9.8 C
New York
Monday, November 25, 2024

నిమిత్త మాత్రులు

శ్రీ ప్రతాప్ రాజులపల్లి

ప్రొద్దున దిన పత్రిక లన్నింటిలోనూ పెద్ద, పెద్ద అక్షరాల్లో హెడ్‌ లైన్స్‌. “హేతు వాది, దళిత సాహితి సత్యాన్వేషి దారుణ హత్య”. “నాస్తిక నాయకుడిక నాస్తి”, “తీవ్ర మతవాద కుడి పక్షాల పై అనుమానం” వగైరా, వగైరా. కానీ నన్ను ఆకర్షించిన వార్తే వేరు.” హతుడి నాస్తిక స్నేహితుడు ప్రత్యక్ష సాక్షి; పారిపోతున్న దుండగులను అతడు గుర్తు పట్టగలడు; బైక్‌ నెంబర్‌ కూడా చూశాడు; అతడు వర్ణించిన ఆనవాళ్ళతో పోలీసులు దుండగుల స్కెచ్‌ లను కూడా వేయించారు ఆ న్యూస్‌ బాస్‌ కు చూపెట్టాను. చదువుతూ బిగ్గరగా నవ్వసాగాడు బాస్‌. అది చూసి దిగ్భ్రాంతి, అసహనం నాకు; అదేం నవ్వాల్సిన విషయమా? బాస్‌ తన కిష్టమైన “రం” బాటిల్‌ ఓపెన్‌ జేసి రెండు గ్లాసుల్లో పోసి, సోడా కలిపాడు. ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ జేసి, సిగరెట్‌ వెలిగించి, టి.వి ఆన్‌ చేశాడు.

దాదాపు అన్ని ఛానెళ్ళు అదే హత్యకు సంబంధించిన వివరాలను ప్రముఖంగా చూపిస్తున్నాయి. రాష్ట్ర గృహ మంత్రి హతుడు సత్యాన్వేషిని విపరీతంగా పొగుడుతున్నాడు. మూఢ నమ్మకాలు, అస్పృశ్యత, కులవ్యవస్థ, దేవుడి పేరుతొ సంఘం లో జరిగే ఎన్నో అన్యాయాలను ఎదిరించి, పోరాడిన ధీరుడు ఇత్యాది, ఇత్వాది..” హతుడి సెక్యురిటీని ఎందుకు తీసేశారన్న” ఓ విలేఖరి సూటి ప్రశ్నకు “పభుత్వం ఎంత హెచ్చరించినా, ఆయనే పట్టుబట్టి తీసేయమన్నారని” చట్టని బదులిచ్చారు మంత్రి వర్యులు.

అసమ్మతి ని కేవలం హత్యతోనే నిర్మూలించగలమని నమ్మే సాంఘిక విద్రోహ శక్తుల పిరికి తనాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. స్థానిక మఠాధిపతి స్వామీజీ. నాస్తికుడూ, హేతు వాద సాహితీ అయిన హతుడితో తమకు అభిప్రాయ భేదాలు, కేవలం ఇద్దరు మంచి స్నేహితుల మధ్య సైద్ధాంతిక ఆలోచనా భిన్నతే అని, తాము పరస్పరం గౌరవ భావం కలవారమని స్వామీజీ స్పష్టం జేశారు. నేరస్థులు ఎంతటి వారైనా సరే పట్టుకొని తగిన శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేశారు. సంతాపం వెలిబుచ్చే సమయం లో స్వామీజీ కళ్ళు చెమ్మగిల్లాయ్.

“బేకింగ్‌ న్యూస్‌” అంటూ టి.వి. ఛానెల్స్‌ బైక్‌ నెంబర్‌ ను, దుండగుల స్కెచ్‌ లని మరీ, మరీ చూపిస్తున్నాయ్‌. ఆశ్చర్యమేసింది నాకు.

ఓ భక్తుడు “ఇదంతా ‘వాడి’ మహిమే, దేవుణ్నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని చెబుతున్నాడు. నాస్తికుడు చంపబడింది, దుష్ట శిక్షణార్థం స్వామిజీ చేయిస్తున్న శాంతి హోమపు కడ పటి రోజైన 9వ రోజునే అని గుర్తు చేశాడతడు.“ఇది కాకతాళీయం కాదు. ప్రారబ్ఞాన్ని ఎవ్వరూ మార్చలేరు” అని కూడా అన్నాడతడు. సత్యాన్వేషి రచనలను, సీద్ధాంతాలను, ఉపన్యాసాలను ధిక్కరిస్తూ ప్రదర్శనలు చేసిన కొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, స్కెచ్‌ ల లో వున్న వ్యక్తులు వారేనని టి.వి ఛానెల్స్‌ ప్రసారం చేశాయ్‌. హతుడి అంతిమ సంస్కారం కంటే ముందుగా, అత్యంత వేగంగా, చురుగ్గా దర్యాప్తు చేసి హంతకులను అరెస్ట్‌ చేసినందుకు హోం మంత్రి, ఇతరులూ పోలీసులను అభినందించారు. అది ఎలా సాధ్యమయిందా అని నాకు ఆశ్చర్యం. చూస్తూ, చూస్తూ నాకు ముందు రోజుల సంఘటనలు జ్ఞప్తి కొచ్చాయ్‌.

సుసంపన్నమైన ధార్మిక పరంపరను కాపాడే ఆస్తికుల ఊరేగింపుకు నాయకత్వం వహించి ముందుకు నడిపిన స్వామీజీ పైనే అన్ని టి.వి ఛానెల్స్‌ దృష్టి పెట్టాయ్‌. కొద్ది రోజుల క్రితం బాస్‌తో పాటి ఎదురుగా కలిసినప్పటికంటే, టి.వి లోనే స్వామీజీ నాకు స్పష్టంగా కనిపించారు.

ఊరేగింపు తరువాయ్‌ బహిరంగ సభలో, కొందరు అరాజక వాదులు ఆధార రహితమైన సిద్ధాంతాలతో మన దేశపు ఏకశిలా సదృశమైన, మొక్క వోని మతాన్ని, ఎలా ఛిన్నా భిన్నం చేయాలని కుట్రలు పన్నుతున్నారో స్వామీజీ ఎండ గట్టారు. దేవుడి ఉనికినే ప్రశ్నించే నాస్తికుల్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వేదిక పై రాష్ట్రపు ప్రభుత్వపు హోం మంత్రి గారు, స్వామీజీ మతానికి చెందిన ఇతర గురువులు ఒక వైపు, అన్య మతాధికారులు, మత గురువులు మరో వైపు కూర్చొని వున్నారు. సభ భక్తులతో, అనుయాయుల తో క్రిక్కిరిసి పోయింది.

అందులో కొందరు “సత్యాన్వేషి నశించాలి,” “సంఘానికి చీడ పురుగు సత్యాన్వేషి” “ధిక్కారం, ధిక్కారం… నాస్తికులకు ధిక్కారం”, “లాంగ్‌ లీవ్‌ ది రిలిజియన్‌” అని వ్రాసి వున్న ఫ్లెక్సి బ్యానర్‌ లను పట్టుకొని వున్నారు.

మన అమూల్యమైన సాంప్రదాయ వారసత్వాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, పవిత్ర పూజా పునస్కారాది సంస్కారాల్ని మరింత శద్ధతో ఆచరించాలని ప్రజలకు స్వామీజీ వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. “యధా కస్టుకపాతే నో త్పత త్యార్యః పతన్నపి, తధా త్వనార్యః వేతతి మృత్పిణ్జపతనం యధా” – స్వామీజీ ఆశువుగా భర్తృహరి సుభాషితాన్ని ఉల్లేఖించి, వెంటనే అర్థం వివరించారు (ఆస్తికుడు మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బంతి లాగా లేవగలడు; నాస్తికుడు మట్టి కరుస్తాడు). స్వామీజీ వ్యాఖ్యానానికి జనం ఉత్సాహంగా చప్పట్లు గొట్టారు. వేదిక పైనున్న మతాధిపతులు సైతం సమ్మతిగా తలలు వూపారు. స్వామీజీ రెచ్చిపోయారు.

“అలాంటి దుశ్వక్తుల నుండి సంఘాన్ని రక్షించేందుకు, గత ఎనిమిది రోజులుగా మేము శాంతి హోమాన్ని ప్రారంభించాం.. 9వ రోజున ఆ ద్రోహ శక్తులను పవిత్ర హోమాగ్ని లో సాంకేతికంగా దహనం చేస్తాం. ‘వినాశయచ దుష్కృతాం” దేవుడు ఎలాగైనా వారిని శిక్షించక మానడు. ఆ రోజు ఎంతో దూరం లో లేదు. అలా అని మనం దేవుణ్ణి వేడుకుందాం”.

స్వామీజీ దేవుణ్ణి వేడుకుందాం అన్నారో, వాడుకుందాం అన్నారో నేను తికమక బడ్డాను. హర్షధ్వానాల మధ్య స్వామీజీ ఉపన్యాసం ముగిసింది.

ఆ రోజు రాత్రి టౌన్‌ చాలా ఉద్రిక్తంగా వుండింది. పోలీస్‌ పెట్రోలింగ్‌ కూడా చురుగానే వున్నింది.

బిగ్గరగా అరుస్తున్న బాస్‌ అరుపుల తో వర్తమానం లోకి వచ్చేశాను నేను.

“హే! గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌. మతం మహోన్నత మైంది. అధికార దాహం, అవకాశవాదం మాంఛి ఉత్రేరకాలు.._… వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలూ. మరింత మంది సత్యాన్వేషులు కావాలి సంఘానికి “- బిగ్గరగా కేకలేశాడు బాస్‌, మరో గ్లాస్‌ “రం” ఖాళీ జేసి.

“మహా భారతం లో కర్ణుణ్ణి ఎవరు చంపారు? హుం??”- బాస్‌ ప్రశ్న. మాటలు కాస్త ముద్ద, ముద్ద గా వస్తున్నాయ్‌.

నాకు కాస్త విసుగేసింది; నేనేం మూర్ధున్నా? విసుగును అణచుకుంటూ “అర్జునుడు” అంటూ బదులు చెప్పాను.

“నో, యు ఆర్‌ రాంగ్‌”-అరిచినంత పని చేశాడు. తాగి నప్పుడు ఇంగ్లీష్‌ కాస్త ఎక్కువే మాట్లాడతాడు మా వాడు. “ఐదుగురో, ఆరుగురో- వేరే, వేరే భారతాల్లో వేరే, వేరే నెంబర్‌… పరశురాముడు, ఇంద్రుడు, కుంతి, శల్యుడు, కృష్ణుడు, మరి చివ్‌ వ్‌ వ్వార్నఅర్జునుడు”- దీర్జం తీసాడు బాస్‌. మరి ఈ కేసు లో ముగ్గురే “- భావ గర్భితంగా నవ్వాడు అంతా తనకే తెలుసు అన్నట్లు. కైపు ఎక్కిన తర్వాత అందరూ మహా జ్ఞానులే మరి!!

“ముగ్గురా?” – ఈ సారి నేను అవాక్కయాను

“తన తెర వెనుక భాగోతాలను బహిరంగంగా దుయ్యబడుతున్న నాస్తికుని తొలగించడానికి తన ఆస్తిక ధర్మాన్ని, మతాన్ని ఆయుధంగా వాడుకొని, మఠంలో తన ప్రత్యర్థుల పై రాజకీయ ఆధిక్యత, మఠం ఫండ్స్‌, అధికారాలపై ఆజమాయిషీ బలవత్తరం చేసికోవడానికి స్వామీ జీ; బలం హేతువాద సంఘపు అధ్యక్ష పదవికై రాబందులా కాచుకు కూర్చున్న అసూయాపరుడు తోటి మిత్రుడు – అఫ్‌ కోర్సు, టార్గెట్‌ మిస్‌ కాకుండా మార్నింగ్‌ వాక్‌ పేరుతొ సత్యాన్వేషే తలుపు తెరిచేలా, సోషల్‌ మీడియా నుండి ఐడెంటిఫై చేసికొన్నకొంత మంది ‘రియాక్షనరీ” వ్యక్తులను కేసు లో ఇరికించి, అసలు దోషులను తప్పించేలా – ఆ మిత్రుడు హోం వర్క్‌ బాగా చేశాడు. సత్యాన్వేషి తలుపు తెరువక పొతే, మొత్తం ప్లాన్‌ “హుష్‌ కాకి.” యధా ప్రకారంగా మార్నింగ్‌ వాక్‌ కి తన మిత్రుడే వచ్చాడని పాపం….“- అదో రకంగా చేయి పైకి ఊపాడు బాస్‌.

వేలును కాల్చిన సిగరెట్‌ నేల రాచి, ఇంకాస్త “రం” దట్టించి కొనసాగించాడు. నాలుక మందమైంది; మాటలు తడ, బడుతున్నాయ్‌. ళ, ల లు స, శ, ష లు అన్నీ ఒకే లాగ పలుకుతున్నాడు. మహా ప్రాణాలను మింగేస్తున్నాడు.

“ఓమ్‌ మంత్రి, సత్యాన్వేషి ఒకే కులం వాల్లు. ఆ కులం యువకుల్లో తన రాడికల్‌ సిద్దాంతాలతో పరపతిని, ప్రాముక్యాన్ని పెంచుకోసాగాడు సత్యా. పెరిగే వీడి ప్రాచుర్యంతో తన కులపు వోట్‌ బ్యాంకు చీలితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెల వడమే కష్టమవుతుంది, మంత్రి పదవీ పోతుంది. పోయిన సారే అంతంత మెజారిటీ. అందుకే సెక్యూరిటీ తీసి వేయించి, పని సుగమం చేశాడు ఓమ్‌ మంత్రి.”

“వాల్లందరూ, వాల్ల, వాల్ల కోశమే ఈ పని చేషారు. దేవుడు, మతం, కులం అన్నీ కుంటి శాకులు. “ఏమైతేనేం, ఒక్క కూనీ, ముగ్గురి ముడుపులు… జాక్‌ పాట్‌. చిన్న టౌన్‌ లో గురి తప్పకుండా కాల్చేరౌడీ కి పెద్ద అడ్వాంటేజ్‌..హ, హ, హా “ బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు – తనను తాను అదుపు లో పెట్టుకోలేక పోతున్నాడు. క్రితం రోజు జరిగిందంతా నా కళ్ళ ముందు కదిలింది.

బాస్‌ ను బైక్‌ లో వెనుక కూర్చోబెట్టుకుని, తెల్లవారు జామున 5.30 కల్లా చేరాల్సిన అడ్రస్‌ కి చేరి పోయాను. బాస్‌ జేబులో రివాల్వర్‌ వుంది. టౌన్‌ ఇంకా నిద్రమత్తు లో వుంది. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. ఎడమ వైపు వున్న- వెళ్ళాల్సిన ఇంటికి కాస్త ముందుగా రోడ్డుకు మరీ ఎడమ గా బైక్‌ ఆపాను. ఇంజిన్‌ ఆన్‌ లోనే వున్నా, శబ్దం మంద్ర స్థాయి లో ఉంది. చుట్టు ప్రక్కల పోలీసులెనీరూ లేక పోవడం కాసింత ఆశ్చర్యం కలిగించింది. రోడ్డుకు కాస్త దూరంగా ఇల్లు చాలా మామూలుగా వుంది. ఇంటి కి ముందు వైపు కాస్త స్థలం, దాని చుట్టూ ప్రహరీ గోడ. గోడ గేటు కొద్దిగా తెరిచే వంది. బాస్‌ బైక్‌ దిగాడు. రోడ్డుకు అటూ, ఇటూ చూశాడు. నడుచుకు వెళ్లి, గేటు దాటి, తలుపు వైపు వెళుతున్నాడు. నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. టైం అవుతోందని తెలుసు. ఏదో తెలియని అసహనం. ఊపిరి బిగపట్టి నాలో నేనే ఎంచడం మొదలెట్టాను.

“టైన్‌, నైన్‌ , ఎయిట్‌, సెవెన్‌ …” కుడి చేత్తో రివాల్వర్‌ పట్టుకొని , డోర్‌ బెల్‌ రింగ్‌ చేశాడు బాస్‌.

.”సిక్స్‌, ఫైవ్‌, ఫోర్‌, త్రీ…” నా కనుల కొనలలొ ఎవరో అపరిచితుడు గేటు వైపు వెళుతూ కన్పించాడు.

“ఓహ్‌, గాష్‌ !

….టూ, వన్‌”. ఓ మధ్య వయస్కుడు ఇంటి తలుపు తెరిచాడు.

“థడ్‌, థడ్‌, థడ్‌”- పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ లో మూడు బులెట్లు అతడి గుండెల్లోకి దించేసి, నా వైపు పరిగెత్తుకొస్తూ బాస్‌ గేటు వైపు వస్తున్న అపరిచితున్ని ఢీ కొట్టడంతో అతడు క్రింద పడి అరవడం మొదలెట్టాడు- ”పట్టుకోండి, పట్టుకోండి ”-అని. అయితే, చుట్టూ ప్రక్కల ఎవరూ లేరు.

“పద, పద”, నా వెనుక లంఘించి కూచుంటూ అరిచాడు, బాస్‌. వున్న ఫళంగా ఆక్షిలిరేటర్‌ ఇస్తూ, బైక్‌ ముందుకి దూకించి, వేగంగా స్టేట్‌ హైవే వైపు దూసుకు వెళ్లి, కొద్ది దూరం తరువాత ప్రక్కనే వున్నఅడవిలోకి తిప్పి, మమ్మల్నెవరూ వెంటాడడం లేదని ఖచిత పరచుకొని పొద్దెక్కే లోగా మా స్థావరాని కి మేము చేరుకున్నాం. రాత్రంతా బాస్‌ అప్పటికే ముట్టిన నోట్ల కట్టలను లెక్కెడుతూ త్రాగుతూనే వున్నాడు;

మధ్య, మధ్య లో “అచ్చొచ్చిన నెల”, “మతం, అధికారం – వీటిని మించిన పెద్ద వ్యాపారం ఏదీ లేదు” అంటూ బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు. గది నిండా సిగరెట్‌ పొగ. అప్పటికే నేను కూడా రెండు క్వార్టర్‌ లు మందు, ఓ పెద్ద బిరియాని పొట్లం కాజేశాను-నోట్ల వైపు ఆశ గా చూస్తూ, తెలియకుండా అలాగే నిద్రలోకి జారి పోయాను.

ఇంతలో బాస్‌ సెల్‌ మ్రోగడం తో మళ్ళీ వర్తమానం లోకి వచ్చేశాను నేను.

బాస్‌ నాకందించాడు ఫోన్‌. సెల్‌ లో కాలర్‌ పేరు “స్వామీజీ” అని డిస్‌ప్లే అవుతోంది.

నేను రిసీవ్‌ చేసికున్నాను. ఫోన్‌ లో స్వామీజీ శిష్యుడు; “బాస్‌ నిద్రబోతున్నాడ” ని అబద్ధం చెప్పాను.

మరుసటి రోజు వచ్చి స్వామీజీని చూడమని, తదుపరి పని, తగిన పారితోషికం అప్పగిస్తారని ఆయన మాటల సారాంశం.

టి.వి ఛానెల్‌ అంతిమ సంస్కారానికి వెళుతున్న శవయాత్ర పై కేంద్రీకరించింది. నేపథ్యంలో భగవద్గీత, తెలుగు వ్యాఖ్యానం వినిపిస్తున్నాయ్‌.

“య ఏనం వేత్తి హన్తారం యశ్చెనం మన్యతే హతం | ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే”

(“జీవుడు చంపాడని లేదా చంపబడినాడని తలచు వారు జ్ఞాన రహితులు. ఆత్మ చావదు; చంపబడదు)

“హే, హ, హ…. బగవంతునికి మటుకు వాక్‌ శ్వాతంత్ర్యం వుంది. …. ఆయన ఏం కావాలంటే, అది సెప్పొచ్చు. నిజమే! మరీ ఈ రోజుల్లో రాజకీయనాయకులను, స్వామిజీలను అనవసరంగా విమర్శించడం పాసన్‌ అయిపోయింది. ఎవరు ఎవర్ని సంపగలరు? పోలీసోల్లు, కూనీ చేయించినోల్లు, మనం …….అందరం …..అందరం _ మన మందరం నిమిత్త మాత్తర్లం” తప్ప తాగిన మత్తు లోనవ్వుకుంటూ, గొణుగుతూ చప్పట్లు కొట్టబోయి, వాలిపోయాడు బాస్‌.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles