మాటురా, నీ యోటుమాటె
కోటిధనములిచ్చికొందు
-చమత్కారపూరితమైన భాషణతో సాగిన ఈ పాటలో నాటిమాటను మరిచిపోవటం
సాధ్యం కాదని స్త్రీ పురుషుల మధ్య సాగిన సంభాషణ ఉంది. ‘నీవే ప్రాణమని, ముమ్మాటికీ
నిను విడువనని పలికిన బోటితో మిత్రుడు పలికినప్పుడు మాట తప్పటం పొరపాటేనని
బోటి ఒప్పుకొంది. గురజాడ ఈ గేయంలో భాషకు సంబంధించిన అద్భుతమైన భావాన్ని
పొందుపరిచారు. బ్రతుకులో స్థిరత్వం లేదు కాబట్టి భాషలో స్థిరత్వాన్ని వెదకవలసిన
అవసరం లేదన్నారు. అంటే భాష స్థిరంగా ఉండదని కాలాన్ని బట్టి మారుతుందని,
మారాలని గురజాడ భావం. రెండవ చరణంలో తప్ప, పల్లవి, అనుపల్లవి, మిగిలిన
చరణాల్లోని ‘ట’కార ప్రాస వీనుల విందుగా ఉంది.
లేవొకోమంత్రములు : గురజాడ లేఖిని నుంచి వెలువడ్డ మరోపాట ఇది. లేమగా
చెయ్యటానికి మంత్రాలు లేవా అని అడుగుతున్న తీరులో చమత్కారంగా సాగిన పాట ఇది.
శంకరాభరణం రాగంలో, ఝంపతాళంలో ఈ పాట సాగింది.
1.లేవొకో మంత్రములు – లేమగా – జేయనిను
లావపుడు బయలుబడునొక్కొ
కావనుచు నీలాటి – కాంతునకుజిక్కి నీ
భావముల నలయికను బడుదొ.
2. మంచియును చెడ్డయును మానమును గనుక పటు
వంచనను పరకాంతదగిలి
యించుకయినను లోకమెంచునని భీతిలక
కొంచెతన మూనుటది కొమరో.
3. మగడవై పగతీర్చు పగతుడవుకాకనిది
తగునటర తలపోయకుంట
మిగిలినది లేదురిక మీద నిను నమ్మనా
నగధరుని నమ్మెదను లేరా
ఒక స్త్రీ పలుకుల్లో ఈ పాట సాగింది. తనకాంతుని లేమగా మార్చటానికి మంత్రాలు
లేవా అని పలికిన కాంత పలుకులీ గేయంలో ఉన్నాయి. తన కాంతుని లేమగా మారిస్తే
అప్పుడతని బలం బయటపడుతుందని పలికింది. పరకాంత పట్లవ్యామోహాన్ని కలిగి
ఉండటం తగదని హెచ్చరించంది. ప్రియుని నమ్ముకోవడం కంటే నగధరుని
నమ్ముకోవటానికి కాంత నిశ్చయించుకోవటం ఈ పాటలోని కొసమెరుఱుపు.
చిత్తరువని చూడ : రాగము – శంకరాభరణము, తాళము – మిశ్రజాతిచాపు గురజాడ
రచించిన నీలిగిరి పాటల్లో ఇది చివరిది.