అంటే సంప్రదాయ కవిత్వంలో గురజాడ స్థానం ఎంత వున్నతమో చెప్పగలమా! అక్కడక్కడ
కొన్ని సందర్భాలు చూద్దాం.
సుభద్ర, అర్జునులను శ్రీకృష్ణుడు చూడడం ఎంత మధురంగా అలతి అలతి పదాలతో
కూర్చాడో గురజాడ!
కపట మౌని జూచి కన్నియ జూచుచు
గన్నె జూచి కపట మౌని జూచి,
చిత్త మలర దల చె జిత్తజ జనకుండు
నేడు గంటి నలువ నేర్పటంచు.
ఇంకో సందర్భంలో కందాన్ని ఎంత అందంగా పొందుపరచాడో చూడండి.
“విన్నాడట హరి యీనా
డున్నా డవతారమెత్తి యుర్వినని, యతం
డన్నాడట నీవే యని,
కన్నారగ నిన్ను గాంచగా నిటు వచ్చెన్.”
అలాగే మాట్లాడుతున్నట్లు కందపద్యాలు
“పోనొల్లను యతి కడ కిక
గానిమ్మేమైన; నరుడు గానలలోనన్
గాని యగచాట్లు గుందగ
గానక నే దిరుగుచుంటి గఠిన హృదయనై.”
“కారాదొకొ యతి యీశుడు
రారాదొకొ నిన్ను బ్రోవ రమణిరొ వటుడై
తా రాడొకొ యిటకు నరా
కారంబన నెంత యతికి గరుణ గలిగినన్”.
నన్నయ్య చేమకూరలు వర్ణించని విషయాన్ని గురజాడ ఇందులో సమకూర్చాడు.
సుభద్ర తాను అర్జునుని పరిచర్యకు వెళ్ళలేనని నిర్ణయించుకున్న సందర్భంలో రుక్మిణి
సుభద్రతో తప్పకుండా వెళ్ళమనిచెబుతూ యతివల్ల నీకు అర్జునుని దర్శనం కలగవచ్చు.
నాకానాడు ఓ బ్రాహ్మణునివల్లేకదా శ్రీ కృష్ణుని భర్తగా పొందే అదృష్టం కలిగింది అనడం
ఎంతో చక్కగా కథకు అన్వయించింది.