జరుగుతున్న కన్యాశుల్క పిచ్చి బాల్యవివాహం చేసుకునే ముసలివరుడి ఆగడాలను
అరికట్టడానికి, సాంఘిక దురాచారాన్ని మట్టుబెట్టడానికి నడుముకట్టి నిలిచాడు. కాటికి
కాళ్ళు చాచే వృద్ధులు కాసులిచ్చి కన్యల్ని వివాహమాడడం వో పెద్దసమస్యగా
మారిపోయిందనే భావనతో గొప్ప సాంఘిక నాటకంగా కన్యాశుల్కాన్ని తీర్చిదిద్దాడు. ఈ
నాటకంలో ఇతివృత్తం స్వీకరణ, హాస్యరసపోషణ, పాత్రలను పండించడంలోకాని,
భాషాప్రయోగపరంగా గానీ, సంభాషణల నిర్వహణగాని అద్భుతంగా మలచబడ్డాయి.
ముందు తరాలకు ఈ నాటకం కనువిప్పు కల్గించబట్టే కన్యాశుల్కం దురాచారం
అంతరించింది. వరకట్న దురాచారం దాని స్థానంలో ప్రవేశించింది. అది కొనసాగుతూనే
వుంది.
మొదట్లో గురజాడ సంప్రదాయ రీతిలో పద్యాలు, ఖండకావ్యాలు రాశాడు. తరువాత
పాతబాటలో కాకుండా కొత్తబాటలో కావ్యరచన చేయాలనుకున్నాడు. ముత్యాలసరాలు,
ఖండకావ్యంలో లవణరాజుకల, కన్యక, పూర్ణిమ, లంగరెత్తుము, డామన్ పితియస్,
దేశభక్తి గేయం, నీలగిరి పాటలు మొదలగు గొప్ప కవితలు రాశాడు. ఈయన కావ్యాలలో
కథానాయికలు సామాన్యులు, పేదవారలు.
ఇవాల్టి కవుల్లో ఆవేశబలం తప్ప అనుభూతిచిత్రణ అరుదు. వాదాల బలం తప్ప ఆ
వాదాలవెనుక దాగివున్న సామాజిక నేపధ్యం వివరణ శూన్యం. కాని గురజాడ కవిత్వంలో
నిసర్గమైన ఒక ఉద్వేగభావ శబలత నిజాయితీ కనిపిస్తుంది. ఈయన కవిత్వంలో మార్మికత
కంటే దార్శనికత గాఢంగా కనిపిస్తుంది. సామాజిక రుగ్మతలు రూపుమాపి సమాజాన్ని
చైతన్యవంతంగా తీర్చిదిద్దాలనేది ఈయన సాహిత్యంలో దాగివున్న ఆర్తి, ఆవేదన.
ఈ కవిపై ధనిక వర్గం ఒక నిఘాకన్ను వేసివున్నా, నిబద్ధత గల రచయితగా ప్రజాపక్షం
వహిస్తూ ‘పాతసంధులు పాతిపెట్టుము / యుద్ధముల కవి, ఉనికిపట్టులు’ అని
హెచ్చరించాడు. చదువుకున్న మేధావులే వెర్రిభ్రాంతులతో మూఢవిశ్వాసాలకులోనై వాటిని
వదిలించుకోలేరు అనే భావాన్ని చెప్తూ ‘చదువు వారికి వెర్రిభ్రాంతులు / మెదడుకెక్కిన
పాయవందురు / అదును లేదే దేనికైనను / అందరెరుగనిదే?’ అంటారు. హేతుబద్ధంగా
ఆలోచించినప్పుడే యథార్థమైన జ్ఞానసముపార్జన చేయవీలగుతుందని జ్ఞానసముపార్జన
ద్వారానే మానవజీవితం సుఖతరం, ప్రయోజనకరం అవుతుందని నమ్మినవాడు గురజాడ.
గేయకవితా ప్రస్థానానికి ప్రవర్తకుడు గురజాడ. ఆయన ముత్యాలసరం ఆధునిక
భావాలతో దార్శనికతతో తెలుగులో గేయకవిత్వ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈయన
గేయకవిత్వం సమాజపరమైన వేదనలను, రోదనలను బొమ్మకట్టించింది. గురజాడ
కవితాజాడల్లో ప్రేమతత్త్వాన్ని వివరిస్తూ ‘మగడువేల్పన పాతమాటది’ అన్న
అభ్యుదయపథగామి. గురజాడ. ‘ప్రేమనిచ్చిన ప్రేమవచ్చును / ప్రేమనిలిపిన ప్రేమ
నిలుచును’ అంటాడు. గురజాడ సాహిత్యం, దార్శనికత గల్గిన మానవతావాదం,
సంఘసంస్కరణ దృష్టి, తెలుగుదనం, దేశభక్తి, విశ్వమానవ ప్రేమ పుష్కలంగా కలిగి
తెలుగు ఆధునిక కవిత్వానికి దిశానిర్దేశం చేసేది దిక్సూచిగా పేర్కొనవచ్చును.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు