గురజాడ తాను చేపట్టిన ప్రతి ప్రక్రియనూ
ఆధునీకరించారు, సామాజీకరించాడు, సమకాలీనం
చేశాడు. ప్రయోగం, సాంఘిక ప్రయోజనం రెండూ
సాధించాడు.
‘చిన్నకథ’ అప్పారావు మానసిక పుత్రిక అన్నాడు
రమణారెడ్డి. దీని ఆంతర్యమే ‘దిద్దుబాటు’! చదువుకుంటే స్త్రీ
చెడిపోతుందనుకుంటున్న రోజుల్లో – చదువుకున్న స్త్రీ తన
సొంత తెలివితేటలతో, స్వాభిమానంతో – దాంపత్యాన్నీ,
కుటుంబాన్నీ కాపాడుకోగలదనే సందేశాన్నిచ్చిన కథానిక ‘దిద్దుబాటు’. ఆధునిక స్త్రీలు
మానవచరిత్రను తిరిగిరాస్తారన్న గురజాడ నిబద్ధతకు ప్రారంభసూచి ఈ కథానిక.
కమలిని వేశ్యాలోలుడైన భర్తని చాకచక్యంగా, సేవకునితో కలిసి చిన్న నాటకమాడి,
భర్తకు కనువిప్పు కలిగించి అతన్ని దారికి తెచ్చుకుంది. అంతే ఇతివృత్తం!
శిల్పపరంగా కథానికకు కావలసిన ఐక్యత, క్లుప్త , ఎత్తుగడ (సరాసరి కథానికలోనికి
ప్రవేశించటం), ఉత్కంఠ, కథనం, నడక, పట్టు, విడుపు, ముగింపు – అన్న అన్ని లక్షణాలూ
సౌష్టవంగా, పొందికగా కుదిరిన ఆధునిక కథ ’దిద్దుబాటు’. ఇక శైలి వాడుక భాషా వాదిగా
గురజాడ తెలుగుజాతికి ఆనాటికి గల ఆ భాషలో రాసి చూపిన కథానిక ఇది. నిజానికి
ముందు కొంత శిష్టవ్యావహారికంలో ‘కమలిని’ పేర రాసి, దానిని తనకు తానుగా మార్చి
‘దిద్దుబాటు’ రూపాన్నిచ్చాడు.
గురజాడ ఆధునిక కథానికాశిల్ప పరిజ్ఞానానికీ, పరిణతికీ ఉదాహరణగా వెలువడిన
ఆణిముత్యం ఇది. నాటికీ, ఈనాటికీ, ఏనాటికీ – కథానికా రచనకు ‘నమూనా’ శైలీ శిల్ప
రూపం ఇది. తదనంతర రచయితల ప్రతిభ, ప్రజ్ఞ, ఉపజ్ఞల్ని బట్టి ఆ శైలీ శిల్పాల్ని మరింత
సానబెట్టుకుని పురోగమిస్తున్నారు.
1910 జనవరి, ఫిబ్రవరి ’ఆంధ్రభారతి’ పత్రికలో ప్రచురింపబడింది – ’దిద్దుబాటు’!
దిద్దుబాటు – పరిచయం
SourceAuthor - విహారి