8.4 C
New York
Monday, November 25, 2024

దిద్దుబాటు

తొలి కథ

దిద్దుబాటు

‘తలుపు! తలుపు!’
తలుపు తెరవలేదు.
గదిలో గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది.
‘ఎంత ఆలస్యం చేస్తిని? బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా వుంటాను.
యాంటినాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమై పోయినది. ఒక్కపాట
సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదక్కూడా మనసు పరుగెత్తుతూంది. లేకుంటే, నేను
పోకిరి మనిషివలె పాట ముగిసినదాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశము
కలగజేసికొని దానితో నాలుగుమాటలు ఆడడపు ఆసక్తి ఏమిటి? యిదుగో, లెంపల

వాయించుకుంటున్నాను. రేపట్నుంచి మరి
పాటకు వెళ్ళితే వొట్టు – (వొట్టువేసుకోరాదు.
అదో నియమం వొచ్చింది కదూ) మరి వెళ్ళను,
నిశ్చయం, నిశ్చయం. గట్టిగాగాని
పిలిస్తినట్టాయనా, కమలిని లేవగలదు. మెల్లిగా
తలుపు తట్టి రాముణ్ని లేపగలిగితినా చడీ
చప్పుడూ లేకుండా పక్కజేరి పెద్దమనిషి
వేషము వెయ్యవచ్చు.
గోపాల్రావు తలుపు చేతనంటగానే, రెక్క
విడబారింది. ‘అరే యిదేమి చెప్మా!’ అనుకొని
తలుపు మెల్లిగ తెరిచేసరికి, నడవలో దీపం
లేదు. నాలుగిళ్ళ వాకిలి దాటి, పడకగది
తలుపు తీసిచూస్తే దాన్లోనూ దీపం లేదు.
చడీచప్పుడూ లేకుండా అడుగువేస్తూ
మంచము దరికిపోయి, కమలిని మేలుకొని వున్నదా, నిద్రించుతున్నదా అని కనిపెట్ట
ప్రయత్నించెనుగాని, యేర్పరించ లేకపోయినాడు. బల్లమీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల
వెలిగించాడు. మంచం మీద కమలిని లేదు. నిశ్చేష్టుడైపోయినాడు. చేతినుంచి అగ్గిపుల్ల
రాలింది. గదినీ, అతని మనస్సునూ చీకటి కమ్మింది. వెఱ్ఱి శంకలూ, అంతకు వెఱ్ఱి
సమాధానాలూ మనసున పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలగజేశాయి. బుద్ధి తక్కువ పని
చేసినందుకు తనయందో, కానరామికి కమలినియందో యేర్పరింపరాని కోపావేశం
కలిగింది. నట్టి వాకిట వచ్చి నిలబడ్డాడు. చుక్కల కాంతిని నౌకరుగానీ, దాసీగానీ
కానరాలేదు.
తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి, గది నలుముఖాలా పరికించి చూశాడు. కమలిని
ఎక్కడా కానరాలేదు. వీధి గుమ్మం దగ్గిరికి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి, వీధి నడుమ
చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రావుడు కనపడ్డాడు! ‘రామా!’
అని గోపాల్రావు పిలిచాడు. రావుడి గుండె జల్లుమంది. నోట్లో చుట్ట జారి కిందపడ్డది.
‘రా వెధవా!’
కాలీడ్చుకుంటూ రావుడు దగ్గర కొచ్చాడు.
‘మీ అమ్మేదిరా?”
‘మా యమ్మా బాబూ? మా కొంపలున్నాది’
‘నీ అమ్మకాదురా! బుద్ధిహీనుడా! నా భార్యరా’
ఆ మాటతో రావుడికి మతిపోయింది. ఆలోచించుకుని అన్నాడు.
‘ఎక్కడుంటారు బాబూ? అమ్మగోరు గదిలో తొంగున్నారు బాబూ!’
‘యింట్లో ఎక్కడా లేదురా, వెధవ! యిల్లు విడిచి నువ్వెక్కడికి పోయినావురా?”

రావుడు మొహం ఓరజేసుకుని
‘నౌఖరోడికి కాల్నొస్తుంది, కడుపు
నొస్తుంది, బాబూ. పెద్దయ్యోరు మరీ
మరీ అప్పసెప్పి ఎల్లినారు గందా,
అమ్మగారి నొక్కర్నీ ఒగ్గేసి నిసి
రాత్రేళ సానమ్మగారి-’
రావుడి వీపుమీద రెండు వీశ
గుద్దులు పడ్డాయి.
‘సంపేసినారు బాబూ’ అని
రావుడు నేల కూలబడ్డాడు.
గోపాలరావు దయగలవాడు.
వెంటనే కోపం దిగజారి,
పశ్చాత్తాపం కలిగింది. రాముడ్ని
చేత లేవనెత్తి, వీపు నిమిరి,”కోపం
పట్టలేక పశువువలె ఆచరిస్తిని’
అనుకుంటూ గదిలోకి
తీసుకువెళ్ళాడు.
కుర్చీమీద తాను కూచుని ‘రామా ఏమాయెరా!’ యని దైన్యంతోటి అన్నాడు.
రావుడు యీ తట్టూ, ఆ తట్టూ చూసి.
‘ఏటో మాయలా వుంది, బాబూ’ అన్నాడు.
‘పుట్టింటిగ్గానీ వెళ్ళి వుండునా?”
‘అంతోరు కారనా, బాబూ? కోపగించితే నెప్పజాల్నుగానీ, ఆడోరు సదువుకుంటే,
ఏటౌతది బాబూ?”
‘విద్య విలువ నీకేం తెలుసురా రామా!’ అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆన్చి ఆ
నడుమ శిరస్సువుంచి తలపోస్తూ వున్నంతలో ముద్దులొలికే కమలిని చేవ్రాలున
వుత్తరవొకటి బల్లమీద కనపడ్డది. పైకి చదివాడు;
‘అయ్యా!’
‘ప్రియుడా!’ పోయి ‘అయ్యా’ కాడికి వొచ్చిందా?”
‘పెయ్యపోయిందా బాబూ?”
‘మూర్ఖుడా! వూరుకో!’
‘అయ్యా! పది దినములాయె రాత్రులనింటికి మీ రాకయే నేనెరుగను. మీటింగులకు
బోవుచుంటిమంటిరి. లోకోపకారమునకై నుద్యమముల నిదురమాని చేయుచుంటి
మంటిరి. మా చెలుల వలన నిజము నేర్చితిని. నేనింట నుండుటను గదా మీరు కల్లలు

పలుకవలసి వచ్చెను. నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు
అవకాశము కలుగకుండును. మీచే దినదినమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు
అడ్డుగ నుండకుండుటయే, పతి మేలుకోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి
కన్నవారింటికి జనియెద. సంతసింపుడు. వెచ్చముగాక ఏపాటి మిగిలియున్న
దయనుంచుడు’
‘ఉత్తరం ముగించి ‘నేను పశువును’ అని గోపాల్రావు అనుకున్నాడు.
‘అదేమిటి బాబూ, అలా శలవిస్తారు?”
‘శుద్ధ పశువును’
రావుడు అతిప్రయత్నంచే నవ్వు ఆపుకొనెను.
‘గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు, నా చెడుబుద్ధికి తగిన శాస్తి చేసింది’
‘అమ్మగారేటి సేసినారు బాబూ!’
‘‘పుట్టింటికి వెళ్ళిపోయింది – గాని, నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా?”
రావుడు రెండడుగులు వెనక్కివేసి, “నాను తొంగున్నాను కావాల బాబు! అలిగితే
సెప్పసాల్నుగాని బాబు, ఆడదాయి సెప్పకుండా పుట్టినోరింటికి ఎల్తానంటేలెంపలోయించి
కూకోబెట్టాలిగాని మొగోర్లాగా రాతలూ, కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా, బాబూ?”
‘ఓరి మూర్ఖుడా! భగవంతుడికి సృష్టిలోకల్లా ఉత్కృష్టమయిన వస్తువు విద్యనేర్చిన స్త్రీ
రత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచి ఇచ్చాడు కాదా. ఇంగ్లీషువాడు భార్యను
‘బెటర్ హాఫ్’ అంటాడు. అనగా పెళ్ళాం మొగుడికన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?”
‘‘నాకే బోదకాదు బాబూ?” రావుడికి నవ్వు ఆచుకోవడం అసాధ్యం కావచ్చింది.
‘నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ
వాళ్ళ కంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వొచ్చిందో చూడు. ఆ మాట అలా వుణ్ణియ్యి
గాని, యిప్పుడు నువ్వో, నేనో వెంటనే బయల్దేరి చెంద్రవరం వెళ్ళాలి? నే వెళ్దానికి శెలవు
దొరకదు. నువ్వు తాతలనాటి నౌఖరివి. నీమీద కమలినికి యిష్టం. గనక నువ్వే వెళ్ళడం
మంచిది. వెళ్ళి కమలిని పిలుచుకురా’
‘శలవైతే యెల్నా, యెలతాను. ఆర్రానంటే-’
‘యింద పదిరూపాయలు. బతిమాలి తీసుకొస్తివట్టాయనా, మరి పది
రూపాయలిస్తాను.’
‘సిత్తం’
‘అయితే, యేవిటి చెప్పాలో తెలుసునా?”
‘యేటా, బాబూ? సెప్పకుండా లేసి రావడం మా మంచి పని సేసినారమ్మా. బాబు నా
యీపు పగలేసినారు. రండి రండమ్మా అని సెప్తాను’
‘నన్ను క్షమించి దెబ్బల మాట మరిచిపో. కమలినితో ఎన్నడూ దెబ్బల మాట
చెప్పబోకు. ఈ మాట జ్ఞాపకం వుంచుకుంటావు గదా?”

‘సిత్తం’
‘నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో, చెబుతాను బాగా చెవొగ్గి విను. పంతులికి
బుద్ధివొచ్చిందను…’
‘అదేటి బాబు!’
‘నీకెందుకు? నే అన్నమాట గట్టిగా జ్ఞాపకం వుంచుకుని చెప్పు. పంతులికి బుద్ధి
వొచ్చింది అను. మరి ఎన్నడూ సానుల పాట వినరు. గట్టివొట్టువేసుకున్నారు. (మరచి
పోయి అన్నాను; ఆ మాట అనకు) యిటుపైని ఎన్నడూ, రాత్రిళ్ళు యిల్లు కదలరు. ఇది
ఖరారు. తెసిందా?”
రావుడు తల వూపాడు.
‘ఇంకా ఏవిటంటే, గెడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు. దయదల్చి
పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు. (ఇది ముఖ్యమైన మాట. విన్నావా?) రెండు
మూడు రోజుల్లో తప్పకుండా వెళ్ళిపోయి రమ్మన్నారు. మీరు దగ్గర లేకపోవడంచేత
వెఱ్ఱెత్తినట్టున్నారు. గడియో యేడు లాగ గడుపుతున్నారు. (యీ మాట మరవగలవు
జాగర్త) యేం చెప్పాలో తెలిసింది గదా? ఒక్కమాటైనా మరచిపోకు’
‘తెలిసింది బాబూ’
‘యేం చెబుతావో నాకోమాటు చెప్ప’
రావుడు తల గోక్కుంటూ, “యేటా – యేటా – అదంత నాకేం తెల్దు బాబూ.
నేనంతాను… అమ్మా నామాటినుకోండి. కాలం గడిపినోణ్ణి – పిన్నల్ని సూసినాను. పెద్దల్ని
సూసినాను యిన్నారా? ఆడోరు యజమాని సెప్పినట్టల్లా యిని వల్లకుండాలి. లేకుంటే, పెద్ద
పంతులార్లాగ, సిన్న పంతులోరు కూడా సెడిపోతారు. మీ శెవుల్లో మాట. పట్టంలోకి
బంగారం బొమ్మలాంటి సానమ్మవొచ్చింది. ఆ సానెమ్మోర్ని సూసినకాణ్ణుంచీ పంతులు
మనసు, మనసులా లేదు. నా మాటిని రండి. లేకుంటే మీ సిత్తం, అంతాను’
‘ఓరి వెధవా!’ అని గోపాలుడు కోపంతో కుర్చీమీంచి వురికాడు.
తప్పించుకుని రావుడు వూసలాగ గదిపైకి దాటాడు.
అంతలో మంచం కింద నుంచి అమృతం వొలికే కలకల నవ్వూ, మనోహరియైన
నూపురముల రొద విననయ్యెను.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles