11.7 C
New York
Monday, November 25, 2024

గురజాడ రచనలపై పరిశోధన

గురజాడ రచనలపై పరిశోధన

నా అనుభవాలు-జ్ఞాపకాలు

1985-90ల మధ్యలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యా
లయం లో తెలుగు శాఖలో గురజాడవారి రచనలపై ఎం.
ఫిల్., పిహెచ్.డి. లకై పరిశోధనలో చేరాను. పర్యవేక్షకులు
ప్రొఫెసర్ పి.సి. నరసింహా రెడ్డి గారు. చేరిన వెంటనే వారు
గురజాడ అప్పారావు రచనలన్నీ పరిశోధనా దృష్టి తో
క్షుణ్ణంగా చదవమన్నారు. అర్థంచేసుకోమన్నారు. తరు
వాతనే గురజాడపై వచ్చిన వ్యాసాలు, పుస్తకాలు
చదవాలనిచెప్పారు. నేను రచనలు చదువుతుండగానే,
మా సర్ గురజాడ పుట్టిపెరిగిన, ఉద్యోగం చేసిన ప్రదేశా
లన్నీ చూసి రమ్మని చెప్పారు. ఎక్కడకీ ఒంటరిగా వెళ్ళటం,
ప్రయాణాలు చెయ్యటం అలవాటు లేని నన్ను మా ఇంట్లో తిరుపతి నుంచి
విజయనగరం, అంత దూరం వద్దన్నారు. నాకేమో తప్పకుండా వెళ్లాలనుంది. మొత్తం
మీద ఒప్పించి, ప్రయాణమయ్యాను.
ఆరోజుల్లో, 1985లో, మా లాంటి అతిదిగువ మధ్యతరగతి కుటుంబాలకు లాండ్
ఫోన్ తెలియదు. ఉత్తరాలే ప్రసారమాధ్యమాలు! తిరుపతిలో మాకు తెలిసిన వాళ్లకు
విజయనగరంలో దూరపు బంధువులుంటే వాళ్ల అడ్రస్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను.
ఆమె యమున. ప్రభుత్వ పాఠశాలలో టీచర్. నా పనులయ్యేదాకా వాళ్ళింట్లోనే
ఉన్నాను. చాలా బాగా సహాయం చేశారు నాకు.

మొదట, గురజాడ అప్పారావు గారు పుట్టిన విశాఖ జిల్లా యలమంచిలి
తాలూకా రాయవరం ఊరికి వెళ్ళాను. మాతామహులు గొడవర్తి
కృష్ణయ్య గారింట అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21 న జన్మించారు.
వెంకట రామదాసు,కౌసల్యమ్మ తల్లిదండ్రులు.

కృష్ణయ్య గారు రాయవరం జిల్లా మున్సిఫ్ కోర్టులో శిరస్తదారుగా చేశారు.
అప్పారావు గారు సెలవుల్లోతాతగారింటికి వెళ్ళినప్పుడు
ఒకసారి, తోటిపిల్లతో కోర్టుకి వెళ్లారట. కోర్టు హాలు
తలుపుపై జి. వి. అప్పారావు బి ఏ. బి. ఎల్. డిస్ట్రిక్ట్ మున్సిఫ్
అని రాశారుట. మర్నాడు మున్సిఫ్ గారు చూసి ఎవరు

రాశారు ఇది అని అడిగితే కృష్ణయ్య గారు తన మనవడే అయి వుంటాడని అప్పారావు గారిని పిలిపించారుట.

అప్పారావుగారు తనే అలా రాశానని చెపితే మున్సిఫ్
గారు ఆ ధైర్యాన్ని మెచ్చుకున్నారట. ఆ కోర్టు, రాయవరం గ్రామ వీధుల ఫోటోలు థీసిస్లో
పెట్టాను. రాయవరం లో గురజాడ స్మారక గ్రంథాలయం ఉంది. అందులో వారి
నిలువెత్తు విగ్రహాలు రెండు హుందాగా ఉన్నాయి.నేను ఒకసారి, రాయవరం,
విజయనగరం, విశాఖపట్టణాలలో అవసరమైనవి చూసేశాక, తిరుపతినుంచి మా
కుటుంబ మిత్రుడు, సోదరతుల్యుడు చిత్రపు హనుమంతరావు సొంత కెమెరాతో వచ్చి
గురజాడకు సంబంధించిన ఫోటోలన్నీ తీశాడు.
విజయనగరంలో గురజాడవారు చదువుకున్న, చదువు చెప్పిన మహారాజా
కళాశాలలో అడుగు పెట్టినప్పుడు నా ఆనందం మాటలలో వర్ణించలేనిది. కాలేజి అంతా
తిరిగి చూశాను. అక్కడ కొందరు లెక్చరర్లతో మాట్లాడాను. ఫోటోలు తీసుకున్నాను.
విజయనగరంలో గురజాడ అప్పారావుగారింటికి వెళ్ళాను. ఆ ఇంట్లో వారి వంశీయులే
ఉన్నారప్పుడు. పేర్లు గుర్తుకు రావట్లేదు. ఇల్లంతా చూపించారు. అప్పారావుగారు
చదువుకునే గది చూసి పులకించిపోయాను. ఎందుకంటే, వారు ఎన్నో పుస్తకాలు
చదివారు. పుస్తకాలను చదివేటప్పుడు అందులోనే పక్కన మార్జినల్ నోట్స్
రాసుకునేవారు. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలో వారు చదివే పద్ధతి నుండి గ్రహించాను.
అది నేటియువతకూ పాఠమే. పఠనం, పరిశీలనం రెండు అవసరమని వారు చెప్పిన
మాటలు ఎప్పటికీ అందరికీ అనుసరణీయమైనవి.
గురజాడ అప్పారావు గారు ప్రతి చిన్నవిషయాన్ని నిశితంగా పరిశీలించేవారు.
ద్రౌపది వస్త్రాపహరణం, ప్రహ్లాద, శకుంతలవంటి నాటక ప్రదర్శనలను చూసినప్పుడు
వాటిపై రాసుకున్న అభిప్రాయాలు వారి సునిశిత పరిశీలనా శక్తిని వ్యక్తం చేస్తాయి.
కన్యాశుల్కం తొలి కూర్పు రచన తర్వాత నాటక ప్రదర్శనలు చూడటమే కాక, నాటక
సాహిత్యం విస్తృతంగా చదివారు.
విజయనగరంలో వసంతరావు బ్రహ్మాజీరావు గారి కుమారుడు ధాతారావు
గారున్నారు. వారి ఇంట్లో గురజాడ వారి పుస్తకాల బీరువా ఉంది. అందులో పుస్తకాలన్నీ
పట్టికగా రాసుకున్నాను. అనేక విభాగాల పుస్తకాలు! వాటిలో గురజాడ వారు పేజీలలో
పక్కన స్వదస్తూరీతో రాసుకున్న అభిప్రాయాలు! వారు స్వయంగా చేతులతో పట్టుకుని
చదివిన పుస్తకాలవి! వాటిని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. గురజాడ వారు చదివిన
పుస్తకాలలో ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలు, ఇంగ్లిష్ ఫిక్షన్ కథలు, అలంకార శాస్త్రగ్రంథాలు,
శైలికి, అనువాద విధానానికి సంబంధించిన గ్రంథాలు, వ్యాకరణాలు, చరిత్ర, మనస్త ్వ,
సామాజికశాస్త్రాలు, విద్యా విధానానికి సంబంధించినవి, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు
ఎలా ఏర్పడతాయో తెలిపే గ్రంథాలు, నాటక సాహిత్యం, ఇలా భిన్న అధ్యయన రంగాలకు
సంబంధించిన గ్రంథాలున్నాయి. ఆ పట్టికనంతా నా థీసిస్లో ఇచ్చాను.

ధాతారావు గారింట్లో గురజాడ అప్పారావు గారు ఉపయోగించిన టేబుల్ ఉంది. దానిని కూడా ఫోటో
తీసుకున్నాం. నాకు ఆ టేబుల్ చాలా అపురూపంగా కనిపించింది. “సర్, నాకు ఇచ్చేయండి,
తీసుకెళ్తాను” అనడిగాను. ఆయన నవ్వేసి, నీలాంటి భావి పరిశోధకులు ఎందరో వీటిని
చూడటానికి వస్తారు. ఇవి గురజాడ వారు మనకు వదిలి వెళ్ళిన సంపద, అన్నారు . నిజమే
కదా! వసంతరావు బ్రహ్మాజీరావు గారు రచించిన గురజాడ జీవితచరిత్ర రాతప్రతి ఒకటి
ధాతారావు గారు చూపించారు. పరిశోధనలో రాత ప్రతులకు విలువెక్కువని మా పి.సి.
నరసింహారెడ్డి సర్ చెప్పారు. అందులో నుంచి కొన్నివాక్యాలు రాసుకున్నాను.అప్పటికి అది
అచ్చు కాలేదు. తరువాత అయిందో, లేదో నాకు తెలియదు. గురజాడ వారికి పుస్తకాలంటే
చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులతో విజయనగరం గంటస్తంభం
దగ్గర అమ్మే సెకండ్ హాండ్ పుస్తకాలు కొని చదివేవారు. ఆ గంట స్తంభం ఫోటో కూడా
తీసుకున్నాను. ఆ సమయంలోనే విజయనగరంలో గురజాడ స్మారక గ్రంథాలయం
నిర్మాణం జరుగుతోంది. కూలీలు పనిచేస్తున్నారక్కడ. అది కూడా ఫోటో తీసుకున్నాను.
1985 లోనే “అస్తమించని సూర్యుడు” గురజాడ జీవితచరిత్ర డాక్యుమెంటరీ చిత్రీకరణ
జరిగింది. అబ్బూరి గోపాలకృష్ణ గారు కథను సమకూర్చారు. సుగమ్ బాబు దర్శకత్వం.
అందులో లెక్చరర్ గురజాడ అప్పారావుగా వారి మునిమనవడు ప్రసాద్ నటించారని,
మిగతా పాత్రధారుల వివరాలతో ఓ వారపత్రికలో సమాచారం వచ్చింది. అది కూడా నా
దగ్గర ఉంది. కన్యాశుల్కంలోని బొంకుల దిబ్బను కూడా చూశాను. విజయనగరంలో,
విశాఖపట్నంలో గురజాడ విగ్రహాలు ఫోటోలు తీసుకున్నాను.
విశాఖపట్నంలో గురజాడ రవీంద్రుడు గారు, అప్పారావు గారి మునిమనవడు,
గురజాడ వారి కళ్ళజోడును చూపించారు. అంతేకాదు, రవీంద్రుడుగారు రెండు
అపురూపమైన ఫోటోలు తరవాత పోస్టులో నాకు పంపారు. ఒక ఫొటోలో, అప్పారావు
గారి కుమారుడు రామదాసుగారు, ఆయన కుమారుడు శ్యామలరావు గారు, కోడలు
సుగుణమ్మ గారు, రామదాసు గారి చెల్లెలు కొండాయమ్మ గారు, కుమార్తె శకుంతలమ్మ
వున్నారు. ఇంకో ఫొటోలో రామదాసుగారు,పక్కన రవీంద్రుడు గారు, శ్యామలరావు
గారు ఉన్నారు. అంతే కాక, రవీంద్రుడు గారు గురజాడ అప్పారావు గారి తరవాతి
తరాల వారి గురించి మనుమలు, మునిమనుమలు పేర్లతో, వరసలతో వివరణాత్మక
మైన సమాచారాన్ని ఇచ్చి గురజాడ వంశవృక్షాన్ని రూపొందించడానికి పూర్తి
సహకారాన్ని ఇచ్చారు. ఎంతో ఓపికగా వివరాలన్నీ ఉత్తరంలో రాశారు. వారు నా క్షేత్ర
పర్యటన (field work)అయి తిరుపతికి వచ్చేశాక ఈ లేఖ రాశారు. అది నా దగ్గర
ఉంది.
విశాఖపట్నంలో అబ్బూరి గోపాలకృష్ణ గారు కన్యాశుల్క నాటక ప్రదర్శనల
గురించి చాలా విలువైన విషయాలు చెప్పారు. రాజమండ్రిలో గౌతమిగ్రంథాలయంలో
ఎన్నో పాత దిన పత్రికలలో గురజాడకు సంబంధించిన సమాచారాన్ని సేకరించ గలిగాను.

ఇంతటి సాంకేతికత, ఇన్ని సౌకర్యాలు లేని ఆ రోజుల్లోకేవలం ఉత్తరాలతోనే
చాలా సమాచారాన్నిచ్చి ప్రోత్సహించారు సెట్టి ఈశ్వరరావు గారు. ఎన్నో ఉత్తరాలు
రాశారు నాకు. మద్రాసులో ఒక సాహితీ సంస్థ నిర్వహించిన సమావేశంలో ‘గురజాడ
రచనలలో సంఘ సంస్కరణ భావాలు’ అనే అంశం మీద పేపర్ చదవటానికి నేను
వెళ్ళినప్పుడు ఈశ్వరరావు గారు అక్కడకు వచ్చారు. చాలా విషయాలు గురజాడ
గురించి మాట్లాడారు.
కావలిలో కె. వి. రమణారెడ్డి గారింట్లో నాలుగు రోజులుండి గురజాడకు సంబం
ధించిన విషయసేకరణ చేశాను. నన్నో విద్యార్థినిలా చూసి, చాలా ప్రోత్సహించారు.
విషయ సేకరణ అంతా జరిగిన తరువాతే, అధ్యాయ విభజన చేసుకుని రాయటం
మొదలుపెట్టాను.
ఎం. ఫిల్ లోవున్నప్పుడే ఒక సెమినార్ సందర్భంగా ఎస్. వి.యూనివర్శిటీ కి
వచ్చిన కొత్తపల్లి వీరభద్రరావు గారిని వారు విడిది చేసిన అతిథి గృహంలో నేను, మా
సర్ వెళ్లి కలిశాము. నేను ముందుగానే రాసుకుని వెళ్లిన ప్రశ్నలన్నింటికి ఎంతో ఓపికగా
చెప్పి సందేహాలు తీర్చారు వారు. ఆరుద్రగారు కూడా ఈ పరిశోధన విషయంగా నేను
అడిగిన సందేహాలకు లేఖ రాశారు. తరవాత వారు తిరుపతి వచ్చినప్పుడు మాట్లాడాను
కూడా!
నేను విజయనగరం, విశాఖపట్నం వెళ్లి వచ్చాక కన్యాశుల్కం నాటక ప్రదర్శనల
గురించి వ్యాసాలు చదవటం, పలువురు పెద్దల ద్వారా వినటం జరిగి నాకూ ఒక
ఆలోచన వచ్చింది. కన్యాశుల్కం నాటకాన్ని ముఖ్యమైన సంఘటనలతో ముప్ఫై
పేజీలకు కుదించి, తిరుపతిలో మేము వుండే ఇంటి దగ్గరున్న చిన్న రామాలయం
ముందు, శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్టేజి మీద నాటకం వేయించాను.

విజయనగరం మాండలికంలోఉన్న కన్యాశుల్కం నాటకాన్ని రాయలసీమ విద్యార్థులతో! కుదించిన నాటకాన్ని మా సర్ చూసి, కొన్ని సూచనలు
చేసి,ప్రదర్శనకు బాగుంటుందన్నారు. కె. వి.రమణారెడ్డి గారు అంత తక్కువ పేజీలకు
కుదించడం గొప్ప విషయమే అని ఉత్తరం రాశారు. ఈ ప్రదర్శనకు మా సర్, కె.వి. ఆర్
గారు వస్తామన్నారు గాని కారణాంతరాల వల్ల రాలేకపోయారు .ఈ నాటక నిర్వహణలో,
చిత్రపు హనుమంతరావు, ఫోటోలు తీసిన వ్యక్తి సహకరించారు. అతను
అగ్నిహోత్రావధాన్లుగా వేశాడు. అందరూ మగ పిల్లలే! పాలిటెక్నిక్ కాలేజి విద్యార్థులు.
మధురవాణి, బుచ్చెమ్మ, మీనాక్షి పాత్రలకు ఆడ వేషం వేసుకున్నారు. సంభాషణలు
కష్టపడి నేర్చుకున్నారు. అదొక మరచిపోలేని జ్ఞాపకం నాకు.
నేను సేకరించిన ఫొటోలతో,1985లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో మహాకవి
గురజాడ అప్పారావు అనే వ్యాసాన్ని అప్పారావుగారి జీవిత విశేషాలను చెపుతూ రాశాను.
అదే అచ్చయిన నా మొదటి వ్యాసం. అలా నా రచనా వ్యాసంగం కూడా గురజాడను
గురించిన వ్యాసం తోనే ప్రారంభమైంది.
ఈ పరిశోధన జరుగుతున్న సమయంలోనే గురజాడ వారి గురించి అప్పటి వరకు
జరిగిన కృషి పరిశీలించాక, ‘గురజాడపై ఇంకా జరగవలసిన పరిశోధన’ అనే వ్యాసం
రాశాను. అది ‘తెలుగు’మాస పత్రికలో అచ్చయింది.
గురజాడ కన్యాశుల్కం నాటకంపై వివిధ కోణాలలో అనేక వ్యాసాలు వచ్చాయి.అవి
పుస్తక రూపంలో ఒకే దగ్గర దొరుకుతున్నాయిప్పుడు. కానీ, ముప్ఫై ఏళ్లకిందట విషయ
సేకరణకి గ్రంథాలయాలలో పాత పత్రికలే ఆధారం. ఒక యజ్ఞంలా సాగిందప్పుడు
సేకరణ కార్యక్రమం! తెలుగుశాఖలో మా ప్రొఫెసర్ గారి గదికి వచ్చే వెల్చేరు
నారాయణరావు గారిలాంటి పెద్దలతో చర్చలు జరిగేవి. అదో అపూర్వమైన కాలం! తిరిగి
రాని కాలం! ఆ జ్ఞాపకాలు,అనుభవాలు నాలో ఇంకా పచ్చగా అలాగే ఉన్నాయి.
‘ప్రకాశిక’ అనే పక్ష పత్రికకు గురజాడ వారు సంపాదకత్వం వహించారని నేనూ
థీసిస్ లో చెప్పాను కానీ చూడలేదు. ఎవరూ చూసినట్లు చెప్పలేదు. అంతేకాక, గురజాడ
‘సారంగధర ‘తరువాత ‘చంద్రహాస‘ అనే ఐదువందల పంక్తుల ఇంగ్లీషు పద్య కావ్యాన్ని
రచించినట్లు తెలుస్తోంది. దానినీ ఎవరూ చూడలేదు .
ఎం.ఫిల్.అంశం ‘‘గురజాడ అప్పారావు రచనలు-భాషా సాహిత్య ప్రమేయ
దృక్పథం’’లో గురజాడ వారి జీవితవిశేషాలు, భాషా సాహిత్యాల పట్ల వారి దృక్పథాన్ని
చెప్పటం జరిగింది.
పీహెచ్డీ అంశం ‘‘గురజాడ అప్పారావు రచనలు-భాషా, సాహిత్య సామాజి
కాంశాల పరస్పరసంబంధం’’లో వారి రచనల్లో భాషా సాహిత్య సామాజికాంశాల
సమన్వయాన్ని విపులంగా, విస్తృతంగా చెప్పటం జరిగింది.
ఇవీ గురజాడ వ్యక్తిత్వ, సాహిత్య అధ్యయనాలలో నేను గ్రహించిన విషయాలు, నా
అనుభవాలు, జ్ఞాపకాలు.


4/5 - (1 vote)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles