నీ దండ చిక్కువడెనే
నాదండలు చిక్కటన్న నగరే ప్రాజ్జుల్
నీ దండ నుంచి కొనుమా
వాదుడుగు మటందు రచటి వనితలు విటులున్.
చూతము మీ మీ జాతుల
నాతిరొ యన విటులు బల్కె నగి లావికలున్
ప్రీతిగలదేని జాతులు
జూతురె మా జాతులెల్ల జోద్యము లనరే.
చిన్న విరోధాభాసతో చక్కని సూక్తితో చెప్పిన ఈ పద్యం ఎలా అమరిందో చూడండి.
కుసుమ శర విద్దు లయ్యును
కుసుమంబులె కొందు రచటి కోవిదులు విటుల్
విషమునకు మందు విసమగు
నసమాయుధు వేటు తీట లలరులె మాన్చున్.
చివరగా ముగింపులో గురజాడ మగవారి మక్కువలెలా వుంటాయో చివరకి
ఏమవుతాయో కూడా చెప్పడం అద్భుతం.
చక్కదనంబు నశ్వరము సత్యమె మక్కువ లెల్ల కాలమున్
మిక్కుటమై చెలంగునొకొ, మిత్రమ చీమలు చుట్టుముట్టుచుం
జక్కెర చెల్లుదాక బలు సందడి జేయుచు వీడు కైవడిన్
జొక్కపు ప్రాయ మేగు తరి సున్న కదా మగవారి మక్కువల్!
ప్రబంధకవులకు దీటుగా ఇలా చక్కని చిక్కని పద్యాలు రాసిన గురజాడకు
మనమివ్వవలసిన స్థానం ఏది!
4.మాటల మబ్బులు:
ఇందులో 4 పద్యాలలో గురజాడ లోక రీతుల్ని వేమనలా విప్పి చెప్పాడు. అందుకే శ్రీశ్రీ
అన్నాడు, తిక్కన వేమన గురజాడ ముగ్గురే కవులని.
దబ్బరలుం గొండెమ్ములు
మబ్బువలెం గ్రమ్ము మాయ మాటల తీపున్
నిబ్బరము మొండితనమును
నబ్బురమగు విద్య లచటి యధికారులకున్.