మూల శ్లోకంలోని భావాన్ని వివరిస్తూ మనిషికి కూడా కులం, శీలం, గుణం,
కర్మలనుబట్టి నాలుగు విధాల పరీక్షతో గొప్పతనం కలుగుతుందనడం గురజాడ
గొప్పతనం!
నాల్గు రీతుల గనకంబు నాడెమగును
వేటు గీటుల తునియించి వెచ్చజేసి
నరుడు నట్టుల నాల్గింట నాడెమగును
కులము శీలంబు కర్మంబు గుణము చేత.
సత్యవ్రతి శతకాన్ని మకుటంతో పూరించడాన్ని గురజాడ కందపద్యాల అందాన్ని
చూసాం. సమస్యాపూరణం కూడా అతనికి గల ప్రజ్ఞగా మరో సందర్భం. రీవా రాణి
అప్పలకొండయాంబకు సమస్యా పూరణం అంటే చాలా ఇష్టమట.
“వెలవాల్గంటికుమారులౌదురుగదా విప్రోత్తముల్ రావణా” అనే సమస్యను ఆమె ఆస్థాన
పండితులకిచ్చారట. దానికి గురజాడ పూరణ ఇది అని కె.వి.ఆర్. మహోదయంలో
పేర్కొన్నారు.
కలిచేతన్ విమతిత్వమొందుచు మహాకామాంధకారంబునన్
కులధర్మంబు పరిత్యజించి గణికన్ గూడిమ్మ అమ్మా నినున్
బలుమార్వేడెద మంచు బల్కెదరహో పాండిత్యమూహింపకే
వెలవాల్గంటి కుమారులౌదురుగదా విప్రోత్తముల్ రావణా.
పైవిధంగా గురజాడ సంప్రదాయకవిగా ప్రాచీనకవులకు పోటీగా దీటుగా, సాటిగా
చిక్కని కవిత్వం పలికిస్తే అతనికి ఛందస్సు, వ్యాకరణం, సంప్రదాయం అన్నవేవీ తెలియవు
అందుకే వ్యావహారికభాషలో రాసేడనడం ఎంతవరకు సమంజసమో సహృదయులు
భావించండి. ఆ అన్నవాళ్లైనా అవేవీ తెలియనివాళ్ళు కారు. అయినా అన్నారంటే వాస్తవాన్ని
కప్పి పుచ్చి కేవలం కవి మీద ద్వేషంతో అక్కసుతో ఈర్ష్యతో అన్న కువిమర్శే కానీ మరేమీ
కాదు. నేడింతగా ఈ విషయాన్ని వివరించవలసిన అవసరంలేదు కానీ ఏదో ఉండబట్టక
చాపల్యంతో రాసాను.