కవితా విషయానికి వస్తే సంప్రదాయ కవిత్వంగా కందాలు, వృత్తాలు, ఆటవెలదులు,
సీసాలు, అన్నీ చోటుచేసుకున్నా కంద పద్యాలే ఎక్కువగా అందగించాయి. కందం
రాసినవాడే కదా కవి. ఈ విషయం మన విమర్శక శిఖామణులకు తెలియలేదు. ప్రబంధ
కవులకు తీసిపోని రీతిలో గురజాడ వర్ణనలు ఎంతో హృద్యంగా వున్నాయి.
ఉదా: సుభద్ర అర్జునుని సమీపానికి సపర్యకై వచ్చిన ఘట్టంలో ఆమెను వర్ణించిన తీరు
అమలిన శృంగారంగా అందంగా సాగింది.
కస్తూరి గన్నేరు కావి చీర మెఱుంగు
మేని చాయకు వింత మిసిమి గొలుప
చెలరేగు ముంగురుల్ చేర్చి కట్టిన జోతి
యిరులపై రిక్కల కరణి వెలుగ
పైటపై దూగాడు పచ్చల హారముల్
చలదింద్ర చాపంబు చాడ్పు జూప
నిద్దంపు జెక్కుల దిద్దిన పత్రముల్
మకరాంకు బిరుదాల మాడ్కి వఱల
మెఱపు, కెమ్మబ్బు లోపల మెఱయునట్లు
వలిపమున మేల్మి మొలనూలు తళుకులీన
భద్ర నడతెంచె బంగరు పళ్లెరముల
బండ్లు బూవులు గొనుచు సపర్య కొరకు.
ఈ ఘట్టంలో సుభద్ర అర్జున సపర్యకై వచ్చిన సందర్భంలో నన్నయ్య రచన చూద్దాం!
క్వణదణు కింకిణీ కవిత కాంచన కాంచి కలాపమున్ రణ
న్మణికల నూపురంబులు సమధ్వని నొప్పగభక్తి పాదచా
రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రి పూజన
ప్రణతులు సేసె నింద్రసుతు, బార్థు నిజేశ్వరుగా దలంచుచున్. (ఆది. 2ఆ. 178)
ఇక చేమకూర తన కాలంనాటి సాహిత్య స్వరూపంలో సుభద్ర రావడాన్ని ఇలా
వర్ణించాడు-
చందురు కావి పావడ పిసాళిరుచుల్ సరిగంచు చీరపై
జిందులు ద్రొక్క వేణి కటిసీమపయిన్ నటియింప జాళువా
యందెలు మ్రోయ జంటిరవికంటి చనుంగవ పిక్కటిల్లగా
చందనగంధి వచ్చె రభసమ్మున నమ్మునిరాజు సేవకున్ (విజయ-2-180)
ఈ మూడు పద్యాలను కవుల పేర్లు లేకుండా పేర్చి ఎవరెవరిది ఏ పద్యమో చెప్పగలమా!