11.1 C
New York
Tuesday, November 26, 2024

స్వర్గద్వారాలు

స్వర్గద్వారాలు

– అప్పరాజు నాగజ్యోతి
9480930084

ఆదివారం ఉదయానే సోఫాలో కూర్చుని , తీరిగ్గా టీవీ ఛానళ్ళు మారుస్తున్న మురారి కళ్ళు… ఒక ప్రముఖ వ్యక్తితో జరుగుతున్న ఇంటర్వ్యూ ప్రోగ్రాం వద్ద అతుక్కుపోయాయి.

“చిన్న వయసులోనే  సమాజ సేవకి అంకితమవడం వెనకాల ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా  “ అన్న యాంకర్ ప్రశ్నకి  “ ఒంట్లో  ఓపికున్నరోజుల్లోనే తోటివారికి సాయాన్నందించడం  మంచిదండీ. ఎందుకంటే- వృద్ధాప్యంలో అడుగుపెట్టాక  మనం ఒకళ్ళకి సేవ చేయడం కాకుండా, మనకే వేరేవాళ్ళు సాయం చేయవలసిన పరిస్థితి వస్తుందేమో చెప్పలేం కదా. జీవితం క్షణభంగురం. ఎవరికి ఏ క్షణాన ఆ భగవంతుడి నుండి పిలుపొస్తుందో ,  ఆ స్వర్గద్వారాలు ఎప్పుడు ఎవరికి ఆహ్వానం పలుకుతాయో ఎవరమూ చెప్పలేం. కాబట్టి ‘ రిటైరయి ఖాళీ దొరికినప్పుడు  చేయొచ్చులే ‘ అని అనుకోకుండా ,  చేయదలుచుకున్న పనిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఉత్తమమని నా అభిప్రాయం” అన్నాడు ఆ వ్యక్తి.

రిటైర్మెంట్ కి దగ్గరలో వున్న మురారికి ఆ మాటలు చురుక్కుమనిపించాయి.

“అతను చెప్పినట్టుగా ఇకనైనా కొద్దోగొప్పో సమాజసేవ చేసి పుణ్యంకట్టుకోకపోతే,  నాకోసం స్వర్గద్వారాలు తెరుచుకోవేమో !” అలా అనుకోగానే మురారికి గుండెల్లో దడగా అనిపించింది.

ఈలోగా టీవీలో ప్రోగ్రాం మారింది.

“ఇతరులకి  ప్రయోజనం చేకూర్చే మంచిపనులని  వాయిదావేయడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు. సత్కార్యాలని ఆలస్యం చేయకుండా, తక్షణమే అమల్లో పెట్టేయాలి ‘  అంటూ టీవీలో స్వామీజీ సుభాషితాలు వినిపించాయి. అప్పటికే ఆలోచనల వెల్లువలో  మునకేస్తున్న మురారికి కళ్ళెదుట స్వర్గద్వారాలు ఉన్నపళంగా తెరిచేసుకుని  ‘ స్వాగతం ‘ అంటూ దేవగణాలన్నీ ఎలుగెత్తి   ఆహ్వానం పలుకుతున్నట్టుగా గోచరించింది.

అంతే. ఒళ్ళంతా మైకం కమ్మేసినట్లవగా గభాల్న సోఫాలోనుండి లేచి నుంచుని చేతులు రెండూ పైకెత్తి ‘నమో నారాయణ ‘ అంటూ భక్తపారవశ్యంతో కళ్ళు మూసుకుని నాలుగడుగులు ముందుకేశాడు మురారి.

“ఇదేం అఘాయిత్యంరా , కొంచెమైతే నీ దూకుడుకి నీళ్ళ తొట్టి  కిందపడి విరిగిపోయుండేది. నేను రావడం  మరొక్క క్షణం కనక ఆలస్యమయుంటే,  బంగారంలాంటి  చేపలన్నీ చచ్చూరుకునేవి.   ఓరి నీ అసాధ్యం కూలా “.

అప్పుడే అటుగా వచ్చిన మురారి తల్లి వర్ధనమ్మ కొడుకుని అక్వేరియానికి దూరంగా లాగుతూ గట్టిగా చీవాట్లు పెట్టింది.

తల్లి దీవెనలకి బైటపడ్డ మురారి  ‘ ఏవీ  స్వర్గద్వారాలు , అహో  ఏరీ ఆ  దేవగణాలూ  ‘  అంటూ  ఆరాటంగా నలుదిక్కులా చూశాడు.

అతని వెర్రి చూపులకి టీవీ పక్కనే వున్న అక్వేరియంలోని చేపలు బిక్కచచ్చిపోయాయి. సమయానికి ఆ మహానుభావురాలొచ్చి ఈ తిక్కమనిషిని లాగబట్టి సరిపోయింది గానీ , లేకుంటే ఈ పాటికి మన ప్రాణాలు సరాసరి ఆ వైకుంఠాన్ని చేరుకునేవి కాదూ అన్నట్లు… చేపలన్నీ వాటిలో అవే గుసగుసలాడుకుంటూ, భయంభయంగా అక్వేరియం  లోపలున్న మొక్కల చాటున దాక్కున్నాయి .

ఇవేవీ గమనించే ధ్యాసే లేని మురారి మాత్రం ‘ ప్రతిజ్ఞ  చేశాను సరే-  కానీ  సమాజసేవలో నాకు ఓనమాలు తెలియవే, ఇప్పుడెలాగా’ అనుకుంటూ మళ్ళీ సోఫాలో కూర్చుని  ఆలోచనల్లో పడిపోయాడు. 

ఇంతలో  “ ఏరా, ఏం చేస్తున్నావు? అంతా కుశలమేనా “  అంటూ స్నేహితుడు రమణారెడ్డి నుండి  ఫోన్ రాగా, అతనితో తన ఆలోచనని పంచుకున్నాడు మురారి.

“చక్కటి నిర్ణయం మురారీ!  ఆలస్యం అమృతం విషం అన్నారు కాబట్టి- వెంటనే వెయ్యో , రెండువేలో అవసరాల్లో  ఉన్నవాళ్ళకి ఆర్ధికసాయం చేసేయ్. నేనూ నీ అడుగుజాడల్లో నడిచేస్తా “ అన్నాడు రమణారెడ్డి.

“ మంచి  సలహా  రమణా “ అంటున్న మురారికి అంతలోనే మరో ధర్మసందేహం కలగడంతో “ ఒరేయ్ , డబ్బులని ఎవరికి దానం చేస్తే బావుంటుందంటావ్? ఇవ్వాళ రేపు ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాం, లోకంలో మోసగాళ్ళు ఎక్కువైపోయారోయ్“ అన్నాడు.

“ నిజమే- ఏదైనా అనాధాశ్రమంకో లేదా వృద్ధ ఆశ్రమంకో  దానం చేస్తే వాటి నిర్వాహకులు ఆ డబ్బులని సక్రమంగా వినియోగిస్తారో తెలీదు కాబట్టి ,  స్వయంగా మన కళ్ళెదుట  అవసరంలో  ఉన్నవాళ్ళకి సాయం చేస్తేనే  మంచిది “ అన్న స్నేహితుడి  మాటలతో ఏకీభవించాడు మురారి.

ఫోన్ పెట్టేశాక “ అమ్మా! త్వరగా టిఫిన్ పెట్టు,  అలా బైటకి వెళ్లి వస్తాను “ అంటూ డైనింగ్ టేబుల్ వద్దకి వెళ్ళబోతుంటే…

 “అయ్యగారూ , మా బుడ్డోడికి ఒళ్ళు కాలిపోతాంది. టైపాయిడ్ జొరమని సెప్పి, మందులు రాసిచ్చినరు. అయి కొననీకి  వెయ్యిరూకలు  అవుతయన్నరు. సమయానికి నా పెనిమిటి కూడా ఊళ్ళో లేడయ్యా . మీరు జరింత పైసలు సర్దితే నేనూ , నా బిడ్డా మీ పేరు సెప్పుకుని దినాం దేమునికి దణ్ణం పెట్టుకుంటం ‘ అంటూ పనిమనిషి కమల రెండుచేతులూ జోడించి మురారిని అడిగింది.

కమల వేడుకోలు వినగానే మురారిలో  హుషారు తన్నుకొచ్చేసింది.

“ఇలా సమాజసేవని తలపెట్టానో లేదో , అలా అవకాశం తలుపుల్ని తన్ని మరీ లోనికొచ్చేసింది ‘ అని  లోలోనే  మురిసిపోతూ  లాల్చీజేబులో నుండి  పర్సు  తీసేంతలో కాలింగ్ బెల్  మోగింది.

తలుపులు తెరవగానే, ఎదురుగా కమల భర్త ఆంజనేయులు, అతని పక్కనే ఆరేళ్ళ పిల్లవాడు ! 

“బుడ్డోడిని ఒక్కన్నీ వొదలొద్దు.  నీతోటి పనికి తోలుకుపోమ్మంటే ఇనుకోవు. ఇప్పుడు సూడు,  ఈడు ఇస్కూల్ పుస్తకాలన్నీ  సింపేసి, ఆటి తోటి పడవల్ని  సేసి ఆడుకుంటున్నాడు . వీడ్ని జరింత కాసుకో కమలా . నేను పనికి పోతన్నా”….

ఆ క్షణాన అక్కడ మొగుడినీ , పిల్లాడ్ని చూసిన  కమల ముఖంలో కత్తిగాటుకి నెత్తురుచుక్క లేనట్టయింది.

“బాగున్న బిడ్డడికి జ్వరం వచ్చిందని చెప్పడం పాపం కమలా ‘ అని  కమలని మందలిస్తూ  ఉప్మా ప్లేట్ తెచ్చి కొడుకు చేతికిచ్చింది వర్ధనమ్మ.

“నయం , బూటకపు మాటలు నమ్మి డబ్బులిచ్చాను కాను ‘ అని మనసులో అనుకుంటూనే  కమల వేపు కోపంగా చూశాడు  మురారి.

చెంచాతో ఉప్మా తీసి నోట్లో పెట్టుకున్న మరుక్షణమే ‘ఇదేంటి , ఉప్మా తియ్యగా వుంది ‘ అంటూ తుపుక్కున నోట్లోముద్దని బైటకి ఉమ్మేశాడు.

అప్పుడే బ్రష్ చేసుకుని హాల్లోకొచ్చిన మురారి  భార్య మందాకిని   ” మా అమ్మలాగా వంట చేయడం నీకీ జన్మకి  రాదంటూ నన్ను హేళన చేస్తుంటారుగా, అనుభవించండి  “  అని అతడిని  దెప్పుతూ  ఫిల్టర్ కాఫీ కప్పుని అత్తగారి చేతినుండి అందుకుంది.

కోడలి మాటలని పట్టించుకోకుండా ‘అది కాదురా … కంటిపరీక్ష చేయించి మూడేళ్ళయింది కదూ ,  పవర్ మారినట్టుంది. ఈమధ్యన  నాకళ్ళకి అంతా మసక మసకగా ఉంటోందని నీకు చాన్నాళ్ళ నుంచీ చెబుతూనే వున్నాగా!  అదీగాక కంట్లో శుక్లాలు మొదలైనట్టున్నాయిరా. పంచదార డబ్బా,  ఉప్పుడబ్బా పక్కపక్కనే ఉండడంతో , సరిగా కనిపించక పొరపాటున ఒకదానికి బదులు మరొకటి వేసినట్టున్నాను. ఆ ఉప్మా ప్లేట్ ని పక్కన పెట్టేయ్ నాన్నా! రెండునిమిషాల్లో నీకు వేడివేడిగా దోసెలు వేసుకొస్తానుండు “  అంటూ గోడలని పట్టుకుని మెల్లిగా వంటింటి వేపు నడుస్తున్న తల్లిని  చూసి కలవరపడ్డాడు మురారి.

‘శ్రవణకుమారుని గురించి తెలియనివాళ్ళుండరు.  తల్లిదండ్రుల  ఋణాన్ని తీర్చుకోని పుత్రులకి పుట్టగతులుండవు. నరకం తప్పదు  ‘ అంటూ   సరిగ్గా అదే సమయానికి టీవీలో వస్తున్న ప్రవచనంతో మురారికి ఛెళ్ళున చెంపపై కొట్టినట్టయింది.

‘ఇంట్లో అవీ ఇవీ  పట్టుకుని తడుముకుంటూ  నడుస్తున్న కన్నతల్లికి  వైద్యం చేయించేందుకు డబ్బులకి వెనకాడుతున్నాను.   ఎవరెవరికో దానధర్మాలని చేస్తే నాకోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని అనుకోవడం ఎంత మూర్ఖత్వం! బాల్యంలోనే కాదు, ఇప్పటికీ  తన కాల్లో చిన్నముల్లు గుచ్చుకున్నా తన కంట్లో దబ్బనం గుచ్చుకున్నంతగా తల్లి విలవిల్లాడే విషయాన్ని  తలుచుకుని సిగ్గుపడ్డాడు మురారి. పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళనమవుతుండగా తల్లి వెనకాలే వంటింట్లోకి నడిచాడు.” అమ్మా! కళ్ళ డాక్టర్ దగ్గరకి  వెళ్దాం , త్వరగా తయారవు”

అతడి మాటలకి ఆ క్షణాన తల్లి కళ్ళు  తళుక్కుమన్నాయి. అక్కడే స్వర్గద్వారాలు దర్శనమివ్వగా, తల్లికి పాదాభివందనం చేసుకున్నాడు మురారి.

*******************

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles