12.3 C
New York
Monday, November 25, 2024

మా ఊరి గిరీశం

మా ఊరి  గిరీశం

                                                          బత్తుల వెంకట రమణమూర్తి                                                                                       9848987239

అప్పటికి ఆ సమావేశం మొదలై గంటవుతోంది. అందరిదీ ఒకటే మాట-  మాస్టారూ… ఆ గిరీశం సంగతి కాస్త చూడండి!

“మీ అందరూ చేయలేనిది, ఈ వయసులో నేనేం చేయగలను”…రామనాథం మాస్టారు నిస్సహాయంగా చూస్తూ అన్నారు.

“కొడితేనో, తిడితేనో వాడు మారే మనిషి అయివుంటే ఆ పని మేము ఎప్పుడో చేసేవాళ్లం మాస్టారూ! వాడివన్నీ పుల్లిరుపు వ్యవహారాలు. చెయ్యితడపందే వ్యవహారం నడపడు. పోనీ మనమే చేసుకుందామంటే ఏదో ఒక పుల్ల పెట్టి పని కానివ్వడు. మేమేం చేయాలి చెప్పండి” నిష్టూరంగా అన్నాడు పెద్దవీధి వీర్రాజు.

“ఆ గిరీశం ఎవరో, మీరా సుబ్బారావుకు ఆ పేరెందుకు పెట్టారో మాకు తెలియదుగాని, వీడు మాత్రం మా పాలిట శనీశంలాగా తయారయ్యాడు. మీరు దారిలోకి తేవాలి. లేకపోతే ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది” అంతా ముక్తకంఠంతో అన్నారు.

“సరే వెళ్లిరండి, ఏదో ఆలోచించి చెపుతాను”- రామనాథం నిరాశగానే అన్నారు.

ఆ ఊరివాడే గిరీశం. నాలుగు పదుల వయసు నిండకుండానే అన్ని అవలక్షణాలూ!  డబ్బుకోసం దళారీ అవతారం ఎత్తాడు. ఊరివాళ్లను పీక్కుతినడం మొదలెట్టాడు.వంద గడపల ఊరది. ఎక్కువమంది నిరక్షరాస్యులు. తొలిరోజుల్లో… సాయపడుతున్నాడని సంతోషించేవారు. ఐదో పదో అడిగితే పైన ఉన్నవారికి ఇవ్వాలి కాబోలని సర్దుకుపోయేవారు.రానురాను పని అంటే డబ్బులు రాబట్టడమే అలవాటుగా మారడంతో, గిరీశం ఊరివాళ్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. మాస్టారి వద్ద ఊరివాళ్ల ఫిర్యాదు అందుకే.

ఎనభై ఏళ్ల రామనాథం మాస్టారంటే ఆ ఊరివారందరికీ ఎంతో గౌరవం. గాంధీగారి శిష్యుడినని గర్వంగా చెప్పుకుంటారు. ఎంతటి సమస్యకైనా గాంధీగిరీతో  పరిష్కారం చూపించగలరని ఊరివారి నమ్మకం. అందుకే ఆయనను ఆశ్రయించారు.

 *****

“ఏం గిరీశం… పెందలాడే బయలుదేరావు. పైగా మంచి హుషారుగా ఉన్నావు. మళ్లీ ఏదైనా పనితగిలిందా” రామనాథం పిలుపుతో ఉలిక్కిపడ్డాడు సుబ్బారావు ఉరఫ్ గిరీశం.

“నమస్కారం మాస్టారూ!. కొత్తగా వచ్చిన హుషారేముందండీ? ఎప్పుడూ ఉన్నదేగా. పనిమీద పట్నం వెళ్తున్నాను. అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదు” కాస్త కంగారుగా, కాసింత మొహమాటంగా చెప్పాడు సుబ్బారావు.

ముఖంపై నవ్వు పులుముకున్నా,  ఉదయాన్నే ఈ పెద్దాయన  తగులుకున్నాడేంటా అని మనసులోనే తిట్టుకుంటున్నాడు.

“ఊరికి కావాల్సినవాడివి. నీకు కాకపోతే,  రిటైరై ఇంట్లో కూర్చున్న నాలాంటి వాడికి పనులుంటాయా చెప్పు…” రామనాథం నవ్వుతూ అన్నారు.

ఆయన మాటల్లో ఏదో వెటకారం ధ్వనించింది సుబ్బారావుకు. “మాస్టారూ! మీరేమీ అనుకోకపోతే ఎంచక్కా సుబ్బారావు పేరుతో  పిలవరాదూ. గిరీశం ఎవడోగాని, మీరలా పిలవడం మొదలెట్టినప్పటి నుంచి ఊరివాళ్లంతా నా పేరే మర్చిపోయారంటే నమ్ముతారా? మీరంటే పెద్దవారు, పైగా మీ శిష్యుడిని. మీమీద గౌరవంతో ఏమీ అనలేకపోతున్నాను. కానీ ఊరిలో ప్రతి ఒక్కడూ అలా వెటకారంగా పిలుస్తుంటే ఎక్కడలేని కోపం వస్తోంది. అప్పటికీ కసురుకుంటున్నా. ఎంతమందిని అలా కసురుకోగలను చెప్పండి” నిష్టూరంగా అన్నాడు గిరీశం.

“అదేమిటి గిరీశం…ఆ పేరును అంత చులకనచేసి తీసిపారేస్తున్నావు.  గిరీశం అంటే ఎవరో నీకు తెలుసా? చాలా పెద్దమనిషయ్యా. ఆయన గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవు” రామనాథం నవ్వుతూనే సమాధానమిచ్చారు.

“గొప్పోడైతే నాకా పేరు మీరెందుకు పెడతారు మాస్టారూ!  పేరు అరువు తెచ్చుకోవాల్సిన ఖర్మ నాకేంటి చెప్పండి. మా అమ్మానాయినా  పెట్టిన పేరు ఎంచక్కా ఉందిగా. మీరు ఆ పేరుతోనే పిలిస్తే సంతో షిస్తాను” కోపం తన్నుకువస్తున్నా నిగ్రహించుకుంటూ అన్నాడు సుబ్బారావు.

“మరీ అలా బాధపడకు గిరీశం-ఓ…సారీ సుబ్బారావ్!  నా శిష్యుడివి, నిన్ను తక్కువ సి మాట్లాడుతానా చెప్పు? నేను పుట్టక ముందే పుట్టాడా గిరీశం!  చాలా పేరు ప్రఖ్యాతులున్నోడయ్యా. అందుకే నీకా పేరు పెట్టాను”

“మీకు వంద నమస్కారాలు మాస్టారూ! మీరు పనిపడిందా అన్నా… ఎవడి పనైనా  అయిపోయిందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు హుషారుగా ఉన్నావేంటి అంటే- ఎవరి ఉసురు తీస్తున్నావు అన్నట్టు వినిపిస్తుంది. ఇప్పుడీ కొత్త పేరుతో మరీ ఇబ్బందిగా ఉంది. వాడెవడో మహానుభావుడుగాని, దయచేసి నానుంచి తీసేయండి,  మీకు దండం పెడతాను”…సుబ్బారావు ఉడుక్కుంటున్నాడు.

“మరీ అలా డీలాపడకు సుబ్బారావ్ ! నువ్వేంటో, నీ వ్యాపకాలేంటో పూర్తిగా తెలిసాకే నీకా పేరు పెట్టాలనిపించింది. పోనీ ఆ గిరీశం ఎవరో నీకు చెప్పనా, అప్పుడైనా ఇష్టపడతావేమో…’ మాస్టారు చనువుగా అడిగారు.

“అర్జంటు పనిమీద బయటకు వెళ్తున్నాను మాస్టారూ! ఇప్పుడా జంఝాటం వద్దు. నామాట మన్నిస్తే మన్నించండి, లేకపోతే మీ దయ. అయినా మీకు నేనేం అన్యాయం చేశానండి… ఆడెవడితోనో పోల్చుతున్నారు. మిమ్మల్ని నేను గురువులా భావిస్తుంటే,  మీరేమో నన్ను గురివింద గింజనని ఎగతాళి చేస్తున్నారు. ఏనాడైనా మీ వద్ద రూపాయి పుచ్చుకున్నానా, మీ పని చేయిస్తానని నమ్మించానా, మరెందుకు నామీద కక్ష? అయినా ఆ గిరీశం ఎవరో తెలుసా? అంటే నాకేం తెలుస్తుంది చెప్పండి. మహా అయితే ఏ హెూటలోడో, కిళ్లీ కొట్టువాడో అయివుంటాడు. ఎవుడినో తల్చుకుని నన్నడిగితే నేనేం చెబుతాను. నామీద దయుంచి ఆ పేరు తీసి పుణ్యం కట్టుకోండి. మీ పాదాలు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుంటాను” చిరాకు బయటకు కనిపించకుండా అన్నాడు సుబ్బారావు ఉరఫ్ గిరీశం.

“అదయ్యా సంగతి.హెూటల్ వాడో, కిళ్లీ కొట్టువాడో అనుకుంటున్నావంటే- నీకా గిరీశం గురించి తెలియక అలా బాధపడుతున్నావు.  నిజంగా తెలుసుంటే ఇలా మాట్లాడి ఉండేవాడివి కావని ఇప్పుడనిపిస్తోంది. పోనీలే వదిలేయ్”మాస్టారు వ్యంగ్యంగా అన్నారు.

సుబ్బారావుకు చిరాగ్గా ఉంది. ఈయన నుంచి ఎలా తప్పించుకోవాలా అని అసహనంగా చూస్తున్నాడు.

“ఏదో అభిమానంకొద్దీ మాట్లాడుతున్నాగాని,  నువ్వంటే నాకు కోపం ఎందుకు ఉంటుంది చెప్పు గిరీశం? బతకలేని బడిపంతులు ఉద్యో గానికి ఇరవై ఏళ్ల క్రితమే  రాంరాం చెప్పేశాను. గవర్నమెంటువాళ్లు ఇచ్చే నాలుగు పింఛన్ డబ్బులు అందుతున్నాయి. కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేస్తున్న నాకు నీతో చేయించుకునే పనులేముంటాయి? కానీ ఊరికి కావాల్సిన నీలాంటివాడిని అలా ఊరికే వదిలేస్తే నా పెద్దరికం ఏమయిపోవాలి?  అందుకే అభిమానం చాటుకుంటున్నాను”మాస్టారు నిబ్బరంగా అన్నారు.

“మీ మాటల్లోని అంతరార్థం తెలుసుకునేంత తెలివితేటలు నాకు లేవు. వాదించి గెలవగలనా చెప్పండి”సుబ్బారావు దీనంగా ముఖంపెట్టాడు.

“అదేంటయ్యా….ఆఫీసులచుట్టూ తిరుగుతూ కంచు కంఠంతో అందరినీ కడిగి పారేస్తుంటావని మనవాళ్లు చెబుతుంటారు. నువ్వేమో అలా డీలాపడి మాట్లాడుతున్నావు?అది సరేగాని,  ఏంటయ్యా పింఛన్ ఇప్పిస్తానని ఆ మహాలక్ష్మి దగ్గర వెయ్యి నొక్కేసావని ఊరంతా చెప్పుకొంటున్నారు. ఇంతకీ పని పూర్తయ్యిందా? లేదా?”

ఉలిక్కిపడ్డాడు సుబ్బారావు. డబ్బులు సంగతి ఊరందరికీ చెప్పిందన్నమాట.

“అదేం మాట మాస్టారూ! డబ్బులు నాకోసం అడుగుతానా చెప్పండి,  పై వాళ్లకు ఇవ్వకుండా పనులెలా అవుతాయి? ఏదో ఊరికి ఉపకారం చేద్దామని కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాను. బస్సులకు, ఆటో రిక్షాలకు ఇంతింత ఖర్చవుతున్నా ఎవరినైనా ఏ రోజైనా పైసా అడిగానా చెప్పండి, రూపాయి పుచ్చుకున్నానేమో అడగండి. పై వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే ఇచ్చి నాకేదో ఇస్తున్నట్టు ఇలా నన్ను అప్రతిష్టపాలు చేస్తే నేనేం చేయను? ఇంక ఎవరికీ ఉపకారం చేయకూడదనుకోవడం తప్ప”…సుబ్బారావు కోపంగా ముఖంపెట్టాడు.

“అంతేనయ్యా- కాసే చెట్టుకే రాళ్లు, డబ్బులు తీసుకున్నవారికే మాటలు అని ఊరికే అన్నారా చెప్పు? అయినా నీకిదేమైనా కొత్తా, కొన్నేళ్లుగా ఇలా నువ్వు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎందరి పనులు చేయించలేదు”…రామనాథం వెటకారం దాచుకుంటూ అన్నారు.

“అదే మాస్టారూ  వీళ్లతో వచ్చిన సమస్య? పని అయ్యేదాకా ప్రాణం తీసేస్తారు. తీరా చేయించాక అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు అని ప్రచారం చేస్తారు. కాస్త చెయ్యి తడపకుండా పనులయ్యే రోజులా ఇవి, మీరే చెప్పండి” సుబ్బారావు నిష్టూరంగా అన్నాడు.

“నువ్వన్నదీ నిజమేనయ్యా….కానీ పేదోళ్లు కదా, అంతంత డబ్బు ఎక్కడినుంచి తెస్తారు? అష్టకష్టాలుపడి అప్పోసప్పో చేసి తెచ్చిస్తారు కదా, కడుపుమంట దాచుకోలేక అలా అనేస్తుంటారు. మహాలక్ష్మినే తీసుకో. నీకు వెయ్యివ్వాలని తన చెవిపోగులు తాకట్టు పెట్టిందంట. మరి ఎంత కష్టమో చూడు”

“నిజమే కానీ,  ఇప్పుడు నెలనెలా పింఛన్ వస్తోందిగా- వాటిని విడిపించుకోవడం పెద్ద కష్టమా చెప్పండి? ఓ నెల పింఛన్లో సగం ఖర్చుకే అలా అయిపోతే ఎలా”

“మన చంద్రరావు ఉన్నాడు… వ్యాపారానికి కనాకష్టంగా ఉంది,సొసైటీలో లోనిప్పించవా అన్నాడు. మూడువేలు తీసుకున్నా 30 వేలు లోను ఇప్పించానా లేదా చెప్పండి. అంతెందుకు మన గురవయ్య ఉన్నాడుగా. మిషనెట్టుకోవాలని రెండు లక్షల లోనుకోసం ఏడాది క్రితం దరఖాస్తు పెట్టుకున్నాడు. మరి వచ్చిందా?” కాసేపు ఆగి మాస్టారి వైపు చూస్తున్నాడు సుబ్బారావు.

ఆయన నవ్వుతూ అతనివైపే చూస్తున్నారు.

“రాదు మాస్టారూ! మీ రోజులు కావివి. గురవయ్యా! పదేలు నీవి కావు అనుకో, లోను వచ్చిపడుతుందని అన్నాను. ఊ అన్నాడు. నెలరోజులు తిరక్కముందే ఆ అకౌంట్లో రెండు లక్షలు జమైపోయాయి. ఎవరికీ ఏమీ ఇవ్వకుండానే ఈ పనులైపోతున్నాయా మాస్టారూ! పనులు కావాలి, పైసా ఖర్చుకాకూడదంటే ఎలా? పనిచేశాక నన్ను ఆడిపోసుకుంటూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఊరివాళ్లన్న అభిమానానికి పనులు చెయ్యాలా, వదిలెయ్యాలా మీరే చెప్పండి”

మాస్టారు కాసేపు మౌనం వహించారు.

మన దెబ్బకి మాస్టారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టుంది అనుకున్నాడు సుబ్బారావు ఉరఫ్ గిరీశం. ఆయన ఏం చెబుతాడా అని చూస్తున్నాడు.

“అదే నీ గొప్పతనం! చేసినదాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఒప్పేసుకుంటావు. అందరి పనులు చేస్తూ తృణమో పణమో తీసుకుంటానన్నది నీ ఉద్దేశం.  ఈ జనం అర్థం చేసుకోవడం లేదన్నమాట”

“ఏమో మాస్టారూ! నేనింత కష్టపడుతున్నా నా ఊరివాళ్లే నా ఇజ్జత్  తీసేస్తుంటే నాకు బాధగా ఉంది. అన్నీ తెలిసిన మీలాంటోళ్లు కూడా వాటిని నమ్ముతుంటే ఇంకా బాధనిపిస్తోంది. ఇక ఎవరి పనుల  జోలికీ వెళ్లకూడదని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ నా దగ్గరికి వచ్చినవారిని చూశాక వెళ్లకుండా ఉండడానికి మనసొప్పదు. ఏం చేస్తాను, అది నా బలహీనత” త్యాగమూర్తిలా ముఖంపెట్టాడు గిరీశం.

“చూడు గిరీశం. మనగురించి ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దానికో కారణం ఉండే ఉంటుంది.  అర్థం చేసుకోవాలి. ఊరివాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. నాలాంటివాడు జోక్యం చేసుకుని “గిరీశం సేవా దృక్పథం తోనే ఈ పనులు చేస్తున్నాడ”ని చెబితే ఎవరైనా నమ్ముతారా చెప్పు? పైగా మాస్టారి శిష్యుడు కాబట్టి వెనకేసుకొస్తున్నారని అనరా? ఇంకా కోపం వస్తే- నువ్వు తీసుకున్న దాంట్లో నాకూ వాటా ఉందని అనేసినా అనేస్తారు, అవునంటావా కాదంటావా చెప్పు” రామనాథం ముఖం ఆవేదనగా పెట్టారు.

“అదే మాస్టారూ  నా బాధ! ఇంత కష్టడి ఊరందరి కోసం ఎండనక వాననక తిరుగుతుంటే కనీసం గుర్తించడం లేదు సరికదా అడిపోసుకుంటున్నారు. ఇదెక్కడి అన్యాయం”…సుబ్బారావు వాపోయాడు.

” అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. నీ గొప్పతనం, నీ కష్టం ఈ ఊరికి అర్థమయ్యేలా చేయాలంటే ఏం చేయాలో నేను చెబుతానుగాని, అవసరమైన ఏర్పాట్లు నువ్వు చూడు” అంటూ చెవిలో గుసగుసలాడారు మాస్టారు.

సన్మానం అనగానే ఎక్కడిలేని శక్తి వచ్చినట్టయింది సుబ్బారావుకు.నిజమే మన గొప్పతనం గురించి ఎంతమందికని చెబుతాం. అదే ఊర్లోనే ఓ మీటింగ్ పెట్టి నలుగురు పెద్ద మనుషులను, అదికారులను పిలిచి మనగురించి చెబితే ఎంత చక్కగా ఉంటుంది? ఊరివాళ్లకు మన గొప్పతనం తెలుస్తుంది, వచ్చిన అధికార్లకు పరిచయం అయినట్టవుతుంది-.ఈ ఆలోచనరాగానే ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.“వచ్చే ఆదివారానికే ఏర్పాట్లు చేస్తాను మాస్టారూ!  మనోళ్లకు నేను పురమాయిస్తాను, ఊర్లో పనులు వాళ్ళు  చూస్తారు, ఎవరెవరిని  పిలవాలో మీరే ఆలోచించుకుని నిర్ణయించండి” అని చెప్పి హుషారుగా వెళ్లిపోయాడు.

 *****

ఆరోజు గిరీశం సత్కార కార్యక్రమం.

రామనాథం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. అదో కొత్త అనుభవంలా ఉంది గిరీశానికి. ఎప్పుడూ స్టేజ్ దిగువన నిలబడడమే తప్ప, మీద కూర్చునే అవకాశం రాలేదు. పైగా ఓ వైపు మండల తహసీల్దారు, మరోవైపు ఊరి పరిధి పోలీస్ స్టేషన్ సీఐ, ఇంకోవైపు పెద్ద బ్యాంకు మేనేజర్, అటువైపు కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టరు…ఇలా అందరూ ముఖ్యులే. అలాంటి పెద్దవాళ్లతో కలిసి వేదిక పంచుకోవడం గిరీశానికి థ్రిల్లింగ్ గా ఉంది. కాసేపటికి సభ ప్రారంభమైంది. రామనాథం మాట్లాడుతున్నారు.

” మన ఊరి మనిషి, మనకు కావాల్సిన మని షి, మనందరి నోట్లో నాలుకలా ఉన్న గిరీశాన్ని అదే మన సుబ్బారావును ఈరోజు సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చెయ్యి తడపనిదే ఎక్కడా పనిజరగని ఈ రోజుల్లో రూపాయి ఖర్చులేకుండా, పిసరంత శ్రమ మనం పడకుండా అంతా తానై మన పనులు చేసిపెడుతున్న వ్యక్తి గిరీశం. అటువంటి వ్యక్తిని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడం. అవునా? కాదా?”

వేదిక ముందు కూర్చున్నవారంతా చప్పట్లు కొట్టారు.

వేదిక మీద కూర్చున్న గిరీశం మాత్రం గతుక్కుమన్నాడు. “ఏమిటీ మేటరు ఇలా ట్విస్ట్ చేస్తున్నాడు?  ఊరంతా నేనేదో డబ్బులు నొక్కేస్తున్నానని, ప్రతి పనికీ ఇంత రేటని చెప్పి వసూలు చేస్తున్నానని, డబ్బులు ఇవ్వని వారి పనులు జరగకుండా అడ్డుకుంటున్నానని ఫిర్యాదులు చేస్తుంటే … పైసా కూడా ముట్టని నికార్సయినోడినని చెబుతున్నాడు. ఇందులో ఏదైనా మతలబు ఉందా…ఏంటో ఈ మాస్టారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం” అనుకుంటూ  అసహనంగా కదిలాడు.

రామనాథం ప్రసంగం కొనసాగిస్తున్నారు.

“మొన్నటికి మొన్న మన దిగువ వీధి మహాలక్ష్మి పింఛన్ కోసం దరఖాస్తు చేస్తే,  ఆ తాసిల్దారు ఆఫీసులో ఓ గుమస్తా వెయ్యి రూపాయలు అడిగాడట. మహాలక్ష్మి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలదు? విచారంలో ఉండగా మన గిరీశం ఉరఫ్ సుబ్బారావు జోక్యం చేసుకుని ఆ దరఖాస్తు తీసుకుని రూపాయి ఖర్చులేకుండా పింఛన్ ఇప్పించాడు”…మాస్టారు కాసేపు ఆగారు.

అదే సమయంలో వేదికపై  ఉన్న గిరీశంతోపాటు తహసీల్దారు కూడా అసహనంగా కదిలారు.

పింఛన్ కోసం రెవెన్యూ ఉద్యోగి లంచం అడిగాడని తనముందే ఆ పెద్దాయన చెప్పడంతో  తహసీల్దార్  ముఖంలో రంగులు మారుతున్నాయి.

మరోవైపు- ఇప్పుడీ మహాలక్ష్మి గొడవెందుకని గిరీశానికీ టెన్షన్ గా ఉంది. తత్తరపాటుకు గురవుతున్నాడు.

రామనాథం ప్రసంగం కొనసాగిస్తున్నారు.“ చంద్రరావు ఏదో పథకంలో 30వేల సాయం ప్రభుత్వం అందిస్తుందంటే,  దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కో ఆపరేటివ్ బ్యాంకు గుమస్తా మూడువేలిస్తేగాని ఫైల్ కదపనని పట్టుబట్టాడట. డబ్బులిచ్చాక అందులో మినహాయించుకోండన్నా ససేమిరా అన్నాడట.  చంద్రరావు అంత సొమ్ము ఒకేసారి ఎక్కడినుంచి తేగలడు? అందుకే రుణం వద్దు, ఆ పథకం వద్దు అని నిరాశలో కూరుకుపోయి కూర్చుంటే విషయం తెలుసుకున్న మన గిరీశం రూపాయి ఖర్చులేకుండా తానే ఆ పనిచేయించాడు. అంత సాయం చేసిన మన గిరీశాన్ని సత్కరించడం అవసరమా? కాదా? మీరే చెప్పండి?”

మళ్లీ  చప్పట్ల మోత మోగింది.

వేదిక మీదున్న గిరీశానికి చెమట్లు  పట్టేస్తున్నాయి. ఈ మాస్టారు నా పుట్టి ముంచే ఎత్తుగడతోనే  ఈ ఏర్పాటు చేశాడని భయపడుతున్నాడు.

వేదిక పై  ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకు డైరక్టర్ కు కూడా చికాగ్గా ఉంది. తమ బ్యాంకు సిబ్బంది అవినీతి గురించి అంత బాహాటంగానే ఈ పెద్దాయన చెప్పడంతో అతని ముఖం వాడిపోయింది. అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు.

“ఇక మన గురవయ్య సంగతి చూద్దాం. రోజులు మారాయి, ఇప్పుడంతా ఆధునిక కాలం. తన గానుగ ఎద్దుతో పని జరగడం లేదని మిషన్ పెట్టుకోవాలనుకున్నాడు. అందుకు రెండు లక్షలు కావాలని బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టడానికి పది శాతం కమీషన్ కావాలన్నడట అక్కడో పెద్దమనిషి! బతుకుతెరువుకోసం మిషన్ పెట్టుకోవాలనుకునే గురవయ్యలాంటోళ్ళు  ఉన్నపళాన వేలకు వేలు ఎక్కడి నుంచి తేగలరు? అందుకే ఇది మనవల్ల అయ్యే పనికాదని తనకుతానే నిమ్మళించుకున్నాడు. కానీ ఆ సమయంలో నేనున్నాను అంటూ ఆదుకున్న మనిషి ఎవరో తెలుసా?…” రామనాథం ఓసారి వేదిక ముందున్న వారివైపు చూశారు.

“గిరీశం…గిరీశం…” అని పది మంది కుర్రాళ్లు అనడం, వెంటనే మిగిలిన రు చప్పట్లతో మోతమోగించడం జరిగిపోయాయి.

“అటువంటి గిరీశం మన ఊరివాడు కావడం, ఈరోజు మనం అతన్ని సత్కరించుకోవడం మనల్ని మనం సత్కరించుకోవడం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను”

 పందిట్లో మళ్లీ చప్పట్ల మోత.

సుబ్బారావు మాత్రం భయంతో గుటకలు మింగుతున్నాడు.

“ఇలా ఎన్నని చెప్పను? పోలీస్ స్టేషన్ కెళితే లంచం, ఆఫీస్ కెళితే లంచం, బ్యాంకుకు  వెళితే లంచం…ఇలా అందరి చెయ్యీ  తడపాలంటే పేదోళ్ల వల్ల అవుతుందా, చదువురానివాళ్లు పనులు చేయించుకోగలరా? అలాంటి వాళ్లందరినీ  నేనున్నానంటూ ఆదుకుంటున్న గిరీశంలాంటి వాళ్లు ప్రతి ఊర్లో ఉండాలని నా అభిప్రాయం. లేదంటే పేదోళ్లను, నిరక్షరాస్యులను ఎవరాదుకుంటారో వేదిక నలంకరించిన పెద్దమనుషులే చెప్పాలని కోరుతూ  సెలవు తీసుకుంటున్నాను”….అంటూ  రామనాథం మాస్టారు తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు.

అప్పటికే గిరీశం ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. అసలే సీఐ కూడా వచ్చివున్నాడు. అతనితో కూడా ఇద్దరు కాని స్టేబుళ్లున్నారు.గిరీశం వణికిపోతున్నాడు.

ఇంతలో సహకార బ్యాంకు డైరెక్టర్ మాట్లాడడం మొదలుపెట్టాడు.

“సహకార బ్యాంకులోనే సహకారం ఉంది. అటువంటప్పుడు లంచం అడిగింది ఎవరోగానీ,   తెచ్చి నాముందుంచాల్సిందిగా మాస్టారిని కోరుతున్నాను. మీరు రుణం కోసం దరఖా  చేసుకుంటే అన్ని అర్హతలూ  ఉన్నప్పుడు దానికదే మంజూరవుతుంది. అందువల్ల మీరెవరికీ లంచాలు ఇవ్వక్కర్లేదని తెలియజేస్తున్నాను.మీరు రుణం కోసం వెళితే ఎవుడైనా డబ్బులు అ గితే నా నంబర్ కి ఫోన్ చేయాలని కోరుతున్నాను” అంటూ తన నంబరు చెప్పి  ప్రసంగం ముగించాడు.

అతను చెప్పిన నంబరు చాలామంది తమ సెల్ ఫోన్లలో ఫీడ్ చేసుకున్నారు.

ఆ తర్వాత సీఐ మాట్లాడాడు.  “పోలీసులంటే ప్రజల్లో ఓ భాగం. నిత్యం మీ రక్షణ కోసం పనిచేసే మాకు ఎవరూ రూపాయి ఇవ్వక్కర్లేదు. మాకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది మీ సేవ చేయడానికే. పరిస్థితి బట్టి  నా నంబరుకు ఫోన్ చేయాలని కోరుతున్నాను” అంటూ తన నంబర్ చెప్పాడు.

అది  కూడా చాలామంది ఫోన్లలో ఫీడైపోయింది.

బ్యాంకు అధికారి ప్రసంగం మొదలు పెట్టాడు. ” అన్ని అర్హతలు, అవసరమైన ష్యూరిటీలు ఉంటే బ్యాంకు ఎవరికైనా రుణం ఇస్తుంది. మేమెందుకు డబ్బులు ఆశిస్తాం? తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందాలనుకునేవారు మాత్రమే ఇలా లంచాలు ఎరజూపి పనిచేయించుకోవాలని చూస్తారు. మీకు అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తే,  నేరుగా బ్యాంకు అధికారులనే రుణం కోసం సంప్రదించండి.ఒకవేళ మా బ్యాంకులో మీకు పని జరగడం లేదని అనుమానం వస్తే నేరుగా నా ఛాంబరుకు  వచ్చి  కలవండి’ అన్నాడు.

చివరిలో తహసీల్దార్ మాట్లాడడానికి లేచారు. “రెవెన్యూ శాఖ అంటే అవినీతిమయం అని ముద్రపడిన మాట వాస్తవమే. కానీ అది పూర్తిగా నిజం కాదని నా 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. అన్ని శాఖల మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అవినీతి పరులు కొందరు  ఉన్నారు. నూటికి ఒకరో, ఇద్దరో అలాంటి వారుంటారు. నిబంధనల మేరకు నిజాయితీగా  పనిచేసేవారే ఎక్కువ ది. ఎవరైతే తప్పుడు పత్రాలు కోరుకుంటారో, తప్పుడు విధానంలో వెళ్లాలనుకుంటారో వారే లంచాలు ఇవ్వజూపుతారు. దళారీలను ఆశ్రయించి పనులు చేయించుకోవాలని చూస్తారు. ఈ దళారీలు తాము తీసుకున్న దానికి లెక్క చెప్పాలని రెవెన్యూ సిబ్బంది పేరు చెబుతుంటారు. వంద శాతం అది నిజం కాదు. రెవెన్యూ కార్యాలయంలో ఏ పని ఉన్నా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోండి. లేదంటే మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు అందించండి. ఇలాచేస్తే నియమిత కాలంలోనే మీ పని కచ్చితంగా జరుగుతుంది. ఇందుకు ఎవరికీ రూపాయి అయినా ఇవ్వక్కర్లేదు. డబ్బులు ఇవ్వక పోవడం వల్లే మీపని కావడం లేదని మీకు అనుమానం వస్తే,  నేరుగా నా సెల్ నంబర్ కి ఫోన్ చేయండి, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఉప్పందించండి” అంటూ సుదీర్ఘంగా ప్రసంగించి ముగించారు.

అందరి ప్రసంగాలూ  పూర్తయ్యేసరికి,  గిరీశానికి నిప్పుల  కుంపటిమీద కూర్చున్నంత  ఫీలింగ్ కలుగుతోంది.

“మాస్టారూ! ఎంతైనా గాంధీగారి కాలంనాటి బుర్ర మీది. నన్ను మంచివాడని, సహాయపడేవాడని  చెబుతూనే తెలివిగా నన్ను ఊరివాళ్ల ముందు నిలబెట్టేశారు.  ఇన్నాళ్ళూ  పనులు పేరు చెప్పి నేను తీసుకున్న డబ్బులన్నీ నేనే నొక్కేశానని చెప్పకనే చెప్పించారు. ఇప్పుడు విషయం అందరికీ అర్థమయ్యాక,  ఇక ఊర్లో దక్కే విలువేంటో నాకు తెలియదా? నాకు సత్కారం అన్నప్పుడు అనుమానించకుండా సై అన్నాను చూడండీ…నాకు తగిన శాస్తే చేశారు”….గిరీశం తనను తానే తిట్టుకుంటూ చెంపలు వాయించుకున్నాడు.

ఆ తర్వాత అధికారులు, ఊరి పెద్దల ఆధ్వర్యంలో పెద్ద పూలదండ మెడలో వేసి సత్కారం చేస్తున్నా… గిరీశానికి ఏదో ముళ్ళ  కిరీటం పెట్టినట్టుంది. మెడలో పూలదండ కాలసర్పంలా కనిపిస్తోంది. ఇక ఊరిలో తలెత్తుకు తిరగడం ఎలా అనే  ఆలోచనే అతడిని భయపెడుతోంద

********************

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles