పుస్తకాన్ని అభివందనాలతో బహూకరించమని పరిచయస్థులైన మర్యాదస్తులు గ్రంథకర్తను
అర్థిస్తారు. దీనితో గ్రంథకర్త లాభం గూబల్లోకి వస్తుంది. అతని పని కుదేలు.’
గురజాడవారి లేఖలలో స్పృశించని అంశంలేదని భాషాకారులు వ్యాఖ్యానిస్తారు. వారు
రాసిన కొన్ని అక్షరరూపకాల పరిశీలనకు ప్రయత్నిద్దాం.
“నిత్య జీవిత కార్యకలాపాలలో గ్రాంథికభాషను వ్యవహరిస్తే ఎంత కృత్రిమంగా
వుంటుందో దానిని రంగభూమియందు ప్రయోగించినా అంత కృత్రిమంగానూ
వుంటుంది.’
“ఆధునిక స్త్రీరేపటి సమాజ చరిత్రను రచిస్తుంది.’’
“ఏనాడు బౌద్ధమతం భారతదేశంలో తుడిచిపెట్టబడిందో ఆనాడే భారతదేశం మత
విషయక ఆత్మహత్యను చేసుకుంది.’’
“కవితాన్యాయం నిన్నమొన్నటిలా నేడు లేదు. మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను.
చిత్రిస్తూ కళానైపుణ్యంతో ఆదర్శ పూరితం చేస్తానే అనుకో. కవితాకళకు నేను వొదిగి
ఉండవలసిన వాడినే. అయినా మానవ సమాజం పట్ల నాకొక మహత్తరమైన బాధ్యత
ఉంది. కనుక పాఠకులు నన్నొక ప్రశ్న అడగవచ్చును. నేను వొక దోషాన్ని, దుర్నడతను
ఆకర్షవంతం చేశానా? చేయలేదనే నేను భావిస్తున్నాను.’’ “కన్యాశుల్కం నాటకం పిలవని
పేరంటానికి మా అప్ప చీరె కట్టుకొస్తానని బయలుదేరి యేదో వొక నైతికోద్దేశాన్ని
ప్రత్యక్షంగా, బలవంతంగా నెత్తిన రుద్దదు. కానీ..దానికి మహత్తరమైన నైతిక ప్రయోజనం
ఉంది.’’
“సాంఘిక సంస్కరణోద్యమాన్ని పురోగమించడానికి నాటకరంగానికి తెలుగుభాష
నప్పదనే సామాన్య దురభి ప్రాయాన్ని పోగొట్టడానికే కన్యాశుల్కం నాటకం వ్రాశాను. వొక
ప్రయోజనాన్నికాంక్షించి,వొక మార్గాన్ని నిర్దేశించడం కోసం ఆ నాటకాన్ని వెలువరించాను.
రచయితలు ముఖ్యంగా నాటకకర్తలు తప్పుదారులు పట్టి, పట్టాలు తప్పి సాహిత్యకృషి
సల్పుతు న్నారని నేను గమనించాను.’’
ఇలా అసంఖ్యాకమైన, అతి విలువైన లేఖల ద్వారా నాటి సామాజిక స్థితిగతులతో పాటు
సమకాలీన భాషాసాహిత్యాలకు సంబంధించిన రసస్ఫోరకమై భావగర్భితమైన నిష్పాక్షిక
చర్చ కనిపించడం విశేషం. తనదైన భావజాలంతో ఉత్తర తరాల సాహితీస్రష్టలకు ఆదర్శ
ప్రాయుడు, ఆరాధ్యనీయుడుగా తెలుగునాట సమున్నత కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న
యుగకర్త గురజాడ వారి అడుగుజాడలు తరతరాలకు తరగని అమూల్య నిధులు.
ఆనాడు గురజాడ అప్పారాయ కవివరేణ్యులు విత్తిన సాహితీబీజం శాఖోపశాఖలై
విస్తరించిన మహావటవృక్షమై దశదిశలా వ్యాపించింది. ఆ మహత్తర తరుచ్ఛాయలో
పునీతులమవుదాం. తెలుగుభాష పునః ప్రాభవ సాధనకు పునరంకితమవుదాం.
అదే ఆ మహాకవికి మనమిచ్చే ఘన నివాళి.
జై తెలుగుభాష!
జై తెలుగుజాతి!