6.1 C
New York
Monday, November 25, 2024

నవయుగాల బాట – నార్ల మాట

నవయుగాల బాట – నార్ల మాట

సాహిత్య ప్రకాశిక

తెలుగు సంపాదక శిఖరం నార్లవెంకటేశ్వరరావు.
నిజానికి సంపాదకుడు అనే మాట ఆయనకు ఇష్టం
ఉండదు. అందులో సంపాదన శబ్దం ధ్వనించడం వల్ల
కాబోలు.ఎడిటర్ అనే పదమే ఆయనకు ఇష్టం.ముట్నూరి కృష్ణారావు,ఖాసా
సుబ్బారావు తర్వాత తరంలో అంతటి ప్రభావం చూపించినవారు నార్ల తప్ప ఇంకొకరు లేరు. ఇంగ్లిష్ లో వీ.ఆర్ నార్లగా ప్రసిద్ధులు. నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ వంటి దిగ్దంత పాత్రికేయులపై కూడా వీరి ప్రభావం ఉంది. కేవలం ఒక ఎడిటర్ కోసమే ఒక వార్తాపత్రికను స్థాపించడం వీరి విషయంలోనే జరిగింది.
బహుశా! అంతటి గౌరవం పొందిన ఏకైక పాత్రికేయుడు నార్ల. ఆంధ్రప్రభతో
మనస్పర్థలు వచ్చినప్పుడు కేవలం నార్ల గురించి కె ఎల్ ఎన్ ప్రసాద్ వంటి పెద్దలు
“ఆంధ్రజ్యోతి”ని స్థాపించారు. అప్పటికే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ తెలుగునాట ఒక
వెలుగు వెలుగుతున్నప్పటికీ, ఆంధ్రజ్యోతి స్థాపనతో కొత్త వెలుగులు వెలిగించిన ఘనత
నార్లవారిదే. సుత్తి లేకుండా సూటిగా చెప్పడం ఆయన నైజం. చిన్న చిన్న వాక్యాలలోనే

అత్యంత శక్తివంతంగా భావ ప్రకటన చేసే ఒరవడి ఈయన సొత్తు. మానవత్వం, హేతువాదం నీడలలో తాను నడుస్తూ సమాజాన్ని నడిపే ప్రయత్నం చేశారు. పత్రికా భాషలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వాడుకభాషకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ శైలి వల్ల తెలుగు పత్రికా లోకంలో
పాఠకులు బాగా పెరిగారు.

అదే సమయంలో సందర్భోచితంగా విలువైన శబ్దాలు వాడేవారు. నార్ల కేవలం పాత్రికేయుడు కాదు, సాహిత్యజీవి. అందుకే అక్షరాన్ని అందంగాఒడిసిపట్టుకునేవారు. ఎడిటర్ గా పత్రికలో బహుముఖంగా విహరించినట్లే, సాహిత్య సృష్టిలోనూ సృజనశీలంగా నార్ల బహుముఖీనంగా ప్రయాణం చేశారు.

నాటికలు, కథలు, కవితలు, పద్యాలు, వివిధ దేశాల చరిత్రలు, చారిత్రక పురుషుల
జీవన చిత్రాలు పుంఖానుపుంఖంగా రాశారు. సవ్యసాచిలా అటు ఇంగ్లిష్ లోనూ
సమప్రతిభ చూపించారు.ఎంత గొప్ప రచయితో, అంత గొప్ప చదువరి కూడా. ఆయన
సొంత లైబ్రరీలో వేల పుస్తకాలు ఉండేవి. అవన్నీ అలంకార ప్రాయంగా కాక, ప్రతి పుట
చదివినవే.ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ కంటే ముందు స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర
మొదలైన పత్రికల్లో అక్షరాలకు పదునుపెట్టి, పత్రికల శక్తి అంటే ఏమిటో లోకానికి
చూపించారు. మూడు దశాబ్దాలకు పైగా ఎడిటర్ గా శిఖర సమానుడిగా ఖ్యాతికెక్కారు.
సంపాదక రచనలో వీరిదే పైచేయి. పత్రికకు దర్పణంగా చెప్పుకునే సంపాదకీయాల
స్థాయిని హిమవత్ పర్వత శిఖరంపై కూర్చోబెట్టిన ఘనత వీరిదే. కేవలం నార్లవారి
సంపాదకీయాల కోసమే పత్రికలు చదివేవారంటే- అది నార్లవారికే చెల్లింది. ఆ
అక్షరాలు, ఆ పదాలు సరికొత్త ఆలోచనలకు జీవం పోసేవి. తాను చెప్పాలనుకున్నది
నిర్భీతిగా, నిర్మొహమాటంగా చెప్పేవారు. కలంయోధుడు అనే మాట అక్షరాలా నార్లకు
సరిపోతుంది. తాను నమ్మిన సిద్ధాంతాలను, వ్యతిరేకించిన అంశాలను, అభిమానించిన
విషయాలను ఒక క్యాంపెయిన్ లాగా నడిపేవారు. సి.రాజగోపాలాచారిని కాంగ్రెస్
శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని మహాత్మాగాంధీ నిర్ణయించినప్పుడు దానికి
వ్యతిరేకంగా పత్రికా ముఖంగా క్యాంపెయిన్ నడిపారు. ఆంధ్రప్రభను నిషేధించిన
సమయంలోనూ, రజాకార్లదురాగతాలపైన అక్షరయుద్ధం ప్రకటించారు.
కత్తి కంటే కలం శక్తివంతమైందని నార్ల అక్షరాలు అడుగడుగునా నిరూపిస్తాయి.
మూఢ నమ్మకాలు, ఛాందస చాదస్తాలను నిలువెల్లా విమర్శించారు.”తెలుగు
పత్రికారచనలో వాడినీ, వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత కారం ఉందో
తెలియజెప్పినవాడు నార్ల” అంటూ గోరాశాస్త్రి కితాబు ఇచ్చారు.”విరామమెరుగని
రాక్షసుడు నార్ల “ అని ఖాసా సుబ్బారావు అనేవారు. పత్రికల ద్వారా వ్యావహారిక భాషా
ఉద్యమానికి ఊపిరిలూదినవారు నార్ల వెంకటేశ్వరరావు.ఆంధ్రప్రభపై సెన్సార్
విధించినప్పుడు పత్రిక మొదట పేజీ మొత్తం నల్లరంగు పులిమి తన నిరసనను ఘాటుగా
ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా
క్యాంపెయిన్ నడిపిన ప్రత్యేకత నార్లవారిదే. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన
ఘనత కూడా నార్లవారిదే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాంస్కృతిక
వ్యవహారాల సలహాదారుడుగా ఉన్నారు. అకాడెమీలు రద్దు చేయడం మొదలైన
సలహాలు వీరివే.కొందరి పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా, విషయం వచ్చేసరికి
తీవ్రంగా విభేదించేవారు.టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కళా
వెంకటరావు, ఎన్ జి రంగా, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలైన పెద్దలందరూ నార్ల
కలంపోటుకు గురైనవారే. తేడా వస్తే, పతాక శీర్షికల్లో ధ్వజమెత్తేవారు. అంతటి
ధైర్యశాలి. మొదట్లో ఎం ఎన్ రాయిని గుర్తించలేదు.ఆయన విలువ తెలుసుకున్న

తర్వాత, వారి రచనలన్నీ చదివి, ఎం ఎన్ రాయికి
పెద్ద అభిమానిగా మారిపోయారు. విశ్వనాథ
సత్యనారాయణకు, నార్లకు అస్సలు పడేది కాదు.
విశ్వనాథ పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉండేది కానీ,
ఆయన భావాలు ఏ మాత్రం నచ్చేవి కాదు.
ఇందిరాగాంధీ పట్ల కూడా వ్యతిరేక భావంతో
ఉండేవారు. కుటుంబ వారసత్వ రాజకీయాల పట్ల
విముఖంగా ఉండేవారు. బౌద్ధం పట్ల ప్రత్యేకమైన
ఆకర్షణ ఉండేది. చిత్ర, శిల్ప కళలంటే చాలా ఇష్టం.
పత్రికా రంగంలో నార్లవారి ప్రభావం ప్రత్యక్షంగా
కొందరిపైన, పరోక్షంగా ఎందరిపైనో ఉంది.కృష్ణాజిల్లా కాటూరు వీరి మూల పురుషుల గ్రామం.1908డిసెంబర్ 1వ తేదీనాడు జబల్ పూర్ లో జన్మించిన నార్ల ఫిబ్రవరి 15వ తేదీ 1985లో మరణించారు.మద్దూరి అన్నపూర్ణయ్య “ కాంగ్రెస్ “ అనే పత్రికను నడిపేవారు. స్వరాజ్యాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానంతో ఉత్తేజితుడై, కాంగ్రెస్ పత్రికకు 1927లో ఉత్తరం రాశాడు. ఇదే నార్లవారి మొదటి రచన.1928లో
వ్యాసం రాశారు. ఇదే వీరి తొలి వ్యాసం. ఉపేంద్ర, నరేంద్ర అనే పేర్లతో వ్యాసాలు
రాస్తుండేవారు.చిన్న చిన్న ఉద్యోగాలు ప్రయత్నించినా పెద్దగా ఉపయోగపడలేదు.
విజయవాడ నుంచి వచ్చే “ప్రజామత”లో వ్యాసాలు రాసినందుకు 5 రూపాయలు
చొప్పున ఇచ్చేవారు.దీన్నే మొదటి ఆదాయంగా భావించాలి.భారతి పత్రికలో రాసిన
వ్యాసానికి అప్పటి సంపాదకులు గన్నవరపు సుబ్బరామయ్య 25రూపాయల
పారితోషికం ఇచ్చారు. అది ఆ కాలంలో చాలా పెద్ద మొత్తం. ఈ గౌరవానికి నార్లవారి
తల్లి ఎంతో మురిసిపోయారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య నడిపే ఇంగ్లిష్ పత్రిక
“జన్మభూమి”కి, కృష్ణాపత్రికకు కూడా నార్లవ్యాసాలు రాసేవారు. ప్రభ, స్వతంత్ర
భారత్ మొదలైనవాటికి కూడా రాసేవారు. బందరు నుంచి వచ్చే “జ్యోతి” పత్రికకు
తొలిసారిగా సంపాదకుడుగా పనిచేశారు. ఇదే ఆ పత్రిక తొలి సంచిక కూడా.
ఇంగ్లిష్ జర్నలిజం పట్ల నార్లవారికి మక్కువ ఎక్కువ ఉండేది. దీని గురించే మద్రాస్
వెళ్లారు. ఇండియన్ ఎక్సప్రెస్ లో చేరడానికి ప్రయత్నించారు, కానీ రాలేదు.జస్టిస్
పత్రికలో అవకాశం వచ్చినా ఎక్కువకాలం ఉండలేకపోయారు. టంగుటూరి ప్రకాశం
పంతులు స్థాపించిన “స్వరాజ్య” పత్రికలో చేరి, వివిధ శాఖల్లో పనిచేసి చాలా
మెలుకువలు నేర్చుకున్నారు. ఇది ఒక శిక్షణలా ఆయనకు ఎంతో ఉపయోగపడింది.
ప్రూఫ్ రీడింగ్ నుంచి ఎడిటింగ్ దాకా ఆన్నీ అక్కడే నేర్చుకున్నారు.ఆ పత్రిక
మూసివేయడంతో మళ్ళీ వెతుకులాట ప్రారంభమైంది.1938లో తన 30వ ఏట
రామనాథ్ గోయంకా తెలుగులో స్థాపించిన “ ఆంధ్రప్రభ”లో న్యూస్ ఎడిటర్ గా చేరారు. అప్పటి నుంచి పాత్రికేయ వృత్తిలో స్థిరపడిపోయారు. ఖాసా సుబ్బారావు,
నారాయణమూర్తి సంపాదకులుగా తప్పుకున్న తర్వాత,1942లో ఆంధ్రప్రభ
సంపాదకుడిగా బాధ్యతలు తీసుకొని గొప్ప ఒరవడి సృష్టించారు. కమ్యూనిస్టులు
ఓడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నార్లవారి సంపాదకీయాలే ప్రధాన పాత్ర
పోషించాయని చెబుతారు. అదీ నార్లవారి కలంబలం. గోయంకాతో విభేదాలు
రావడంతో బయటకు వచ్చారు.కె ఎల్ ఎన్ ప్రసాద్, నార్ల అభిమానులు కలసి కేవలం
నార్లవెంకటేశ్వరరావు కోసం ఆంధ్రజ్యోతిని 1960 జులై 1వ తేదీన స్థాపించారు. అదీ
నార్లవారిగొప్పదనం. ఇటువంటి ఘనత చరిత్రలో ఎవ్వరికీ దక్కలేదనే చెప్పాలి. స్త్రీలకు,
వ్యవసాయదారులకు ప్రత్యేక శీర్షికలు నడిపారు. గ్రామీణవార్తలు ప్రత్యేకంగా
ప్రచురించేవారు. కళలు, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి పెద్దపీట వేశారు. పుస్తక
సమీక్షలు ప్రవేశపెట్టారు. పుస్తక సమీక్షలను కూడా సంపాదకీయాలుగా రాశారు.ఈ
సంస్కృతికి శ్రీకారం చుట్టింది కూడా వీరే. వీటిని ఇంగ్లిష్ లో కూడా అనువాదం
చేయించేవారు. దీనివల్ల ఎందరో తెలుగు రచయితలకు జాతీయ స్థాయిలో పేరు
ప్రఖ్యాతులు వచ్చేవి.1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీని తీవ్రంగా
వ్యతిరేకించారు. సంజయ్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతిస్తూ
ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచికను తెచ్చింది. ఈ విధానాలన్నీ నచ్చక, సంపాదకుడుగా
రాజీనామా చేశారు. మరి కొన్ని నెలల్లో బయటకు వచ్చేశారు.
నార్లవారి పాత్రికేయ జీవితాన్ని పరిశీలిస్తే, తనకు నచ్చని సంఘటనలు జరిగితే,
తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆత్మగౌరవం,
సిద్ధాంతం పట్ల గౌరవంగా వీటిని భావించాలి. గాంధీ, నెహ్రూ, బెర్నార్డ్ షా, గురజాడ,
కందుకూరి, వేమన, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి- నార్లకు ఇష్టమైన
రచయితలు. ఎన్నో విదేశీ పర్యటనలు కూడా చేశారు.తన రచనా జీవితంలో అనేక కొత్త
పదాలను సృష్టించారు.ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని
నాగేశ్వరరావుపంతులు అంటే నార్లవారికి అమితమైన గౌరవం. నేడు జర్నలిజం ఇంత
అభివృద్ధి చెందిందంటే, తెలుగులో ఇన్ని పత్రికలు వచ్చాయంటే, అంతా
కాశీనాథునివారి చలువ అని చెప్పేవారు.నార్లవారు మెరుపు వేగంతో రాసేవారు. కదిలే
విజ్ఞాన భాండాగారం నార్ల.జర్నలిజం ప్రపంచంలో నార్ల వినూత్న విరాట్ స్వరూపం.
పత్రికా రచనకు ఆధునికతను అద్దిన సృజనశీలి, దార్శనికుడు. రాగద్వేషాలకు లోబడి
జీవించినా.. సత్యానికి, ప్రతిభకు పెద్దపీట వేసిన మానవతావాది. తెలుగు పత్రికా
ప్రస్థానంలో నార్ల యుగకర్త. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పెద్దపత్రికలకు పెద్దదిక్కుగా
నిలిచిన తేజోమయుడు.నార్లవెంకటేశ్వరరావు వంటివారు న భూతో న భవిష్యతి.
(ఫిబ్రవరి 15వ తేదీ నార్లవారి వర్ధంతి సందర్భంగా అక్షరాంజలి)


4/5 - (1 vote)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles