మంగు కృష్ణకుమారి
2023 దీపావళి కథల పోటీలో అయిదవ బహుమతి పొందిన కథ
విజయగర్వంతో స్వామివారి చేతిమీద, వెండి సీతారాముల బొమ్మ బహుమానం తీసుకుంది చాముండి. పక్కనే ఆమె భర్త శివప్రసాద్ ఉన్నాడు.
ఉత్తరాది వ్యాపారి ఒకతను ఆధ్యాత్మిక చింతన చాలా ఉన్నవాడు. అతను తనకి గురువయిన స్వామి రామానంద ఆధ్వర్యంలో ఒక క్రతువు నిర్వహించేడు.
కొన్ని ఎకరాల మైదానం దున్నించి పోటీలో పాల్గొంటున్న జంటలందరికీ అరకలు ఇచ్చేడు.
భూమిలో అక్కడక్కడ సీతాదేవి బొమ్మలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఎవరికి మొదట సీత దొరికితే వాళ్ళు జనకుడూ, భార్య రత్నమాల.
చాలా ఉత్సాహంగా సాగిన పోటీలో చాముండికే మొదట సీత దొరికింది. నవ్వులూ సరదాల మధ్య సభ ముగిసింది.
ఇంటికి వచ్చి అలసటగా కూచుంది చాముండి. ఫోన్ మోగింది. తమ్ముడు శంకరం.
“ఏమిట్రా?” అడిగింది.
“అక్కా నీకో గుడ్ న్యూస్. మేం ఒక పాపనీ, బాబునీ పెంచుకుంటున్నాం.
వచ్చేవారమే బారసాల. నువ్వు రేపే వచ్చీ… అమ్మకి సాయం ఉండాలి కదా” గబగబా చెప్పేడు.
“చాలా సంతోషంరా. పిల్లల వివరాలు చెప్పు” అంటూండగానే శంకరం శివప్రసాదుతో మాటాడి పెట్టేసేడు.
చాముండి ఆత్రంగా “ఏమన్నాడండీ…. నాకు ఒక్కముక్క సరిగ్గా చెప్పలేదు” అంది.
శివప్రసాద్ “నాకూ ఏ వివరాలూ చెప్పలేదు. కవలపిల్లలట. ఇద్దరినీ పెంచుకుంటారట. సరే
నిన్ను వేగం రమ్మంటున్నాడు…. రేపే ఫ్లెట్ కి ఎక్కించిస్తాను” అన్నాడు.
తమ్ముడికి పిల్లలు లేకపోడం చాముండికి ఆమె ఇద్దరు చెల్లెళ్ళకీ కూడా బెంగే.
తమ్ముడు ఒక్కడే కొడుకు వాళ్ళమ్మా నాన్నలకి. అతనికి కొడుకు పుట్టకపోతే, పుట్టింటి వంశం ఏం కావాలని బెంగ.
శంకరం దురదృష్టం ఏమో, అతని భార్యకిమూడు నెలల కిందట నాలుగో కానుపు బిడ్డకూడా దక్కలేదు. అందరూ విచారించేరు.
పిల్లలనీ, భర్తనీ కూడా నాలుగు రోజుల్లో రమ్మని చెప్పి పుట్టింటికి చేరింది చాముండి.
ఇంట్లో పిల్లలు నిద్రపోతున్నారేమో, నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి తల్లి కామేశ్వరి కనిపించింది. కూతురిని చూసి “రావే…” అంటూ మంచి నీళ్ళు తెచ్చింది.
చాముండి మంచినీళ్ళు తాగి “శంకరం, అఖిలా ఏరమ్మా? పిల్లల సందడే లేదేమి?” అంది.
కామేశ్వరి విచారంగా “ఏం చెప్పమంటావే? నీ తమ్ముడు చేస్తున్న ఘన కార్యం ” అంది.
“ఏమయిందమ్మా?””
“నాకూ నిన్నటిదాకా చెప్పలేదు. అఖిలకి ఆ మధ్య కానుపులో బిడ్డ నష్టం జరిగింది కదా….అప్పుడు దానికి ఆరోగ్యం బాగాలేక ఓ నాలుగు రోజులు హాస్పిటల్ లో ఉంది. అప్పుడే పక్కనే ఉన్న జనరల్ వార్డ్ లో ఆమెకి కవలలు పుట్టేరు. తెల్లారేసరికి ఆవిడ పిల్లలని వదిలి పారిపోయింది. హాస్పిటల్ అందరూ చెప్పుకున్నారు.
శంకరం అఖిలా ఇద్దరూ ఈ పిల్లలిద్దరినీ పెంచుకుంటాం అని హాస్పిటల్ మేనేజ్మెంట్ ని ఒప్పించేరట.
“ఏవిటీ? ఎవరో తెలీని పిల్లలా? ఇదెక్కడి కర్మ?” గట్టిగా అంది చాముండి.
“చంటి పిల్లలిద్దరూ అండర్ వెయిట్ తో పుట్టేరని హాస్పిటల్ లో నెలరోజులు ఉంచి ఇచ్చేరట. అఖిలకి పిల్లలని సాకడం రాదని భయపడితే, అక్కడి హెడ్ తనింట్లో నెల పైనే ఉంచుకొని దీనికి ట్రయినింగ్ ఇచ్చిందిట. మొన్న నీ తమ్ముడు నాకు చెప్పేడు. నేను వద్దన్నా వినకుండా నిన్న పిల్లలిద్దరినీ తెచ్చేసేడు. మీ అందరికీ రమ్మని ఫోన్లుచేసేడు. ఇహ ఒకొక్కళ్ళూ దిగుతారు” ఆగి కళ్ళనీళ్ళు తుడుచుకుంది కామేశ్వరి.
చాముండికి గుండెల్లో హోరులా ఉంది
“అది కాదమ్మా, అసలు ఆ తల్లి గురించి ఏమీ తెలీదా?” అంది.
“ఏమోనే ఎవరో ఆడావిడే జాయిన్ చేసిందిట. సులువుగా డెలివరీ అయిపోయిందిట. తెల్లారికి పారిపోయేరు. ఓ కులం, గోత్రం తెలీదు. ఏ పనిమనుషులో, పెళ్ళి కాకుండా కనిపారేసిందో తెలీదు. అసలు ఏ హరిజనులో, గిరిజనులో తెలీదు. మొగుడూ పెళ్ళాం ఇటు నన్నూ, అటు వాళ్ళ వాళ్ళని అడక్కుండా ఇంతపని చేసేరు” భారంగా అంది కామేశ్వరి.
“ఏమిటమ్మా, ఉప్పూ నిప్పూ కడిగే ఆచారం ఉన్న ఇంట్లో, నియమ నిష్టలు ఇంతలా పాటించే ఇంట్లోకి ఇలా అనాధ పిల్లలని ఎలాతెచ్చేడమ్మా వీడు?” చాముండికి కోపం వచ్చింది.
“అక్కా వచ్చేవా?”‘ అంటూ వచ్చేడు శంకరం.
“పిల్లలని చూసేవా? అమ్మ దగ్గర కబుర్లన్నీ వినేశావుగా… పిల్లలని చూద్దూగాని రా” అంటూ అక్క చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేడు. మంచం మీద నిద్రపోతున్నారు ఇద్దరూ. ఇద్దరూ చామనచాయకన్నా ఓపాలు ఎక్కువే నలుపు అనేట్టు ఉన్నారు. పాపకి కళ్ళు పెద్దవి. బాబుకి జుత్తు ఎక్కువ.
అఖిల నవ్వుతూ పలకరించినా ఆమె దృష్టి పిల్లలమీదే ఉంది. తమ్ముడితో చర్చలకి ఇది సమయం కాదని, తన చెల్లెళ్ళు, అఖిల తల్లితండ్రులు కూడా రావాలని మాటాడలేదు చాముండి. మర్నాటికి ఇల్లు చాముండి తరవాత చెల్లెళ్ళు ఉమా, కాత్యాయనీ, అఖిల తల్లితండ్రులు, అఖిల చెల్లి సుధారాణీలతో నిండింది.
అఖిల తల్లి అయితే ‘వెక్కి వెక్కి’పడుపు మొదలెట్టింది. “ఇదేం కర్మే..నీకు పిల్లలు కావాలంటే మన సుధకి పుట్టేబిడ్డనో, మన చుట్టాల బిడ్డనో తీసుకోకుండా, ఇలా అనాధలని తెస్తావా?” అంది.
ఒకొక్కళ్ళూ ఒకొక్కలా మాటాడేరు.
కాత్యాయని మాత్రం మౌనంగా ఉన్నాది.
శంకరం మాత్రం అసలు కోపం తెచ్చుకోలేదు. నవ్వుతూ ఊరుకున్నాడు.
అఖిల తన తల్లితో రౌద్రంగా “నేను ఉండగానే నా పిల్లలని అనాధలు అంటావేమిటమ్మా….” అంది.
మనసు పీకుతున్నా మరదలిని చూసి ఏమీ అనలేక ఊరుకుంది చాముండి. నియమనిష్టలతో ఇన్నేళ్ళు కలకలలాడిన ఈ ఇంటికి వారసులు వీళ్ళా? అయ్యో… పైపెచ్చు పిల్లడికి తమ తండ్రి పేరే పెడతాడట తమ్ముడు.
‘జౌరా… బతికి ఉండగానే తన పుట్టింట్లోనే ఈ విప్లవం ఏమిటి?” చాముండికి వెలపరంగా ఉంది.
రెండు రోజుల్లో తన పిల్లలూ, చెల్లెళ్ళ పిల్లలూ అఖిల చెల్లి సుధారాణి, కూతురూ అందరూ దిగేరు. శివప్రసాద్, ఇద్దరు షడ్రకులూ కూడా జరగబోయే బారసాల వేడుకలకి దిగేరు.
పిల్లలు ‘కిల కిల’ నవ్వుతూ, తుళ్ళుతూ చంటిపిల్లలని ముద్దు చేస్తూ ఉంటే, చాముండీ, ఉమా ఒకళ్ళపక్క ఇంకొకళ్ళు చూసుకున్నారు.
శంకరం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. అఖిల పిల్లలిద్దరూ పడుకున్నారని తమగది తలుపు వేసేసింది.
పెద్దలూ, పిల్లలే ఉన్నారు హాల్లో.
కామేశ్వరి దిగాలుగా ఉంటే, చాముండి కూతురు వెనక నించీ మీదపడి “అమ్మమ్మా…
ఏమయింది అలా ఉన్నావేం?” అంది.
“ఇంకెలా ఉంటుందే? ఏడాది కల్లా ఈ వెధవలిద్దరూ నీలాగే “నాన్నమ్మా…అంటూ మీదపడరూ” కసిగా అంది చాముండి.
కాత్యాయని నిదానంగా అంది “అక్కా నువ్వు ఇంత అసహ్యంగా మాట్లాడతావని నేను అనుకోలేదు సుమా”
చాముండికి కూడా కోపం వచ్చింది.
“నన్ను అంటావే… వీడు చేసిన పని బాగుందా?”
“ఏం బాగులేదక్కా?” కాత్యాయని సూటిగా అడిగింది
“నాన్నగారు నిత్యాగ్నిహోత్రి. అమ్మ ఎంత ఆచారం పాటిస్తుంది చెప్పు. నిప్పూ ఉప్పూ కడిగే ఇంట్లో, ఏమీ తెలీని ఇంటి పిల్లలని ఎలా తీసుకొచ్చేరో?” నిప్పులు చెరుగుతున్నట్టే ఉన్నాయి చాముండి మాటలు.
“అయితే ఏమయిందక్కా?” కాత్యాయని
“ఏ పనివాళ్ళకి పుట్టేరో, జాతితక్కువ వాళ్ళకి పుట్టేరో తెలీదు. ఆరోగ్యం జీన్స్ ఎలాటివో తెలీదు. మనింటి వారసులంటే, అమ్మకి కాకపోతే ఎవరికి బెంగ? అమ్మ ఏడుపు విన్నారా వీళ్ళు అని…” చాముండి ఆవేశంగా అంది.
“మన చుట్టాలు ఎందరికో ఎన్నో అవకరాలు ఉన్న పిల్లలు పుట్టేరు. ఎవరిదాకానో ఎందుకు? మన తాతగారికి కాలు వంకరగా ఉండేదిట. నాయనమ్మ తల్లికి పిచ్చి ఉండేదిట. ఈ జీన్స్ మన వంటినిండా లేవా?” కాత్యాయని సూటిగా అడిగింది.
“బాగుందే మనది ఉప్పూ నిప్పూ కడిగే ఆచారం. అసలు మన పిల్లలకి కూడా శివ పార్వతుల పేర్లు తప్ప మరో పేరు పెట్టలేదు. నాన్న లలితపూజలకి పిలిస్తే తల్లి పలికేదట. అలాటి ఇల్లు అపవిత్రం అవదా?” చాముండి జవాబులో ప్రశ్నలు.
“ఏవిటక్కా… నాన్న పూజించే లలితాదేవిని ‘మాతంగకన్యా’ అని కాళిదాసు ప్రార్థించలేదా? ఐఎఎస్లూ ఆఫీసర్లు పనివాళ్ళ ఇళ్ళలోంచి రాటంలేదా? అసలు ఇంట్లో పిల్లల పెంపకం పట్ల ఇన్ని చూసే నువ్వు, ఆక్రతువులో ఎలా పాల్గొన్నావు? సీతాదేవిని గెలుచుకున్నావు? అప్పుడే స్వామివారికి చెప్పీలేదేమి? ‘ఇలా దొరికిన పిల్లల కులగోత్రాలు తెలీవు. వాళ్ళంటే నాకు అసహ్యం’ అని చెప్పవు. ఎందుకంటే కీర్తికండూతి. గొప్ప కావాలి. ఇక్కడేమో ఇలా” రొప్పుతూ ఆగింది కాత్యాయని.
తెల్లబోయి చూస్తున్నాది చాముండి.
శంకరం వచ్చేడు చేతిలో బేగులతో.
“కాత్యాయనక్కా… అంతా విన్నాను. నా మనసులో మాట నువ్వు చెప్పేవు.
పెద్దక్కే కాదు ఎందరినో చూసేను. ఆమ్రపాలి, గౌతమబుద్ద్ధుడూ నాటకం వేసేవాళ్ళు, హరిజనులని ఉద్ధరించాలన్న సందేశంతో పాటలు పాడేవాళ్ళు, పెద్దకబుర్లు చెప్తారు. ఆచరణ శూన్యం. ఇలా దేవుళ్ళ ఉదాహరణలు ఎన్ని చూపించినా వినరు. వీళ్ళు నెగెటివ్ గా ఆలోచించే మనసు ఉన్నవాళ్ళు. నేనూ అఖిలా కూడా పోజిటివ్ దృక్పథంతో ఉన్నాం” అంటూ ఉంటే కాత్యాయని నవ్వుతూ “నీ పిల్లల మెడికల్ రిపోర్టులు చూసేనురా. ఇద్దరిదీ బి పోజిటివే.
అఖిలదీ బి పోజిటివేగా. సరిగ్గా సరిపోయింది” అంది. ఇల్లంతా పిల్లల నవ్వులు ఊసులతో, కాత్యాయని, సుధారాణి, శంకరం, అఖిలల సంస్కారవంతమయిన భావాలతో పోజిటివ్ వైబ్రేషన్స్ తో నిండిపోయింది.