కరోనానంతరకాలం
-దృక్కోణం
గతసంవత్సరం ఈ సమయానికి కరోనా వాడల్లోనే ఉంది. ఊహాన్ నగర సమస్యగానే పరిచయం అయింది ప్రపంచానికి. మొదట్లో చాలా మంది సమస్య త్వరలో సమసిపోతుందని ఊహించారు. కరోనా వైరస్ గురించిన
వివరాలు బయటపెట్టిన చైనా డాక్టరు మరణంతో సమస్య అంతర్జాతీయ స్థాయి సమస్యగా రూపొందింది. ఆంతరంగిక భద్రతావ్యవస్థ హెచ్చరించినా పెడచెవిన పెట్టి, కరోనా ఒక ‘మిథ్య’గా, ‘గాలివార్త’గా అగ్రరాజ్య పాలకులు కొట్టిపారేశారు. ఆదిలోనే తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే అగ్రరాజ్యంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. కోట్లాదిమంది కోవిడ్ బారిన పడేవారు కాదు. ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఇంతగా చితికేది కాదు. విచిత్రమేమంటే, ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని తెలుసు. వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం మీద విస్తృతప్రణాళికలు తయారుచేసి ఉంచారు. ఉపద్రవనివారణశాఖ కూడా ఉంది. ఎప్పుడో ఏదో రావచ్చని ఈ శాఖవారిని కూర్చోపెట్టి మేపడం ఎందుకని వారిని ఇంటికి పంపేశారు. ప్రణాళికలని తగలబెట్టేశారు.
ముసుగు అవసరం లేదు, ముసుగు ‘బలహీనతకి నిదర్శనం’ లాంటి
సెంటిమెంటులతో అగ్రరాజ్యం సమస్యకి ముసుగు కప్పింది. రాజకీయాలు,
అరాచకాలు, అబద్ధపుప్రచారాలు, అసంబద్ధ విధానాలు, మతిలేని నేత, గతిలేని ప్రజ,
వెరసి అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న ఈ దుర్భరస్థితి. “బలవంతుడు నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా” అన్న చందంగా, బలవంతమైన రాజ్యం
కనపడని కణంతో కృశించిపోతోంది. రాచపీనుగ ఒక్కటే పోదన్నట్లు అగ్రరాజ్యం అన్ని
రాజ్యాలని పతనమార్గంలోకి నెడుతోంది.
ఇక భారతదేశం విషయం చూస్తే, లాక్డౌన్ 1,2,3లు నివారణకి దోహదపడ్డాయో
లేదో బయటి ప్రపంచానికి తెలీదుకాని, రోజువారి జీతాలు, కూలిమీద బతికే బక్కజీవుల
బతుకుమాత్రం అతలాకుతలం అయింది. ఇళ్ళలో పనిచేసి బతుకు సారించేవాళ్ళు,
ఇంట్లోంచి పనిచేసి మనలేరు కదా! ఒక్కటి మాత్రం గమనించదగ్గ విషయం,
అగ్రరాజ్యంలో ప్రభుత్వం ఏమీచేయట్లేదు అన్న భావం ప్రజల్లో ఉంటే భారతదేశంలో
మాత్రం ఏదో చేసేస్తున్నారు మనకేం ఫర్వాలేదు అన్న భద్రతాభావం ఇంప్రెషన్ మాత్రం
కలిగించగలిగారు. పాలకులు మాత్రం కరోనాని ఎడాపెడా వాడుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వల్ల ఎన్నికలు
జరుపలేమని ఒక పార్టీ, కరోనా ఉన్నా లక్షమందితో తెలంగాణా రాష్ట్రంలో రాలీ పెట్టి ‘బలప్రదర్శన’ చేసి ఒక
పార్టీ, కరోనాకే నవ్వొచ్చేలా కరోనా పేరు వాడేస్తున్నారు.
అంతర్జాతీయ నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని దేశాలు మినహా (europeలో) ప్రపంచదేశాలు కరోనాని అరికట్టడంలో విఫలం అయ్యాయి. ప్రజలను నడిపించేవాడు
ప్రజలకి ఏది మంచిదో తెలుసుకుని ప్రజలను ఆ పనికి సమాయత్తం చేసేవాడు నాయకుడని పూర్వం వినేవాళ్లం. ఇప్పుడు, ప్రజలు ఏమి ఆశిస్తారో అదే తిరిగి వాళ్ళకి
చెప్పేవాడు ఓట్ల నాయకుడు అయ్యాడు.
వంద సంవత్సరాల క్రితం వచ్చిన అంటువ్యాధికి, ఇప్పటి అంటువ్యాధికి, అప్పటి,
ఇప్పటి కాలమానపరిస్థితులకి చాలా తేడాలున్నాయి. ఇప్పుడు ప్రపంచం పరస్పరం
ఆధారపడి బతికే ఒకచిన్న సమాజంలాంటిది. అమెరికా, ఇండియాలకు మధ్య
పదిరోజులు విమానాలు రద్దయితే ఎంతమంది జీవితం మీద ప్రభావం పడుతుంది?
ఎన్నోచుక్కలు కలిస్తేనే ప్రపంచవ్యవస్థ చిత్రపటం సంపూర్ణం అవుతుంది. కరోనా
కాలంలో “మాకు మేమే, మీకు మీరే” అన్న ధోరణి చాలా దేశాలలో, ముఖ్యంగా
అభివృద్ధిచెందిన దేశాలలో ప్రబలుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో
కార్యక్రమం చేపట్టి ఉంటే చవకగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా టీకా
రూపొందే కార్యక్రమం జరిగేది. కానీ ఎవరికి వారే టీకా రూపొందించే కార్యక్రమంలో
పడడంవల్ల సమన్వయలోపంతోపాటు పేదదేశాలకి టీకా అందుబాటులోకి రావడంలో
జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మనుషుల జీవితం మీద కరోనా ప్రభావం విస్తృతంగా ఉంది. సాంకేతిక ప్రగతి,
మనుషుల మధ్య గోడలు కడితే, కరోనా ఆ గోడలను మరింత పటిష్టం చేసింది. ఒకరు
లేకపోతే ఇంకొకరు లేరు అన్నంతగా ఉండే స్నేహితులు, ప్రేమికులు కూడా నోరువిప్పి
మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరికి కోవిడ్ ఉందో ఎవరితో మాట్లాడితే కరోనా
సోకుతుందో అన్న సంశయం, భయం అందరిలోనూ ఉంది. పూర్వం స్త్రీలు పరాయి
పురుషుడిని చూస్తే కొంగు కప్పుకునేవారు. ఇప్పుడు లింగబేధం లేకుండా ప్రతివాళ్ళు
ముసుగు సర్దుకుంటున్నారు. అదొకరకంగా “నన్ను అనుమానిస్తున్నాడా” అన్నట్టు
ఉంటోంది. ఇంతకీ ఉందో లేదో తెలీని, ఎలా ఉంటుందో ఏం తింటుందో, ఆడో, మగో
తెలీని ఈ కణం మన ఆలోచనల్లో మాత్రం స్థిరంగా పాతుకుపోయింది. ‘అందమే
ఆనందం’ అని అభిమాన కవి అన్నాడు కాబట్టి, పైసా ఖర్చులేని ఎవరికీ హాని కలిగించని
అందం చూద్దామంటే అరవిందాలలాంటి ముఖాలు ముసుగారవిందాలయి
నల్లటిమబ్బుల చాటున చక్కని చంద్రుడిలా దాక్కుంటున్నాయి.
సుమారు సంవత్సర కాలంపాటు, ప్రపంచం అనుభవిస్తున్న క్షోభకి చరమాంకం
మొదలయింది. అనతికాలంలోనే అందరికీ టీకాలు, అంతటా ఆనందాలు
వెల్లివిరుస్తాయి. కానీ పునర్నిర్మాణానికి చాలా కాలం పడుతుంది. ముఖ్యంగా మానవ
అనుబంధాల పునర్నిర్మాణం కష్టతరం, సమయం పట్టే విషయం. యువకులకి
చేయూతనిచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలు ఇప్పుడు చాలా అవసరం. అంతకుమించి,
ఆలంబన లేని వయోవృద్ధులకు ఆదరణ కల్పించడం అవసరం ఉంది. కరోనా ప్రపంచ
పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టింది, ప్రపంచవ్యాప్తంగా. శిశిరం శాశ్వతం
కాదు. వసంతాగమనాన్ని ఆపలేము. అందరికీ ఆలవాలమయ్యే వసంతవాకిలి
మానవాళి ఆశయం కావాలి. ప్రపంచ సమాజాన్ని కలిసిమెలసి పునర్నిర్మించవలసిన
అవసరం మునుపెన్నడూ లేనంతగా ఉంది. అన్నిరంగాలలోనూ అంతర్జాతీయ
నాయకత్వ అవసరం మెండుగా ఉంది. సందర్భానికి అనుగుణంగా ఎదగగల
సామర్ధ్యం, సంస్కారం, నైపుణ్యం ఉన్నతెలుగువాళ్ళు ఈ చారిత్రాత్మక సమయంలో
నాయకులుగా ఉద్భవిస్తారని ఆశిద్దాం.