గురజాడ ప్రేమతత్వం
-తొలి సంచిక
“ప్రేమ పెన్నిధిగాని,ఇంటను నేర్ప
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు,
శాస్త్రము లిందు గురించి
తాల్చెమౌనము; …” ( గురజాడ – కాసులు )
ప్రేమ ఒక కళ. ఇంట్లో నేర్పించరు, బయట నేర్పించే
ఉపాధ్యాయులు లేరు. శాస్త్రములు చదివి తెలుసుకుందామంటే
అవి ఏమీ చెప్పవు. అలాంటప్పుడు ఈ సమస్యకు పరిష్కారం
వెతుక్కోవలసినది ఎక్కడ ? సాహిత్యంలోనే అన్నది
నిస్సంశయం. జీవితంలోని ఖాళీలను పూరించటమే
సాహిత్యం పని కదా!? “కాసులు” కవితలో నాయకుడు కూడా
“నేను నేర్చితి భాగ్య/ వశమున; కవుల, కృపగని హృదయ/ మెల్లను నించినాడను ప్రేమ
/యను రతనాల – కొమ్మ !” అని చెప్పుకొన్నాడు. అంటే కవిత్వం చదివి, సాహిత్యం చదివి
ఎన్నింటినో నేర్చుకోవచ్చునన్నమాట. ఇది గురజాడ మాట. ఆ బాటలో అదే గురజాడ
సాహిత్యాన్ని పరిశీలించి ఆయన నిరూపించిన ప్రేమతత్వం ఏమిటో తెలుసుకొనాలని
కలిగిన కుతూహలం ఫలితం ఈ వ్యాసం.
భారతీయులకి ప్రేమ ఆధునిక భావన. ప్రాచీన భారతీయ శాస్త్రాలు, సాహిత్యం కామం,
కోరిక, శృంగారం అనే మాటలను వాడినట్లు ప్రేమ అనే మాటను ప్రయోగించినట్లు
కనబడదు. కామాన్ని తృతీయ పురుషార్థంగా చెప్పారు. ప్రియము అనే మాట ఇష్టం,
స్నేహం అనే అర్థంలో ప్రయోగించబడింది కానీ ప్రేమ అనే మాటకానీ, దానిచుట్టూ
ఉన్నభావజాలం కానీ పూర్తిగా కొత్తవి. ఫ్రెంచ్ విప్లవానంతరం ప్రచారంలోకి వచ్చిన స్వేచ్ఛ,
సమానత్వ స్వాతంత్ర్య భావనలు, పారిశ్రామిక విప్లవానంతరం ప్రపంచ రాజకీయార్థిక
వ్యవస్థలలో వచ్చిన పరిణామాలు, పెరిగిన వ్యక్తి ప్రాధాన్యత ‘ప్రేమ’ను మానవ
సంబంధాలలో కీలకమైన అంశంగా అభివృద్ధి చేశాయి.
అటు సంస్కృత భాషా సాహిత్యాలను, ఇటు ఆధునిక భాషా సాహిత్యాలను మాత్రమే
కాక చరిత్ర, సమాజం మొదలైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి గాఢమైన
అనుభవాన్ని పొంది, నిర్ధిష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకొన్న గురజాడ 20 ఏళ్ల
వయసుకు ఇంగ్లీష్లో కవిత్వం వ్రాయటం మొదలు పెట్టాడు. సామాన్యుల దైనందిన
జీవితాన్ని సాహిత్య వస్తువుగా చేసిన వర్డ్స్ వర్త్ వంటి కవుల కవిత్వ సారాన్ని ఆస్వాదించ
గలిగాడు. అభినందించగలిగాడు. ఆ క్రమంలో ఆధునిక ప్రేమ భావనను
అందిపుచ్చుకోగలిగాడు. గురజాడ సమగ్ర సాహిత్యంలో ప్రేమ గురించి అక్కడక్కడా
ఇచ్చిన నిర్వచనాలు, చేసిన వ్యాఖ్యానాలు పరిశీలించి చూస్తే గురజాడ ప్రేమతత్వం నిగ