– శ్రీ మూని వెంకటా చలపతి
వాడు అంతే!
నాలుగు అక్షరాలు తెచ్చి
ఓ కవిత అల్లి
ప్రజల మనసును దోచుకెళ్తాడు!
వేప చేదుని
నాలుకపై పూసి సత్యా న్ని ఉమ్మద్దు
చప్పరించి మింగమంటాడు!
కోయిల స్వరాన్ని
కాకి కూతను శ్రద్ధగా ఆలకించి
సమాజంలోని ఎత్తుపల్లాలను
కలంతో చదును చేస్తానంటాడు
ఎగిరే రెక్కకు దున్నే నాగలికి
అనుబంధం రుణానుబంధమేనని
పారే కాలువలో నీరు తాగి
రేగడినేలలో గొంతు ఎండేలా అరుస్తాడు!
కొన్ని గింజలను
పక్కవాడి సంచి సొరుగులొ దాచాలని
సూర్యుని కిరణాలకు శ్రమజీవుల చెమటకు
దండం పెట్టి ఆ దారిలో నడవాలంటాడు!
ఆకలికి అన్నంతో పాటు
నాలుగు పుస్తకాలు నంజుకుతిని
పక్కవాడు నవ్వినప్పుడే పండగ అంటాడు!
వాడు అంతే!
కాలాన్ని సిరా చుక్కలో ముంచి
నిన్నటికి రేపటికి మధ్య సంధి కాలంలో
తన జ్ఞాపకాన్ని ఒక్క సంతకంతో ముగిస్తాడు!