కె. కౌండిన్య తిలక్
2023 దీపావళి కథల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ
యేమిటండీ! అప్పటి నుండి రుసరుసలు, బుసబుసలు. అంత అసహనం అవసరమా?” అన్నది భర్త ప్రకాశంతో చిరుకోపంతో హైమవతి.
“నా అసహనం, నాకోపం గురించి నీకు తెలియదా? ఎన్నో కష్టాలకోర్చి , త్యాగాలు చేసి ఇద్దరి పిల్లల్ని పెంచి పెద్దచేసాము. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదివించాము. ఒకడు అమెరికాలో డాలర్లు మూటలు కడితే, మరొకడు లండన్ లో పౌండ్లు కట్టలు కడుతున్నాడు. మనం ఇక్కడ చస్తున్నాము”
“మనకు మాత్రం యేమి తక్కువైంది చెప్పండి.స్వంత ఇల్లు ఉంది. కారు ఉంది. మీరు రిటైరైన తరువాత కొంచెం డబ్బులు కూడా చేతికి వచ్చాయి. పిల్లలు ప్రతి నెలా చెరీ ఒక అయిదు వేలు పంపుతున్నారు. ఇంకా యేమి కావాలి?”
“ఇంకా యేమి కావాలా?మనకు వచ్చే డబ్బును రోగాలు మింగేస్తున్నాయి. నెలాఖరికి వచ్చేసరికి ప్రతి దానికి వెతుక్కోవలసి వస్తుంది”
“మనకు వచ్చే ఆదాయం తో పాటు పరిస్థితులు బాగుండి, ఆరోగ్యం సహకరిస్తే ,ఈ వయసులో కూడా మనకు తోచిన పని చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. శ్రీకారం హోమ్ ఫుడ్స్ రుక్మిణమ్మ తనకు పిండి వంటల ప్రిపరేషన్ లో రోజు కొంత సేపు సాయపడమని చాలా రోజులుగా అడుగుతుంది. నెలకు ఎంతో కొంత ఇస్తాను అంటుంది. మీ ఫ్రెండ్ అనూప్ తన కంపెనీ ఆడిటింగ్ వ్యవహారాలను మిమ్మల్ని చూసుకోమని చెప్పాడని నాతో అన్నారు కదా. సో! గౌరవంగా బతకాలి అంటే, మన సమస్యలకు మనమే పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది”
“నలభై సంవత్సరాలు రెక్కలుముక్కలు చేసుకున్నాను. అంతో ఇంతో సంపాదించాను. ఇప్పుడైనా కాళ్లమీద కాళ్ళు వేసుకొని పదవీ విరమణ జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదించవద్దా? అలా జరగాలంటే పిల్లలు ఇంకొక ఇరవై వేలు పంపించ వచ్చు కదా. నా మిత్రుడు రంగయ్య కుమారుడు అమెరికాలో ఉంటాడు. ఆ పిల్లవాడు రంగయ్యకు నెలకు పాతిక వేలు పంపిస్తున్నాడు ”
“ఎవరి పరిస్థితులు ఎలాంటివో మనకేమి తెలుసు. మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు పుట్టారు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ ఖర్చులు వాళ్లకు ఉంటాయి కదా .మరొక మాట మనం మాత్రం మన తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా నిలిచామా?”
“నీవెన్నైనా చెప్పు. అప్పట్లో మన పరిస్థితి వేరు. ఇపుడు వీళ్ళ పరిస్థితి వేరు. మనం మన జీతాన్ని రూపాయిల్లో లెక్క పెట్టుకుంటే , వీళ్ళు డాలర్లలో,పొండ్లలో లెక్కపెట్టుకుంటున్నారు”
“సరే! ఇదంతా ఎప్పుడూ ఉండేదే. హాస్పిటల్ కు వెళ్ళే టైమ్ అవుతుంది. డ్రైవర్ కృష్ణ కూడా వచ్చాడు. సెల్లార్ లో ఉన్నాడు. నేనతనికి కాఫీ ఇచ్చి వస్తాను.ఇంతలో మీరు రెడీ కండి”
“ నేను రెడీగానే ఉన్నాను. అయినా డ్రైవర్ల కు కాఫీలు,టిఫిన్లు ఎందుకు ? పద బయలుదేరుదాము”
ఇద్దరూ కాసేపట్లో ఆపార్ట్ మెంట్ బయటికి వచ్చారు. సెల్లార్ నుండి కార్ తీసి,కృష్ణ నిలుచోని ఉన్నాడు. వీళ్ళు కారులో కూర్చోగానే తన స్కూటీ పైన ఉన్న రెండు,మూడుసంచులను కారు డిక్కీలో పెట్టాడు. కారు కదిలింది.
“బాగున్నావా కృష్ణ. హాస్పిటల్ కు వెళ్ళి రావాలి. తొందర యేమీ లేదు కదా?” అన్నది హైమవతి.
”బాగున్న అమ్మా! నాకేమీ తొందర లేదు. మన పని అంత అయిన తరువాత మాత్రం మనం పోయే దారిలోనే రెండు చోట్ల చిన్న పనులున్నయి.అంత కలిపి పది నిముషాలలో అయిపోతది”అన్నాడు డ్రైవర్.
ప్రకాశం కు ఆ మాటలు నచ్చక పోయినా బయట పడలేదు. కాసేపట్లో హాస్పిటల్ చేరుకున్నారు. కృష్ణ హాస్పిటల్ పార్కింగ్ లో బండి పెట్టి ,లాంజ్ లో వచ్చి కూర్చున్నాడు.
ప్రకాశం దంపతులు హాస్పిటల్ లో డాక్టర్లను కలిసి, రకరకాల టెస్టులు చేయించుకొని, మందులు రాయించుకొని, బయటికి వచ్చారు. ఇదంతా అయ్యేసరికి చాలా సేపయింది. ఆపై తిరుగు ప్రయాణమయ్యారు.
కొంత దూరం వెళ్ళిన తరువాత కార్ ఒక ఖరీదైన గేటెడ్ కమ్యూనిటి ముందు ఆగింది. అప్పటికే అక్కడికి ఒక యువతి వచ్చి నిలుచుంది. కృష్ణ డిక్కీ నుండి ఒక సంచీ తీసి ఆమె చేతికిచ్చాడు. ఆమె యేదో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా ‘మళ్ళీ కలుస్తాను’ అంటూ వచ్చి, కార్ స్టార్ట్ చేశాడు.
మరొక ఐదు నిమిషలలో ఒక కొరియర్ సెంటర్ దగ్గర ఆపాడు. డిక్కీలో ఉన్న సంచుల నుండి కొన్ని పాకెట్లు తీసి,కొరియర్ చేసి వచ్చాడు.
కార్ స్టార్ట్ చేసి ప్రకాష్ ఇంటి వైపు పోనివ్వసాగాడు. కుతూహలం ఆపుకోలేని హైమవతి,
“ఏమిటి కృష్ణా ! సంచులు, పాకెట్లు బట్వాడా చేస్తున్నావు?” అన్నది నవ్వుతూ.
“ముందు వెళ్ళిన లక్షరీ గేటెడ్ కమ్యూనిటి లో పెద్ద కొడుకు,కోడలు ఉంటారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. నెలకు ఇద్దరికీ కలిపి మూడు లక్షలు వస్తయి.నేను బట్టలు ఇచ్చిన ఆమె నా కోడలు.రేపు నా మనుమడి పుట్టినరోజు. అందుకే బట్టలు కొని ఇచ్చిన.రేపు నాకు గిరాకీ ఉంది.పోలేను. అందుకే ఇపుడు బట్టలు ఇచ్చి వచ్చిన.
మా చిన్న కొడుకు న్యూజిలాండ్ లో ఉంటాడు. వాడు అక్కడ సైంటిస్టు. మా రెండవ కోడలు కూడా డాక్టర్. మొన్న మా ఆమె పండగకు పిండి వంటలు చేసింది. వాటిని కొరియర్ చేసిన” అన్నాడుకృష్ణ
“ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు. మరి నీకీ కష్టం ఎందుకు?’అన్నది.
“అమ్మా! నేను సదువుకోలేదు. ప్రైవేట్ కంపెనీల కార్ డ్రైవర్ గా నౌకరీ చేసేటోణ్ణి.పదేళ్ళ కింద రిటైర్ అయిన. అయినా కార్ డ్రైవింగ్ వదిలి పెట్టలేదు . ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి. గీ డ్రైవింగ్ చేస్తూనే , నేనూ,నాభార్య ఒక్క తీరుగ కష్ట పడ్డం. పిల్లల్ని సదివించినం. వాళ్ళీ దినాన పెద్ద సదువులు సదివి ,పెద్ద కొలువులు చేస్తున్నరు. బాగా కమాయిస్తున్నారు. కాని నేను యే రోజు వాళ్ళ తాననుండి ఒక్క రూపాయి తీసుకోలేదు.
నాకు చేతనయిన కాడికి,వాళ్ళిళ్ళల్ల యే ఫంక్షన్ వచ్చినా గిఫ్ట్ లు కొనిపెడుత. నా భార్య ఈ రోజుకు మిషన్ కుడుతది. నేను డ్రైవింగ్ చేస్త. రెండు కమ్రాలా సొంత ఇల్లు ఉన్నది. ఇప్పటికీ మేమిద్దరం కలిసి నెలకు ఇరవై వేలు సంపాయించుతము. మా యిద్దరికి యెళ్ళిపోతది.ఎపుడన్న మా పెద్దకొడుకు ఇంటికిపోతము.పెట్టింది తింటము. మా చేతనయిన పండో,కాయో పిల్లల చేతిల పెడుతము.
నా కొడుకులు “రండి నాయినా! మా ఇంట్ల ఉండండి”అంటరు. మేమునవ్వి ఊరుకుంటము. మా యిల్లు వదిలి ఎక్కడికి పోము”అన్నాడు కృష్ణ.
‘బాగా ఉంది కానీ అన్నీ రోజులు మనవి కావు కాదా?”
“మా ఇద్దరి చేతులు కాళ్ళు అడినంత కాల ఎవరి మీద ఆధారపడం. యేమన్న అయితే దేవుడే భారం.అప్పుడు ఆలోచిస్తము”అన్నాడుకృష్ణ చాలా ప్రశాంతంగా.
“నీ వయసెంత”
“డెబ్భై రెండు సంవత్సరాలు. అర్ధరాత్రి కూడ డ్రైవింగ్ చేస్త. నాకూ, మా ఆమెకు యేరకమైన బీపీలు, షుగర్ లు లేవు. పొద్దున్నే దేవుని గుడికి పోయి ప్రదక్షిణాలు చేస్తము. సాయంత్రం వాకింగ్ చేస్తము. యే రంది పెట్టుకోకుండ బతుకుతము” అన్నాడు కృష్ణ నవ్వుతూ, డ్రైవ్ చేస్తూనే.
‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటూ కృష్ణ చెప్పిన మాటలు ప్రకాశాన్ని ఆలోచనలో పడేశాయి. ఆలోచనల నుండి తేరుకొని,ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా , తన మిత్రుడు అనూప్ కు ఫోన్ చేసాడు.
“అనూప్! నీవు చెప్పినట్లే ఒకటి రెండు రోజుల్లో నీ ఆఫీసులో జాయిన్ అవుతాను”
“ఓహ్! సడన్ చేంజ్, నిన్నటి వరకు రానూ, చేయనూ అన్నావు. ఇంతలో ఈ మార్పు ఏమిటి?” అన్నాడు నవ్వుతూ.
“ఆలోచనలలో మార్పు రావడానికి గ్రంథాలు చదవాల్సిన పనిలేదు.మన చుట్టూ ఉన్న జీవితాలను గమనించినా చాలు” అన్నాడు.
“ఎనీ హౌ ! ఐ యాం హ్యాప్పీ. నీ ఇష్ట మున్నంత కాలం పని చేసుకో .నీ అనుభవం నాకు కావాలి. నీ శ్రమకు తగిన ఫలితాన్ని నేను ఇస్తాను” అన్నాడు.
“సరే ! రేపు కలుస్తాను” అంటూ ప్రకాశం ఫోన్ పెట్టేసాడు.
ఇంతలో అపార్ట్ మెంట్ చేరుకున్నారు. ప్రకాశం దంపతులు కారుదిగారు.
కృష్ణ సెల్లార్ లో కార్ ను పార్క్ చేసి వచ్చాడు. కార్ కీస్ ప్రకాశం చేతిలో పెట్టి, నమస్తే పెట్టాడు.
“ఇంట్లోకి రా. కాఫీ తాగుదువు గాని.అక్కడే డబ్బులిస్తాను” అన్నాడుప్రకాశం కృష్ణ వైపు ప్రసన్నంగా చూస్తూ.