10.7 C
New York
Tuesday, November 26, 2024

మౌనమే నీ భాష ఓ మూగ మనసా!

మౌనమే నీ భాష ఓ మూగ  మనసా!

-కె. బి. కృష్ణ
+91 9989102736

ప్రపంచంలో దాదాపు అన్ని జాతులకు ముఖ్యంగా మానవ జాతికి భగవంతుడు ఇచ్చిన వరం మాట్లాడడం. నోరు విప్పి తన మదిలోని భావాలను చెప్పగల శక్తి ఒక్క మనిషికే ఉంది. మానవజన్మ ఉత్కృష్టమైనదని అంటారు. 

ఇవ్వాళ మనసంతా ఏమిటో కకావికలం గా ఉంది. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళై ప్రయోజకులై ఒక ఇంటివారై తలా ఒక చోట  హాయిగా జీవిస్తున్నారు. మేమిద్దరం-మాకిద్దరం కొంతకాలం కిందట మా పరిస్థితి. అయితే ఇప్పుడు “మేమిద్దరం- మాకు ఒకరికొకరం” అయింది.

ఇంతలో సెల్ మోగింది. మూర్తి భార్య ఫోను, మూర్తీ నేనూ కలిసి ఉద్యోగాలు చేశాం, కలిసి రెండేళ్ల క్రితం పదవీ  విరమణ చేశాం. ఒకే ఊరిలో స్థిరపడ్డాం. వాడికీ ఇద్దరు పిల్లలు, వాళ్ళూ మా పిల్లల్లాగే డిటో డిటో —

ఎప్పుడూ ఫోన్ చేస్తాడు, సమాధానం వచ్చేలోపుగా ఒక వంద మాటలను గడగడా మాట్లేడేస్తాడు, వాగుడుకాయ అనుకోండి, అలాం   టిది అతని భార్య ఫోన్ చేయడం నాకు కొంచెం ఆశ్చర్యం, అనుమానం కలిగించినా- “ఏమిటమ్మా — మూర్తి ఊరెళ్ళాడా ? నువ్వు ఫోన్ చేశావేమిటి?” అన్నాను.

 “అన్నయ్యగారూ మూడు రోజుల నుంచి ఆయన ధోరణి అంతా వింతగా కొత్తగా ఉంది. మానసికంగా ఆయనకు ఏదైనా అయిందేమోనని భయంగా ఉంది. మీరు వస్తే సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకువెళదామని –” అన్నది జీరబోయిన గొంతుతో.

 నేను షాక్ తిన్నాను…చెప్పొద్దూ 

“భలేదానివే, అప్పుడే వాడిని డాక్టర్ దగ్గరకు కూడా తీసుకువెళదామనే నిర్ణయానికి వచ్చేశావా ? క్షణంలో అక్కడ ఉంటాను. వాడిని ఏమీ అనకు” అన్నాను. నేను చక చకా లుంగీ మీద చొక్కా వేసుకుని రెండు వీధుల అవతల వున్న మూర్తి ఇంటికి చేరాను.

వాకిట్లోనే ఎదురై చెంబుతో నీళ్లిచ్చింది. కాళ్ళు కడుక్కుని లోపలకు ప్రవేశిస్తూ ఆమె ముఖాన్ని చూస్తే అప్పటి వరకూ కంట నీరు స్రవించినట్లుగా తడిగా, కొంచెం ఉబ్బినట్లుగా వున్నాయి ఆమె కళ్ళు.

మూర్తి కి సంసారంలో నాకు తెలిసినంతవరకూ ఏ సమస్యా లేదు. చక్కని కుటుంబం. పిల్లలు అతని మాట జవదాటరు. వాళ్లకు ఆర్ధిక సమస్యలు అసలే లేవు. భార్యాభర్తల మధ్యన అపార్ధాలూ అలకలూ లేనేలేవు. మరిప్పుడు ఏమిటి కారణం ?

నా ముందుగా నడుస్తూ “అన్నయ్యగారూ! నాలుగు రోజుల నుంచి ఆయన మాట్లాడడం లేదు, ఏమి కావాలన్నా ఎవరొచ్చినా తన దగ్గర ఉన్న చిన్న స్లిప్పుల మీద రాసి ఇస్తున్నారు. అంతే ! ఏమిటో నాకు భయంగా ఉంది” అంటోంది ముక్కూ కళ్ళూ కలిపి కొంగుతో తుడుచుమంటూ.

కుంకుమరంగు వేంకటగిరి నేత చీర కట్టుకుంది, పచ్చని మేని చాయలో ఉన్న ఆమెకు ఆ చీరె,జాకెట్ భలేగా నప్పేయి. ఐదున్నర అడుగుల ఎత్తులో. మూర్తి కన్నా ఐదేళ్లు చిన్నది కావడం వల్ల  కొంచెం పుష్టిగా, ఆరోగ్యంగానే ఉంటుందామె.

నేను ఆమె వెనకాలే లోపలకు వెళ్లాను. హాలులో ఒక ఫైబర్ కుర్చీ లో కూర్చుని వున్నాడు మూర్తి. ఎప్పుడూ అతను కట్టుకునే రెండు రంగుల అంచులు వుండే గంధపు రంగు ఖద్దరు లుంగీ, పైన పొట్టిచేతుల ఖద్దరు తెల్ల చొక్కా. సుమారు ఆరడుగుల ఎత్తు లో ఎత్తుకు తగిన శరీరంతో, చామనచాయ రంగులో ఉంటాడు. సూటి గా వుండే ముక్కు, మరీ పెద్దవి కాని  కళ్ళు, విశాలమైన నుదురు. సన్నని మీసకట్టు, కోలముఖానికి తగిన గెడ్డం. బావుంటాడు.

మూర్తి, ఏటో చూస్తున్నాడు. నేను అడుగుపెడుతూనే  “ఏరా మూర్తి! ఏమిటీ వేషం ? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ ? ” అన్నాను. దగ్గరకు రమ్మని తన పక్కన కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. కూర్చున్నాను. వెంటనే తన దగ్గర చిన్న స్టూల్ మీద ఉన్న చిన్న తెల్లకాగితపు చీటీ తీసి అందులో రాసి నా చేతికి ఇచ్చాడు.

అందులో “ఇంతవరకూ నేను చాలా శక్తి ని కోల్పోయాను, ఎక్కువగా మాటలాడి. అలాగే సమాజంలో, పదిమందిలో, ఇంట్లో కుటుంబ సభ్యుల వద్దా నా వ్యక్తిత్వాన్ని కోల్పోయాను. లోకువ అయిపోయాను. అందుకని నా శేష జీవితాన్ని భగవన్నామస్మరణ లో గడిపేస్తాను ఇంతే !” అని రాశాడు.

సంఘం లో రకరకాల మనుషులు. ఉన్నపాటుగా వైఖరి మార్చేసుకుందామని అనుకుని వారేదో చేసేస్తుంటారు. కానీ కొద్దీ రోజుల్లోనే మళ్ళీ పూర్వ స్థితికి వచ్చేస్తారు. వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. అలాగే మూర్తి వెనకటి మామూలు స్థితి కి వచ్చేస్తాడని నాకు నమ్మకంగా వుంది.

“అమ్మా! ఇదంతా శాశ్వతం కాదు. నువ్వు అనవసరంగా కంగారుపడి, మీ పిల్లలను గాని, మీ తల్లితండ్రులను గాని, మూర్తి బంధువులను గాని పిలిపించకు. అతను కొన్ని  రోజుల్లో మామూలు స్థితికి వచ్చేస్తాడు” అన్నాను.

ఆమె లోనికి వెళ్ళింది.

మూర్తి మా మిత్ర బృందంలో అతిగా మాట్లాడే వ్యక్తి. డబ్బాగాడు, ఒహటే వాగుతాడు, ఎలా బతుకుతాడో ఏమో… అనుకునే వాళ్ళం. ఏదైనా చర్చ జరుగుతొంటే తనకు ప్రతీ విషయం తెలుసన్నట్లుగా అతిగా మాట్లాడేస్తాడు. ఎవరినీ మాట్లాడనియ్యడు, అతడిని  జోకర్ లా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి

మూర్తిని “ఓహో — ఆయనా! అబ్బా ఒకటే సొద బాబూ!ఎదుటి వాళ్ళని మాట్లాడనియ్యడు, చిన్నప్పుడు వాళ్ళ తల్లి గారు సరిగా మాటలు రాకపోతే వసకొమ్ము అరగదీసి పోసిందేమో ! వసపిట్టనుకోండి” అంటారు కొందరు.

ఇంట్లో భార్యకూడా నా దగ్గర అనేకసార్లు “ఆయన మాటల ధోరణి అంతే అన్నయ్యగారూ ! మా ఇంట్లో ఎవరినీ    నోరువిప్పనియ్యరు . ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే మాట. మా కుటుంబంలో వన్ వే ట్రాఫిక్ అనుకోండి”  అనేది ఎప్పుడూ.  మీరు కాస్సేపు మాట్లాడకుండా కూర్చోండి అని కేకలేసిన సందర్భాలు కూడా ఉన్నాయిట.

అతి గా మాట్లాడడం ఇత్తడి, మితం గా మాట్లాడం వెండి, మౌనం వహించడం బంగారం తో సమానం అని ఎక్కడో విన్నట్లు గుర్తు. అయితే మూర్తి ప్రపంచం లో అతి ఖరీదైన లోహం లోకి దిగాడన్నమాట. ఏది ఏమైనా మూర్తి ఎన్నుకున్న మార్గం సర్వోత్తమం అనిపించింది. ఈ మార్పు శాశ్వతం అయితే మూర్తి ఒక ఋషి, యోగి అవుతాడు.

నా ఆలోచనలకు  అంతరాయం కలిగిస్తూ మూర్తి శ్రీమతి కాఫీ కప్ తో వచ్చింది. “అయితే అన్నయ్యగారూ ! ఈయన అస్సలు ఇలా మౌనంగా ఉండిపోతే, నా పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ ఇద్దరమూ వాదించుకునే వాళ్ళం. మా ఇంట్లో ఇలా ఈయన మౌనం తో నిశ్శబ్డం ఆవరించుకుని ఉంటే  నా గతి ఏం  కాను ? ఎలాగోలా ఆయన్ను మాట్లాడించే ఉపాయం ఆలోచించండి ”అంది.

ఎక్కువగా మాట్లాడేవారిని నానా మాటలూ అని మౌనం గా ఉండేట్లు చేయడం ఒక రకం గా సాధ్యమయ్యే వ్యవహారం. మనసులో మార్పు  చెంది మౌనముని గా మారిన వ్యక్తిని ఎలా మాట్లాడించగలం ?

“అమ్మా! కాలం కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. నువ్వు కొన్నాళ్లు వేచి చూడు. అతని మనసులో ఏవో ఆలోచనలు ముసురుకుని మౌనాన్ని కలగచేశాయి– ఆ ముసురు తగ్గితే మళ్ళీ మనలోకి తప్పక వస్తాడు. ధైర్యం గా ఉండు. అతని దగ్గర కూర్చుని ఒహటే సొద పెట్టమాకు. అతని అవసరాలను కనిపెట్టుకుని చూడు ” అని లేచి నిలబడ్డాను.

అసలు మాట్లాడకపోతే- ఏమిటండీ బాబూ, ఈయన నోట్లోంచి మాట రాదు అంటారు. తక్కువగా మాట్లాడితే ఇదేంటండీ బాబూ తూచి తూచి మాట్లాడతాడీయన అనుకుంటారు. మరీ ఎక్కువగా మాట్లాడితే- అబ్బా ఈయనతో చస్తున్నాం బాబూ,  డబ్బా లో రాళ్ళేసి కదిపినట్లుగా ఒహటే వాగుతున్నాడేమిటండీ బాబూ! ఆసలు నిద్రపోతాడా ఈయన,  కనీసం అప్పుడైనా మాట్లాడకుండా ఉంటాడని…అని అంటుంటారు.

కానీ మరి మూర్తి ని మాట్లాడించాల్సి  వచ్చింది- ఇదేమిటీ  పరిస్థితి ? ఇంటికి నడుస్తున్నాను,  మూర్తి గురించి నా మదిని చుట్టుముట్టిన ఆలోచనలెన్నో!        

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles