10.7 C
New York
Tuesday, November 26, 2024

తప్పుటడుగులు

తప్పుటడుగులు

కోటమర్తి రాధాహిమబిందు
7780188651

అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం. డాబా మీద కూర్చున్న ఆ జంట ఒకరికొకరు తమ పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

“అర్జున్ ఉంటే బాగుండేదిప్పుడు…టూర్ అంటూ వెళ్ళాడు”

“తన మాట నెగ్గించుకున్నట్లే… ఎల్లుండిగానీ రాడు” అన్నాడు సురేంద్ర.

 “వాడిని చూడకుండా అప్పుడే వారం దాటింది”

” ఇంకా ఏదైనా మాట్లాడు ప్రతిమా!”

“ఏం మాట్లాడాలీ …జీవితం చాలా బాగా, తృప్తిగా ఉంది. మీ బిజినెస్ బాగుంది… నాకు ప్రమోషన్ వచ్చింది”

 “అనుకుంటే అంతా ఆశ్చర్యంగానే ఉంది కదూ- అర్జున్ అప్పుడే బీటెక్ సెకండ్ ఇయర్ కు వచ్చాడు”- అలా అలా చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రతిమ, సురేంద్ర.

 ***

పదిరోజులు గడిచాయి. గేట్ బయట ఉన్న యాక్టివా పై కూర్చోబోతున్న ప్రతిమ- పక్కింటి ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది.

” నిన్న మేం చాలా ఇబ్బందిగా ఫీలయ్యాం. మేమే కాదు, ఈ వీధి అంతా చిరాగ్గా అయిపోయింది. మీ బాబు పదిమంది ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి గోల గోల చేశాడు. డీజే పెట్టారు… ఒకటే  డాన్సులు”

“నిన్న బాబు బర్త్ డే. వాడు ముందే మాకు చెప్పాడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తానని. సో…  ఆ విషయం  మాకు తెలుసు. మీకు ఇబ్బంది అయిందంటున్నారు కాబట్టి సారీ! నాకు ఆఫీసుకు టైం అయింది.  మీతో మళ్లీ మాట్లాడ తాను” అంటూ యాక్టివా ని స్టార్ట్ చేసింది.

          ఆ రాత్రి  తన ఒడిలో పడుకున్న అర్జున్ తలను  ప్రేమగా నిమురుతూ  అడిగింది ప్రతిమ “బాగా చదువుకుంటున్నావా? ఫ్రెండ్స్ తో జాగ్రత్త. నేను, నాన్న బిజీ. నీ భవిష్యత్తు మీదే మా ఆశ, ఆరాటం. నువ్వు చాలా మంచి పిల్లాడివి,  మాకు తెలుసు. కానీ ఏదో భయం. రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా! విచిత్రమైన కొత్త కొత్త వార్తలు వింటున్నాం. చెడు ఎట్రాక్ట్ చేసినంతగా మంచి చేయదు.. నీ వయసున్న పిల్లలు చెడు మార్గాల వైపు నడిచేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు”… అంటూ ఓ గంటసేపు మంచి మంచి మాటలు చెప్పింది ప్రతిమ. ఎప్పుడో చూసేసరికి, నిద్రపోతూ కనిపించాడు అర్జున్. కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకొని జుట్టు సవరించింది. సరిగ్గా అదే సమయంలో వచ్చాడు సురేంద్ర. ఆ దృశ్యాన్ని చూసి అతని మనసు ఉప్పొంగిపోయింది.

***

సంవత్సర కాలం గడిచింది.

“ఏమండీ! ఒకసారి కాలేజీకి వెళ్లి మనవాడు ఎలా ఉంటున్నాడో తెలుసుకుందామా”

“ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు? వాడు మొదటినుండీ  క్లాస్ ఫస్ట్ ఏమీ రాలేదు. అలా అని డల్ స్టూడెంట్ కాదు. చదువు విషయంలో చాలామందిలా వాడిమీద  మనం ఎలాంటి ప్రెషర్ పెట్టవద్దు అనుకున్నాం. కంగారు ఎందుకు ప్రతిమా? వాడు చాలా గుడ్ బాయ్” నవ్వాడు సురేంద్ర.

 “నేనూ అలాగే అనుకున్నాలేండి”

  ** *

సాయంత్రం వేళ సురేంద్ర నుండి  ఫోన్ వచ్చింది ప్రతిమకు. “ప్రతిమా, ఎక్కడ ఉన్నావ్”? అంటూ.

“ఇప్పుడే ఇంటికి వెళ్ళబోతున్నాను”అంది ప్రతిమ

 “ఓసారి కాలేజీకి రా”

“వస్తున్నాను”- గంటలో కాలేజీ దగ్గరకు వెళ్ళింది ప్రతిమ. గేటుదగ్గర నిలబడి ఉన్నాడు సురేంద్ర. ఏమీ అర్థం కాలేదు ప్రతిమకు. బిగ్గరగా ఏడ్చాడు సురేంద్ర.

“ఏం జరిగింది? అర్జున్ కు ఏమైంది?” అంటూ ముందుకు పరిగెత్తింది ప్రతిమ. క్షణాల్లో వార్త ఆమెకు

తెలిసిపోయింది.

అర్జున్ వాడి ఫ్రెండ్ ని కత్తితో పొడిచాడట. ఆ అబ్బాయి చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్ కు తీసుకువెళ్లారట. అర్జున్ అరెస్ట్ అయ్యాడట…అని. కుప్పకూలిపోయింది ప్రతిమ.

 ***

వారం రోజులు ఎలా గడిచాయో తెలియలేదు ప్రతిమ, సురేంద్రలకు. ఎన్నో తిట్లు, ఎన్నెన్నో ఛీత్కారాలు, ఇంకెన్నో అవమానాలు. భారంగా మోస్తూ ఇంటినుండి బయటకు వెళ్ళలేకపోయారు. సురేంద్ర కు కొడుకు పట్ల సర్వ అసహ్యం కలిగింది. ప్రతిమ ఏడ్చి ఏడ్చి నీరసించిపోయింది. బిజినెస్ అంతా ఫోన్ మీదే నడిపిస్తున్నాడు సురేంద్ర,  ఆఫీసుకు లీవ్ పెట్టింది ప్రతిమ.

“వాడ్ని చూసొస్తా అన్నారుగా”

 “వెళ్ళబుద్ధి కావట్లేదు ప్రతిమా!”

బావురుమంటూ ఏడ్చి పడిపోయింది ప్రతిమ. జీవితాలు ఒక్కసారిగా ఇలా తలకిందులు అయ్యేసరికి, మనసులో మౌనంగా రోదించాడతను. ప్రతిమ ముఖం మీద నీళ్ళు చల్లి లేపి, ఒక ఇడ్లీ తినిపించి, టాబ్లెట్స్ ఇచ్చాడు.

“కాసేపు పడుకో.. నేను వెళ్లి వస్తా”

“నే..ను”

“నువ్వు రాలేవు,వాడిని  అలా చూడలేవు” అంటూ బయటకు వచ్చి డోర్ లాక్ చేసి, తప్పు చేసిన వాడిలా… ఎవరైనా కనిపిస్తారేమో, ఏమన్నా  అడుగుతారేమో అన్నట్లు చూశాడు. గేటు బయట కారులో జొరబడ్డాడు. ‘ఏం బతుకు? జైలుకు వెళ్తున్నాడు. ఏ మనిషికైనా జైలుకు… పోలీస్ స్టేషన్ కు… కోర్టుకు వెళ్లే దయనీయ పరిస్థితి రాకూడదు’- అతని గుండె వెక్కివెక్కి ఏడ్చింది.

***

“తప్పంతా వాడిది పెట్టుకొని నన్ను జైల్లో వేయటం ఏంటి? నన్ను బయటకు రానీయండి… వాడి    అంతు తే లుస్తా. నా ఫ్రెండ్ గా నటించి, నేను ప్రేమిస్తున్న సోనీకి వాడు లైన్ వేస్తాడా? సారీ నాన్నా! మీతో ఈ విషయాన్ని ముందే డిస్కస్ చేయాలనుకున్నా” -అలా చెప్పుకుంటూపోతున్న కొడుకుని విస్తుపోతూ చూస్తూ శిలా విగ్రహం లా నిలబడిపోయాడు సురేంద్ర.

“నాన్నా! మన లాయర్ అంకుల్ ఏమన్నారు? బెయిల్ ఇప్పిస్తా అన్నారా”

కొడుకునే చూస్తూ కోపంగా అన్నాడు సురేంద్ర “లాయర్ అంకుల్ ఇంటికి వచ్చారు. బెయిల్ ట్రై చేద్దాం అన్నారు. ఇప్పుడే ఈ క్షణమే… అటూ ఇటూ ఊగిసలాడుతున్న నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఇక బెయిల్ కు ప్రయత్నించను”

 “నాన్నా”

“తప్పు చేసి శిక్ష అనుభవించబోతూ కూడా నిన్ను నువ్వు  సమర్థించుకుంటున్నావ్!  నీలో భయం లేదు, పశ్చాత్తాపం అంతకన్నా లేదు. అమ్మ ఎలా ఉంది అని కూడా అడగలేదు. నాన్న ఎలాగైనా బయటకు తీసుకొస్తారని నీ నమ్మకం. నీపై ఉన్న  మా నమ్మకాన్ని మాత్రం  పాతాళంలోకి తొక్కేశావు. ఛీ… నిన్ను చూడటానికి కూడా ఇష్టం కలగటం లేదు. నీలో పరివర్తన వస్తే ఈ వాతావరణంలోనే రావాలి. నీ శిక్ష పూర్తి అయ్యేసరికి నీలో మంచి మార్పు రావాలి. నేను  వెళ్తున్నాను, ఇక రాను”

 “నాన్నా”…

“నీకు కఠినంగా అనిపించవచ్చునేమో.  నువ్వేం చేశావో ఎలా ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇప్పుడు నేను  చేస్తున్నది తప్పుగా, కఠినంగా అనిపించదు” అంటూ వెనుతిరిగాడు సురేంద్ర.

“నాన్నా, నాన్నా”… అర్జున్ పెద్దగా అరుస్తూ పిలవటం వినిపిస్తున్నా, అతని మనసు కరగలేదు. అతను  వెనుతిరిగి చూడనూ లేదు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకే సాగిపోయాడు.

***

సురేంద్ర  చెప్పిందంతా విని, చలనం లేని రాయిలా కూర్చుండిపోయింది ప్రతిమ. ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చాడు సురేంద్ర. వెక్కి వెక్కి ఏడ్చింది.   “వాడు కనిపించడు కదా”

” వాడు జైలుకి వెళ్ళింది  హత్యా ప్రయత్నం కింద!  అదే ఆ పిల్లవాడు చనిపోయి ఉంటే, వీడు చాలా సంవత్సరాలు మనకు కనిపించకపోయేవాడు! హాస్పిటల్ కి వెళ్లి ఆ అబ్బాయిని చూసి వస్తాను. అయినా  వాడి గురించి ఇంకా మనం మాట్లాడుకోవటం వద్దే వద్దు. కొన్ని సంవత్సరాలు వాడిని అలాగే ఉండనీ,  శిక్ష అనుభవించనీ”

బావురుమంది ప్రతిమ.

” ప్లీజ్! నేను ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థంచేసుకో. వాడ్ని ఎందుకు కాపాడాలి? వాడు మనల్ని ఎంత మోసం చేశాడు? వాడు తాగుతున్నాడు, పబ్బులకు వెళుతున్నాడు. అమ్మాయిని ప్రేమించాడు,  ప్రేమ విషయంలో ఫ్రెండ్ ని కత్తితో పొడిచాడు. ఇలా  ఎక్కడో వింటుంటాం. మన ఇంట్లోనే  ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎలా అనుకుంటాం? వాడు మనకు తెలియని మరో రూపాన్ని మనకు చూపించాడు. మనల్ని అంతా ఎలా నిలదీస్తున్నారో చూస్తున్నావు కదా? మన గుండె ఇంకా ఎందుకు ఆగిపోలేదు ప్రతిమా!”

 “ఏమండీ”

“మరోసారి చెబుతున్నా. వాడ్ని జైల్లో అలాగే ఉండనీ! మనం ఎలాంటి  ప్రయత్నాలూ  చేయవద్దు. మనల్ని వాడు ఏటీఎం కార్డు లా భావించాడు. మన ఎదురుగా మంచిగా, అమాయకంగా నటిస్తూ మనం  లేని సమయంలో వాడు మరోలా ఉన్నాడు. “నేను ఒక్కడే కొడుకుని, అమ్మ నాన్న సంపాదించే డబ్బుకు ఆస్తులకు  నేనే అధికారిని” అన్న  ఆలోచన వాడికి వచ్చింది. ఇంకా నయం… ఈ సంఘటన జరగకపోతే, కొన్ని సంవత్సరాల తర్వాత వాడు మనిద్దర్నీ చంపేవాడు!అలా చేసినా బాగుండేది ప్రతిమా! ఇప్పుడు మాత్రం ఏముందిలే… చస్తూ బతకటమేగా”

“ఏమండీ”

“ఈ ఏరియాలో మనకెంతో మంచి పేరుంది. ఇక ఇక్కడ మనం ఉండలేం. ఎక్కడికైనా  దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు జాబ్ కు రిజైన్ చెయ్. నువ్వు ఇక జాబ్ చేయలేవు. నేను చాలా వరకు బిజినెస్ వదిలేస్తాను. ఎవరికోసం ఎందుకోసం మనం ఇంకా సంపాదించటం? ఈ ఆరాటం మనకు వద్దు. నువ్వు  ఇంకేం మాట్లాడకు. నేను చెప్పేదానికి ఎప్పటిలా నువ్వు సహకరించు. కన్నకడుపు… నీకు ఎంత బాధగా వుందో నాకు తెలుసు. మార్గం మార్చుకోకపోతే ఇంకా కుంగిపోవాల్సివస్తుంది. ఏదో అంటున్నాగాని, నాకు మాత్రం బాధ లేదా ప్రతిమా! వాడు ఘోరమైన తప్పు చేశాడు. శిక్ష అనుభవించాల్సిందే. వాడి గురించి మాట్లాడకు, వాడ్ని తలుచుకోకు… అది మహా పాపం” కఠినంగా అన్నాడు సురేంద్ర.

            “ఏ..మం..డీ”  నిర్ఘాంతపోతూ, భర్తను అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రతిమ.

                                          ******************* 

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles