పల్లవి : చిత్తరువని చూడ జిత్తము గొంటిని
చిత్తజునపరంజి – చిలుక యెవ్వతెవే
అనుపల్లవి : వత్తువా నా మ్రోల – వలరాజువేడిన
మత్తకాశిని నీదు – మనమైననీగదె
చరణములు :
- ఇచ్చిపుచ్చుకొంట – యిలలోని మర్యాద
ముచ్చిలిమౌనము – మెచ్చుదురట, లే
వచ్చి చూచినంత – వంచన జేయుదె
పచ్చి దొంగతనము – పడతిరొ పరువె - మనసులేని తనువు – మరియేలనే నాకు
చెనటిదీనిగూడ -చేకొన దగవె
వానికి బదులొక్క వాక్కు నే వేడెద
మానిని యీపాటి మన్నింపజెల్లునె. - విలువచాలదన్న విరివిల్తు పైనాన
కలుగు జన్మముల – గానుకకొనవే
ఎలమినానందేంద్రునేలిన వెన్నుడు
పలుతెఱుగుల మేలు – పడతినీకిచ్చునె’
-నాయికకు, అపరంజి చిలుకకు జరిగిన సంభాషణ ఈ పాటలో ఉంది. చిత్తరువని
చూడాలని నాయిక మనసు పడిన నాయిక మన్మథుని బంగారు చిలుకా యెవ్వతెవే అని
ప్రశ్నించి, వలరాజు కోరుకొంటే నా సమీపం లోనికి వస్తావా? కనీసం నీ మనసైనా
ఇస్తావా? అని చిలక అడిగింది. ‘ఇచ్చిపుచ్చుకోవటం ఈ లోకంలో మర్యాద; అనే ప్రబోధం
బాగుంది. మనసులేని తనువు వల్ల ప్రయోజనం లేదన్న మాట కూడా సముచితంగా ఉంది.
వెన్నుని దీవెనల్ని కూడా చిలుక నాయికకు అందించింది.
గురజాడ నీలగిరి పాటల్ని గమనించినప్పుడు ఇవి రాగ తాళబద్ధంగా రచించబడ్డాయి.
కాబట్టి గురజాడకు సంగీత జ్జానం ఉన్నదని మనం అంగీకరించక తప్పదు. ప్రతిపాట
పల్లవి, అనుపల్లవులతో సాగింది. అచ్చతెనుగు పదాలను ఎక్కువగా ఈ పాటల్లో
ప్రయోగించి గురజాడ శ్రావ్యతను సంతరింపచేశారు. 1862వ సంవత్సరం సెప్టెంబరు
21వ తేదీన జన్మించిన గురజాడ 1915వ సంవత్సరం నవంబరు 30వ తేదీన మరణించినా
ఆయన రచనల ద్వారా శాశ్వతంగా వెలుగొందుతున్నారని చెప్పటం సముచితం.