సోదరభావంతో మెలగవలయును అంటూ ‘చెట్టాపట్టాల్ పట్టుకొని / దేశస్థులంతా
నడవవలెనోయి / అన్నదమ్ములవలెను జాతులు / మతములన్నీ మెలగవలెనోయి’ అని
ప్రబోధిస్తాడు.
‘నా కులానికి నా మతానికి మాత్రమే దేశభక్తి ఉంది. మేం దేశభక్తికి పేటెంట్ హక్కు
గలవారమని విర్రవీగవద్దు. వొట్టి గొప్పలు చెప్పవద్దు. ఒక్క మంచి పని జనానికి చేసి
చూపెట్టు’ అంటూ దార్శనిక దృష్టితో మనుషులు ఏవిధంగా ఉండాలో సూచిస్తాడు కవి.
‘దేశాభిమానం నాకు కద్దని / వొట్టి గొప్పలు చెప్పుకోకోయి / పూని యేదైనాను
వొకమేల్ / కూర్చి జనులకు చూపవోయి’ అంటూ తోటివారికి సహాయపడాలి అంటే నీ
స్వార్థాన్ని కొంత విడిచిపెట్టాలి. దేశాన్ని మట్టిగా కాకుండా మనుషులుగా చూడడం
నేర్చుకోవాలి.
‘స్వంతలాభం కొంతమానుకు / పొరుగువాడికి
తోడు పడవోయి / దేశమంటే మట్టికాదోయి /
దేశమంటే మనుషులోయి’ అంటారు.
మతం వొక మత్తుమందు. ఇది యెన్నో
నిజాల్ని దాచి పరమత సహనాన్ని కోల్పోయే
విధంగా మనిషిని మారుస్తుంది. ఏ మతమైన
మానవ జీవితాన్ని కోరాలి. ‘మతం వేరైతేను
యేమోయి? / మనసులొకటై మనుషులుంటే
/ జాతమన్నది లేచి పెరిగి / లోకమున
రాణించునోయి’ అప్పుడే మానవ సమాజం
ఉన్నతస్థితికి వస్తుంది. మనిషి ఏవిధంగా తన
సుఖసంతోషాలను జారవిడుచుకుంటాడో, తనకు ఏవిధంగా మేలు జరుగుతుందో చెప్తూ
‘పరుల కలిమికి పొర్లి యేడ్చే / పాపికెక్కడ సుఖం కద్దోయి? / ఒకరి మేల్ తనమేలనెంచే
/ నేర్పరికి మేల్ కొల్లలోయి’ అంటారు.
మానవునిలో చైతన్యం కలిగించి కార్యోన్ముఖుణ్ణి చేయువాడే నిజమైన కవి.
సోమరితనంతో ఏది పట్టనట్టువుంటే, దేశప్రగతికి భంగం కలుగుతుందనే దార్శనిక
హెచ్చరిక ఎలా వుందో చూడండి! ‘యీసురోమని మనుషులుంటే / దేశమేగతి
బాగుపడునోయి / జల్దుకొని కళలెల్ల నేర్చుకు / దేశి సరుకులు నించవోయి’ అంటూ అన్ని
కళల్లో పరిశ్రమించి ఘనత కెక్కమంటాడు కవి.
పాడిపంట పొంగి పొర్లేదారి వ్యవసాయం. ఆ దారిలో పాటుపడితే దేశంలో తిండికి
కరవులేకుండా ఉంటుంది. తిండి వుంటేనే మనిషికి కండ బలముంటుంది. శక్తిమంతుడే
ప్రగతికి సోపానమవుతాడు. ‘పాడిపంటలు పొంగిపొర్లే / దారిలో నువు పాటు పడవోయి
/ తిండి కలిగితే కండ కలదోయి / కండ కలవాడే మనిషోయి’ అంటారు.
గురజాడ రాసే మాత్రా ఛందస్సు కవిత్వం ఆనాడు కొంతమంది కవులకు నచ్చలేదు.