 నుండి)
శర్వరీనీలకేశపాశమ్మునుండి
జారిపడె కోటితారకాకోరకములు;
ఉదయశైలకోటీరరత్నోజ్జ్వలముగ
మెరసె తరుణభాస్కరశోణకిరణచయము.
పాతాళమ్ముననుండి భువనసౌభాగ్యంబు దర్శింపగా
నేతెంచున్ బలి నేడె, పండుగయు నేడే భోగి యం చూరకే
మ్రోతల్వెట్టుచు తేనెలూరు మధుపమ్ముల్ రేగె నెత్తావితో
వీతెంచెన్ పవనమ్ము; క్రొవ్విరులతో విప్పారె నారామముల్.
అపుడు-బలిరాజు పాలించినపుడు -గడప
గడప – నూత్నతోరణముగా, ఎడద నెడద
నిత్యకల్యాణముగ నయ్యె; నేడు మరల
వచ్చు బలిరాజు; బ్రదుకులే విచ్చునేమొ!
అలరుచు గేహదేహళులయందు రసాలకిసాలతోరణ
మ్ములు సవరింపుడీ! ఎడద పొంగగ ప్రాంగణసీమ రంగవ
ల్లులు రచియింపుడీ! బ్రదుకులోవలె వీథులవెంట భోగిమం
టలు వెలిగింపుడీ! పుడమినాలుగుమూల లలంకరింపుడీ!
ప్రాతవై పాడుపడినవై రోతలైన
బ్రతుకులన్ని కాలగ, సుందరములు నూత
నములు వాసంతయువజీవితములు వెలుగ,
కూడి భోగిమంటలు రగుల్కొ ల్పుడయ్య!