పద్య సౌరభం
-సాహిత్య ప్రకాశిక
తెలుగుసాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. శతకాల్లోని కొన్ని పద్యాలనూ అందులో ఉన్న మర్మాలనూ మనం క్రమంగా పరిచయం చేసుకుందాం. సాధారణంగా మనకు జీవితంలో వివిధ మనస్తత్వాలు
కలిగిన వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందులో కొందరు సన్నిహితులు అవుతారు. కొందరు కేవలం పరిచయస్థులుగా ఉండిపోతారు. కొందరితో ఆత్మీయాను బంధాలు పెనవేసుకుంటాయి. ఎవరిని మనం ఏ స్థాయిలో స్వీకరించాము అన్నది అనేకానేక కారణాలతో ముడివడి
ఉంటుంది. ఒక్కొక్కమారు మన అనుకున్న మనకు ఉపకారం చేసేవాళ్లే తెలిసియో తెలియకయో లేదా మనo కొంత బలహీనులం అయినప్పుడో మనకు అపకారం చేస్తారు. ఇది అందరికీ అనుభవంలో ఉండేదే!! ఈ అంశానికి సంబంధించిన ఒక పద్యం చూద్దాం.
బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
బలము తొలంగెనేని తనపాలిటి శత్రు,వదెట్లు పూర్ణుడై
జ్వలనుడుకానగాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగుపట్టుననార్పడె గాలి భాస్కరా!!
(మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం)
గాలీ అగ్నీ మంచి స్నేహితులు. అగ్నిని వాయుసారథి అంటారు మనవాళ్ళు.
ఎందుకంటే వాయువు మొయ్యకపోతే అగ్ని ఎక్కడికీ కదలలేదు. అడవిలో కార్చిచ్చు
రూపంలో ఉన్న అగ్నికి వాయువు తోడైతే జరిగే నష్టం అంతాఇంతా కాదు. అగ్నికి
వాయువు తోడైనట్లు అంటూ ఉంటాం కదా!! కానీ అదే అగ్ని చిన్న దీపంగా ఉన్నప్పుడు
అదే వాయువు చిత్రంగా దాన్ని ఆర్పేస్తుంది. చిన్న దీపం అనే అగ్నిని నిల్వనివ్వదు.
కొండెక్కిస్తుంది. ఇదే భాస్కర శతకంలో ప్రస్తావిస్తూ లోకరీతిని తెలియపరుస్తాడు.
విశేషం:
ఒక సామాన్య విషయాన్ని ఒక విశేష విషయంతో సమర్థించి చెప్పడం కవిత్వంలో
ఒక అందం. అంతేకాదు మనకు సూటిగా అర్థమవుతుంది. మనంబలహీనులం
అయితే –అది మానసికమో శారీరకమో లేదా ఆర్థికమో అది ఎలా అయినా-
అప్పటిదాకా మన పక్కనున్నవాడే అపకారం చేయడానికీ వెనుదీయడు. కొందరు
స్థిరంగా కష్టంలోనూ మనతో పాలుపంచుకుంటూ మనతోనే ఉంటారు. అదే వైవిధ్యం.
ఇదే విషయాన్ని అగ్నీ వాయువుల స్నేహoతో కవి పోల్చిచెప్పడం వల్ల మనకు స్పష్టమైన
అవగాహన వస్తుంది.
ఇంక ఆధునిక శతకాల్లో ఒకటి అయిన ఈ వ్యాస రచయిత చక్రవర్తి రచించిన
మంచిమాటను ఒకదాన్ని చూద్దాం.
తేటగీతి: నిన్ను శక్తిమంతునిగ మన్నించువారి,
యెంచిసాహాయ్యులై, ప్రోత్సహించువారి,
మెచ్చి,యెదుగగ, ప్రేరణనిచ్చువారి
మధ్యనున్న- సౌఖ్యము,శాంతి సాధ్యమగును.
మన చుట్టూ ఎటువంటి వారు ఉంటే మన మనుగడ ఆనందంగా గడుస్తుందో
ఇందులో ఉంది.మనను ఒక శక్తిగా, సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ మనకు ప్రేరణగా
నిలిచేవారి మధ్యన మనం ఉంటే మనo హాయిగా శాంతిగా బతకగలుగుతాం. కనుక
అవి అన్నీ ఎవరిద్వారా మనకు లభిస్తాయో వారే మనకూ, మనసుకూ ఆనందకారకులు.
వారి సాంగత్యం వీడరాదు.
తెలుగుసాహిత్యంలో మరకతమణులు – తిక్కనభారతంలోని ఒక పద్యం:
ఒరులేయవియొనరించిన
నరవర!యప్రియము తన మనంబునకగు దా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథములకెల్లన్
పరిమాణంలో చిన్నపద్యం. కానీ అనంత విశాలభావం.సాహిత్యలక్ష్యాల్లో
హితప్రబోధం ఒకటి. సందర్భందొరికినప్పుడల్లా కవి తన కవిత్వంలో ఒక లోకోపయోగ ధర్మాన్ని ప్రస్తావనా వశంగా చెప్తాడు.
ఇతరులు ఏమిచేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో మనకు తెలుసు. తెలుసు
కనుక అదే చెడు పనిని మనం చెయ్యకూడదు. ఎందుకని? దానివల్ల ఎదుటివాళ్ళు
కష్టపడతారు కనుక ! ఆ అమానవీయ కృత్యాలను మనమెందుకు చెయ్యాలి?? మనకు
కష్టం కలిగింది కనుక ఇతరులకూ అదే కష్టాన్ని కలిగించాలనుకోడం దుర్జనుల
లక్షణం. ఆ బలహీనతను జయించి, మంచిని కాపాడాలి.ఒక చెంపపై కొడితే. నువ్వు
తిరిగి కొట్టకు. రెండో చెంపకూడా చూపించు అన్న గాoధీ మాటకు ఇదే మూలం.
అయితే కాలం మారింది. ఇప్పుడు ఆ రెండో చెంపనూ వాయించిపోతారేమో!!అనేటట్టు
ఉంది పరిస్థితి.
భావరసాత్మకమైన ఆధునిక పద్యాల్లో కవికోకిల గుఱ్ఱం జాషువా గారి పద్య
సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం.
తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు తూగుటు
య్యేలగృహంబు, మానవుల కేరికి సాధ్యముగాదు, దానిలో
జాలరు, లందులోజిలుగుశయ్యలు నంతిపురంబులొప్పగా
మేలు!భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాడ! నీడజా!!
(జాషువా గారి ‘గిజిగాడు’ ఖండికలోని పద్యం)
ప్రకృతి సౌందర్య చిత్రణ, మనకు కళ్ళముందు కనిపించే దృశ్యానికి అందమైన
వ్యాఖ్యానం. మనం లోకంలో చిన్న జీవులనీ పెద్ద ప్రాణులనీ వింగడించుకుంటూ
ఉంటాం. మళ్ళీ మనమే సృష్టిలో దేవుని దృష్టిలో చిన్నా పెద్దా లేదు అనుకుంటూ
ఉంటాం. చిన్న అని మనమనుకునే జీవుల్లో ఎంత అద్భుత శక్తులు ఉన్నాయో జాషువా
కవి ఇందులో చెప్తారు గిజిగాడు పిట్టను వర్ణిస్తూ. దీన్నే కొన్నిచోట్ల బంగారు పిచ్చుక
అంటారు. ఊళ్లలో ఈ చిన్నపిట్ట చెట్లకు అందమైన గూళ్లను వెళ్ళాడదీసి నివాసం
ఉంటాయి. ఆ గూళ్ళు గాలికి ఊగుతూ ఉంటాయి. అది పైకి మనకు కనిపించేది.
ఖర్చులేని తేలికైన గడ్డిపోచలు నిర్మాణ సామగ్రి. కూలీలూ మేస్త్రీలూలేని గిజిగాడు
నిర్మాణ కౌశలం.. అంతే !! డబ్బు ప్రస్తావన లేనే లేదు. ఆ గూటిలోపల ఎన్నో గదులు
ఉంటాయిట. ఆ గదుల్లో మెరిసే పడకలు ఉంటాయట. అంతఃపురాలూ ఉంటాయట.
అలాటి నిర్మాణం ఏ మనుషులూ చేయలేరు అంటూ నిజానికి ఈ గిజిగాడే పక్షుల
రాజు(పులుంగుటెకిమీడు)అంటాడు కవి జాషువా!!పులుంగుఅంటే పక్షి, ఎకిమీడు
అంటే ప్రభువు అని అర్థం. కవి ప్రత్యేకత ఏమంటే మనం నిత్యం చూచే వస్తువులనే
నూతనంగా చెప్పడం! అందుకే కవికి సూక్ష్మ పరిశీలన ఉండాలి. నవనవోన్మేష ప్రతిభ
ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ కవిత్వం పదికాలాలపాటు నిలుస్తుంది.