దాసుగారి చివరి పద్యం:
చతురకళా విద్యాసం
గతికిన్ స్థిరధృతికి ప్రకటకరుణా మతికిన్
కృతియానందగజపతికి
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్.
గురజాడవారిది:
ధృతి గురు జాడల నరిగెడు
గతి పెద్దల జూప జనితి గజపతి త్రోవన్
కృతి కదె గౌరవమగుటన్
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్.
ఇందులో గురజాడ గురుజాడలు కూడా ఉండడం విశేషం. గురజాడవారి 25 పద్యాలు
ఋతం, సత్యం గురించే వివరిస్తూ సాగాయి. సమస్య దానికి సంబంధించిందే కాబట్టి
అందుకే ఈ శతకాన్ని ఋతశతకము అని కూడా అనడం వుంది. సంగీత సాహిత్యాన్ని
సమ్మేళనం చేస్తూ…
మతి వీణ మీటు నంతనె
ఋత తంత్రీ శ్రుతిని జేరి యింపుగ స్వరముల్
ప్రతి సంవాద మ్మిడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్
3.పుష్పలావికలు:
పువ్వులు కోసి అమ్మే పూబోడులు పుష్పలావికలు. ప్రాచీనకాలంలోనే కాదు నేటికీ
చాలా ప్రాంతాలలో ముఖ్యంగా తమిళదేశంలో స్త్రీలే పువ్వులమ్ముతారు. మన ప్రాచీన
కవులందరూ ముఖ్యంగా ప్రబంధకవులు పుష్పలావికావర్ణన చేసినవారే. కావ్యంలో
అష్టాదశ వర్జనలు ఉండాలన్నది ఆలంకారిక నిర్ణయం.
“పురసింధు నగర్త్వినశశి
సరసీవన మధు రతిప్రసంగ విరహముల్
పరిణయ తనయోదయ నయ
విరచన యాత్రాజి దౌత్య విభు వర్ణనముల్ (నరస. 2అ. 166)
అని ఆ అష్టాదశవర్ణనల్ని వివరించాడు భట్టుమూర్తి. అందులో మొదటిది పురవర్జన.
కావ్యకథా ప్రారంభంలో నగరాన్ని వర్ణిస్తూ అక్కడ పుష్పలావికల్ని వేశ్యల్ని వర్ణించడం
చూస్తాం. పుష్పలావికల వర్ణనలో ప్రధాన పాత్రలు విటులు, పుష్పలావికలు. వారిమధ్య
సంభాషణ సరస మధురంగా సాగుతుంది.