“కోరి వరించితి గాదే
నారాయణు నేను నాడు నాతులతోనన్
బేరు బ్రతిష్టయు గాంచనె
పారుడొకడు కాదె నాకుఁ బట్టై నిలిచెన్.”
కథ అసంపూర్ణంగా ఉన్నా 3 భాగాల విభజనతో రచన నడిచింది. మొత్తం 78
పద్యాలలో 57 కందపద్యాలే. అంటే కందం గురజాడ చేతిలో మాకందం. అదే మనకందం.
2.సత్యవ్రతి శతకం :
ఆనందగజపతి మహారాజు ఒకనాటి ఇష్టాగోష్టిలో “సతతము సంతసమొసంగు
సత్యవ్రతికిన్” అనే సమస్యను కవులకు ఇచ్చారట. దానిని ఎంతమందో ఆనాడు
పూరించారు. హరికథా పితామహుడు అష్టభాషా విశారదుడు ఆదిభట్ల నారాయణ
దాసుగారైతే వంద కంద పద్యాలలో ఆశుధారణాశుధారతో నూరు విధాల పూర్తిచేసారట.
ఏక సమస్యా పూరణలు నూరువిధాలుగా ఉన్న ఏకైక తెలుగు శతకం ఈయన సత్యవ్రతి
శతకం.
ఆ సమస్యనే స్వీకరించి గురజాడ కూడా పూరించారు. సమస్య కందపద్యపాదం కాబట్టి
కందాలే చెప్పాలి. ఈ సంపుటంలో 25 కందపద్యాలే ఉన్నాయి. అంటే ఇది పావుశతకం
అన్నమాట.
ఆదిభట్లవారి మొదటి పద్యం:
“హితమిత వాక్సంతతికిన్
దతభూత దయానురతికి ధైర్యోన్నతికిన్
జతుర మనీషా గతికిన్
సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్”
గురజాడవారి మొదటి పద్యం:
స్మితమతి సూచీ భేదిత
బుుత మౌక్తిక పదక శతక మిభపతి భాషా
సతి కతి కుతుకతగూర్చగ
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్.
ఈ గురజాడకా ఛందోవ్యాకరణాలు తెలియవన్నది!