అధికారం అన్నీ తీసికట్టేనని ( అలఘు రాజ్యము ప్రేమసంపద కలతి యని దలతున్ ) అని
రాజు చేతనే చెప్పించాడు.
ప్రేమంటే ఏమిటో, ఏది జీవితమో దానిని జీవించేవాడిని, ఏది దైవమో దానిని ఆరాధించే
వాడిని అడిగి తెలుసుకోవాలంటాడు షెల్లీ( On Love and Fragments by Percy
Bysshe Shelly -https://romantic -circles.org / editions/mws/
lastman/pbsfrags.htm) ప్రేమంటే ఏమిటో పూర్ణమ్మ గేయం(1912) చదివితే
అర్థం అవుతుంది. పూలతో, పండ్లతో, అవి ఇచ్చే సర్వ ప్రకృతితో, రుతువులు తెచ్చే
మార్పులతో స్నేహం చేసిన పూర్ణమ్మకు జీవితం విలువ తెలుసు. తండ్రికి ధనంతోనే
సంబంధం. దాని ముందు తాత వయసువాడికి బిడ్డనిచ్చి పెళ్ళిచేయటంలో న్యాయం
గురించిన చింతన గానీ, కన్నబిడ్డ బతుకు గురించిన దయ గానీ అతనికి లేకపోయింది. ఆ
పెళ్లి వల్ల లభించే జీవితం పూర్ణమ్మ దృష్టిలో విలువలేనిది. ఏది జీవితమొ అది జీవించటం
అంటే గుణాత్మకంగా జీవించటం. సార్థకంగా జీవించటం. అది అసంభవం అయినప్పుడు
జీవితం త్యజించటమే పూర్ణమ్మ ఎంపిక. “నలుగురు కూచుని నవ్వే వేళల / నా పేరొకతరి
తలవండి;/ మీమీ కన్నబిడ్డల నొకతెకు / ప్రేమను నా పేరివ్వండి/” అని అన్నదమ్ములను
సంబోధించి పూర్ణమ్మ చెప్పిన మాటలు జీవితాన్ని ఆమె ఎంత ప్రేమించిందో, దానిని
త్యజించటానికి ఎంత బాధను అనుభవించిందో చెపుతాయి. సంతోషంగా, సార్థకంగా
జీవించటానికి అవరోధంగా ఉన్న ధనం, జీవించే హక్కును భంగపరుస్తున్న దుష్ట
సంప్రదాయాలు మొత్తంగా జీవితాన్ని ప్రేమ రాహిత్యంలోకి నెడుతున్న స్థితిని చూపటం
ద్వారా గురజాడ సామాజిక సంస్కృతి లో, మానవ సంస్కారాలలో రావలసిన మహత్తరమైన
పరివర్తనను ఊహించాడు.
వ్యక్తి ప్రేమలు, కుటుంబ ప్రేమలు, అక్కడి నుండి దేశ ప్రేమ వరకు గురజాడ ప్రేమతత్వం
విస్తరించింది. ‘దేశమును ప్రేమించుమన్నా’ అన్న ప్రబోధగీతం (దేశభక్తి,1913)
గమనించవచ్చు. ఓర్వలేనితనం వదిలించుకొని ఒకరి మేలు తనకు మేలని ఎంచగల
మానవత్వం మేల్కొనాలని కలలు కన్నాడు. స్వార్థం కొంత తగ్గించుకొనటం, పొరుగువాడి
కి తోడ్పటం మానవత్వ వికాసనానికి ఊపిరులూదుతుందని భావించాడు. “దేశమంటే
మట్టికాదోయి/ దేశమంటే మనుషులోయి!” అని చెప్పటంద్వారా దేశభక్తి అంటే భౌగోళిక
సరిహద్దులు, జండావందనాలు, జైశ్రీరామ్లు కాదని, మనుషుల మధ్య సాధించబడ
వలసిన ఒక సామరస్యం అని గురజాడ సూచించినట్లయింది. వ్యక్తులుగా, కులాలుగా,
మతాలుగా విడిపోయిన మనుషుల మధ్య పరస్పర సానుభూతి, సహానుభూతి, స్నేహం
అభివృద్ధిచెందటానికి అనువైన వాతావరణాన్ని సిద్ధం చేయటమే దేశభక్తి అని ఆయన
భావించాడు. “దేశమనియెడి దొడ్డవృక్షం / ప్రేమలనుపూలెత్తవలెనోయి” అన్న గురజాడ
ఆకాంక్షకు వంద సంవత్సరాలు దాటాయి. దానిని వాస్తవీకరించటానికి సాహిత్యం దగ్గర
ఆగితే సరిపోదు. సాహిత్యం నుండి క్రియాశీల సామాజిక రాజకీయ కార్యాచరణ వైపు
కదలక తప్పదు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు