ఆలోచనల దారిలో..
గురజాడ వెలుగు జాడలు
“కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా”
—మహాకవి గురజాడ
రెండు విలక్షణమైన ఆలోచనలలోని మంచిని ఒక చోట
చూసినప్పుడు, అది…మన హృదయాంతరాల వెనుక
అంతఃచేతనలోని లాలిత్యాన్ని తాకి, సున్నితమైన ఆత్మ
ఔన్నత్యాన్ని జాగృతం చేసి, రహస్యంగా దాగిన వేదనలను క్షాళన చేసి అపురూపమైన
మానవీయ పరిమళం వైపుకు మనల్ని నడిపించే… ఆ అక్షర సుగంధాన్ని మనమందరం
గుర్తించగలమా?!
ఏది వైయక్తికం, ఏది సామూహికం? వైయక్తికంలోని విషాదం లేదా చైతన్యం
విరాట్ రూపంతో తన బాహువులను విస్తృత పరచినప్పుడు లోకం కదులుతుంది.
ఒక్కోసారి భూగోళపు సరిహద్దులు కూడా చెరిపివేయబడి, మనోనేత్రం విశ్వాంత
రాళంలోని రహస్యాలను వెతికే దిక్కువైపుకు వికాసంచెందుతుంది. మహాకవి గురజాడ
ఒక సాహితీకారుడిగా, సంఘసంస్కర్తగా, అభ్యుదయ కవిగా సరిగ్గా అదే పని చేశాడు.
1862 లో కౌసల్యమ్మ మళ్లీ రాముడికి జన్మనిచ్చింది. రాయవరం గ్రామం, విశాఖ
సముద్రం, కళింగ రాజ్యం, గజపతి రాజులు, తెలుగు నాటకం….అన్నీ యుగ పురుషుడి
కోసం ఎదురు చూశాయి.
మధురవాణి కళ్ళల్లో తడి. తన హృదయ ఔన్నత్యం లోకానికి తెలుస్తోంది అనే
సంతోషంతో. గిరీశం ఎలాగూ కంగారు పడతాడు మనకు తెలుసు. It is the women that seduce all mankind అని ఇకపై అంత తేలిగ్గా అనలేడుగా! రామప్ప
పంతులు, పూటకూళ్లమ్మ, లుబ్ధావధానులు… కళ్లు తిప్పి అటుచూశారు.
లోకం అంతా సౌజన్యరావులతో నిండే ఒక రోజు వస్తుంది అని లోకం అంతా
ఎదురు చూసిన పుట్టుక అది.
యువతరం ఆలోచనల దారిలో గురజాడ వెలుగు జాడలు ఎన్ని ఉన్నాయని
చూస్తే…., చాలా మంది పేరు తెలుసు అన్నారు. ఇంకొందరు… “దేశమంటే మట్టి
కాదు” అన్నాడు కదా, తలపాగా, మీసం ఆయనే కదా! అన్నారు…
నేటి యువతరం ఎక్కువగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతోoది! జీవితంలో
తొందరగా ఏం సాధించాలి. అమెరికా వెళ్లాలి, సముద్రాన్ని ఈదాలి, ఎవరెస్ట్ ఎక్కాలి….
అత్యంత ధనవంతుడుగా మారాలి…..
చూద్దాం, ప్రపంచ జాతీయ గీతాన్ని అందించిన గురజాడ ఎన్నో తరాలకు ప్రతినిధి!
అతని దిద్దుబాటు ఎన్నో కుదుపులతో అద్భుత సర్దుబాటులను లోకంలో చేస్తుంది.
ఇదిగో 1896 లోని “ప్రకాశిక” కొత్త కాంతులు అద్దుకుని మళ్లీ ఉదయిస్తోంది!
రాముడు ధర్మం కోసం నిలబడితే…, వేంకట అప్పారావు తన అక్షరాలతో
ధర్మరాజ్యం రావాలని ఆకాంక్షించాడు.
ఆ ఆలోచనల దారిలో వెలుగు జాడలు మళ్లీ
మళ్లీ వెతుక్కుందాం, మన కోసం.
“ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలక వలెనోయి
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి”
తెలుగు ప్రజల అదృష్టం కాదూ ఈ
కవిత్వం చదవడం!?
మనం ఎన్నుకునే ప్రధానాంశాల
(product of the choices we make)
మిశ్రమంగా మన ఉన్నత వ్యక్తిత్వం
రూపాంతరం చెందుతుంది. అలాగే దృక్పథం(Attitude), ప్రేమ, దయాగుణం, సామాజిక బాధ్యత గురించి ఆలోచనలు కూడా.
యువతరం గురజాడను వెతుక్కుని అభ్యుదయం వైపుకు నడిచి తీరుతుంది! శ్రీశ్రీ,
వేమన, గురజాడ, మహాకవి పోతన అన్నీ చదివి…”తుదనలోకంబగు పెంజీకటి
కవ్వల…” వెలుగు జాడలు ప్రసరించే వైతాళికులై ముందుకే నడుస్తారు. ముత్యాల
సరాలతో వజ్రాల హారాన్ని కట్టగలరు.
అవును, కృష్ణశాస్త్రిగారు, “గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను
జీవించడం ప్రారంభించాడు” అన్నారు కదా.
ఇదిగో “ప్రకాశిక” మళ్లీ సాక్ష్యమై నిలవబోతోంది!